భారత్‌లో అవకాడో సాగు పెరగడానికి నటి శిల్పాశెట్టికి సంబంధం ఏమిటి?

ఫొటో సోర్స్, Cottanad Plantations/Getty
- రచయిత, ప్రీతి గుప్తా
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 6 నిమిషాలు
పదిహేనేళ్ల కిందటివరకు భారత్‌లో అవకాడోకు మార్కెట్ లేదు అని మధు బోపయ్య గుర్తు చేసుకున్నారు.
చెట్ల నుంచి మాగిన పండ్లు కిందపడితే వాటిని కుక్కలు తినేవి. అందుకే వీటికి డాగ్ ఫ్రూట్ అనే అంతగా రుచించని పేరు వచ్చిందని ఆయన చెప్పారు.
బోపయ్య 26 ఏళ్లుగా భారత్‌లో ప్లాంటేషన్ పరిశ్రమలో పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఆయన కేరళలోని కొట్టనాడ్ ప్లాంటేషన్‌లో గ్రూప్ మేనేజర్‌గా పని చేస్తున్నారు.
ఈ కంపెనీ కేరళంలోని వయనాడ్‌లో కోకో, రబ్బర్, కాఫీ, మసాలా దినుసులు, అవకాడో సహా ఇతర పంటలను సాగు చేస్తోంది.
"అవకాడోను మేం ఎప్పుడూ ప్రధాన పంటగా వేయలేదు. కాఫీ పంటకు నీడనిచ్చే చెట్లుగా పెంచాం. తర్వాత ఇది కూడా లాభదాయకమైన వ్యాపారమని తెలుసుకున్నాం" అని ఆయన చెప్పారు.

సంప్రదాయపంటలు కాకుండా...
బాలీవుడ్ స్టార్ శిల్పాశెట్టి 2011లో తన చర్మ సంరక్షణకు అవకాడో ఉపయోగిస్తున్నట్టు చెప్పడం కీలకమైన మలుపని ఆయన వివరించారు.
"రాత్రికి రాత్రే అవకాడో ధర రెట్టింపు అయ్యింది, అప్పటి నుంచి పెరుగుతూనే ఉంది" అని గుర్తు చేసుకున్నారు.
పెరిగిన డిమాండ్‌కు తగ్గట్టుగా కొట్టనాడ్ 40 ఎకరాల్లో అవకాడో సాగు ప్రారంభించింది. గత ఏడాది అక్కడ పది నుంచి పదిహేను టన్నుల దిగుబడి వచ్చింది. వచ్చే మూడు నాలుగేళ్లలో దిగుబడిని 40 నుంచి 50 టన్నులకు పెంచాలని వారు భావిస్తున్నారు.
"దక్షిణాఫ్రికా నిపుణుల నుంచి చాలా విషయాలు నేర్చుకున్న తర్వాత అవకాడో పండించే విధానంలో పూర్తిగా మార్పులు చేశాం. అవకాడో వేర్ల ద్వారా చాలా తెగుళ్లు వ్యాప్తి చెందుతాయి. అందుకే ఎత్తైన గట్లు, మొక్కల మధ్య ఖాళీ స్థలం, నాటే విధానంలో భిన్న పద్దతులను అనుసరిస్తున్నాం " అని బోపయ్య వివరించారు.

ఫొటో సోర్స్, Cottanad Plantations
అవకాడో ఉత్పత్తి పెంచడానికి భారతీయ రైతులకు చాలా అవకాశం ఉంది.
" మార్కెట్‌ను పరిశీలించినప్పుడు డిమాండ్‌కు, సరఫరాకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని తేలింది. భారత్ ఏటా 15వేల టన్నుల అవకాడోను దిగుమతి చేసుకుంటోంది. దేశంలో మాత్రం అవకాడో ఉత్పత్తి 8 వేల నుంచి 9వేల టన్నులు మాత్రమే" అని భారత్‌లో అవకాడో పరిశ్రమను ప్రోత్సహించడానికి సాయపడుతున్న మణిలాల్ పళ్లియత్ చెబుతున్నారు.
సంప్రదాయ పంటలు పండిస్తూ ఇబ్బంది పడుతున్న రైతులకు ఇది మంచి అవకాశంగా ఆయన భావిస్తున్నారు.
"మారుతున్న వాతావరణ పరిస్థితులతో కాఫీ, మిరియాలు పండించే రైతులు బాగా ఇబ్బంది పడుతున్నారు. మార్కెట్ అవసరాలకు తగ్గట్టుగా రైతులు భిన్నంగా ఆలోచించాలి" అన్నారు ఆయన.

ఫొటో సోర్స్, Ajay Rajput
అంతర్జాతీయ రకాలకు భారీ డిమాండ్
భారత్‌లో అవకాడోకు డిమాండ్ పెరుగుతున్నప్పటికీ స్థానికంగా పండించిన పండ్ల రకాలకు ఆ స్థాయిలో డిమాండ్ లేదు.
