నెయ్యి తింటే కొవ్వు పెరుగుతుందా? ఎలా తినొచ్చు, ఎవరు తినకూడదు? 8 ప్రశ్నలు - జవాబులు

నెయ్యి

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, సుభాష్ చంద్రబోస్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 5 నిమిషాలు

''నెయ్యి తింటే బరువు పెరుగుతారు?’’

''ఖాళీ కడుపుతో నెయ్యి తింటే లావు తగ్గుతారు''

''కడపులో పుండ్లను నెయ్యి నయం చేస్తుంది''

''నెయ్యి గుండెపోటుకు కారణమవుతుంది''

నెయ్యి గురించి ఇలాంటి భిన్నమైన అభిప్రాయాలు తరచూ వింటూ ఉంటాం. కేవలం వినడమే కాదు, కొంతమంది వాటిని ఆచరిస్తూ ఉంటారు కూడా.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

నెయ్యిలో శాచ్యురేటెడ్ కొవ్వు 60 నుంచి 65 శాతం, మోనో అన్‌శాచ్యురేటేడ్ కొవ్వు 20 నుంచి 25 శాతం, పాలీఅన్‌శాచ్యురేటెడ్ కొవ్వు 3 నుంచి 4 శాతం, కొన్ని విటమిన్లు ఉంటాయి.

నెయ్యిలో శరీరానికి అవసరమైన మంచి కొవ్వులు, కొలెస్ట్రాల్‌ను పెంచే చెడు కొవ్వూ రెండూ ఉంటాయి.

నెయ్యి వాడితే కలిగే ప్రయోజనాలతోపాటు, దాని వినియోగం వల్ల కలిగే ప్రతికూల ఫలితాలపైనా నిరంతరం చర్చ నడుస్తూనే ఉంటుంది. ఇంతకీ వీటిల్లో ఏది వాస్తవం? ఏది అపోహ? వైద్యులు ఈ కథనంలో వివరించారు.

నెయ్యి...

ఫొటో సోర్స్, Getty Images

నెయ్యి తింటే బరువు పెరుగుతారా?

నెయ్యి తిన్నంత మాత్రాన బరువు పెరగడం ఉండదని పలువురు డాక్టర్లు చెప్పారు.

"ఏదైనా ఆహారం ఎంత తీపిగా లేదా విషపూరితంగా మారుతుందనేది దానిని తీసుకునే పరిమాణంపై ఆధారపడి ఉంటుంది. నెయ్యి తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారా అని అడిగితే 'లేదు' అని చెప్పొచ్చు. అయితే, నెయ్యిని ఎక్కువ పరిమాణంలో తీసుకోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పెరగొచ్చు’’ అని బీబీసీతో గుండె వైద్య నిపుణుడు డాక్టర్ రెఫాయ్ షౌకత్ అలీ అన్నారు.

నెయ్యి వల్ల రక్తనాళాలు మూసుకుపోతాయా?

నెయ్యి తీసుకోవడం వల్ల పెరిగే కొలెస్ట్రాల్ గుండెకు మంచిది కాదని డాక్టర్ రెఫాయ్ అన్నారు.

"నెయ్యి నేరుగా గుండెలోకి, రక్తనాళాల్లోకి వెళ్లి గుండె జబ్బులను కలిగించదు. మనం తినే ఏ ఆహారం కూడా ఆ విధంగా నేరుగా రక్తనాళాల్లో పేరుకుపోదు. కానీ మనం నెయ్యిని ఎక్కువగా తీసుకుంటే, అది శరీరంలో కొవ్వును పెంచుతుంది. అలా పెరిగిన కొవ్వు గుండె జబ్బులకు కారణమవుతుందని నిరూపితమైంది" అని ఆయన వివరించారు.

నెయ్యి

ఫొటో సోర్స్, Getty Images

రోజూ ఎంత నెయ్యి తీసుకోవచ్చు?

ప్రతిరోజూ ఎంత నెయ్యి తీసుకోవాలో, దాని వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలేమిటో బీబీసీకి వివరించారు పోషకాహార నిపుణురాలు మీనాక్షి బజాజ్.

‘‘ఆరోగ్యవంతులైన పెద్దలు రోజుకు మొత్తం 27 నుంచి 30 గ్రాముల కొవ్వు లేదా నూనె తీసుకోవచ్చని ఐసీఎంఆర్ 2024 మార్గదర్శకాలు చెబుతున్నాయి.

మొత్తం కేలరీలలో సంతృప్త కొవ్వులు 6 శాతం కంటే తక్కువగా ఉండాలని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ తెలిపింది. వెన్న, జున్ను, రెడ్ మీట్, ఇతర జంతు ఆధారిత ఆహారాలలో సంతృప్త కొవ్వులు ఉంటాయి.

దశాబ్దాల శాస్త్రీయ అధ్యయనాలు సంతృప్త కొవ్వులు శరీరంలో 'చెడు' కొలెస్ట్రాల్‌గా పరిగణించే ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచి, గుండె జబ్బుల ప్రమాదాన్ని అధికం చేస్తాయని నిరూపించాయి.

