మధ్యాహ్న భోజన పథకంలో గుడ్డు ఉంటుందా, ఉండదా? ఏమిటీ వివాదం?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, నికిత యాదవ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 6 నిమిషాలు
మధ్యాహ్న భోజన పథకంలో కోడి గుడ్డు ఉంటుందా? లేదా?
పైలట్ ప్రాజెక్టులో భాగంగా, కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలో కోడి గుడ్డుకు బదులు శాకాహార ప్రత్యామ్నాయాలను అందించనున్నట్లు గతవారం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం చేసిన ప్రకటన అనంతరం సోషల్ మీడియాలో, వార్తాకథనాల ప్రధాన శీర్షికల్లో ప్రముఖంగా కనిపించిన ప్రశ్న ఇది.
మధ్యాహ్న భోజన పథకంగా పేరొందిన ఈ స్కీమ్.. ప్రభుత్వం, ప్రభుత్వ సాయంతో నడిచే పాఠశాలల్లో పిల్లలకు ఉచితంగా వండిన భోజనాన్ని అందిస్తుంది.
లక్షల మంది నిరుపేద పిల్లలకు.. రోజులో వారు తినే అత్యంత పోష్టికాహార భోజనం ఇది. కొందరికి రోజులో వారు తినే ఒక్కటే భోజనం కూడా ఇదే కావొచ్చు. పోషకాలను అందిస్తూ, ఆకలిని తగ్గించి, పిల్లలు బడి మానేయకుండా చేయడంలో ఉపయోగపడుతోందన్న పేరు ఈ పథకానికి ఉంది.
కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడిచే పాఠశాలల కోసం భోజనాన్ని సిద్ధం చేసే బాధ్యతలను 'హరే కృష్ణ మూవ్‌మెంట్'గా పేరొందిన హిందూ ఆధ్యాత్మిక సంస్థ ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్‌కు (ఇస్కాన్‌కు) అప్పగిస్తున్నట్లు పశ్చిమ బెంగాల్‌లోని బీజేపీ ప్రభుత్వం చేసిన ప్రకటన తర్వాత ఈ వివాదం చెలరేగింది.

కేవలం శాకాహారాన్ని మాత్రమే వడ్డించే 'ఇస్కాన్ అన్నమిత్ర ఫౌండేషన్' ఈ భోజనాన్ని సిద్ధం చేస్తుందని, గుడ్డుకు బదులు ఇతర ప్రొటీన్ ఆహార పదార్థాలతో భర్తీ చేయనున్నట్లు ఇస్కాన్ ప్రతినిధి ఒకరు గత వారం తెలిపారు.
ఈ ప్రాజెక్ట్ ఇంకా ప్రారంభం కాలేదు. ఇతర పాఠశాలలకు కూడా దీన్ని విస్తరించనున్నారా అనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. దీనిపై చర్చలు జరుగుతున్నాయని, ఇంకా ఏమీ ఖరారు కాలేదని ఇస్కాన్ సంస్థ బీబీసీకి తెలిపింది.
కానీ, ఈలోపే ఈ విషయం దేశవ్యాప్తంగా సుపరిచితమైన ఒక పాత చర్చను మళ్లీ రాజేసింది. అదే.. పాఠశాల మధ్యాహ్న భోజనంలో ఏం ఉండాలి? అనే ప్రశ్న.
పెరుగుతున్న పిల్లలకు, ముఖ్యంగా పేద కుటుంబాల పిల్లలకు అత్యంత చౌకైన, అత్యంత ప్రభావవంతమైన ప్రొటీన్ వనరులలో ఒకటి గుడ్డు అని పోషకాహార ప్రచారకర్తలు అంటున్నారు.
పాఠశాల భోజనాల్లో గుడ్డును తొలగించడానికి లేదా పరిమితం చేసేందుకు అనేక రాష్ట్ర ప్రభుత్వాలు (వాటిల్లో చాలా వరకు బీజేపీ పాలిత రాష్ట్రాలే) చేసిన ప్రయత్నాలు పదేపదే వివాదాలకు దారితీశాయి.
