రూత్: నా భర్త చూస్తుండగా పరాయి వ్యక్తులతో సెక్స్‌లో పాల్గొనాలి, ఆయన దగ్గర లేకపోతే వీడియో తీసి పంపాలి

మహిళలు, లైంగిక వేధింపులు, సెక్స్, అత్యాచారం, నేరాలు, వెబ్‌సైట్
ఫొటో క్యాప్షన్, బాధామయ గతం తనను వెంటాడుతోందని రూత్ చెప్పారు.
    • రచయిత, కాట్రిన్ నై, జేమియే బార్ట్‌లెట్, కవితా పూరీ, రూత్ మేయర్
    • హోదా, బీబీసీ న్యూస్ ఇన్వెస్టిగేషన్స్
  • ప్రచురణ
  • చదివే సమయం: 10 నిమిషాలు

హెచ్చరిక: ఈ కథనంలో లైంగిక చర్యకు సంబంధించిన వివరాలున్నాయి.

రూత్ ఓగ్రాడీ అనే మహిళ అయిష్టంగానే భర్త ఒత్తిడితో ఒక స్వింగింగ్ వెబ్‌సైట్ (భాగస్వాములను మార్చుకోవడం)లో అయిష్టంగానే చేరారు. అయితే ఓ అపరిచితుడితో కారులో ఎప్పటికీ శృంగారంలో పాల్గొనని ఆమె భర్తకు చెప్పారు.

కానీ కొన్ని నెలల తర్వాత ఆమె సరిగ్గా అదే పని చేశారు. తన భర్తకు పంపడానికి దాన్ని చిత్రీకరించారు.

ఆ వెబ్‌సైట్ ద్వారా 18 నెలల కాలంలో అపరిచితులతో 100 సార్లకు పైగా శృంగారంలో పాల్గొన్నానని ఆమె చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

వెంటాడుతున్న చేదు జ్ఞాపకాలు

తీవ్రమైన మానసిక క్షోభకు గురయ్యానని, బాధాకరమైన జ్ఞాపకాలు ఇప్పటికీ తనను వెంటాడుతూనే ఉన్నాయని రూత్ చెప్పారు.

మూడేళ్ల క్రితం ఆమె మొదటిసారి మమ్మల్ని సంప్రదించారు. ఇప్పుడు బాగా ఆలోచించుకుని పూర్తి పేరుతో తన కథను చెప్పాలని నిర్ణయించుకున్నారు. తన కథ మిగిలిన మహిళలకు ఓ హెచ్చరిక కావాలని ఆమె కోరుకుంటున్నారు.

రూత్ తన మాజీ భర్త క్రిస్‌పై కోపంగా ఉన్నారు. అదే సమయంలో యూకేలోని అతిపెద్ద స్వింగింగ్ వెబ్‌సైట్‌‌ను కూడా నిందిస్తున్నారు. ఆ వెబ్‌సైటే తన భర్త వందలాదిమంది పరాయివ్యక్తులను తనతో సెక్స్‌చేయమని అడగడానికి కారణమైందని రూత్ చెప్పారు.

ఈ ఆరోపణలపై రూత్ మాజీ భర్తను బీబీసీ సంప్రదించింది. కానీ ఆయన స్పందించలేదు.

భాగస్వాములను మార్చుకునే పద్ధతిలో సాధారణంగా జంటలు కలుసుకుని భాగస్వాములను మార్చుకుంటారు. కానీ కొన్నిసార్లు జంటలో ఒకరు మాత్రమే ఇతరులతో లైంగిక సంబంధాలు కలిగి ఉంటారు.

మహిళలు, లైంగిక వేధింపులు, సెక్స్, అత్యాచారం, నేరాలు, వెబ్‌సైట్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జీసెల్ పెలికో

జీసెల్ పెలికో కేసు స్పందన చూశాకే...

