‘షారుఖ్ ఖాన్‌ను నమ్మకుండా ఉండాల్సింది’ అని షోయబ్ అఖ్తర్ ఎందుకన్నాడు, ‘గ్యాంగ్‌స్టర్’ సినిమా ఎందుకు మిస్సయింది?

ఫొటో సోర్స్, Hamish Blair/Getty Images
- రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌గా గుర్తింపు పొందిన షోయబ్ అఖ్తర్ కెరీర్లో వివాదాలెందుకు?
- సాధారణ కుటుంబంలో పుట్టిన షోయబ్ అఖ్తర్ పాకిస్తాన్ జట్టుకు ఎలా ప్రాతినిధ్యం వహించగలిగాడు?
- ఓ వ్యక్తికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం షోయబ్ అఖ్తర్ ఏం చేశాడు?
- కరాచీ బాంబు పేలుడు సమయంలో షోయబ్ అఖ్తర్ ఎక్కడున్నాడు?
- బాలీవుడ్ సినిమాలో నటించే అవకాశం వదులుకోవడంపై అఖ్తర్ అభిప్రాయమేంటి?
- షారూఖ్ ఖాన్‌పై షోయబ్ అఖ్తర్ బహిరంగంగానే ఎందుకు అసంతృప్తి వ్యక్తంచేశాడు?
- క్రికెటర్‌గా రిటైరైన తర్వాత షోయబ్ అఖ్తర్ కామెంటేటరీ ఎలా ఉంది?
- రచయిత, రషీద్ షకూర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 9 నిమిషాలు
పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అఖ్తర్ గురించి మాట్లాడే ముందు అతణ్ని సరిగ్గా అర్థం చేసుకోవడం ముఖ్యం.
ఈ కథ అంత సులభమైనది కాదు. వేర్వేరు వ్యక్తులు అతణ్ని వేర్వేరు కోణాల నుంచి చూశారు. దీనివల్ల అతని వ్యక్తిత్వంపై భిన్నమైన ముద్రలు పడ్డాయి.
కొందరికి అతను తన వేగంతో బ్యాట్స్మెన్లను ఇబ్బంది పెట్టే బౌలర్ కాగా, మరికొందరు క్రమశిక్షణ లేని, అల్లరి, తిరుగుబాటు స్వభావం గల క్రికెటర్‌గా భావించారు.
విమర్శకులు అనుమానాస్పద బౌలింగ్ యాక్షన్, బాల్ ట్యాంపరింగ్, డోపింగ్ ఆరోపణలతో సహా అనేక వివాదాలను ప్రస్తావించేవారు.
అతనిపై నిషేధాలు అమలయ్యాయి. జరిమానాలు, అనేక విచారణ కమిటీలు, కోర్టుల ఎదుట కూడా హాజరయ్యాడు. క్రమశిక్షణాఉల్లంఘనల ఆరోపణలు అతని వృత్తి జీవితమంతా వెంటాడాయి.


ఫొటో సోర్స్, SEBASTIAN D'SOUZA/AFP via Getty Images
'చికిత్స కోసం డబ్బు వృథా చేయొద్దు'
కానీ నిజం ఏంటంటే షోయబ్ అఖ్తర్ కెరీర్ ఒక సూపర్ హిట్ సినిమా లాంటిది. ప్రజల దృష్టిని ఆకర్షించడానికి కావలసినవన్నీ అందులో ఉన్నాయి.
క్రికెట్ నుంచి షోయబ్ అఖ్తర్ రిటైరై 15 ఏళ్లకు పైగా అయింది. ఇప్పుడు టీవీల్లో విశ్లేషకుడిగా కనిపిస్తుంటాడు. అఖ్తర్ కామెంటరీ అతని బౌలింగ్ లాగే సూటిగా, పదునుగా ఉంటుంది.
రావల్పిండిలోని ఒక సాధారణ కుటుంబంలో జన్మించాడు షోయబ్ అఖ్తర్. తండ్రి ఓ ఆయిల్ రిఫైనరీలోని పెట్రోల్‌బంకులో నైట్ వాచ్‌మెన్‌గా పనిచేసేవాడు. వారి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండేది.
ఆత్మకథ 'కాంట్రవర్షియల్లీ యువర్స్'లో షోయబ్ తాను చిన్నతనంలో తీవ్రమైన దగ్గుతో బాధపడి, దానివల్ల బలహీనపడ్డానని, ఊపిరితిత్తులు ఎప్పటికీ బలహీనంగానే ఉంటాయని వైద్యులు చెప్పారని రాశాడు.
"పిల్లాడు బతక్కపోవచ్చు. చికిత్స కోసం సమయం, డబ్బు వృధా చేయవద్దు" అని ఒక రోజు అఖ్తర్ తాత అఖ్తర్ తల్లితో చెప్పారట. కానీ తల్లి అందుకు ఒప్పుకోక, తనను ఆస్ప్రతికి తీసుకెళ్లేవారని అన్నారు.
ఆ తర్వాత తన ఊపిరితిత్తులు ఎంతో బలంగా మారాయనీ, మైదానంలో తాను గాలిలా పరుగెత్తడం మొదలుపెట్టానని షోయబ్ అఖ్తర్ రాశాడు.

