ఐఐటీ బాంబే విద్యార్థి మృతిపై వివాదం ఏమిటి? మృతుడి తల్లిదండ్రుల అనుమానాలు, ఆరోపణలు ఏమిటి?

బాంబే ఐఐటీ విద్యార్థి సాహిల్ వాకోడే మృతి
ఫొటో క్యాప్షన్, ఐఐటీ బాంబే విద్యార్థి సాహిల్ వాకోడే మృతి తర్వాత, న్యాయం కోసం ఆయన తల్లిదండ్రులు నిరాహార దీక్ష చేపట్టారు. అయితే పోలీసులు వారి నిరాహార దీక్షకు అనుమతి ఇవ్వలేదు.
ప్రచురణ
చదివే సమయం: 6 నిమిషాలు

సెప్టెంబర్ 18న మృతి చెందిన ఐఐటీ బాంబే విద్యార్థి సాహిల్ వాకోడే కేసులో చర్య తీసుకోవాలని విద్యార్థుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది.

సాహిల్ మరణం తరువాత అడ్మినిస్ట్రేటివ్ అఫైర్స్ డీన్ పదవి నుంచి ప్రొఫెసర్ సూర్యనారాయణ దుల్లాను తొలగించినట్లు ఐఐటి బాంబే మీడియా కోఆర్డినేటర్ సెప్టెంబర్ 21న ప్రకటించారు.

మరోవైపు ప్రొఫెసర్ దుల్లాపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదన్న డిమాండ్లు మొదలయ్యాయి.

దుల్లాకు మద్దతుగా ఐఐటీ బాంబే ప్రొఫెసర్లు మార్చ్ నిర్వహించారు.

సెప్టెంబర్ 18న, ద్వితీయ సంవత్సరం విద్యార్థి సాహిల్ వాకోడే మృతదేహం అతని గదిలో లభ్యమైంది. దీని తరువాత విద్యార్థులు నిరసన తెలిపారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

సాహిల్ మరణం తర్వాత ఆయన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కులపరమైన దూషణలు, వేధింపులకు గురవుతున్నందువల్లే సాహిల్ ఆత్మహత్య చేసుకున్నాడని ఫిర్యాదులో ఆరోపించారు.

అయితే, సాహిల్‌పై కుల ఆధారిత వేధింపుల ఆరోపణలను ఐఐటీ బాంబే ఖండించింది.

సాహిల్ పరీక్షలో కాపీ కొడుతూ దొరికారని, తర్వాత ఆయన క్షమాపణలు చెప్పారని, ఈ విషయంపై విచారణ కొనసాగుతోందని ఐఐటీ బాంబే పేర్కొంది.

సాహిల్ తల్లి సోనాలి వాకోడే, తండ్రి రవీంద్ర వాకోడే తమ కుమారుడికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం ముంబయిలోని ఆజాద్ మైదాన్‌లో నిరాహార దీక్షకు కూర్చున్నారు.

అయితే ప్రభుత్వం నుంచి అనుమతి లభించకపోవడంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

సాహిల్ తల్లిదండ్రులతో బీబీసీ మాట్లాడింది.

"సాహిల్ ఆత్మహత్య చేసుకునే వ్యక్తి కాదు. ఒకవేళ ఆత్మహత్య చేసుకున్నట్లయితే, ఆ రోజు జరిగిన ఘటనకు సంబంధించిన ఫుటేజ్‌ను ఎందుకు విడుదల చేయలేదు?" అని రవీంద్ర వాకోడే ప్రశ్నించారు.

"మేం న్యాయం కోసం డిమాండ్ చేస్తున్నాం. విచారణలో ఎవరైనా దోషులుగా తేలితే, వారిపై తగిన చర్యలు తీసుకోవాలి" అని కోరారు.

"మేం వెళ్లకముందే నా కొడుకుకి పోస్ట్‌మార్టం నిర్వహించారు. అంత తొందర ఎందుకు? ఒక తల్లి తన కొడుకుకి న్యాయం జరగాలని కోరుకుంటోంది. భవిష్యత్తులో ఎవరికీ ఇలా జరగకూడదన్నదే మా కోరిక" అని సాహిల్ తల్లి చెప్పారు.

ఈ కేసులో ప్రొఫెసర్ దుల్లా, ఐఐటీ అధికారులపై ఫిర్యాదు నమోదైంది.

ప్రొఫెసర్‌పై ఆత్మహత్యకు ప్రేరేపించారని, కులపరమైన దూషణలు చేశారని ఆరోపిస్తూ సాహిల్ తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.

సాహిల్ మృతిపై విచారం వ్యక్తం చేస్తూనే, ఆ అధ్యాపకుడికి తమ మద్దతు ప్రకటించింది బాంబే ఐఐటీ ఫ్యాకల్టీ ఫోరం.

ప్రొఫెసర్ దుల్లాను డీన్ పదవి నుంచి తొలగించారు. అలాగే ఐఐటీ బాంబే డైరెక్టర్ ప్రొఫెసర్ శిరీష్ కేదారే తాను రాజీనామా చేయలేదని స్పష్టం చేశారు.