రూత్ కథ వెలుగులోకి వచ్చిన తర్వాత యూకేలో భాగస్వాములను మార్చుకునే వ్యవహారంపై ఎనిమిది నెలలు బీబీసీ పరిశోధన జరిపింది. తాము నిజంగా ఇష్టపడటం వల్లే ఇందులో పాల్గొంటామని కొందరు మాతో చెప్పారు. కానీ ప్రతిసారీ అది నిజం కాదని మాకు అర్ధమయింది.

తాను అనుభవించిన వేధింపులకు ఫాబ్‌స్వింగర్స్ అనే వెబ్‌సైట్ సహాయపడిందని రూత్ ఆరోపిస్తున్నారు.

భాగస్వాములను మార్చుకునే అవకాశం కల్పించే వెబ్‌సైట్‌లన్నింటి కంటే ఎక్కువ మంది ఈ వెబ్‌సైట్‌ను చూస్తున్నారు. నెలకు ఆరులక్షల మంది యాక్టివ్ సభ్యులు ఉన్నారని వెబ్‌సైట్ చెబుతోంది. భాగస్వాములను మార్చుకునే విధానంలో అంగీకారమే అత్యంత ముఖ్యమని ఆ వెబ్‌సైట్ బీబీసీకి తెలిపింది.

మరోపక్క వందలాది నేర నివేదికలలో ఈ వెబ్‌సైట్ ప్రస్తావన ఉందని యూకే పోలీసులు చెబుతున్నారు.

తన కథ జీసెల్ పెలికో లాంటి కథ కాదని రూత్ చెప్పారు. తనపై అత్యాచారం చేసిన నిందితులను బహిరంగ విచారణ జరపాలని ఫ్రెంచ్ మహిళ జీసెల్ పెలికో పట్టుబట్టారు. ఈ కేసు‌కు వచ్చిన స్పందన చూసిన తరువాత తాను నోరువిప్పడానికి ధైర్యం వచ్చిందని రూత్ చెబుతున్నారు. "అందరూ చాలా ఆశ్చర్యపోయారు గానీ, నాకేమీ ఆశ్చర్యం అనిపించలేదు'' అని రూత్ అన్నారు.

మహిళలు, లైంగిక వేధింపులు, సెక్స్, అత్యాచారం, నేరాలు, వెబ్‌సైట్
ఫొటో క్యాప్షన్, తనను అపరాధభావంలోకి నెట్టి భర్త తనతో ఇష్టం లేని పని చేయించారని రూత్ ఆవేదన వ్యక్తంచేశారు.

‘అపరాధభావంలోకి నెట్టి...’

ఇతర పురుషులతో శృంగారం చేయాలనే ఆలోచనను క్రిస్ ఉత్తర వేల్స్‌లో 2008లో కలుసుకున్నప్పటి నుంచి తరచుగా ప్రస్తావించేవారని కానీ తాను వ్యతిరేకించేదాన్నని రూత్ చెప్పారు.

కానీ 2021లో రూత్ మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు క్రిస్ ఆమెకు అధికారిక సంరక్షకుడయ్యారు. క్రిస్ తనలో తాము కోరుకున్నట్టుగా జీవితం సాగలేదనే అపరాధభావన కలిగేలా చేశారని రూత్ చెప్పారు.

ఈ క్రమంలో భాగస్వాములను మార్చుకునే ప్రస్తావన మళ్లీ తీసుకురావడంతో చివరకు తాను లొంగిపోయి అంగీకరించానని రూత్ గుర్తుచేసుకున్నారు.

''ఈ కథను ఇప్పుడే వింటున్న వారికి ఇది విచిత్రంగా అనిపించవచ్చని నాకు తెలుసు. కానీ ఓ విషయం గుర్తుంచుకోండి. ఇది రాత్రికి రాత్రే జరగదు. 12 సంవత్సరాలుగా ఒకరితో కలిసి ఉంటూ, ఆ వ్యక్తి మిమ్మల్ని ఒక విషయం గురించి ఒప్పిస్తున్నట్టు ఊహించుకోండి'' అని రూత్ వివరంగా చెప్పారు.