ఫొటో సోర్స్, Mike Hewitt/Getty Images
గాలిపటాలు, గిల్లీ-దండా ఆటల ప్రభావం
చిన్నప్పుడు గాలిపటాలు ఎగరేయడం అంటే తనకు ఇష్టంగా ఉండేదని షోయబ్ అఖ్తర్ చెప్పారు. గాలిపటాలు ఎగురవేసే సీజన్ కోసం ఆత్రుతగా ఎదురుచూసేవాడిననీ, అన్నయ్య తాహిర్...గాలిపటాలు కొనిపెట్టేవాడి చెప్పాడు.
గాలిపటాలను పట్టుకోవడానికి పరుగుతీయడం తన వేగాన్ని పెంచడంలో సాయపడిందని అఖ్తర్ అంటాడు. గిల్లీ-దండా ఆడటం వల్ల త్రోయింగ్, ఫీల్డింగ్ నైపుణ్యాలు మెరుగుపడ్డాయన్నాడు. ఈ ఆటలన్నీ తర్వాత క్రికెట్లో బాగా ఉపయోగపడ్డాయని అఖ్తర్ చెప్పాడు.

ఫొటో సోర్స్, Hamish Blair/Getty Images
గుర్రపుబండి తోలే వ్యక్తికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న అఖ్తర్
క్రికెట్‌ను సీరియస్‌గా తీసుకున్న తర్వాత అవకాశాల కోసం అనేక నగరాలు తిరిగినట్లు అఖ్తర్ చెప్పారు.
అఖ్తర్ ఇంకా ఏం చెప్పాడంటే...
లాహోర్‌లో పీఐఏ జట్టు కోసం ట్రయల్స్ జరుగుతున్నాయని తెలిసిన వెంటనే స్నేహితుడు ఎజాజ్ అర్షద్‌తో కలిసి రావల్పిండి నుంచి బయలుదేరా. అప్పుడు జేబులో కేవలం 12 రూపాయలే ఉన్నాయి. స్నేహితుడి దగ్గర 13 రూపాయలు ఉన్నాయి.
టిక్కెట్టు లేకుండా ఏడు గంటల బస్సు ప్రయాణం చేశా. లాహోర్ చేరుకున్నాక హోటల్లో ఉండటానికి కూడా మా దగ్గర డబ్బులు లేవు.
రైల్వే స్టేషన్ దగ్గర వారికి అజీజ్ ఖాన్ అనే గుర్రపు బండి నడిపేవ్యక్తి కలిశా. భోజనం కావాలని, ఆ రాత్రి బస చేయడానికి చోటు కావాలని అడిగా.
"మీరు పాకిస్తాన్ తరపున ఆడతారా?" అని బండినడిపే వ్యక్తి అడిగారు.
"ఇప్పుడు కాదు. కానీ ఒక రోజు నేను తప్పకుండా ఆడతా" అని బదులిచ్చా.
పాకిస్తాన్ జట్టుకు తాను ఎంపికైతే తిరిగి వచ్చి ఆయన్ను కలుస్తానని మాట ఇచ్చా.’’ అని అఖ్తర్ చెప్పాడు.
కొన్ని సంవత్సరాల తర్వాత భారత్‌పై అద్భుతమైన ప్రదర్శనతో ఒక స్టార్‌గా మారిన తర్వాత తన మాట నిలబెట్టుకోవడానికి లాహోర్‌కు వెళ్లినట్లు, అక్కడ అజీజ్ ఖాన్‌ను వెతికి పట్టుకున్నట్లు, ఇద్దరూ కలిసి డిన్నర్ చేసినట్లు వెల్లడించాడు అఖ్తర్? ఆ తర్వాత ట్రయల్స్ కోసం వెళ్లిన అదే మార్గంలో మరోసారి గుర్రపుబండిలో ప్రయాణించినట్లు చెప్పాడు.

