లైంగిక వేధింపులకు, హింసకు పాల్పడే మగవారికి వ్యతిరేకంగా ఇతర మగాళ్లు ఎందుకు నోరువిప్పరు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అనఘా పాఠక్
- హోదా, బీబీసీ కోసం
- చదివే సమయం: 7 నిమిషాలు
మీరు ఖరాత్ కేసు గురించి చదివి ఉంటారు. ఎప్‌స్టీన్ కేసు గురించి విని ఉంటారు..ఇక రీసెంట్‍గా రిషికేష్ వైద్య కేసు తెరపైకి వచ్చింది.
ఇటీవల ఇంటర్నెట్‌లో పదేపదే కనిపిస్తున్న హ్యాష్‌ట్యాగ్ #notallmen(నాట్ ఆల్ మెన్ అంటే అందరు పురుషులూ కాదు) అని. దీనికి మహిళా హక్కుల కార్యకర్తలు #yesallmen (ఎస్ ఆల్ మెన్ అంటే అవును అందరూ బాధ్యులే) అని ప్రతిస్పందించారు.
దీని ఉద్దేశ్యం ఏంటంటే, పురుషులందరూ స్త్రీలపై లైంగికదోపిడీకి పాల్పడకపోయినప్పటికీ, చాలామంది మగవాళ్లు స్త్రీలపై లైంగిక దోపిడీ, హింసకు పాల్పడే మగవాళ్లకి వ్యతిరేకంగా గొంతెత్తరు. దాని గురించి తెలిసినప్పటికీ వారు ఫిర్యాదు చేయరు, స్త్రీల పక్షాన నిలబడరు అని.
అది ఎప్‌స్టీన్ ఫైల్స్ అయినా లేదా మన అశోక్ ఖరాత్ కేసు అయినా ఒక విషయం స్పష్టంగా కనిపించింది. చాలామంది మగవారికి ఈ సంఘటనల గురించి తెలిసినప్పటికీ, వారు దానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. కొంతమంది ఎప్‌స్టీన్‌కు మద్దతు ఇచ్చారు కూడా.
ఎప్‌స్టీన్ స్కాండల్ తర్వాత ఇంటర్నెట్‌లో ఒక వీడియో వైరల్ అయింది. అందులో ఒక మహిళ 'మీ స్నేహితుడు ఎవరైనా మహిళను వేధిస్తున్నాడని, లైంగిక దోపిడీ చేస్తున్నాడని లేదా తన భార్యను మోసం చేస్తున్నాడని మీకు తెలిసినప్పుడు, మీరు (పురుషులు) వారి పక్షం వహించడం మానేస్తారా?' అని ప్రశ్నించారు. దానికి సమాధానం 'లేదు' అయితే, #YesAllMen అనే హ్యాష్‌ట్యాగ్ సమర్థనీయమే.

ఒక స్త్రీ.. తప్పుచేసిన స్త్రీకి దూరంగా ఉండాలని లేదా ఆమెకు వ్యతిరేకంగా గొంతెత్తాలని చాలామంది ఆశిస్తారు.
అలాగే ఒక పురుషుడు కూడా తప్పుచేసిన పురుషుడిని అంతే సులభంగా ఎందుకు వ్యతిరేకించకూడదు?
ఈ నేపథ్యంలో స్త్రీలపై లైంగిక దోపిడీ, హింసకు పాల్పడే పురుషులకు ఎదురు నిలబడకుండా ఇతర మగవాళ్లను నిరోధించే సామాజిక సందర్భాలు, నమూనాలు ఏంటో ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఫొటో సోర్స్, Getty Images
పుణె యూనివర్సిటీ చరిత్ర విభాగంలో ప్రొఫెసర్ దేవ్‌కుమార్ అహిరే..అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. సమాజం, మానవ హక్కులు, సాంస్కృతిక మానవశాస్త్రం (కల్చరల్ ఆంత్రోపాలజీ), అలాగే లైంగికత చరిత్ర (హిస్టరీ ఆఫ్ సెక్సువాలిటీ)వంటి అంశాల్లో పరిశోధనలు చేసే శాస్త్రవేత్త ఆయన .
"ఇందులో స్పష్టంగా కనిపించే విషయం ఏంటంటే మహిళల్లాగే పురుషులు కూడా మన పితృస్వామ్య వ్యవస్థలో బాధితులే అయినప్పటికీ, వారు ఈ వ్యవస్థ నుంచి ఎంతో ప్రయోజనం పొందుతున్నారు. అంటే మగవాళ్లు కేవలం బాధితులు మాత్రమే కాదు, లబ్ధిదారులు కూడా. అందువల్ల వీరు ఆ వ్యవస్థకు వ్యతిరేకంగా నోరువిప్పరు" అని ప్రొఫెసర్ దేవ్ కూమార్ చెప్పారు.