తర్వాత ఆ జంట ఫాబ్‌స్వింగర్స్‌లో చేరింది. ఇతర జంటలను కలుస్తామని తాను అనుకున్నానని, కానీ కథ వేరేలా మారిందని ఆమె చెప్పారు.

క్రిస్ చూస్తున్నప్పుడు, దగ్గరలో వేచి చూస్తున్నప్పుడు లేదా కొన్నిసార్లు ఆయన అసలు అక్కడ లేనప్పుడు ఆ సైట్‌లోని పురుషులతో రూత్ శృంగారంలో పాల్గొన్నారు.

ఈ సంఘటనలు ఆమె ఇంట్లో, ఇతర చోట్ల, కార్లలో, రోడ్డు పక్కన వాహనాలు ఆపే ప్రదేశాలలో లేదా పార్కింగ్ స్థలాల్లో జరిగాయి. తాను ఒంటరిగా వెళ్లినప్పుడు జరిగిన దాన్ని రికార్డ్ చేసి తన భర్తకు పంపించాల్సివచ్చేదని రూత్ ఆవేదన వ్యక్తంచేశారు.

కొన్ని నెలల్లో తాను వారానికి చాలా మంది పురుషులతో, కొన్నిసార్లు ఒకే రోజు నలుగురితో కూడా శృంగారంలో పాల్గొనాల్సివచ్చేదని చెప్పారు.

ఆ కలయికలలో కొన్నింటిని తానే ఏర్పాటు చేశానని, భాగస్వాములను మార్చుకోవడంలో ఉత్సాహం ఉన్నట్టుగా కనిపించేదాన్నని, కానీ తనకు నిజంగా అలా చేయాలని ఎప్పుడూ కోరిక లేదని ఆమె చెబుతున్నారు.

వాటిని అంతటితో ఆపాలని తాను అనుకుంటున్నట్టు పలుమార్లు భర్తతో చెప్పానని, అనేక సందర్బాల్లో తనకు భయం కలిగేదని, లైంగిక సంబంధాల వల్ల తాను మానసికంగా బాగా దెబ్బతిన్నానని కూడా భర్తతో చెప్పానని రూత్ అంటున్నారు.

కొందరితో శృంగారం జరపడానికి ముందు కొంత విరామం ఉండేదని, తర్వాత క్రిస్ మళ్లీ కొత్త సమావేశాలు ఏర్పాటు చేసేవారని రూత్ తెలిపారు.

మహిళలు, లైంగిక వేధింపులు, సెక్స్, అత్యాచారం, నేరాలు, వెబ్‌సైట్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

‘నేనక్కడ ఉన్నట్టే ఉండేది కాదు’

ఆ సంఘటనలు తనపై తీవ్రమైన ప్రభావాన్ని చూపాయని రూత్ అన్నారు. ఆమెకు లైంగికంగా సంక్రమించే వ్యాధులు సోకాయి. గర్భం దాల్చారు. అబార్షన్ పరిస్థితుల నుంచి కోలుకుంటున్న సమయంలో కూడా తనతో ఓరల్ సెక్స్ చేయడానికి క్రిస్ ఒకరిని ఏర్పాటు చేశారని ఆమె ఆరోపిస్తున్నారు.

" నా శరీరం గురించి గానీ, నేను అనుభవిస్తున్న బాధ గురించిగానీ క్రిస్‌కు అసలు పట్టదని నాకు అప్పుడు అర్థమైంది" అని రూత్ చెప్పారు.