గుడ్డును తొలగించడం ద్వారా ప్రభుత్వాలు మత, సైద్ధాంతిక విశ్వాసాలను పోషకాహార విధానాలపై రుద్దుతున్నాయని విమర్శకులు అంటున్నారు. అయితే, జాగ్రత్తగా ప్రణాళికాబద్ధంగా రూపొందించే శాకాహార భోజనం కూడా ఇదే రకమైన పోషకాలను అందించగలదని దీని మద్దతుదారులు వాదిస్తున్నారు.
కొత్తగా ఎన్నికైన బీజేపీ ప్రభుత్వం పాఠశాలల పిల్లలపై 'శాకాహారాన్ని బలవంతంగా రుద్దడానికి' ప్రయత్నిస్తోందని ప్రతిపక్ష ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఆరోపించింది.

ఫొటో సోర్స్, AFP via Getty Images
ఇస్కాన్ అధికారి సూచించిన సోయాబీన్స్ వంటి ప్రత్యామ్నాయాలను రాష్ట్రంలో అంత ఎక్కువగా తినరని, విద్యార్థులు అంత తేలికగా వాటిని అంగీకరించకపోవచ్చని మరికొందరు అంటున్నారు.
కొంతమంది రాజకీయ నాయకులు, కార్యకర్తలు ఒక మధ్యేమార్గాన్ని ప్రతిపాదించారు. గుడ్డు కావాలో, శాకాహార ప్రత్యామ్నాయం కావాలో నిర్ణయించుకునే అవకాశం విద్యార్థులకే ఇవ్వాలని వారు కోరుతున్నారు.
అత్యంత చౌకైన, ఎక్కువ నాణ్యత కలిగిన ప్రొటీన్ ఉండే ఉత్తమ వనరుల్లో కోడిగుడ్డు ఒకటి. వీటి ధర ఒక్కొక్కటి సుమారు 8 రూపాయలు ఉంటుంది.
తమ నిర్ణయాన్ని సమర్థించిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి శుభేందు అధికారి, విద్యార్థులకు 'మంచి, స్వచ్ఛమైన ఆహారాన్ని' అందించడమే ఈ ప్రాజెక్టు ఉద్దేశమని చెప్పారు.
బీజేపీ హిందూవాద భావాజాలంతో ఈ నిర్ణయం తీసుకున్నారనే విమర్శలను తోసిపుచ్చిన ఆయన, ''మీరు హరే కృష్ణను (భక్తి గీతం) పఠించాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని ఎవరూ బలవంతం చేయరు'' అని అన్నారు.
తమపై వస్తున్న విమర్శలు అర్థరహితమని ఇస్కాన్ అంటోంది. అక్షయ పాత్ర ఫౌండేషన్ ద్వారా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, దిల్లీలోని కొన్ని ప్రాంతాలతో సహా 16 రాష్ట్రాల్లో 10 లక్షల మంది విద్యార్థులకు ఇది భోజనాన్ని అందిస్తోంది.
''తమ సంస్థ అందించే భోజనం పూర్తిగా పోషకాలతో, అత్యంత పరిశుభ్రంగా ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం'' అని ఇస్కాన్ కోల్‌కతా విభాగానికి గత వారం వరకు వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న రాధారమణ్ దాస్ స్థానిక మీడియాతో చెప్పారు.
గుడ్డు ద్వారా లభించే పోషక విలువలకు ఏమాత్రం తీసిపోకుండా, అంతే మొత్తంలో ప్రొటీన్లను, విటమిన్లను ఈ శాకాహార మెనూ అందిస్తుందని ఆయన పేర్కొన్నారు.
అయితే, సంస్థ పదవుల నుంచి దాస్‌ను తొలగించింది ఇస్కాన్. ఈయన తొలగింపుకు గల కారణాన్ని ఇస్కాన్ బహిరంగంగా వెల్లడించలేదు.
బీబీసీ ఈ విషయంపై మరింత వివరణ కోసం ఇస్కాన్‌ను సంప్రదించింది.
ఈ వివాదం దేశంలో మధ్యాహ్న భోజన పథకంపై మరోసారి చర్చను రాజేసింది.