ఫొటో సోర్స్, REHAN ARIF/AFP via Getty Images
కాల్పులు, మృతదేహాలు, బంద్‌లు, కర్ఫ్యూలు
పీఐఏ జట్టుకు ఎంపికైన తర్వాత అఖ్తర్ కరాచీ వెళ్లాడు. అయితే తనకు అక్కడ వసతి కల్పించలేదనీ, లియాఖతాబాద్, లాలూఖేత్ వంటి ప్రాంతాల్లోని సాధారణ గదుల్లో ఉండాల్సి వచ్చిందనీ గుర్తు చేసుకున్నాడు.
ఆ సమయంలో కరాచీలో రాజకీయ హింస, సైనిక చర్యలు ఎక్కువగా ఉండేవి. తరచుగా బంద్‌లు, కాల్పులు, కర్ఫ్యూలు ఉండేవి.
జాతీయ స్టేడియానికి చేరుకోవడానికి తాను ప్రతిరోజూ చాలా కిలోమీటర్లు నడవాల్సి వచ్చేదని అఖ్తర్ చెప్పాడు. కొన్నిసార్లు అకస్మాత్తుగా కాల్పులు జరిగేవనీ, అప్పుడు బుల్లెట్ తగలకుండా తప్పించుకోవడానికి నేలపై కూర్చునేవాణ్ణని అఖ్తర్ గుర్తుచేసుకున్నాడు. దాదాపు ఏడాదిన్నర కాలం అలాంటి పరిస్థితుల్లో గడిపినట్లు చెప్పుకున్నారు అఖ్తర్.

ఫొటో సోర్స్, Hannah Peters/Getty Images
‘జీవితంలో మొదటిసారి బాంబు పేలుడు చూసి’
2002 మే నెలలో కరాచీలో పాకిస్తాన్, న్యూజీలాండ్ జట్లు బస చేసిన హోటల్ వెలుపల ఒక భారీ బాంబు పేలుడు జరిగింది.
గదిలో కూర్చుని ఉండగా, అకస్మాత్తుగా పెద్ద శబ్దం సంభవించి, బయట మంటలు కనిపించాయని షోయబ్ అఖ్తర్ చెప్పాడు. తన చెవులు పగిలిపోయినట్టు అనిపించిందనీ, రషీద్ లతీఫ్ గది తలుపు పగలగొట్టి వారిని బయటకు తీసుకువచ్చినట్లు వెల్లడించాడు.
గ్రౌండ్ ఫ్లోర్‌కు వచ్చాక న్యూజీలాండ్ ఆటగాళ్లు భయంతో ఏడుస్తూ కనిపించారనీ, తానూ చాలా భయపడ్డాననీ, ఈ సంఘటన తనపై తీవ్రమైన మానసిక ప్రభావాన్ని చూపిందని, చాలాకాలం పాటు కరాచీకి రావాలంటే భయపడ్డానని చెప్పాడు.