"పితృస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా మాట్లాడితే, అదే వ్యవస్థ ఇంట్లో, సమాజంలో ఇచ్చే లాభాల గురించి కూడా మాట్లాడాల్సి వస్తుంది లేదా ఆ లాభాలను వదులుకోవాల్సి వస్తుంది. దాన్నెవ్వరూ కోరుకోరు. సులభంగా లభించేదాన్ని ఎందుకు వదులుకోవాలి? అనే ఆలోచిస్తారు" అని ఆయన అన్నారు.
"పితృస్వామ్య వ్యవస్థను ఎదిరించే బదులు, దాన్ని స్వీకరించే పురుషులు ‘‘పేట్రియార్కల్ డివిడెండ్'ను పొందుతారు. అంటే సామాజిక, ఆర్థిక, భౌతిక ప్రయోజనాలను పొందుతారు" అని సీనియర్ సామాజిక శాస్త్రవేత్త అయిన ఆర్.డబ్ల్యూ. కానెల్ తన 'మాస్కులినిటీస్' అనే పుస్తకంలో రాశారు.
"ఈ 'పేట్రియార్కల్ డివిడెండ్' వల్ల స్త్రీలను తక్కువగా చూసే హక్కు కూడా వారికి లభిస్తుంది. అందువల్ల తమతో సమానమైన పురుషుడి ప్రవర్తన గురించి వ్యతిరేకంగా మాట్లాడితే ఈ ప్రయోజనాలను కోల్పోతామన్న భయం ఉంది" అని ఆ పుస్తకంలో రాశారు.
అందుకే చాలామంది మగవాళ్లు తమ చుట్టూ ఉన్న తప్పుచేసిన మగవారికి వ్యతిరేకంగా మాట్లాడినట్టు కనిపించరు.

ఫొటో సోర్స్, Getty Images
డాక్టర్ ఐశ్వర్య రేవాడ్కర్ ఒక గైనకాలజిస్ట్. మహిళల సమస్యలపై నిరంతరం మాట్లాడుతుంటారు. ఆమె కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
"అధికారం ఉన్న పురుషులు సమాజంలోని బలహీన వర్గాలను ఆర్థిక, సామాజిక, రాజకీయ, లేదా లైంగిక మార్గాల్లో దోపిడీ చేస్తారు. ఈ వ్యవస్థ మగవారికి లాభం చేకూరుస్తుంది. మహిళలు బాధితులైనప్పుడు, ఆ లాభం ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పురుషులందరికీ చేరుతుంది. ఆ లాభాన్ని దృష్టిలో పెట్టుకునే నోరు విప్పకుండా మౌనంగా ఉంటారు.
మరో ముఖ్యమైన విషయం పురుష సమూహ గుర్తింపు.
ఎదుటి వ్యక్తి ప్రవర్తన ఆమోదయోగ్యం కాకపోయినా లేదా ఆయన దాన్ని వ్యక్తిగతంగా వ్యతిరేకించినప్పటికీ, ఏ పరిస్థితిలోనైనా మగవారి పక్షాన నిలబడిన ఇతర మగాళ్లకు మద్దతు లభిస్తుందని, వారికి వ్యతిరేకంగా మాట్లాడితే గుంపు నుంచి దూరం చేస్తారనే భయం ఉంటుందని ఒక అధ్యయనం ద్వారా తెలుస్తోంది.
మగవాళ్లు తమ గుంపులో ఒకరి చెడు ప్రవర్తనను మొత్తం గుంపుకే మచ్చగా చూస్తారు. అందుకే ఆ విషయాన్ని బయటపెట్టకుండా, దాచడం ద్వారా గుంపు పేరు కాపాడతారు. అలా చేస్తే తమ పేరు కూడా సురక్షితంగా ఉంటుందని భావిస్తారు.
"ఇక #notallmen గురించి మాట్లాడాలంటే అది కూడా ఒక రకమైన ఆత్మరక్షణే. భవిష్యత్తులో ఎవరైనా తమపై ఆరోపణలు చేస్తే, ఇతర మగవాళ్ల మద్దతు అవసరమవుతుంది. కాబట్టి ముందుగానే ఇతర మగవారికి మద్దతు ఇవ్వడం ద్వారా వారు తమను తాము సురక్షితం చేసుకుంటారు" అని ప్రొఫెసర్ అహిరే అన్నారు.

మగవాళ్లు వ్యక్తులుగా ఉన్నా, గుంపుగా ఉన్నా పెద్దతేడా ఏమీ ఉండదు. ఒక సమూహంగా ఎలా ప్రవర్తిస్తారో, వ్యక్తులుగా కూడా అలాగే ప్రవర్తిస్తారు.
