జలుబు, ఫ్లూ మందులతో కలిపి పారాసిటమాల్ తీసుకుంటే ప్రమాదమా?

రైలీ

ఫొటో సోర్స్, SWNS

ఫొటో క్యాప్షన్, పొరపాటున పారాసిటమాల్ ఎక్కువ మోతాదు తీసుకున్న రైలీ తరువాత కోలుకున్నారు.
    • రచయిత, ఆంటోనియా మాథ్యూస్, ఆస్కార్ ఎడ్వర్డ్స్
    • హోదా, బీబీసీ వేల్స్
  • ప్రచురణ
  • చదివే సమయం: 5 నిమిషాలు

ఒక విద్యార్థి పొరపాటున పారసిటమాల్ ఎక్కువ మోతాదులో తీసుకోవడంతో అవయవాలు విఫలమై దాదాపు మృత్యువు ముంగిటకు చేరాడని అతని తల్లిదండ్రులు చెప్పారు. ‘‘ఆ మందు అంత త్వరగా ఇంత ప్రభావం ఎలా చూపిందో అర్థం కావడంలేదు’’ అని వారు తెలిపారు.

యూనివర్సిటీలో మొదటి సంవత్సరం చదువుతున్న 20 ఏళ్ల రైలీ లబూస్ అనే విద్యార్థి కిందటేడాది మార్చిలో జలుబు బారిన పడ్డారు. దీంతో ఆయన సొంతంగా మందుల షాపులో ఓ రెండు టాబ్లెట్లు కొనుగోలు చేశారు. అయితే ఆ రెండు టాబ్లెట్లు పారాసిటమాల్ కాంబినేషన్‌తో ఉన్నాయని ఆయనకు తెలియదు.

కొన్ని వారాలపాటు ఆస్పత్రిలో ప్రాణాధార చికిత్స పొందిన తరువాత రైలీ అనూహ్యంగా కోలుకున్నారు. ఆయన తిరిగి నడవటం, మాట్లాడటం చేయగలుగుతున్నారు.

మందులు తీసుకునే ముందు వైద్యుల సలహా తీసుకోవాలని, మందులపై ఉండే లేబుల్‌ను జాగ్రత్తగా చదవాలని ది రాయల్ కాలేజీ ఆఫ్ జనరల్ ప్రాక్టీషనర్స్ కమ్రీ వేల్స్ సూచించింది.

యూనివర్సిటీలో రైలీకి రోజులు హాయిగా గడిచిపోతున్న సమయంలో వసంత కాలంలో ఆయనకు జలుబు చేసింది. ఆయన దాన్నో సాధారణ విషయంగానే చూశారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

''మొదటి సంవత్సరంలో చాలా మంది ఫ్రెషర్స్ ఫ్లూ లేదా జలుబుతో బాధపడుతుంటారు. అందుకే నేను రెండు మందులు తీసుకున్నా'' అని రైలీ తెలిపారు.

''ఆ సమయంలో ఈ రెండు మెడిసిన్లలో కూడా పారాసిటమల్ ఉందని నాకప్పుడు తెలియదు'' అని తెలిపారు.

పారాసిటమాల్ అత్యధిక మోతాదులో తీసుకోవడం వల్ల కిడ్నీలు, కాలేయానికి తీవ్రమైన ముప్పు కలగవచ్చని ఎన్‌హెచ్ఎస్ తెలిపింది. తొలుత వికారం, వాంతులు, కడుపునొప్పి ఉంటాయని పేర్కొంది.

రైలీ తల్లిదండ్రులు

ఫొటో సోర్స్, SWNS

ఫొటో క్యాప్షన్, గంటల వ్యవధిలోనే రైలీ పరిస్థితి అత్యంత విషమంగా మారింది.

కడుపునొప్పి నుంచి వెంటిలేటర్‌ వరకు..

రైలీకి కడుపునొప్పి వచ్చినప్పుడు, ఎవరి సాయమైనా తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇంగ్లాండ్‌లోని రాయల్ యునైటెడ్ హాస్పిటల్‌లో ఆయన్ను పరీక్షించగా, రైలీ కాలేయం సరిగ్గా పనిచేయడం లేదని తేలింది.

