‘గేమింగ్ ద్వారా టీచర్‌గా కంటే రెండింతలు సంపాదిస్తున్నా’

ఫొటో సోర్స్, John Fairhall/BBC
- రచయిత, జోయీ ఒ బ్రయన్, లారా డెవ్లిన్
- ప్రచురణ
- చదివే సమయం: 4 నిమిషాలు
దీర్ఘకాలిక అనారోగ్యం కారణంగా జార్వ్స్ టస్కర్ 2019లో టీచర్ ఉద్యోగాన్ని వదులుకోవాల్సి వచ్చింది. అప్పుడు ఆమె వయసు 28 ఏళ్లు.
ఏడేళ్లు గడిచేసరికి ఆమె గతంలో ఏడాదికి సంపాదించిన దానికంటే రెట్టింపు ఆదాయం సంపాదిస్తున్నారు.
ఏడేళ్లు గడిచేసరికి ఆమె గేమింగ్ రంగంలో కమ్యూనికేషన్, మార్కెటింగ్ సేవలు అందించే జార్వ్స్ ఇండీ ఇన్‌సైట్స్‌ను నిర్వహిస్తూ టీచర్‌గా ఉన్నప్పుడు ఏడాదికి సంపాదించే మొత్తానికి రెండింతలు కళ్లజూస్తున్నారు.
ఇండిపెండెంట్ గేమ్ డెవలపర్లు, స్టూడియోలను ప్రోత్సహించే కార్యక్రమంలో పాల్గొనడానికి ఇప్స్‌విచ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ సఫోక్ ఈ-స్పోర్ట్ భవనాన్ని ఆమె సందర్శించారు.
‘‘నేనిప్పుడు సంపాదిస్తున్నమొత్తాన్నిటీచింగ్ రంగంలో సంపాదించాలంటే దాదాపు 20 ఏళ్లు పట్టేదని నిస్సంకోచంగా చెప్పగలను’’ అంటారు టస్కర్.

టీచింగ్‌ను వదిలిన తర్వాత టస్కర్ తొలుత ప్లేస్టేషన్ యూట్యూబ్ ఛానల్ కోసం స్వచ్ఛందంగా పనిచేయడం ప్రారంభించారు.
అయితే ఈ రెండు రంగాల మధ్య చాలా పోలికలు ఉన్నాయని ఆమె చెప్పారు.
"ఒక కమ్యూనిటీని నడపడం, పిల్లల తరగతిగదిని నిర్వహించడానికి మధ్య చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. చాలా నైపుణ్యాలు ఈ రెండింటికీ ఉపయోగపడతాయి. అయితే వీడియో గేమ్స్ రంగంలోకి చాలా మంది ఆలస్యంగా అడుగుపెడతారు " అని ఆమె చెప్పారు.
ఎక్సెటర్‌లో నివసించే టస్కర్, ఈ రంగంలో అందుబాటులో ఉన్న అనేక మార్గాల గురించి యువతకు తెలియకపోవచ్చన్నారు.
"వీడియో గేమ్స్ కమ్యూనిటీ చాలా బలమైంది. తాము చేసే పనిని ఇష్టపడే వ్యక్తులకు వారు మద్దతుగా నిలుస్తారు. అయితే కేవలం డబ్బు కోసమే రంగంలోకి వచ్చినవారిని కూడా గుర్తించగలరు" అని ఆమె చెప్పారు.
"అభిరుచే అన్నింటికంటే ముఖ్యమైనది."అని చెప్పారు.
కృత్రిమ మేధస్సు ప్రభావం గురించి అడిగినప్పుడు, వీడియో గేమ్స్ ప్లేయర్లు దాన్ని ఇష్టపడకపోవడంతో గేమింగ్ రంగం దాన్ని సమర్థవంతంగా తిరస్కరిస్తోందని తాను భావిస్తున్నట్లు చెప్పారు.
"మనం ఇప్పటికీ మానవ సృజనాత్మకతకు ప్రాధాన్యం ఇస్తుండటం, ప్రేక్షకులు కూడా దానికి మద్దతుగా నిలుస్తుండటం గురించి ఒక రంగంగా మనం గర్వపడాలి" అని ఆమె అన్నారు. తూర్పు ఇంగ్లండ్‌లో అభివృద్ధి చెందుతున్న స్వతంత్ర గేమింగ్ రంగాన్ని ప్రదర్శించేందుకు గేమ్ ఆంగ్లియా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనేందుకు టస్కర్ సఫోక్‌కు వచ్చారు.

