న్యూస్‌ పేపర్లు, కాగితాల్లో చుట్టిన ఆహారం తింటున్నారా? మీ కడుపులో ఏం జరుగుతుందో తెలుసా

ఫుడ్
    • రచయిత, షేక్ అన్సారి
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 6 నిమిషాలు

ఒకప్పుడు హోటల్‌లో టిఫిన్ చేసినా, భోజనం చేసినా అరటాకుల్లోనో, విస్తరాకుల్లోనో పెట్టి ఇచ్చేవారు. పార్సిల్ తీసుకున్నా వాటిలోనే కట్టేవారు. కానీ కాలక్రమేణా అరటాకుల స్థానంలోకి న్యూస్ పేపర్లు, పాంప్లేట్లు వచ్చిచేరాయి. చాలాకాలంగా టిఫిన్లను ప్లాస్టిక్ కవర్లలోనో, లేదంటే ప్రింట్ చేసిన పేపర్లలోనో చుట్టివ్వడాన్ని చూస్తున్నాం.

అయితే స్ట్రీట్ ఫుడ్ అమ్మేవారు, హోటల్స్, ఇతర ఆహారం అమ్మే వ్యాపారులకు భారత ఆహార భద్రత ప్రమాణాల సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ఇటీవల ముఖ్యమైన సూచనలు జారీ చేసింది.

బోండాలు, బజ్జీలు, సమోసాలు వంటి ఆహార పదార్థాలను వార్తాపత్రికలు, ఇతర ప్రింటెడ్ పేపర్లలో చుట్టి ఇవ్వడం లేదా వాటిపైన వడ్డించడం ఆరోగ్యానికి హానికరమని తెలిపింది.

పేపర్‌పై ప్రింటింగ్‌కు వాడే ఇంక్‌లో రసాయనాలతోపాటు సీసం వంటివి కూడా ఉంటాయని వేడి తగలగానే ఆహారానికి అతుక్కుని ఇవి కూడా కడుపులోకి వెళ్లి అనారోగ్యానికి కారణమవుతాయని తెలిపింది.

దీనిపై మరింత సమాచారం తెలుసుకునేందుకు వైద్య నిపుణులతో మాట్లాడింది బీబీసీ.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఇటీవల ముంబయిలో ఒక వీధి వ్యాపారి ఆహారాన్ని న్యూస్ పేపర్లలో చుట్టి ఇవ్వడాన్ని గుర్తించింది ఎఫ్ఎస్ఎస్ఏఐ.

ఇంతకుముందే మార్గదర్శకాలు ఉన్నప్పటికీ న్యూస్ పేపర్లలో ఆహారం అందించకూడదని మరోసారి ఆదేశాలు జారీ చేసింది.

ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆహార భద్రత, ప్రమాణాల (ప్యాకేజింగ్) నిబంధనలు, 2018 ప్రకారం ఆహారాన్ని నిల్వ చేయడానికి, వడ్డించడానికి వార్తాపత్రికలను లేదా అలాంటి ఏ ఇతర పదార్థాలను వాడడం నిషేధం.

ఆహార పదార్థాలు
వీధి వ్యాపారులు

వేటికి ఉపయోగించకూడదు

  • అదనపు నూనెను పీల్చుకోవడానికి
  • ఆహార పదార్థాలను లేదా పదార్థాల తయారీకి వాడే వస్తువులను కప్పడానికి
  • ఆహారాన్ని వడ్డించడానికి
  • ఆహారాన్ని ప్యాక్ చేయడానికి
రసాయనాలు, ఇంక్
ఫొటో క్యాప్షన్, డాక్టర్ శ్యామ్ ప్రసాద్

వైద్యులు ఏమంటున్నారు?

న్యూస్ పేపర్లలో వేడివేడి పదార్ధాలు పెట్టుకుని తింటే వచ్చే ప్రమాదాలేంటి అన్న విషయంపై కర్నూలు మెడికల్ కాలేజ్‌కి చెందిన డాక్టర్ శ్యామ్ ప్రసాద్‌‌తో బీబీసీ మాట్లాడింది.

శ్యాంప్రసాద్ సోనాలజిస్ట్‌గా పనిచేస్తున్నారు. ముద్రణకు వాడే ఇంక్ శరీరంలోకి వెళ్తే ఏం జరుగుతుంది? ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి, శరీరంలోపలి అవయవాలపై ఎలాంటి ప్రభావం చూపొచ్చన్న విషయాలపై సందేహాలకు సమాధానాలిచ్చారు.