ఆగ్నేయ వేల్స్‌లోని న్యూపోర్టులో నివసిస్తున్న రైలీ తల్లిదండ్రులు తమ కుమారుడి పరిస్థితి తెలుసుకుని ఆయన వద్దకు హుటాహుటిన పరిగెత్తుకు వచ్చారు.

తమ కుమారుడికి మొదట్లో హైపటైటిస్ వచ్చిందేమోనని వైద్యులు భయపడ్డారని ఓ కంపెనీలో డైరెక్టర్‌గా పనిచేసే క్రిస్ తెలిపారు.

"కొన్ని గంటల తర్వాత తెల్లవారుజామున సుమారు 1:30 గంటలకు,ఆసుపత్రిలోని ఐసియు సిబ్బంది నుంచి కాల్ వచ్చింది. మేం వెంటనే అక్కడికి రావాలని వారు చెప్పారు" అని ఆయన గుర్తు చేసుకున్నారు.

''ఆ సమయంలో రైలీని కాపాడటానికి తాము అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని మాత్రమే వాళ్లు నాకు చెప్పారు'' అని క్రిస్ తెలిపారు.

రైలీ కాలేయం పనిచేయకపోవచ్చని డాక్టర్లు ఆయన తల్లిదండ్రులకు చెప్పారు.

తమ కళ్లెదుటే తన కుమారుడి పరిస్థితి క్షీణించిపోవడాన్ని రైలీ తల్లిదండ్రులు గమనించారు. రైలీ అవయవాలు విఫలమవడమే కాక, ఆయన చిత్తభ్రమకు లోనయ్యారు.

''అదే రోజు, సాయంత్రం 6 గంటల వరకు ఆయన్ను మత్తులో ఉంచారు. డయాలసిస్ సహా ప్రాణాధార చికిత్స అందించారు. ఆయన అవయవాలు చాలా వరకు పనిచేయడం ఆగిపోయాయి'' అని రైలీ తండ్రి క్రిస్ తెలిపారు.

''రైలీ పరిస్థితి ఎంత తీవ్రంగా మారిందో మాకు మొదటిసారి అప్పుడే ఆసుపత్రి సిబ్బంది వివరంగా చెప్పారు'' అని క్రిస్ చెప్పారు.

రైలీ మెదడులోని ద్రవం ఆసుపత్రి సిబ్బందిని ఆందోళనకు గురిచేసింది. ఆయన ఊపిరితిత్తులు, మూత్రపిండాలు కూడా పనిచేయడం ఆగిపోయాయి.

''మేం బాగా బాధపడ్డాం. ఇంత అకస్మాత్తుగా ఇదంతా ఎలా జరిగిందో మాకు అర్థం కాలేదు'' అని క్రిస్ తెలిపారు.

అప్పటికే రైలీ పరిస్థితి ఎంతగా క్షీణించిందంటే... తీవ్ర అనారోగ్యంతో ఉన్న రోగుల కోసం ప్రత్యేక ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఉన్న లండన్‌లోని కింగ్స్ కాలేజ్ హాస్పిటల్‌కు ఆయన్ను తరలించారు.

ఆయన పారాసిటమాల్‌ను ఎంత మోతాదులో తీసుకున్నారని డాక్టర్లు రైలీ తల్లిదండ్రులను అడిగారు. ఆ తర్వాత రైలీ తీసుకున్న రెండు మందులను వారు కనుగొన్నారు. అప్పుడే రైలీకి ఏం జరిగిందో వారికి అర్థమైంది.

"ఇది చికిత్సకు నేరుగా పరిష్కారాన్ని అందించదు. కానీ, మేం కనీసం కారణాన్ని కనుగొన్నాం" అని క్రిస్ తెలిపారు.

రైలీ

ఫొటో సోర్స్, SWNS

ఫొటో క్యాప్షన్, తల్లిదండ్రులతో రైలీ

కోలుకున్న రైలీ ఏం చెప్పారు?

ఇప్పుడు రైలీ పూర్తిగా కోలుకుని ఒక పబ్‌లో బార్ టెండర్‌గా పనిచేస్తున్నారు.