ఫొటో సోర్స్, John Fairhall/BBC
గేమింగ్ రంగం ఇప్పుడు బ్రిటన్‌లో అతిపెద్ద రంగాల్లో ఒకటిగా మారిందని గేమ్ ఆంగ్లియాకు చెందిన మార్క్ బ్యాక్లర్ చెప్పారు. ఈ రంగంలో పోటీ ఎక్కువగా ఉందని అంగీకరిస్తూనే, ‘‘గతంలో కంటే ఇండిపెండెంట్ గేమ్‌ను అభివృద్ధి చేసి విడుదల చేయడం మరింత సాధ్యమవుతోంది’’ అని చెప్పారు.
"ఇది కంటెంట్ క్రియేటర్‌గా ఉండటం లాంటిదే. అందరిలో ప్రత్యేకంగా కనిపించే స్థాయికి చేరుకోవడం కష్టం. కానీ అది సాధ్యమే" అంటారు మార్క్ బ్యాక్టర్.
కృత్రిమ మేధస్సు ఈ రంగాన్ని ఎలా మారుస్తుందో చెప్పడం కష్టమని ఆయన అన్నారు. అయితే చాలా మంది ప్లేయర్లు దాని వినియోగాన్ని వ్యతిరేకిస్తున్నారని తెలిపారు.

ఫొటో సోర్స్, John Fairhall/BBC
రీడ్ గ్రేవ్స్‌కు చెందిన సామ్ రీడ్-గ్రేవ్స్ గేమ్ డెవలపర్‌గా పనిచేస్తున్నారు. గడిచిన పదేళ్లలో గేమింగ్ రంగం భారీగా అభివృద్ధి చెందిందని ఈ కార్యక్రమంలో ఆయన చెప్పారు.
"సఫోక్, ఎసెక్స్, కేంబ్రిడ్జ్‌షైర్, నార్ఫోక్ ప్రాంతాల్లో గేమ్ ఆంగ్లియా వంటి కార్యక్రమాల కారణంగా విద్యార్థులు, డెవలపర్లకు సంబంధించిన మంచి క్లస్టర్లు ఏర్పడ్డాయి. పెద్ద గేమ్స్‌ను రూపొందించగల స్టూడియోలను ఈ ప్రాంతానికి తీసుకురావడానికి ఇది దోహదపడుతోందని భావిస్తున్నా’ అన్నారు.
‘‘కాల్ ఆఫ్ డ్యూటీ, ఫిపావంటి వీడియోగేమ్‌లు ఇప్పటికిప్పుడు తూర్పు ఇంగ్లండ్ నుంచి వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇక్కడ పెద్ద పెద్ద స్టూడియోలు లేవు’’ అని చెప్పారు.
‘‘కానీ స్వతంత్ర డెవలపర్లు రూపొందించే చిన్న గేమ్స్ కూడా ఆర్థికంగా అంతే పెద్ద విజయాన్ని సాధించగలవు’’ అని చెప్పారు.

ఫొటో సోర్స్, John Fairhall/BBC
డన్ ఎసెక్స్‌కు చెందిన 22 ఏళ్ల అబ్బిగేల్ స్వతంత్ర గేమ్ డెవలప్‌మెంట్ సంస్థ ఆస్ట్రల్ ఫోర్జ్ వ్యవస్థాపకురాలు, డైరెక్టర్.
ప్రస్తుతం గేమింగ్ రంగంలో మహిళలకు చాలా అవకాశముందంటారామె.
"గేమింగ్ రంగంలో మహిళలు తక్కువగా ఉండడం ఇబ్బందికరంగా అనిపించవచ్చు. మా కోర్సులో కేవలం ముగ్గురు మహిళలు మాత్రమే ఉండేవారు" అని ఆమె అన్నారు.
"నేనే ప్రోగ్రామర్‌ని. ఈ రంగంలో మహిళలు ఉండటం కాస్త అరుదే. అయినా నాకెప్పుడూ ఇక్కడి వ్యక్తిని కాదనే భావన కలగలేదు" అని ఆమె చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

