"ఒక పురుషుడు తన ప్రవర్తనతో పూర్తిగా ఏకీభవించకపోయినా, లైంగిక విషయాల్లో అతని ఆలోచనలు, నైతిక భావనలు సంప్రదాయ దృష్టికోణంలోనే ఉంటాయి. అందుకే తప్పు చేసిన ఇతర పురుషుడి ప్రవర్తనను కూడా అదే దృష్టితో చూస్తాడు. కాబట్టి అది తప్పుగా అనిపించకపోవడంతో దానికి వ్యతిరేకంగా మాట్లాడడు, కొన్నిసార్లు సమర్థిస్తాడు కూడా" అని ప్రొఫెసర్ అహిరే చెప్పారు.
"పురుషుల మధ్య బంధాలు స్త్రీలను పక్కనపెట్టడంపై ఆధారపడి ఉంటాయి" అని 'హీలింగ్ ఫ్రమ్ హేట్ - హౌ యంగ్ మెన్ గెట్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ వయలెంట్ ఎక్స్‌ట్రీమిజం' అనే పుస్తక రచయిత మైఖేల్ కిమ్మెల్ రాశారు.
మౌనమే వారి సమూహాలను కలిపి ఉంచే బంధమని ఆయన రాశారు.
మగతనం గురించి కూడా కిమ్మెల్ ఈ పుస్తకంలో చర్చించారు.
చిన్న వయస్సు నుండే అబ్బాయిలలో మగతనం అనే భావన పాతుకుపోతుంది. చాలా మంది అబ్బాయిలు ఈ మగతనం విలువలతో పెరిగి, అవే వారి గుర్తింపుగా మారతాయి.
ఈ గుర్తింపు దెబ్బతింటుందేమో అన్న భయం పురుషుల్లో ఉంటుంది.
అలాగే హింసకు వ్యతిరేకంగా మాట్లాడితే, తమను బలహీనంగా లేదా కృతఘ్నులుగా చూస్తారనే భయం కూడా ఉంటుంది.
విచిత్రమేంటంటే "ఇతర పురుషులతో పోలిస్తే తమను తాము సహజంగానే తక్కువ 'పౌరుషవంతులుగా'/మగతనం కలవారిగా అనుకునే పురుషులే మహిళలపై జరిగే శారీరక, లైంగిక హింసకు ఎక్కువగా వ్యతిరేకంగా నిలబడే అవకాశం ఉంటుంది" అని కూడా ఒక పరిశోధన పేర్కొంది.
అంటే మగతనం గురించిన నిర్వచనం పురుషులను హింసకు వ్యతిరేకంగా మాట్లాడకుండా చేస్తుంది.
"సమాజంలో.. ముఖ్యంగా లైంగిక సంబంధాల విషయంలో.. అవి వ్యక్తిగతమైనవని, వాటి గురించి మాట్లాడకూడదని మనకు నిరంతరం నూరిపోస్తున్నారు. అందువల్ల ఆ సందర్భంలో భార్యాభర్తల మధ్య అయినా, లేదా పరస్పర అంగీకారంతో ఉన్న ఇద్దరు మేజర్ల మధ్య అయినా, అది దోపిడీ అయినా లేదా మరేదైనా అయినా, ఏం జరిగినా దాని గురించి చదవకూడదు, బహిరంగంగా చర్చించకూడదు, ఎవరూ మాట్లాడకూడదు అనే భావన ఉంది" అని ప్రొఫెసర్ అహిరే అన్నారు.
ఆ భావన పెరిగిపోవడంతో, చివరికి దానికి వ్యతిరేకంగా మాట్లాడేవారు తగ్గిపోతున్నారు.
"మన సమాజంలో లైంగిక సంబంధాలు, లైంగిక చర్యలు, లైంగిక ఆనందం, అంగీకారం వంటి విషయాలపై ఉన్న అభిప్రాయాలు మూసధోరణితో కూడుకున్నవి. అవి ప్రధానంగా పురుషుల అనుభవంపైనే ఆధారపడి ఉంటాయి. ఇదంతా ప్రధానంగా పురుషుల ఆనందానికి సంబంధించినది. ఇందులో మహిళలకు ఎలాంటి స్వేచ్ఛ ఉండదు. అందుకే జరిగింది తప్పేమీ కాదని పురుషులు కూడా భావించే అవకాశం ఉంది" అని ప్రొఫెసర్ అహిరే చెబుతున్నారు.
