అవసరానికి మించి తింటున్నామా? మన ప్లేట్ సైజుకు, మన సైజుకు సంబంధం ఉందా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సారాహ్ బెల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 6 నిమిషాలు
పెద్ద పెద్ద బర్గర్లు, పళ్లెం నిండా ఆహారపదార్థాలు, ఇంకా పెద్ద సైజు సోడాలు. గత 50 ఏళ్లగా ప్రపంచంలో కొన్ని చోట్ల మనం తినే ఆహారం పరిమాణం పెరుగుతూ వచ్చింది. అదే సమయంలో ధరలు, ఊబకాయుల సంఖ్యా పెరుగుతోంది.
ఆహార పరిశ్రమ మనల్ని నోరూరించే రుచులతో కవ్విస్తున్నప్పుడు మన ఆరోగ్యాన్ని రక్షించుకుంటూ, ఎక్కువగా తినాలనే ఆబను నియంత్రించుకోగలమా?
ఈ మార్పు అమెరికాలో స్పష్టంగా కనిపించింది. ఆహార పదార్థాల పరిమాణం 1980ల నుంచీ అమెరికాలో పెరుగుతూ వచ్చింది. బయట తినే అలవాటు పెరగడం, రెస్టారెంట్లు, ఇతర హోటళ్ల వంటి వాటి మధ్య పోటీ పెరగడం దీనికి కారణం.
''ఒక కంపెనీ చిన్న పరిమాణంలో పాస్తా ఇస్తే, మరో కంపెనీ అదే పాస్తాను ఎక్కువ మొత్తంలో అంతే ధరకు అందిస్తుంటే మనం ఎక్కువ పరిమాణంలో ఉన్నదే తినాలనుకుంటాం'' అని న్యూయార్క్ యూనివర్శిటీకి చెందిన డాక్టర్ లీసా యంగ్ ‘ది ఫుడ్ చైన్ ప్రోగ్రామ్’కు చెప్పారు.


ఫొటో సోర్స్, Getty Images
‘ప్రాసెస్డ్ ఫుడ్‌తో జాగ్రత్తగా ఉండాలి’
ఆహారం చవకైపోవడం వల్లే రెట్టింపు ఆహారం తినే పరిస్థితి వచ్చిందంటారు డాక్టర్ లీసా యంగ్.
''ఆహారం చాలా చాలా చవకగా మారింది. దీంతో తయారీదారు పావువంతు డబ్బులు అదనంగా వసూలు చేసి రెట్టింపు ఆహారం అందిస్తారు. మనం చవకగా ఆహారపదార్థాలు పొందామనుకుంటాం. వాళ్లకు మరిన్ని డబ్బులొస్తాయి. ఇది ఉభయతారకంగా అనిపిస్తుందిగానీ వారెక్కువ లాభపడతారు'' అని ఆమె వివరించారు.
బ్రెజిల్ వంటి అభివృద్ధి చెందుతున్నదేశాల్లో కూడా ఇది కనిపిస్తుందని సావో పౌలో యూనివర్శిటీకి చెందిన డాక్టర్ మర్లే అల్వరెంగా చెప్పారు.
''ప్యాకేజ్డ్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ విషయంలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. మన సంప్రదాయ ఆహారపదార్థాలైన రైస్, బీన్స్, చేపలు, కర్రపెండలం పిండిలాంటివి ఇలా ఎక్కువ మొత్తంలో లభించవు'' అని ఆమె అన్నారు.
అమెరికనైజేషన్ వల్ల ఎక్కువగా ఇది జరుగుతోందని డాక్టర్ యంగ్ వివరించారు.
''మెక్‌డొనాల్డ్స్ లేదా కొన్ని క్యాండీ బార్లు లాంటి అమెరికాకు చెందిన ఆహారపదార్థాలు ఇతర దేశాల్లో మరింత పెద్ద పరిమాణంలో దొరుకుతున్నాయి. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకుంటే మనం అదనంగా 500 క్యాలరీలను తెలియకుండా ఎక్కువ తీసుకున్నట్టే'' అని ఆమె వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎక్కువగా ఎందుకు తింటాం?