"భారత్‌లో పండించే అవకాడోల నాణ్యత మెరుగుపడుతోంది. స్థానిక రకాలతో మంచి పంట పండిస్తున్న రైతులున్నారు. కానీ ప్రాంతం, సీజన్ బట్టి నాణ్యత, లభ్యత మారుతోంది" అని హంగర్ ఇంక్ హాస్పిటాలిటీ సంస్థ ఎగ్జిక్యూటివ్ చెఫ్ హుస్సేన్ షాజాద్ చెప్పారు.
ఈ గ్రూప్‌కు ముంబైలో వెరోనికాస్, ది బాంబే క్యాంటీన్ సహా నాలుగు రెస్టారెంట్లున్నాయి.
"భారత్‌లో లభించే అనేక అవకాడో రకాలను పరిశీలించాం. ప్రస్తుతం రుచి, మెత్తదనం, పరిమాణం, పండేస్థాయి వంటివి దిగుమతి చేసుకున్న అవకాడోల్లోనే ఉంటున్నాయి'' అని ఆయన చెప్పారు.
కేటరింగ్ రంగంలో ఉన్న మిగతా వారి మాదిరిగానే ఆయన కూడా స్థానిక ఉత్పత్తులకే ప్రాధాన్యం ఇవ్వాలని అనుకుంటారు.
"స్థానిక ఉత్పత్తుల నాణ్యత పెరుగుతున్న కొద్దీ మేం వాటిని ఉపయోగించడంపై ఎప్పుడూ ఆసక్తితో ఉంటాం. భారత వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, స్థానిక ఉత్పత్తులను వాడటం ఆహార తయారీలో మేం అనుసరించే విధానం'' అని ఆయన చెప్పారు.
దిగుమతి చేసుకుంటున్న నాణ్యమైన పండ్లలాంటివి ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా కొన్ని భారతీయ కంపెనీలు పని చేస్తున్నాయి.
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఉన్న ఇండో ఇజ్రాయెల్ అవకాడో నర్సరీ వ్యవస్థాపకుడు హర్షిత్ గోధా, 2021లో నర్సరీ వ్యాపారాన్ని ప్రారంభించారు. దానికి ముందు ఆయన ఇజ్రాయెల్‌లో నెల రోజులు ఉండి చాలా విషయాలు నేర్చుకున్నారు.
అప్పటి నుంచి ఆయన వ్యాపారం చాలా బాగా సాగుతోంది. గత ఐదేళ్లలో దేశవ్యాప్తంగా ఆయన 18 వేల వరకు అవకాడో మొక్కలను రైతులకు పంపిణీ చేశారు.
ఇవన్నీ కూడా పింకర్టన్, హాస్ వంటి అంతర్జాతీయరకాలకు చెందిన మొక్కలే.
" ఏడాదిలో 8 నెలలు వర్షాలు పడని ఇజ్రాయెల్ వంటి చిన్న దేశం దాదాపు 13వేల హెక్టార్లలో అవకాడో సాగు చేస్తోంది. అందుకే ఇజ్రాయెల్ అవకాడో సాగు సాంకేతికత ప్రపంచంలోనే అధునాతనమైనది" అని గోధా అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, IIHR, Bengaluru
అంచనాలకు తగ్గట్టుగా లాభాలు రావాలంటే...
వాణిజ్య పంటగా అవకాడోను సాగు చేయడం అంత చిన్నవిషయమేమీ కాదు. ఇతర పంటలకు నీడ నిచ్చేదిగా అవకాడోను సాగు చేసుకుంటున్న సంప్రదాయ పద్ధతులకు ఇది పూర్తిగా భిన్నమైంది.
విత్తనాన్ని నాటి నేరుగా అవకాడోను పెంచలేరు. స్థానిక పరిస్థితులను తట్టుకొని నిలబడే బలమైన వేరుకాండాన్ని గుర్తిస్తారు. దాని పైభాగంలో అంటుకడతారు. అదే ఎలాంటి పండ్లను ఇవ్వాలో నిర్ణయిస్తుంది.
అలా చేసిన తర్వాత ఆ చెట్టుపై చాలా శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది.
"అలా తోటను పెంచినప్పుడు కొమ్మలను కత్తిరించడం కూడా తెలిసి ఉండాలి. ఈ అవకాడో చెట్లు ఆరేడేళ్లలోనే దాదాపు 25 అడుగుల ఎత్తు పెరుగుతాయి. ఆ ఎత్తులో పండ్లు కోయడం అంత సులభం కాదు. కూలీలు పంట కోయడానికి వీలుగా చెట్లు అంత ఎత్తు పెరగకుండా కొమ్మలు కత్తిరించడం చాలా అవసరం" అని గోధా చెప్పారు.