నిరసన
ఫొటో క్యాప్షన్, ఐఐటీ బాంబే విద్యార్థి సాహిల్ మృతి అనంతరం నిరసన వ్యక్తం చేస్తున్న ప్రజలు.

ఐఐటీ బాంబేలో ఎనర్జీ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ చదువుతున్న 20 ఏళ్ల విద్యార్థి సాహిల్ వాకోడే మృతదేహం సెప్టెంబర్ 18వ తేదీ సాయంత్రం ఆయన గదిలో కనిపించింది.

తర్వాత విద్యా వ్యవస్థలో పారదర్శకత, భద్రత వంటి అంశాలను లేవనెత్తుతూ విద్యార్థులు ఐఐటీ బాంబే క్యాంపస్‌లో నిరసన చేపట్టారు.

ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే సాహిల్ కుటుంబం సెప్టెంబర్ 19న ముంబయికి చేరుకుంది. సాహిల్ తండ్రి రవీంద్ర వాకోడే పవై పోలీస్ స్టేషన్‌లో ఐఐటీ ప్రొఫెసర్లు, అధికారులపై ఫిర్యాదు చేశారు.

"సంస్థ డైరెక్టర్, ఉపాధ్యాయులు మా కుమారుడిని కులపరమైన వేధింపులు, మానసిక వేధింపులకు గురిచేశారు. అది తట్టుకోలేకే బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు" అని సాహిల్ తల్లిదండ్రులు ఆరోపించారు.

కొన్ని రోజులుగా తనను వేధిస్తున్నారని సాహిల్ చెప్పాడని కూడా ఆయన తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారు.

గత మూడు నెలలుగా సాహిల్‌ను కులం ఆధారంగా వేధింపులకు గురిచేస్తున్నారని తల్లిదండ్రులు ఫిర్యాదులో పేర్కొన్నారు.

విద్యార్థి
ఫొటో క్యాప్షన్, విద్యార్థి మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేసింది ఐఐటీ బాంబే. దర్యాప్తులో పూర్తిగా సహకరిస్తామని తెలిపింది.

'పరీక్షలో కాపీ కొట్టాడు'

ఐఐటీ బాంబే సెప్టెంబర్ 19వ తేదీ సాయంత్రం ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. సెకండ్ ఇయర్ విద్యార్థి సాయంత్రం ఆత్మహత్య చేసుకున్నట్లు అందులో తెలిపింది.

పరీక్ష సమయంలో ఆ విద్యార్థి తన మొబైల్ ఫోన్‌ను ఉపయోగించి ప్రశ్నలకు సమాధానాలు రాశాడని ఐఐటీ తెలిపింది.

ఆ విద్యార్థి ప్రశ్నలను చాట్‌జీపీటీలో అప్‌లోడ్ చేసినట్లు ఐఐటీ బాంబే పేర్కొంది.

"విద్యార్థిపై ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదు. ఆ తర్వాత ఇన్‌స్ట్రక్టర్, విభాగాధిపతి కూడా విద్యార్థితో మాట్లాడారు. ఆయనకి పరిస్థితిని వివరించడంతో పాటు, ఈ ఘటన ఆయన కెరీర్‌పై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపదని విభాగాధిపతి ఆయనకు హామీ ఇచ్చారు" అని ఆ సంస్థ పేర్కొంది.

ఆ తర్వాత విద్యార్థి తన గదికి వెళ్లాడు. కొంతసేపటికి చనిపోయి కనిపించాడు అని ఐఐటీ బాంబే తెలిపింది.

విద్యార్థి మృతిపై తీవ్రంగా విచారం వ్యక్తం చేస్తున్నామని, ఈ ఘటనపై జరుగుతున్న దర్యాప్తులో సంబంధిత అధికారులకు ఐఐటీ బాంబే పూర్తిగా సహకరిస్తుందని ప్రకటనలో పేర్కొంది. అలాగే మృత విద్యార్థి కుటుంబం గోప్యతను అందరూ గౌరవించాలని విజ్ఞప్తి చేసింది.

దర్యాప్తు కొనసాగుతున్నందున ఎలాంటి ఊహాగానాలు చేయవద్దని కూడా ఐఐటీ బాంబే యాజమాన్యం కోరింది.

ఈ ఘటనపై ఐఐటీ ఉపాధ్యాయులు కూడా ఒక ప్రకటన విడుదల చేశారు.

ప్రొఫెసర్ సూర్యనారాయణ దుల్లాకు ఐఐటీ ఫ్యాకల్టీ ఫోరం మద్దతు ప్రకటించింది. పరీక్ష సమయంలో ఒక విద్యార్థి కాపీ కొడుతుంటే ప్రొఫెసర్ దుల్లా అడ్డుకున్నారని ఫ్యాకల్టీ ఫోరం తెలిపింది.