''ఈ మగవాళ్లందరూ నా శరీరాన్ని హింసించి, దానికి ఇన్ఫెక్షన్లు సోకి, అనారోగ్యం పాలయ్యేలా చేస్తున్నారు. ఇప్పుడు అబార్షన్ కూడా అయింది. అయినా కూడా నేను ఇంకా ఈ మగవాళ్లను కలుస్తూనే ఉండాల్సొచ్చింది. కొన్నిసార్లు ఎదిరించడం కంటే, ఉత్సాహం నటిస్తూ వాళ్లు కోరుకున్న పాత్రను పోషించడం సులభం, సురక్షితం అనిపిస్తుంది. అలా చేస్తే ఆ పరిస్థితి త్వరగా ముగుస్తుందని భావించేదాన్ని''

''కొంతమంది పురుషులు నా కళ్లలోకి కూడా చూడరు. మరికొందరు నాతో అసలు మాట్లాడేవారే కాదు. నేను అసలు లేనట్టే ఉండేది. నేను అక్కడ ఉన్నాననే భావన కూడా వారికి ఉండేది కాదు'' అని రూత్ చెప్పారు.

వెనక్కి తిరిగి గమనించుకుంటే ఆ లైంగిక సంబంధాలలో ఏవైనా నిజంగా పరస్పర అంగీకారంతో జరిగాయని మీరు భావిస్తున్నారా? అని అడగ్గా 'లేదు' అని ఆమె సమాధానమిచ్చారు.

నేను అక్కడ ఉండాలనుకోలేదు. అసలు మొదటి నుంచీ నేను ఆ వెబ్‌సైట్‌లో చేరాలని కూడా అనుకోలేదు" అని రూత్ అప్పటి పరిస్థితులను వివరించారు.

రూత్ ఫిర్యాదు చేసిన తర్వాత బలవంతపు నియంత్రణ, ఇతర చట్టాల కింద క్రిస్‌పై పోలీసులు విచారణ జరిపారు. కానీ ఎలాంటి అభియోగాలు మోపలేదు.

భాగస్వాములను మార్చుకోవడంపై రూత్ ఉత్సాహం చూపినట్టు ఆ జంట వాట్సాప్ సందేశాలలో ఉన్న ఉదాహరణలను పోలీసులు ప్రస్తావించారు.

రూత్ కథ ఒక కీలక ప్రశ్నను లేవనెత్తుతుంది.

వాస్తవానికి తమకు ఇష్టం లేని శృంగారాన్ని కూడా అంగీకరించినట్టు, ఎంతో ఉత్సాహంగా ఉన్నట్టు ప్రజలు ఎలా, ఎందుకు కనిపిస్తున్నారు?

సమ్మతి అనేది సంక్లిష్టమైన విషయమని లైంగిక వ్యవహారాలపై పరిశోధనలు చేస్తున్న నిపుణులు ఒకరు చెప్పారు.

"తమకు ఇష్టం లేకపోయినా లైంగిక చర్యకు అంగీకరించినట్టు కనిపించే అవకాశం ఉంది" అని అవాంఛిత లైంగిక అనుభవాలపై 1980లనుంచి పరిశోధన చేస్తున్న ఆక్లాండ్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ నికోలా గేవీ అంటున్నారు.

రూత్ చెప్పినలాంటి కథలనే తాను ఇతర మహిళల నుంచి కూడా విన్నానని గేవీ చెప్పారు.

"తమకేం జరుగుతోందో అర్థం చేసుకోవడానికి కొన్నిసార్లు వారికి సమయం పట్టవచ్చు" అని అభిప్రాయపడ్డారు.

మహిళలు, లైంగిక వేధింపులు, సెక్స్, అత్యాచారం, నేరాలు, వెబ్‌సైట్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

‘నేనక్కడినుంచి వెళ్ళిపోయి ఉండాల్సింది’

ఫాబ్‌స్వింగర్స్‌ను ఉపయోగించే ఓ వ్యక్తి మాతో మాట్లాడటానికి అంగీకరించారు.

మార్టిన్ (ఇది ఆయన అసలు పేరు కాదు) రూత్‌ను ఎప్పుడూ కలవలేదు. తాను చాలా సంవత్సరాలుగా ఆ సైట్‌ను వాడుతున్నానని, దాని ద్వారా సుమారు 50 మందితో శృంగారంలో పాల్గొన్నానని, వారిలో ఎక్కువమంది వివాహితలే ఉన్నారని ఆయన చెప్పారు. భర్తలు ఇదంతా చూడాలని కోరుకునేవారన్నారు.