  • ప్రశ్న: ప్రింటింగ్ అక్షరాలకు వాడే ఇంక్‌ శరీరంలోకి వెళితే ఏం జరుగుతుంది?
  • జవాబు: ప్రింటింగ్ అక్షరాలకు వాడే ఇంక్‌లో సీసం(లెడ్) అనే ఖనిజం ఉంటుంది. ఇది ఆహారంలో కలిసి శరీరంలోకి వెళ్లి లివర్‌ని డామేజ్ చేస్తుంది. అలాగే రక్తంలో కలసి శరీర అవయవాలను దెబ్బతీస్తుంది. కొన్ని సందర్భాల్లో బ్రెయిన్ డామేజ్ జరిగే ప్రమాదం కూడా ఉంటుంది.
  • ప్రశ్న: మహిళలు ఇళ్లలో కూడా చపాతీలు, పూరీలు వంటివి చేసేటప్పుడు పాత న్యూస్ పేపర్లపై వేస్తుంటారు కదా దీని ప్రభావం ఎలా ఉంటుంది?
  • జవాబు: పెద్దలకంటే కూడా పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపిస్తుంది ఈ అలవాటు. వాళ్ల మానసిక, శారీరక ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. వారిలో అవయవాలు పూర్తి స్థాయిలో రూపొందవు కాబట్టి ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది.
  • ప్రశ్న: గర్భిణులపై ఎలాంటి ప్రభావం ఉంటుంది?
  • జవాబు: గర్భిణులు అస్సలు ప్రింటింగ్ చేసిన పేపర్లలో తినకూడదు. అది చాలా ప్రమాదం. శిశువు ఏర్పడని స్టేజ్‌లో ఈ రసాయనాలు శరీరంలోకి వెళితే అబార్షన్ కావడం, మానసిక వైకల్యంతో పుట్టడం, మృతశిశువులు జన్మించే ప్రమాదాలు కూడా ఉంటాయి. కాబట్టి గర్భిణులు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి.
అరిటాకు పొట్లం
ఫొటో క్యాప్షన్, అరటాకు పొట్లం

ఆహార విక్రయం, పంపిణీలో సురక్షితమైన, అధికారికంగా ఆమోదించబడిన ఫుడ్-గ్రేడ్ ప్యాకేజింగ్ పదార్థాలను మాత్రమే ఉపయోగించాలని ఆహార వ్యాపారాలను కోరుతోంది ఎఫ్ఎస్ఎస్ఏఐ.

ఈ విషయంలో వినియోగదారులు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

అలాగే ఆహారాన్ని పెట్టి ఇచ్చే కాగితం లేదా పేపర్ బాక్స్‌లు, ప్లేట్లు, కప్పుల తయారీకి ఉపయోగించే పదార్థం ఫుడ్-గ్రేడ్ ప్రమాణాలతో ఉండాలని, కాలుష్య కారకాలు లేకుండా ఉండాలని ఈ నిబంధన స్పష్టం చేస్తుంది.

రసాయనాలు

ఆరోగ్య ప్రమాదాలు

వార్తాపత్రికల ముద్రణ సిరాలో (ఇంక్) బైండర్లు, రంగులు, రసాయనాలు, ఖనిజ నూనె హైడ్రోకార్బన్ల వంటి భార లోహాలు ఉంటాయి.

వేడిగా ఉన్న ఆహారాన్ని వార్తాపత్రికలో పెట్టినప్పుడు, ఆ వేడి కారణంగా ముద్రణ సిరాలోని రసాయనాలు ఆహారంలోకి చేరే అవకాశం ఉంటుంది.

అలాంటి ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఈ రసాయనాలు మన శరీరంలోకి ప్రవేశించి వివిధ ఆరోగ్య సమస్యలకు కారణమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

జింక్ లోహం

పరిశుభ్రత సమస్యలు

‘న్యూస్ పేపర్లు అనేక చేతులుమారి, రకరకాల పరిసరాల నుంచి వస్తాయి.

దీనివల్ల వాటిపై ధూళి, బాక్టీరియా, ఇతర కాలుష్యాలు చేరే అవకాశం ఉంది.

ఇది వినియోగదారులను వ్యాధుల బారిన పడేలా చేస్తుంది’ అని డాక్టర్ శ్యామ్ ప్రసాద్ చెప్పారు.

బర్గర్లు

ఇంట్లోకూడా పేపర్లు వాడుతున్నారా?

ఇంట్లో కూడా నూనెతో కూడిన ఆహారాన్ని ప్యాక్ చేయడానికి కొందరు న్యూస్ పేపర్లను ఉపయోగిస్తుంటారు. ఇలా చేయకపోవడమే మంచిది.

ఎందులో తినాలి?

ఆహారాన్ని స్టెయిన్‌లెస్ స్టీల్ పాత్రల్లో, ఎండిన ఆకుల్లో లేదా గాజు పాత్రల్లో వడ్డించడం మంచిదని సూచిస్తున్నారు నిపుణులు.

ఫిర్యాదు

ఆహారం విక్రయించేవారు పేపర్లలో ప్యాక్ చేస్తే ఎవరికి ఫిర్యాదు చేయాలి?

ఒకవేళ ఎవరైనా వ్యాపారులు న్యూస్ పేపర్లలోగానీ, కరపత్రాల్లో కానీ ఆహారాన్ని విక్రయిస్తే, ప్రజలు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయ్యొచ్చు.

  • FSSAI అధికారిక వెబ్‌సైట్: www.fssai.gov.in‌లో ఫిర్యాదు నమోదు చేయొచ్చు.
  • ఆహార భద్రత ఫిర్యాదుల పోర్టల్ (FoSCoS): foscos.fssai.gov.in/consumergrievance
  • మొబైల్ యాప్: నేరుగా ఫోటోలతో సహా ఫిర్యాదులను నమోదు చేయడానికి, ట్రాక్ చేయడానికి గూగుల్ ప్లే స్టోర్ / యాపిల్ యాప్ • FSSAI అధికారిక వెబ్‌సైట్: www.fssai.gov.in
  • టోల్-ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్: 1800-11-2100 (24 గంటలు అందుబాటులో ఉంటుంది)

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)