తమ కుమారుడి విషాదం తరువాత, పారాసిటమాల్ అధిక మోతాదు గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి రైలీ తల్లిదండ్రులు ఒక మార్చ్ నిర్వహించారు. గోవర్ ద్వీపకల్పంద్వారా సాగిన ఈ 50 కిలోమీటర్ల నడక, కింగ్స్ కాలేజ్ హాస్పిటల్ ఐసియు కోసం నిధులను కూడా సేకరించింది.

"పరిస్థితి ఇంత త్వరగా దిగజారడం దిగ్భ్రాంతి కలిగించింది" అని రైలీ అన్నారు.

''నేను అప్పటికే అనారోగ్యంతో ఉన్నాను. కడుపు నొప్పి వచ్చినప్పుడు, ఇన్‌ఫెక్షనేమో అనుకున్నా'' అని చెప్పారు.

''ఆ నొప్పి నిజానికి నా కాలేయానికి సంబంధించినదని గ్రహించలేదు. చివరకు కోలుకుని తిరిగి రాగలిగినందుకు సంతోషంగా ఉంది" అని రైలీ అన్నారు.

పారాసిటమల్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, యూకేలో ప్రతి ఏడాది సుమారు 6300 టన్నుల పారాసిటమల్ అమ్ముడవుతోంది.

పారాసిటమాల్‌పై నిపుణులు ఏమంటున్నారు?

వేల్స్‌లో 2024లో 27 మరణాలు నమోదయ్యాయని, వీరి మరణ ధ్రువీకరణ పత్రంలో పారాసిటమాల్ గురించి ప్రస్తావించారని నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీసు తాజా గణాంకాలు పేర్కొంటున్నాయి.

యువతలో కొంతమంది పొరపాటున పారాసిటమాల్ అధిక మోతాదులో తీసుకోవడం చాలా అరుదుగా జరుగుతుందని ఆర్‌సీజీపీ కమ్రీ వేల్స్ చైర్ డాక్టర్ విల్ మెకింతోష్ చెప్పారు.

అయితే పారాసిటమాల్ కలిసి ఉన్న రెండు మందులను తెలియకుండా తీసుకున్నప్పుడు కొంత ప్రమాదం ఉండొచ్చని ఆయన చెప్పారు.

పని, చదువు ఒత్తిళ్లే యువతను ప్రధానంగా ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు కొనుగోలు చేసేలా చేస్తున్నాయని మెకింతోష్ అన్నారు.

''ముఖ్యంగా వైరల్ వ్యాధులు వచ్చినప్పుడు, అవి అంత సీరియస్‌గా లేకపోయినా.. తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం'' అని తెలిపారు.

పారిసిటమాల్

త్వరగా కోలుకోవాలనే ఆత్రుతలో కొన్నిసార్లు విశ్రాంతి ప్రాముఖ్యతను తక్కువగా అంచనావేస్తారని మెకింతోష్ చెప్పారు.

''ఇలాంటి అనేక వ్యాధులలో, శరీరానికి విశ్రాంతినివ్వడం, వ్యాధి దానంతట అదే పూర్తిగా తగ్గే వరకు సమయం ఇవ్వడం అవసరం అని ఆయన అన్నారు.

స్థానిక కమ్యూనిటీ ఫార్మసీలు పెద్ద మొత్తంలో మందులను విక్రయించే విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాయని ఆయన తెలిపారు.

ఈ కారణంగానే పారాసిటమాల్ అమ్మకాలపై తరచుగా గరిష్ఠ పరిమితిని విధిస్తారని ఆయన అన్నారు.

పారాసిటమాల్‌ను అధిక మోతాదులో తీసుకోవడం వల్ల వృద్ధులైన రోగులకు కలిగే ప్రమాదాల గురించి వైద్యులు ఇప్పుడు మరింత అవగాహనతో ఉన్నారని కూడా ఆయన తెలిపారు.

తక్కువ బరువు ఉన్న వృద్ధ రోగులలో ఈ ప్రమాదం ఎక్కువగా ఉండచ్చని ఆయన అన్నారు.

ప్రజలు మందుల లేబుళ్లను చాలా జాగ్రత్తగా చదవాలని, ఫార్మసిస్ట్ లేదా వైద్యుడిని సంప్రదించాలని, అలాగే మరింత సమాచారం కోసం నేషనల్ హెల్త్ సర్వీస్ వెబ్‌సైట్‌ను పరిశీలించాలని ఆయన ప్రజలకు సూచించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)