తాను కలిసే మహిళలు సంతోషంగా, అంగీకారంతో ఉన్నారని నిర్ధరించుకోవడానికి ప్రయత్నిస్తానని, అయితే కొన్నిసార్లు శృంగారం కోసం గదిలోకి వెళ్లిన తర్వాత తనకు ఏదో తేడాగా అనిపించిన సందర్భాలు కూడా ఉన్నాయని అన్నారు.

తాను కలిసిన వాళ్లల్లో సగానికంటే ఎక్కువ మంది మహిళలు శృంగారంలో పాల్గొనడానికి ఇష్టంగాలేరని ఆయన భావిస్తున్నారు.

ఒక సందర్భంలో ఓ మహిళ కళ్లల్లో భయం చూశానని, తన భర్త లోపలకు వచ్చి ఇదంతా రికార్డు చేయబోతున్నారని ఆమె చెప్పారని మార్టిన్ గుర్తు చేసుకున్నారు.

"నేను ఇక్కడినుంచి వెళ్లిపోవాల్సింది. వెంటనే నేరుగా ఫిర్యాదు చేసి ఉండాల్సింది'' అని మార్టిన్ కన్నీటి పర్యంతమయ్యారు.

మరో సంఘటనలో ఒక మహిళ ఒత్తిడికి గురై లొంగిపోయినట్టు కనిపించిందని, ఆమె భర్త, మరో వ్యక్తి తనను ప్రోత్సహించారని ఆయన చెప్పారు.

''ఆ క్షణంలో మీరు అత్యాచారం చేస్తున్నట్టు అనిపించిందా'' అని మేము ఆయన్ను నేరుగా అడిగాం.

దానికి మార్టిన్ "అవును" అని బదులిచ్చారు.

అయితే ఆ క్షణం వరకు ఆ మహిళ పూర్తి అంగీకారంతో ఉన్నారని తాను భావించినట్టు మార్టిన్ చెప్పారు.

మహిళలు, లైంగిక వేధింపులు, సెక్స్, అత్యాచారం, నేరాలు, వెబ్‌సైట్
ఫొటో క్యాప్షన్, తన ఫిర్యాదులపై ఫాబ్‌స్వింగర్స్ ఎలాంటి చర్యలూ తీసుకోలేదని రూత్ చెప్పారు.

‘ఫిర్యాదులపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు’

ఈ విషయాలపై ఫాబ్‌స్వింగర్స్ వెబ్‌సైట్ స్పందించింది.

''ఆన్‌లైన్‌లో ముందుగా చర్చలు జరిగాయి కాబట్టి, ప్రత్యక్షంగా కలిసినప్పుడు సమ్మతి అవసరం లేదని మెమెప్పుడూ చెప్పం. దాన్ని అంగీకరించం'' అని ఆ వెబ్‌సైట్ తెలిపింది.

2023 ప్రారంభం నుంచి ఫాబ్‌స్వింగర్స్ గురించి ప్రస్తావించిన నేర నివేదికలను కోరుతూ యూకేలోని మొత్తం 45 పోలీసు విభాగాలకు సమాచార స్వేచ్ఛ కింద బీబీసీ అభ్యర్థనలను సమర్పించగా, 2026 ఏప్రిల్ చివరి నాటికి 39 విభాగాలు స్పందించాయి. దేశంలోనే అతిపెద్ద పోలీస్ విభాగమైన మెట్రోపాలిటన్ పోలీస్ మాత్రం స్పందించలేదు.

అత్యాచారం, ఇతర తీవ్రమైన లైంగిక నేరాలు, బలవంతపు నియంత్రణ, వేధింపులు, బ్లాక్‌మెయిల్, వెంటపడటం, దాడులు, అత్యంత అసభ్యకర అశ్లీల పోర్నోగ్రఫీని కలిగి ఉండటం వంటి నేరాలు ఫాబ్‌స్వింగర్స్ గురించిన ప్రస్తావన ఉన్న 329 నేర నివేదికల్లో ఉన్నాయి.