ఈ కథనం మగవాళ్లను తప్పుబట్టడం కోసం కాదు. అలాగే మగాళ్లందరూ స్త్రీలను హింసించాలని కోరుకుంటారనిగానీ, వారు మంచివారు కాదనిగానీ కాదు. కానీ ఎక్కువ మంది పురుషులు ఒక సామాజిక వ్యవస్థలో ఉంటారు. అక్కడ వ్యతిరేకంగా మాట్లాడితే నష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే వారు ఎక్కువగా ప్రతిఘటించరని చెప్పడం మాత్రమే.
పురుషులలో కూడా అందరికీ అధికారం, బలం, లేదా డబ్బు ఉండవు, అందువల్ల స్త్రీ పురుషులిద్దరికీ అధికారంలో ఉన్న పురుషులను ఎదిరించడం కష్టమే.

ఫొటో సోర్స్, Getty Images
పురుషులు మౌనంగా ఉండడం కేవలం వ్యక్తిగత లోపం మాత్రమే కాదు, అది వారి చుట్టూ ఉన్న సమాజం, మగతనం గురించి ఉన్న భావనలు, పురుషాధిక్యత నుంచి వచ్చే ఒత్తిడి ఫలితమే.
అయితే ఈ కొత్త తరంలో పెరుగుతున్న పిల్లలకు ఈ ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో ఎలా నేర్పాలి?
కేవలం మంచిగా ప్రవర్తించు, మహిళలను గౌరవించు అని చెప్పడం మాత్రమే సరిపోదు.
మగతనం అన్న మాటను పునర్నిర్వచించాల్సిన అవసరం ఉంది.
'కోచింగ్ బాయ్స్ ఇంటూ మెన్ ' అనే ఒక ప్రయోగంలో టీనేజ్ క్రీడాకారులపై ఒక అధ్యయనం చేశారు. ఇందులో జెండర్ లిటరేట్ (లింగ అవగాహన) కలిగిన కోచ్ ఉండటంతో వారిలో మగతనం గురించి తప్పుడు భావనలు కలగలేదని తేలింది. అందుకే హింస లేదా లైంగిక వేధింపులు జరిగినప్పుడు ఈ అబ్బాయిలు వెంటనే స్పందిస్తారు.
ఇక రెండో విషయమేంటంటే చాలామంది పిల్లలకు చిన్నప్పటినుంచే ఏది సరైనదో, ఏది తప్పో తెలుస్తుంది. కానీ ఏదైనా తప్పు జరిగినప్పుడు, ముఖ్యంగా లైంగిక వేధింపులు జరిగినప్పుడు ఏం చేయాలో వారికి అర్థం కాదు. అటువంటి పరిస్థితుల్లో ఎలా స్పందించాలో వారికి ముందుగానే నేర్పించాలి. ఉదాహరణకు స్త్రీలను కించపరిచే జోక్ వేస్తే, వారు నవ్వకుండా "అందులో ఫన్ ఏముంది" అని లేదా "ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టకు, నువ్వు చేస్తున్నది ఆమెకు నచ్చడం లేదు" అని చెప్పాలి. ఈ మాటలను సరైన సమయంలో ఎలా చెప్పాలో కూడా వారికి నేర్పించాలి.
అమెరికాలోని గ్రీన్ డాట్ కార్యక్రమం, హింసాత్మక పరిస్థితులలో కేవలం ప్రేక్షకులుగా ఉండిపోకుండా, జోక్యం చేసుకోవాలని టీనేజర్లకు ప్రత్యేకంగా బోధిస్తుంది. ఇలాంటి ప్రోగ్రామ్‌లు ప్రతిచోటా అమలు చేయాలి.
ఇక చివరిగా హింసాత్మకంగా ప్రవర్తించే వారికి ఎదురు నిలిస్తే.. ప్రజలు మిమ్మల్ని తిడతారు, కృతఘ్నులని అంటారు, మిమ్మల్ని చూసి నవ్వుతారు లేదా బలహీనులని అంటారు. కానీ వీటికి లొంగిపోకుండా, మీ సొంత అభిప్రాయంపై దృఢంగా నిలబడండి అని మన పిల్లలకు నేర్పించాలి.
అయితే మొత్తం బాధ్యతను కేవలం టీనేజర్లపై లేదా చిన్న పిల్లలపై వేయలేం. మనందరిపై కూడా ఉంది. తప్పు చేసే వారికి తప్పకుండా శిక్ష పడాలని మనం తరచూ బహిరంగంగా చెబుతూ ఉండాలి.
హింసకు, లైంగిక వేధింపులకు పాల్పడేవారికి శిక్షపడుతుందని, వారికి మద్దతు ఇచ్చేవారు కూడా బాధ్యత వహించాల్సి వస్తుందని స్పష్టంగా కనిపించినప్పుడే నిజమైన మార్పు వస్తుంది.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

