ఫొటో సోర్స్, read FAROOQ NAEEM/AFP via Getty Images
'షారుఖ్ ఖాన్ మాటలను నమ్మి ఉండకూడదని తర్వాత అనిపించింది'
ఐపీఎల్ తొలి సీజన్ 2008లో ప్రారంభమైంది. షోయబ్ అఖ్తర్ కూడా అందులో భాగమయ్యాడు.
ఐపీఎల్, ఐసీఎల్ లీగ్‌లు రెండూ అప్పుడప్పుడే మొదలవుతున్న సమయమది. బాలీవుడ్ హీరో, కోల్‌కతా నైట్ రైడర్స్ యజమాని అయిన షారుఖ్ ఖాన్ నైట్ రైడర్స్ తరఫున ఆడాలని తనను ఆహ్వానించాడని షోయబ్ అఖ్తర్ చెప్పాడు.
షారుఖ్ ఖాన్, లలిత్ మోదీలను కలిసినట్లు చెప్పాడు అఖ్తర్. వాళ్లు కొన్ని ఆర్థిక హామీలు ఇచ్చారని, కానీ బిడ్డింగ్ ప్రక్రియ తర్వాత తనకు నిరాశ ఎదురయిందని అఖ్తర్ వెల్లడించాడు.
తనకు చెల్లిస్తున్న మొత్తంతో తాను సంతృప్తిగా లేనని షారుఖ్ ఖాన్‌కు స్పష్టంగా చెప్పానని, ఈ సమస్య కేవలం డబ్బుకు సంబంధించినది మాత్రమే కాదని, ఒక ఆటగాడి హోదా, గౌరవానికి కూడా సంబంధించిన అంశమని అన్నట్లు అఖ్తర్ చెప్పాడు.
లలిత్ మోదీ, షారుఖ్ ఖాన్ల మాటలను తాను నమ్మకుండా ఉండాల్సిందని ఇప్పుడు తనకు అనిపిస్తోందని అఖ్తర్ రాశాడు.

ఫొటో సోర్స్, Jack Atley/ALLSPORT
ఆసిఫ్ జర్దారీ, అల్తాఫ్ హుస్సేన్‌ల సాయాన్ని అఖ్తర్ ఎందుకు కోరాడు?
సెంట్రల్ కాంట్రాక్టులకు సంబంధించి తాను చేసిన ఒక వ్యాఖ్యపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆగ్రహం వ్యక్తంచేసిందని షోయబ్ అఖ్తర్ చెప్పాడు. దీంతో అతనిపై ఐదేళ్ల నిషేధం పడింది. దీంతో ఐపీఎల్లో ఆడే అవకాశం కూడా ప్రమాదంలో పడింది.
ఆ సమయంలో పీసీబీ ఛైర్మన్ నసీమ్ అష్రఫ్ తనకు వ్యతిరేకంగా ఉన్నారని అఖ్తర్ ఆరోపించాడు.
ఈ పరిస్థితి నుంచి బయటపడటానికి తాను ఒక స్నేహితుడి ద్వారా ఆసిఫ్ అలీ జర్దారీని సంప్రదించానని, అలాగే ఎంక్యూఎం నాయకుడు అల్తాఫ్ హుస్సేన్‌కు కూడా ఫోన్ చేశానని అఖ్తర్ తెలిపాడు.
రెహమాన్ మాలిక్ ఈ విషయంలో జోక్యం చేసుకున్నట్లు, ఆ తర్వాత తాను నసీమ్ అష్రఫ్‌ను కలిసినట్లు, ఫలితంగా నిషేధాన్ని ఎత్తివేయడంతో ఐపీఎల్లో ఆడేందుకు అర్హత సాధించినట్లు అఖ్తర్ చెప్పాడు.
ఐపీఎల్లో షోయబ్ అఖ్తర్ కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఆడి దిల్లీ డేర్‌డెవిల్స్‌పై అద్భుతంగా రాణించాడు. వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, ఏబీ డివిలియర్స్, మనోజ్ తివారీలను ఔట్ చేశాడు. జట్టు విజయం తర్వాత షారుఖ్ ఖాన్ ఆనందంగా వచ్చి తనను కౌగిలించుకున్నాడని అఖ్తర్ చెప్పాడు.