ఎక్కువ పరిమాణంలో ఆహారం పెట్టుకుంటే, ఎక్కువ తింటామని పరిశోధనల్లో తేలిందని మాతో మాట్లాడిన సైకాలజిస్టు చెప్పారు. ఆహార పదార్థాల పరిమాణం రెట్టింపు ఉంటే మనం సాధారణంగా తినేదాంతో పోలిస్తే 35 శాతం కంటే ఎక్కువ తింటామని ఓ విశ్లేషణ తెలిపింది.
''అంటే ప్లేటులో ఉన్న ప్రతీదీ తింటామని కాదు. ఎందుకంటే చాలాసార్లు ప్లేటులో ఉన్నవన్నీ తినం. కొన్నింటిని వదిలిపెడుతుంటాం. అయినప్పటికీ ఆహార పదార్థాల పరిమాణం పెరిగితే మనం మొత్తంగా ఎక్కువ తింటుంటాం'' అని సిడ్నీలోని న్యూ సౌత్ వేల్స్ యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ లెన్నీ వర్టానియన్ చెప్పారు.
మనం ఎంత మొత్తం ఆహారం తీసుకుంటే సరిపోతుందనే విషయం తెలుసుకోవడం చాలా కష్టమైన విషయం. మన పొట్ట ఇచ్చే సంకేతాలపై మనం ఆధారపడలేం. ఎంత తినాలో తెలియనప్పుడు ఆహార పరిమాణాన్ని బట్టి తినేస్తుంటాం అని ప్రొఫెసర్ చెప్పారు.
‘‘మనం చాలా సందర్భాలలో పొట్ట నిండిపోవడం లేదంటే ఇంకా ఆకలేస్తూ ఉండటం లాంటి పరిస్థితులను ఎదుర్కోం కానీ ఆ రెండింటి మధ్యలో ఉంటుంటాం. అందువల్లే ఆహారపదార్థాల పరిమాణం, పెద్ద ప్లేటు వంటివాటి ప్రభావం మనం తినే ఆహారంపై ఉంటుంది' అని ప్రొఫెసర్ వర్టానియన్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
చిన్న ప్లేట్లతో ఉపయోగమా?
తిండి తగ్గించడానికి మన పళ్లెం సైజు తగ్గించడం తేలికైన మార్గంగా ఒకనాడు భావించేవారు. పళ్లెం సైజు కారణంగా మనం తక్కువగా తింటామని భావిస్తాం. మీరెంత తింటారోె అంతే ఆహారం మరింత చిన్నప్లేటులో పెడితే చూడటానికి చాలా పెద్దమొత్తంలో కనిపించడం వల్ల తక్కువగా తింటాం.
కానీ ఈ అభిప్రాయం సరైనదని పరిశోధనలు నిర్ధరించలేదు.
పళ్లెం పరిమాణం ప్రభావం ఒక్కటే మనం ఎంత ఆహారం తీసుకుంటామనే దానిపై ఉండదని, ఆహారం అదనంగా అందుబాటులో ఉందా లేదా అన్నదే ప్రధానమని, ఆహారం , బరువుకు సంబంధించిన మనస్తత్వశాస్త్ర నిపుణులు ప్రొఫెసర్ వర్టానియన్ చెప్పారు.
అంటే దీనర్థం మనం ఆహారపదార్థాన్ని మళ్లీ మళ్లీ ప్లేట్‌లో పెట్టుకోవడానికి వీలు కలిగే పరిస్థితి ఉంటే, మనకు తినాలనిపిస్తే, పళ్లెం సైజుతో సంబంధం లేకుండా మళ్లీ మళ్లీ వడ్డించుకుంటాం అన్నారు.
''కొంత వడ్డించుకుని మిగిలినది ప్యాక్ చేసి కంటికి కనిపించనంత దూరంలో పెట్టుకోవాలి.