ఫొటో సోర్స్, Getty Images
1925లో మద్రాసులో (ప్రస్తుత చెన్నైలో) ప్రారంభమైన పాఠశాలలో భోజన పథకం... 1995లో దేశవ్యాప్తంగా ప్రారంభమైంది. దాదాపు 11 కోట్ల మందికి పైగా పిల్లలకు సేవలందిస్తూ.. ప్రపంచంలోనే అతిపెద్ద కార్యక్రమాల్లో ఒకటిగా నిలిచింది.
కేంద్ర ప్రభుత్వం కేలరీలను, ప్రొటీన్ లక్ష్యాలను నిర్దేశిస్తుంది. కానీ, తదనుగుణంగా మెనూను రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయిస్తాయి. ఈ కారణంతోనే.. అన్ని రాష్ట్రాలకు కలిపి ఒకటే మెనూ అంటూ ఏదీ ఉండదు. దేశవ్యాప్తంగా పాఠశాలల్లో అందించే మధ్యాహ్న భోజన పథకాల్లో అందించే ఆహారాలు వేరుగా ఉంటాయి.
బిహార్‌లో.. పిల్లలకు సాధారణంగా పప్పులు లేదా శెనగలతో వండిన కూరలతో అన్నం పెడతారు. వారానికి ఒకసారి గుడ్డు ఇస్తారు. అలాగే, తమిళనాడులో పాఠశాల మధ్యాహ్న భోజనంలో అన్నం, సాంబారు (పప్పుచారు), కూరలు, గుడ్డు ఉంటాయి.
ఇతర రాష్ట్రాలు కొన్ని కేవలం శాకాహార భోజనాన్నే అందిస్తాయి. గుజరాత్, యూపీ, దిల్లీలలో మెనూలలో సాధారణంగా పప్పులు, కూరగాయాలతో పాటు బియ్యం లేదా గోధుమలతో చేసిన వంటకాలు ఉంటాయి. కొన్నిసార్లు వాటితో పాటు పాలు, పన్నీర్ లేదా పండ్లు ఉంటాయి.
భోజనం తయారు చేసే విధానం కూడా మారుతుంది.
అనేక ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సిబ్బంది అక్కడే భోజనం వండుతారు. కొన్నిచోట్ల రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశిత పోషకాహార ప్రమాణాలు, రాష్ట్ర మెనూలకు తగ్గట్లు భోజనాన్ని తయారు చేసి, పంపిణీ చేసేందుకు లాభాపేక్ష లేని సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంటాయి.
దాదాపు దశాబ్ద కాలంగా.. కోల్‌కతాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వారంలో కొన్ని రోజులు అన్నం, పప్పులు, కూరగాయలతో చేసిన వంటలతో పాటు గుడ్డు కూడా ఇస్తున్నారు. కానీ, ఇప్పుడు ఇది మారొచ్చు.

ఫొటో సోర్స్, NurPhoto via Getty Images
దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొంతమంది ప్రాథమిక పాఠశాల విద్యార్థులు బీబీసీతో మాట్లాడుతూ.. ఈ మార్పు రోజూ తినే భోజనం నుంచి కొంత ఉపశమనం ఇస్తుందని, దీనిని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. మరికొందరు మాత్రం నిరాశ వ్యక్తం చేస్తూ.. కోడిగుడ్డు వడ్డించే రోజు కోసం ఆసక్తిగా ఎదురుచూసే వాళ్లమని చెప్పారు.
పాఠశాల భోజనంలో గుడ్డు ఉంటే బాగుంటుందని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ఒక విద్యార్థిని తల్లి 37 ఏళ్ల చైతాలి మిత్రా తెలిపారు.
''పెరుగుతున్న నా బిడ్డకు అవసరమైన ప్రొటీన్‌కు గుడ్డు భరోసా ఇస్తుంది'' అని చెప్పారు.
పోషకాహార నిపుణులకు ఈ చర్చ కేవలం ఆహార ప్రాధాన్యతలకు సంబంధించినది కాదు. కోడిగుడ్డుతో సమానమైన పోషకాలను, అదే ఖర్చుతో శాకాహార ప్రత్యామ్నాయాలను ఇవి అందించగలవా? లేదా? అనేదే వారి సందేహం.