ఫొటో సోర్స్, Will Russell/Getty Images
బ్రయాన్ లారాతో అఖ్తర్ ఏం చెప్పాడు?
షోయబ్ అఖ్తర్ తన అభిమాన బ్యాట్స్‌మెన్ అయిన బ్రయాన్ లారాకు బౌలింగ్ చేయాలనుకునేవాడు. 2004 చాంపియన్స్ ట్రోఫీ సమయంలో అతనికి ఆ అవకాశం లభించింది.
"మీరు నాకు ఇష్టమైన బ్యాట్స్‌మన్, మీకు బౌలింగ్ చేయడం నాకు గౌరవం" అని తాను లారాతో అన్నట్టు షోయబ్ అఖ్తర్ చెప్పాడు.
అయితే షోయబ్ అఖ్తర్ తనను చంపేస్తానని అంటున్నాడని లారా సరదాగా రామ్‌నరేశ్ శర్వాన్‌తో చెప్పాడు.
యాదృచ్ఛికంగా కొద్దిసేపటికే షోయబ్ వేసిన బంతి లారా మెడకు తగలడంతో అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లాల్సి వచ్చింది. ఆ తర్వాత అఖ్తర్ బెదిరింపులకు పాల్పడ్డాడనే వదంతులు వ్యాపించాయి.
అయితే లారా స్వయంగా అందులో నిజం లేదని చెప్పి అఖ్తర్‌కు క్షమాపణ కూడా చెప్పాడు.

ఫొటో సోర్స్, Mike Hewitt/Getty Images
సాహసాలు లేకపోతే జీవితం అసంపూర్ణం
షోయబ్ అఖ్తర్‌కు సాహసాలంటే చాలా ఇష్టమట. స్కైడైవింగ్, బంగీ జంపింగ్ చేశాడు. అడవిలో హైకింగ్‌కు వెళ్ళాడు. బి-52 బాంబర్ విమానాన్ని నడిపాడు. ఇంకా పార్టీలలో స్వేచ్ఛగా డ్యాన్స్ చేశాడు.
అంపైర్ రూడీ కోర్ట్జెన్‌తో తాను చేసిన అల్లరి పనులను కూడా షోయబ్ అఖ్తర్ గుర్తుచేసుకుంటాడు. సరదాగా రూడీ కోర్ట్జెన్ చొక్కా లాగేవాణ్ణని, ఆయనెప్పుడూ కోపగించుకోలేదని అఖ్తర్ అన్నాడు.
2006లో మోకాలి ఆపరేషన్ జరుగుతున్నప్పుడు కొద్దిసేపు స్పృహలోకి వచ్చానని అఖ్తర్ చెప్పాడు. వైద్యులు మళ్లీ మత్తుమందు ఇచ్చి ఆపరేషన్ పూర్తిచేశారు.
రికవరీ గదిలో మెలకువ వచ్చినప్పుడు ఎదురుగా ఉన్న నర్సుతో సరదాగా సరసాలాడటం మొదలుపెట్టానని, కొద్దిసేపటికే తిరిగి నిద్రపోయానని అఖ్తర్ గుర్తుచేసుకున్నాడు.

ఫొటో సోర్స్, LAKRUWAN WANNIARACHCHI / AFP via Getty Images
''గ్యాంగ్‌స్టర్'' చిత్రంలో నటించలేకపోయినందుకు విచారం
దర్శకుడు మహేశ్ భట్ నన్ను కలవాలనుకుంటున్నారని నటి మీరా చెప్పినట్లు అఖ్తర్ వెల్లడించాడు. 'గ్యాంగ్‌స్టర్' సినిమాలో అఖ్తర్‌కు ఒక పాత్ర ఇవ్వాలని మహేశ్ భట్ అనుకున్నారనీ, ఆ ఆఫర్‌కు తాను చాలా సంతోషించానని అఖ్తర్ చెప్పారు.
అయితే సినిమాల్లో నటిస్తే చర్యలు తీసుకుంటామని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు హెచ్చరించింది. క్రికెట్ కెరీర్‌ను సీరియస్‌గా కొనసాగించాలనుకుంటే సినిమాలకు దూరంగా ఉండాలని స్నేహితులు కూడా సలహా ఇచ్చినట్లు అఖ్తర్ చెప్పాడు.
చివరికి షోయబ్ అఖ్తర్ ఆ సినిమాలో నటించలేదు. ఆ అవకాశాన్ని వదులుకోవడం కొంత బాధ కలిగించిందని తర్వాత షోయబ్ అఖ్తర్ అన్నాడు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



