అవకాడో చెట్టు తనంతట తాను పరాగ సంపర్కం చేసుకోలేదు. పండ్లు రావాలంటే రెండు వేర్వేరు రకాల అవకాడో చెట్లు పక్కపక్కనే నాటాలి. మగ మొక్క పుప్పొడిని విడుదల చేసే సమయంలోనే ఆడ మొక్క వికసించాల్సి ఉంటుంది.
"రైతులు ఈ లెక్క తప్పితే మీరు ఎంత ఆధునిక వ్యవసాయ పద్ధతులు పాటించినా అవకాడో చెట్లు కాయవు. ఈ విషయమే కాగితంపై వేసే లాభాల లెక్కలను నిజం చేస్తుంది" అని గోధా చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Hunger Inc. Hospitality
‘మొక్కలు కొనేటప్పుడు జాగ్రత్త పాటించాలి’
ప్రజాదరణ పొందిన విదేశీ రకాలను ఉపయోగించడం ద్వారా భారత్‌లో అవకాడో పరిశ్రమను ఆధునీకరించవచ్చు. భారత్‌లో ఉన్న రకాలనే మెరుగుపరచడం ద్వారా కూడా చేయవచ్చు.
"భారత్‌లో ప్రతి ఇంటి పెరట్లో ఉండే చెట్టు జన్యుపరంగా మరో చెట్టుకు భిన్నంగా ఉంటుంది. ఇదే అవకాడో పెంపకానికి ఉన్న ప్రధాన అడ్డంకి" అని బెంగళూరులోని ఐసీఏఆర్-ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చరల్ రీసర్చ్(ఐఐహెచ్ఆర్) ప్రధాన శాస్త్రవేత్త, డాక్టర్ గణేశన్ కరుణాకరన్ చెబుతున్నారు.
"అందుకే కలగలిపిన పండ్ల రకాలతో భారత్ మార్కెట్ నిండిపోతోంది. నమ్మకమైన వాణిజ్య మార్కెట్ కావాలంటే మాత్రం ప్రామాణిక రకాలు చాలా అవసరం" అని ఆయన అన్నారు.
పాతికేళ్లుగా ఆయన బ్రీడింగ్ ప్రాజెక్టుపై పని చేస్తున్నారు. దీని ఆధారంగా స్థానిక చెట్లను పరిశీలించి ఆయన రెండు రకాలను విడుదల చేశారు.
"రైతులకు ఊరూపేరూలేని వేల రకాల కంటే నాణ్యతతో మంచి దిగుబడి ఇచ్చే రకాలు అందివ్వాలనేది మా లక్ష్యం" అని కరుణాకరన్ చెప్పారు.
తెగుళ్ల బారిన పడే మొక్కలు అమ్ముతున్న నర్సరీల గురించి కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
"తెలియకుండానే రైతులు తెగుళ్లు ఉన్న మొక్కలను కొనుగోలు చేస్తారు. మొదట్లో చూడటానికి ఆ మొక్కలు బాగానే ఉంటాయి. కానీ ఐదారేళ్ల తర్వాత అకస్మాత్తుగా చనిపోతాయి. దీని వల్ల రైతులకు భారీ ఆర్థికనష్టం కలుగుతుంది" అని చెప్పారు.
ఇన్ని సవాళ్లు ఉన్నప్పటికీ రైతులు అవకాడో సాగు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
అవకాడో సాగును తొలినాళ్లలోనే చేపట్టిన రైతుల్లో ఒకరు షిజు సెబాస్టియన్. కేరళలోని వయనాడ్‌లో ఎనిమిదేళ్ల క్రితమే రెండు ఎకరాల్లో అవకాడో సాగు మొదలు పెట్టారు.
"అవకాడో పండించడానికి రైతులు సిద్ధంగా ఉన్నారు, కానీ వారికి సరైన సలహాలు, పంటను అమ్మేందుకు నమ్మకమైన మార్కెట్ అవసరం" అని ఆయన అభిప్రాయపడుతున్నారు.
ఈ ఏడాది ఆయన 3,500 కేజీల దిగుబడి సాధించారు. ఈ పంట మొత్తాన్ని బెంగళూరు నగరంలో అమ్మారు.
"అవకాడో నిన్నెప్పుడూ నిరాశపర్చదు. చాలా అద్భుతమైన, ఇష్టమైన పండు. ఆ పండు ప్రేమలో పడిపోయాను. నేను మరో మూడు ఎకరాల్లో కూడా అవకాడోనే సాగుచేయాలని భావిస్తున్నా'' అని షిజు సెబాస్టియన్ తెలిపారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



