"ఐఐటీ విద్యార్థి మృతిపై మేం విచారం వ్యక్తం చేస్తున్నాం. ఆయన కుటుంబం బాధ మాకు కూడా బాధే. అలాగే మా సహోద్యోగి ప్రొఫెసర్ సూర్యనారాయణ దుల్లాకు మేము అండగా నిలుస్తున్నాం. సెనేట్ ఆమోదించిన విద్యా విధానాల ప్రకారం ఆయన తన బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు" అని ఐఐటీ బాంబే ఫ్యాకల్టీ ఫోరం పేర్కొంది.

"మిడ్-సెమిస్టర్ పరీక్షల సమయంలో సంబంధిత సబ్జెక్ట్ ఉపాధ్యాయుడైన ప్రొఫెసర్ దుల్లా పరీక్ష నిర్వహిస్తున్నారు. అదే సమయంలో ఒక విద్యార్థి స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగిస్తున్నట్లు ఆయన గమనించారు. పరీక్ష నిబంధనల ప్రకారం ఆయన చర్యలు తీసుకుని, ఈ ఘటన గురించి సంస్థ అధికారులకు సమాచారం అందించారు. తన బాధ్యతలను నిర్వర్తిస్తున్న సమయంలో జరిగిన ఘటన తర్వాత ప్రొఫెసర్ దుల్లా ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై విచారం వ్యక్తం చేస్తున్నాం" ఐఐటీ బాంబే ఫ్యాకల్టీ ఫోరం తెలిపింది.

పోలీసులు
ఫొటో క్యాప్షన్, సాహిల్ వాకోడే మృతి ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.

పోలీసులు ఏం చెప్పారు?

ఈ ఘటనపై మీడియాతో మాట్లాడిన డీసీపీ దత్తాత్రేయ నలావడే సెప్టెంబర్ 19న ఐఐటీ పవాయిలో ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు.

"ఈ ఘటన తర్వాత కొంతమంది ఐఐటీ విద్యార్థులు ఒకచోట చేరి నిరసన మొదలుపెట్టారు. విద్యార్థులతో చర్చించి సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకు ఐఐటీ యాజమాన్యం ప్రయత్నించింది. పోలీసులు కూడా ఇక్కడ అన్ని భద్రతా ఏర్పాట్లు చేశారు" అని ఆయన తెలిపారు.

"సాహిల్ బీటెక్ సెకండ్ ఇయర్ స్టూడెంట్. ఎఫ్‌ఐఆర్ నమోదు చేశాం. దర్యాప్తు జరుగుతోంది" అని డీసీపీ తెలిపారు.

సాహిల్ వాకోడే
ఫొటో క్యాప్షన్, సాహిల్ వాకోడే మృతి తర్వాత నిరసన చేస్తున్న విద్యార్థులు.

విద్యార్థుల నిరసనలు

ఈ ఘటన తర్వాత విద్యార్థుల్లో తీవ్ర ఆగ్రహం కనిపించింది. తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ విద్యార్థులు నిరసన చేపట్టారు.

వార్తా సంస్థ ఏఎన్‌ఐతో మాట్లాడిన ఒక విద్యార్థి .. విద్యార్థుల భద్రత, విద్యా వ్యవస్థలో పారదర్శకతపై ప్రశ్నలు లేవనెత్తారు.

"నేను ఐఐటీ బాంబేలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ థర్డ్ ఇయర్ చదువుతున్నాను. మా కాలేజ్‌లో చదివే ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నందుకే మేం ఈ రోజు నిరసన చేస్తున్నాం. ఈ ఘటనపై యాజమాన్యం నుంచి జవాబుదారీతనం, పారదర్శకతను డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టాం" అని అన్నారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ, "ఇలాంటి ఘటన జరగడం ఇదే మొదటిసారి కాదు. ఈ ఏడాది ఇప్పటికే ఇలాంటి నాలుగు ఘటనలు జరిగాయి. వాటిలో రెండు గత రెండు నెలల్లోనే జరిగాయి. ఇలా ఎందుకు జరుగుతోంది, దీని వెనుక కారణాలు ఏమిటనే విషయంలో మమ్మల్ని పూర్తిగా చీకటిలో ఉంచారు" అని అన్నారు.

"మాకు కావాల్సింది ఒక్కటే... డీన్, డైరెక్టర్, యాజమాన్యం ఒక నివేదికను సమర్పించాలి. అందులో మొత్తం ఘటనపై దర్యాప్తు చేసి, జవాబుదారీతనం, పారదర్శకతను నిర్ధరించాలి. వారి పదవీకాలంలో ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వాలి" అని ఆ విద్యార్థి అన్నారు.

ఈ నిరసనల అనంతరం డాక్టర్ సూర్యనారాయణ దుల్లాను డీన్ పదవి నుంచి తొలగించారు.

  • ఆత్మహత్య ఆలోచనలు కలిగితే దాన్నుంచి బయటపడేందుకు భారత ప్రభుత్వానికి చెందిన జీవన్ సాథీ హెల్ప్ లైన్ 18002333330కి ఫోన్ చేయండి.
  • సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వ శాఖ కూడా 18005990019 హెల్ప్ లైన్‌ను 13 భాషల్లో నిర్వహిస్తోంది.
  • నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ హెల్ప్ లైన్ నంబర్ 08026995000

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)