ఫాబ్‌స్వింగర్స్ ప్రస్తావన ఉన్న కేసుల్లో 26 మందిపై అభియోగాలు మోపినట్టు లేదా హాజరు కావాలని సమన్లు జారీ చేసినట్టు ఉంది. వాటిలో 23 కేసులు ఇంకా కొనసాగుతున్నాయి.

ఫాబ్‌స్వింగర్స్‌కు సంబంధించిన గణాంకాల వల్ల ఆ ఆరోపణలకు ఆ సైటుదే బాధ్యతని భావించకూడదు. కొన్ని సందర్భాల్లో అది ఒక నేపథ్య సమాచారంగా మాత్రమే ప్రస్తావించి ఉండవచ్చు. అయితే అనేక తీవ్రమైన నేరారోపణ కేసులకు సంబంధించిన పోలీసు రికార్డుల్లో ఈ వెబ్‌సైట్ పేరు పలుమార్లు ఉందని గణాంకాలు సూచిస్తున్నాయి.

యూకేలో భాగస్వాములను మార్చుకునే ఇతర వెబ్‌సైట్‌ల నుంచి బీబీసీ ఎలాంటి సమాచారాన్ని కోరలేదు.

సమ్మతి లేని కార్యకలాపాల ఫిర్యాదులను అత్యంత ప్రాధాన్యతగా పరిగణిస్తామని, అవి తమ దృష్టికి వచ్చినప్పుడు చర్యలు తీసుకుంటామని, అవసరమైతే పోలీసులకు సహకరిస్తామని ఫాబ్‌స్వింగర్స్ పేర్కొంది.

ఈ సమాధానానికి రూత్ ఆశ్చర్యపోయారు.

ఫాబ్‌స్వింగర్స్ సైట్‌లో తాను కలిసిన పురుషులు తనపై హింసకు పాల్పడతామని, అత్యాచారం చేస్తామని బెదిరించడంతో సహా, అసహజ ప్రవర్తన కనబర్చారని తాను ఫిర్యాదు చేసినప్పటికీ ఆ సైట్ ఎలాంటి చర్యా తీసుకోలేదని ఆమె చెప్పారు.

మహిళలు, లైంగిక వేధింపులు, సెక్స్, అత్యాచారం, నేరాలు, వెబ్‌సైట్
ఫొటో క్యాప్షన్, న్యాయవాది రాచెల్ హోర్మాన్-బ్రౌన్

‘ అన్యాయమని కూడా గ్రహించలేని స్థితి’

రూత్ అనుభవం తనను ఆశ్చర్యపరచలేదని రాచెల్ హోర్మాన్-బ్రౌన్ అనే న్యాయవాది చెప్పారు. ఆమె గృహ హింస కేసుల్లో నిపుణురాలు. గౌరవ కింగ్స్ కౌన్సెల్.

"భాగస్వాములను మార్చుకునే పద్ధతిలో భాగం కావాలని తమపై ఒత్తిడి తెచ్చినట్టు గత కొన్నేళ్లుగా అనేకమంది మహిళలు ఫిర్యాదుచేశారు" అని ఆమె చెప్పారు.

భాగస్వాములను మార్చుకునే విధానం హింసాత్మక వైఖరి ఉన్నవారి వల్ల దుర్వినియోగం కావొచ్చని హోర్మాన్-బ్రౌన్ అభిప్రాయపడ్డారు.

''ఎవరైనా ఒకసారి ఇందులో పాల్గొన్న తర్వాత, అది తీవ్రమైన అవమాన భావన కలిగిస్తుంది. దీనివల్ల మహిళలు దాని గురించి ఫిర్యాదు చేయడానికి వెనుకాడతారు. భాగస్వాములను మార్చుకునే పద్ధతిలో అశ్లీల ఫోటోలు, వీడియోలు తీసే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఒక సంబంధాన్ని దెబ్బతీయడానికి ఉపయోగించే ఆయుధంలా కూడా ఇది మారవచ్చు'' అని హోర్మాన్-బ్రౌన్ విశ్లేషించారు.