ఉదాహరణకు, ఒక వ్యక్తికి రోజుకు 2,000 కేలరీలు అవసరమైతే, ఆ కేలరీలలో సంతృప్త కొవ్వు నుంచి 120 కేలరీలకు మించి రాకూడదు. నెయ్యిలో సుమారు 60 నుండి 65 శాతం సంతృప్త కొవ్వు ఉంటుంది కాబట్టి, దానిని అధిక పరిమాణంలో తీసుకోవడం వల్ల శరీరంలో 'చెడు' కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగవచ్చు'' అని మీనాక్షి బజాజ్ తెలిపారు.

కడుపు పూతను నెయ్యి నయం చేస్తుందా?

నెయ్యిలోని మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు శరీరానికి అవసరమంటున్నారు ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న జనరల్ ప్రాక్టీషనర్ ప్రొఫెసర్ చంద్రశేఖర్.

"నెయ్యిలో లినోలిక్ ఆమ్లం, బ్యూట్రిక్ ఆమ్లం వంటి కొన్ని మంచి ఆమ్లాలు ఉంటాయి, ఇవి శరీరానికి చాలా అవసరం. ఇవి జీర్ణక్రియకు సహాయపడతాయి'' అని ఆయన చెప్పారు .

అదే సమయంలో, దీనిని మందులాగా సేవించకూడదని డాక్టర్ రెఫాయ్ హెచ్చరిస్తున్నారు.

"నెయ్యిలో సంతృప్త కొవ్వు ఎక్కువగా ఉంటుందనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. కాబట్టి, అందులో మంచి ఆమ్లాలు ఉన్నప్పటికీ, మనం అర చెంచా కన్నా ఎక్కువ నెయ్యి తీసుకోకూడదు" అని రెఫాయ్ తెలిపారు.

నెయ్యి కడుపులో పుండ్లను నయం చేయగలదనే వాదనను సమర్థించడానికి బలమైన వైద్య పరిశోధన ఆధారాలు లేవని వైద్య నిపుణులు చెప్పారు.

ఖాళీకడుపుతో నెయ్యి తింటే కొవ్వు తగ్గుతుందా?

ఇది పూర్తిగా తప్పని డాక్టర్ రెఫాయ్ అంటున్నారు.

"నెయ్యి తినడం వల్ల శరీరంలోని కొవ్వు తగ్గదు. శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను పెంచే మొత్తం కొవ్వులో 60, 65శాతం నెయ్యిలోనే ఉంటుంది కాబట్టి, శరీరంలోని కొవ్వు తగ్గే అవకాశమే లేదు" అని ఆయన అన్నారు.

పిల్లలకు నెయ్యి..

ఫొటో సోర్స్, Getty Images

పిల్లలకు నెయ్యి మంచిదేనా?

పిల్లలు నెయ్యి తీసుకోవడం వారి ఎదుగుదలకు సహాయపడుతుందని వైద్యులు అంగీకరిస్తున్నారు.

"పిల్లల నాడీ వ్యవస్థ అభివృద్ధికి, చర్మ ఆరోగ్యానికి, జీర్ణక్రియకు నెయ్యి సహాయపడుతుంది" అని డాక్టర్ చంద్రశేఖర్ అన్నారు.

"పిల్లల జీవక్రియ పెద్దల కంటే భిన్నంగా ఉంటుంది. నెయ్యిలోని మంచి ఆమ్లాలు పిల్లల జీర్ణాశయ ఆరోగ్యానికి సహాయపడతాయి. నెయ్యిలో విటమిన్ ఇ, కె వంటి కొవ్వులో కరిగే విటమిన్లు ఉంటాయి. ఇవి పిల్లల ఎదుగుదలకు కూడా సహాయపడతాయి'' అని డాక్టర్ రెఫాయ్ వివరించారు.

నూనె కన్నా నెయ్యి మంచిదా?

కచ్చితంగా కాదని డాక్టర్ రెఫాయ్ అంటున్నారు.

నూనెకు బదులుగా నెయ్యితో వంట చేయడం చాలా ప్రమాదకరం. నెయ్యి దోసె, నెయ్యి ఇడ్లీ వంటివి అప్పుడప్పుడు సరదాగా తినవచ్చు. వాటిని తరచుగా తినడం మీ ఆరోగ్యానికి కచ్చితంగా హానికరం. నూనె కన్నా నెయ్యి మంచిదని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు. మనం నూనె వాడకాన్ని కూడా అదుపులో ఉంచుకోవాలి" అని ఆయన అన్నారు.

మధుమేహం ఉన్నవారు నెయ్యి తీసుకోవచ్చా?

మధుమేహ వ్యాధిగ్రస్తులు, శరీరంలో అధిక కొవ్వు ఉన్నవారు, అధిక రక్తపోటు ఉన్నవారు నెయ్యిని అస్సలు తీసుకోకూడదని డాక్టర్ రెఫాయ్ అంటున్నారు.

"ఈ వ్యక్తులు నెయ్యిని పూర్తిగా మానుకోవడం మంచిది. నెయ్యిలో కొన్ని మంచి ఆమ్లాలు ఉన్నప్పటికీ, ఒక ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయా లేదా ఎక్కువ నష్టాలు ఉన్నాయా అని ఆలోచించుకోవాలి. ఆ విషయంలో, మధుమేహ వ్యాధిగ్రస్తులు, అధిక రక్తపోటు ఉన్నవారు నెయ్యిని కచ్చితంగా మానుకోవాలి’’ అన్నారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)