‘‘మనం వెంటనే వడ్డించుకునేంత దగ్గరగా ఆ పదార్థాన్ని ఉంచకూడదు'' అని ప్రొఫెసర్ తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆహారం పరిమాణాన్ని ఎలా నియంత్రించుకోవాలి?
మన ఆకలిని గమనించి అందుకు తగ్గట్టుగా ఆహారం తీసుకోవాలని, ఏం తింటున్నామో అవగాహనతో ఉండాలని నిపుణులు చెప్పారు.
''మన ప్లేట్‌లో ఏమేం ఉన్నాయనేదానిపై మనం దృష్టి పెట్టం. ఆకలికి తగ్గట్టుగా తినం. కడుపు నిండిందో లేదో కూడా పట్టించుకోం'' అని డాక్టర్ లీసా యంగ్ చెప్పారు.
పెద్ద పరిమాణంలోని ఆహారపదార్థాలను సాధారణ పరిమాణంగా భావించే ‘పోర్షన్ డిస్టోర్షన్’పైనా అవగాహన కలిగి ఉండాలని లీసాయంగ్ సూచించారు.
'నేనేతై లేబుల్స్ గమనిస్తుండాలి. ఆహారపదార్థం పరిమాణం ఎంత ఉందో చూడాలి. మార్కెటింగ్, ఇతర వ్యవహారాలన్నింటిలో ఆహార పరిశ్రమలు ఏం చేస్తున్నాయో అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించాలని సూచిస్తాను '' అని ఆహార అలవాట్ల నిపుణుడు డాక్టర్ మర్లే అల్వరెంగా చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
చిరుతిళ్ల సంగతేంటి?
''యాపిల్ లేదా ఇతర పండ్లు, నాన్ ప్యాకేజ్డ్ ఫుడ్ విషయంలో ఇలాంటి జాగ్రత్తలు అవసరం లేదు. అవి ఆరోగ్యకరమైన ఆహారం కాబట్టి ఎంత తిన్నా సమస్యలేదు'' అని డాక్టర్ యంగ్ తెలిపారు.
''కానీ ప్యాకేజ్డ్ ఫుడ్ తింటున్నప్పుడు లేబుల్ గమనించాలి. అందులో ఎంత పరిమాణం ఉందో అది తెలియచేస్తుంది. 'ఒక ప్యాకెట్‌లో నలుగురికి సరిపడా ఆహారం ఉంది' వంటి సూచనలుంటాయి. ప్యాకెట్ నుంచి ఆహారపదార్థం బయటకు తీసి, మనం మామూలుగా తినేదానితో పోలిస్తే ఎంత ఉందో పోల్చుకోవాలి'' అని ఆమె సూచించారు.
''బ్రేక్‌ఫాస్ట్ కోసం నేను ఒక చిన్న గిన్నెలో కార్న్‌ఫ్లేక్స్ లాంటివి మాత్రమే తీసుకున్నా అని చెబుతుంటారు. అయితే మనం ఎంత తిన్నామో అంత పరిమాణంలో దాన్ని ఒక గిన్నెలో వేసి చూసుకోవాలి. ఎంత తినాలనేది లేబుల్‌పై రాసి ఉంటుంది. అంతే తిన్నామో లేదో గమనించుకోవాలి. నిజానికి మనం తిన్నది అసలు తినాల్సినదానికన్నా మూడు రెట్లు ఎక్కువగా ఉంటుది'' అని ఆమె చెప్పారు.
‘‘లేబుల్‌పూ సూచించిన పరిమాణాన్ని తీసుకుని చూడండి. తరువాత మీ పళ్లెం లేదా గిన్నెలో మీరు నిజంగా ఎంత పరిమాణం తీసుకుంటున్నారో అంచనా వేసుకోండి. ఇది మన ఆహార పరిమితిని అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది’’ అని డాక్టర్ యంగ్ తెలిపారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.

