ఇలాంటి కథలు తరచూ వింటున్నామని బాధితులకు సాయం చేసే సంస్థలు కూడా చెబుతున్నాయి.

గృహ హింస బాధితుల కోసం పనిచేసే 'రెఫ్యూజ్' అనే స్వచ్ఛంద సంస్థలో, వేధింపులకు గురైన బాధితుల కోసం ఉన్న జాతీయ హెల్ప్‌లైన్‌ను షార్లెట్ ఈస్టాప్ పర్యవేక్షిస్తున్నారు. భాగస్వాములను మార్చుకోవడంలో భాగం కావాలని తమపై ఒత్తిడి తెస్తున్నట్టు మహిళల నుంచి కాల్స్ వస్తున్నాయని ఆమె తెలిపారు.

తాము ఎదుర్కొంటున్నది వేధింపో కాదో, దాన్ని ఎలా చెప్పాలో కూడా చాలా మంది మహిళలకు కచ్చితంగా తెలియడంలేదని ఆమె అభిప్రాయపడ్డారు.

"రూత్ ఇలా మాట్లాడటం మరొకరిపై ప్రభావం చూపుతుందని భావిస్తున్నా" అని ఆమె అన్నారు.

"లైంగికంగా అవమానించడం, కించపరచడం'' వంటి ఘటనలతో ఉన్న 'బ్లాక్ మిర్రర్' సిరీస్ ఎపిసోడ్ ఒకటి చూస్తున్నప్పుడు రూత్‌కు ఓ విషయం అర్ధమైంది. క్రిస్‌కు ఆ ఎపిసోడ్ హాస్యంగా అనిపించింది. " నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావో నాకు అర్థమైంది. "అని రూత్ క్రిస్‌తో చెప్పారు.

ఫాబ్‌స్వింగర్స్‌లో 18 నెలలకు పైగా ఉన్న తర్వాత, తాను ఆ సైట్‌ను విడిచి పెడుతున్నానని రూత్ ఆయనతో చెప్పారు. కానీ మళ్ళీ ఇతర పురుషులను కలవమని లేదా ఇతర రకాల లైంగిక ఏర్పాట్లకు ప్రయత్నించమని క్రిస్ ఆమెను అడుగుతూనే ఉన్నారు.

బయటి వారి సహాయంతో తన భర్తను విడిచి వెళ్ళడానికి రూత్ ప్రణాళిక వేసుకున్నారు. క్రమంగా ఇంట్లో నుంచి డాక్యుమెంట్లు, దుస్తులు, డబ్బు తీసుకుని, తాను ఉండటానికి ఒక సురక్షితమైన స్థలాన్ని ఏర్పాటు చేసుకున్నారు.

చివరకు 2023లో ఆమె ఆ ఇంటి నుంచి బయటకు వచ్చారు. అప్పటి నుండి ఆమె క్రిస్‌ను చూడలేదు, మాట్లాడలేదు.

కానీ తాను ఇప్పటికీ ఆ ప్రభావంలో ఉన్నానని, ఇప్పుడు కూడా చుట్టూ పురుషులు ఉన్నప్పుడు చాలా కంగారుగా అనిపిస్తుందని రూత్ చెబుతున్నారు. స్నానం చేస్తున్నప్పుడు కూడా ఫాబ్‌స్వింగర్స్ కలయికల కోసం తాను సిద్ధపడిన జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయని తెలిపారు.

తన కథను రూత్ ఇంత బహిరంగంగా ఎందుకు చెబుతున్నారు?

'' ఒక్క మహిళ అయినా నాకు ఎదురైన విషయాలను తనతో పోల్చుకుని, తనకు ఇష్టం లేని పనులు చేస్తున్నానని గ్రహిస్తే నాకదే చాలు'' అంటారు రూత్.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)