అత్యంత సంపూర్ణమైన, చౌకైన ప్రొటీన్ వనరుల్లో గుడ్డు ఒకటి అని దిల్లీలోని సర్ గంగా రామ్ హాస్పిటల్‌కు చెందిన పోషకాహార నిపుణులు ఫరీహా షానమ్ చెప్పారు.
'' గుడ్డులో శరీరానికి అవసరమైన తొమ్మిది అమినో యాసిడ్స్ ఉంటాయి'' అని తెలిపారు. పప్పుధాన్యాలు కూడా పౌష్టికరమైనవే అయినప్పటికీ.. వాటిల్లో అత్యంత ఎక్కువగా పీచు పదార్థాలు, శరీరానికి అవసరం లేని అమినో యాసిడ్స్ ఉంటాయని వివరించారు.
ఎదిగే పిల్లలకు కోడిగుడ్డు అత్యంత సమర్థవంతమైన పోషకాహార వనరు అని, ఎందుకంటే దీనిలో విటమిన్ డి, విటమిన్ బి12 కూడా పుష్కలంగా లభిస్తాయని తెలిపారు.
పన్నీర్ లాంటి ఆహారాలు ఇలాంటి పోషకాలనే అందిస్తాయని డాక్టర్ షానమ్ చెప్పారు. కానీ, గుడ్డు కంటే అవి చాలా ఖరీదైనవని, అందువల్ల ప్రభుత్వ నిధులతో నడిచే కార్యక్రమంలో వాటిని క్రమం తప్పకుండా అందించడం కష్టమవుతుందని అన్నారు.
"చాలా మంది పిల్లలకు, రోజంతా లభించే ఆహారంలో పాఠశాల భోజనమే అత్యంత పోషక విలువలు కలిగినది" అని హైదరాబాద్‌లోని గ్లెనెగల్స్ అవేర్ హాస్పిటల్‌లో ఇంటర్నల్ మెడిసిన్ కన్సల్టెంట్ డాక్టర్ వంశీ.వి అన్నారు.
అదే స్థాయిలో పోషకాహాలుండే ఆహార పదార్థాలతో గుడ్డును భర్తీ చేయలేకపోతే.. పిల్లల్లో అత్యవసరమైన ప్రొటీన్లు, మైక్రోన్యూట్రియంట్లు తగ్గే అవకాశం ఉందని డాక్టర్ వంశీ చెప్పారు.
దాని ప్రభావాలు తక్షణమే చూపించవని.. కాలక్రమేణా పిల్లల పెరుగుదల, నేర్చుకునే సామర్థ్యం, రోగనిరోధక శక్తిని దెబ్బతీస్తాయని ఆయన చెప్పారు.
చాలా మంది నిరుపేద పిల్లలకు ఈ భోజనం అత్యవసరమనే వాస్తవం దేశంలోని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు తెలుసు.
"ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలకు మధ్యాహ్న భోజన పథకం ఒక ప్రధాన కారణంగా ఉంది" అని పేరు చెప్పడానికి ఇష్టపడని దిల్లీలోని ఒక ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు చెప్పారు.
చాలా మంది పిల్లలు ప్రతిరోజూ ఆకలితో పాఠశాలకు వచ్చి మధ్యాహ్న భోజనం కోసం ఆత్రుతగా ఎదురుచూస్తారని ఆమె అన్నారు.
బిహార్‌లో ఉపాధ్యాయురాలు బిమ్లా సింగ్ (పేరు మార్చాం) మాట్లాడుతూ.. ఏది ఎంచుకోవాలనే విషయం పిల్లలకే వదిలివేయాలని అన్నారు.
ప్రతి శుక్రవారం, విద్యార్థులకు ఒక గుడ్డు అందిస్తుండగా, గుడ్డు తినని వారికి అరటిపండు ఇస్తున్నారు.
"ఒకటి తినమని గానీ, మరోటి మానుకోమని గానీ ఎవరూ బలవంతం చేయరు" అని ఆమె అన్నారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























