బంగాళాఖాతంలో వాయుగుండం తీరం దాటేది ఎక్కడ, భారీ వర్షాలు పడే ప్రాంతాలు ఏవి?

భారీ వర్షాలు, విశాఖపట్నం
ఫొటో క్యాప్షన్, విశాఖలో భారీ వర్షాలు
    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం
  • ప్రచురణ
  • చదివే సమయం: 6 నిమిషాలు

పశ్చిమ మధ్య, దాన్ని ఆనుకుని ఉన్న వాయవ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం గంటకు 17 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయవ్య దిశగా కదులుతోంది.

ఇది కళింగపట్నానికి తూర్పు ఆగ్నేయంగా 240 కిలోమీటర్లు, విశాఖపట్నానికి తూర్పున 320 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం బీబీసీకి తెలిపింది.

ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు ఆగ్నేయంగా 220 కిలోమీటర్ల దూరంలో ఈ వాయుగుండం ఉందని అధికారులు తెలిపారు.

ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ మంగళవారం సాయంత్రం తర్వాత తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం డ్యూటీ ఆఫీసర్ వెంకన్నదొర బీబీసీతో చెప్పారు.

అదే దిశలో కదులుతూ ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరంలో విశాఖపట్నం-గోపాల్‌పూర్ మధ్య సెప్టెంబర్ 23 రాత్రి లేదా 24వ తేదీ తెల్లవారుజామున తీవ్ర వాయుగుండంగానే తీరం దాటే అవకాశం ఉందని ఆయన చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

దీని ప్రభావంతో 23, 24 తేదీల్లో కోస్తాంధ్రలో అతి భారీ వర్షాలు, దక్షిణాంధ్ర, రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

సెప్టెంబర్ 23 నుంచి 25 వరకు బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.

ఈ మూడు రోజుల్లో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వెల్లడించింది.

Skip ఎక్కువమంది చదివినవి and continue reading
ఎక్కువమంది చదివినవి

End of ఎక్కువమంది చదివినవి

అప్రమత్తమైన ఆంధ్రప్రదేశ్

బంగాళాఖాతంలోని పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం... మరికొన్ని గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది.

మంగళ, బుధవారాల్లో శ్రీకాకుళం నుంచి బాపట్ల వరకు పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది.

రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే సూచనలు. వాయుగుండం ప్రభావంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముందని...ఈ పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ సూచించింది.

"ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశాం. కంట్రోల్ రూమ్‌లను 24 గంటలూ అందుబాటులో ఉంచుతున్నాం. వాతావరణ పరిస్థితులను నిరంతరం సమీక్షించాలని అధికారులను అప్రమత్తం చేశాం" అని ఆంధ్రప్రదేశ్ హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత

ఫొటో సోర్స్, Home Minister Office

ఫొటో క్యాప్షన్, ఆంధ్రప్రదేశ్ హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత

వాయుగుండం నేపథ్యంలో ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, విపత్తుల సంస్థ ఎండీ ప్రఖర్ జైన్, ఉన్నత అధికారులతో మంత్రి వంగలపూడి అనిత అత్యవసర టెలికాన్ఫరెన్స్ సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక అంశాలపై హోం మంత్రి అనిత సూచనలు చేశారు.

"చెట్లు, భారీ హోర్డింగ్స్, శిథిలావస్థలో ఉన్న ఇళ్ల వద్ద ప్రజలు ఉండరాదు. ప్రభుత్వం జారీ చేసే వాతావరణ హెచ్చరికలను ప్రజలు తప్పనిసరిగా పాటించాలి. వర్షాలు, ఈదురుగాలుల నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలి" అని మంత్రి వంగలపూడి అనిత సూచించారు.

విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం డ్యూటీ ఆఫీసర్ వెంకన్నదొర
ఫొటో క్యాప్షన్, విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం డ్యూటీ ఆఫీసర్ వెంకన్నదొర

ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన

"వాయుగుండం ప్రభావం ఉత్తరాంధ్రతో పాటు కోస్తాంధ్రలో కూడా ఉంటుంది. క్రమంగా వర్షాలు పెరిగే అవకాశం ఉంది. సెప్టెంబర్ 22న కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, 23, 24 తేదీల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలతో పాటు బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో కుండపోత వర్షం కురవనుంది" అని డ్యూటీ ఆఫీసర్ వెంకన్న దొర చెప్పారు.

వైజాగ్ బీచ్

‘సముద్రంలోకి వెళ్లొద్దు’

వాయుగుండం తీరానికి చేరువయ్యే సమయంలో సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉందనీ, ఉత్తర ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా తీర ప్రాంతాల్లో గంటకు 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ తెలిపింది.

గాలుల వేగం అప్పుడప్పుడు గంటకు 75 కిలోమీటర్ల వరకు పెరగవచ్చని పేర్కొంది. సముద్రం అలజడిగా ఉంటుంది కాబట్టి మంగళవారం నుంచి 25 తేదీ వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకూడదని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున తీర ప్రాంత ప్రజలు, ముఖ్యంగా మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది.

దీంతో వాతావరణశాఖ నుంచి కూడా మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా ఉండాలని సూచనలు చేస్తున్నట్లు వెంకటన్న దొర తెలిపారు.

విశాఖపట్నం

పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ

ఇప్పటికే వర్షాలు కురుస్తున్న ప్రాంతాల్లో వాతావరణశాఖ రెడ్ అలర్ట్ (అత్యంత భారీ వర్షాలు, 24 గంటల్లో 20 సెం.మీ. కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ) జారీ చేసింది.

మంగళవారానికి (22వ తేదీ) శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

బుధవారానికి (23న) కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, యానాంలకు రెడ్ అలర్ట్‌ ఇచ్చింది. గురువారానికి (24న) కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, యానాంలతో పాటు అల్లూరి, అనకాపల్లి, కృష్ణా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది.

రెడ్ అలర్ట్ జారీ చేసిన ప్రాంతాల్లో వరదలు, కొండచరియలు విరిగిపడటం, రోడ్లు/లోతట్టు ప్రాంతాలు మునిగిపోవడం వంటి ప్రమాదాలు ఉండొచ్చు.

ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. అధికారులు సూచించే జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు.

వాతావరణశాఖ ఇచ్చే గ్రీన్ అలర్ట్ అంటే పెద్దగా ప్రమాదం లేదని, ఎల్లో అలర్ట్ అంటే అప్రమత్తంగా ఉండాలని, ఆరెంజ్ అలర్ట్ అంటే ఏం జరిగిన సిద్ధంగా ఉండాలని, అలాగే రెడ్ అలర్ట్ అంటే అత్యంత జాగ్రత్త అవసరమని అర్థం చేసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

భారీ వర్షాలు, విశాఖపట్నం

ఎల్‌నినో పరిస్థితుల్లో ఈ వర్షాలు ఎందుకు?

ఎల్‌నినో పరిస్థితులు సాధారణంగా భారత రుతుపవనాలపై ప్రభావం చూపుతుంటాయి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో కూడా బంగాళాఖాతంలో వాయుగుండాలు ఏర్పడి భారీ వర్షాలకు కారణమయ్యే అవకాశం ఉందని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ, విశాఖ రీజియన్ మాజీ డైరెక్టర్ డాక్టర్ కేఎస్ఆర్ మూర్తి తెలిపారు.

"ఈ వాయుగుండం ఏర్పడటానికి ఎల్‌నినో ఒక్కటే కారణం కాదు. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు, గాలుల కదలిక, వాతావరణంలోని తేమ వంటి అనేక అంశాలు కలిసి ఇలాంటి వ్యవస్థలు ఏర్పడటంలో పాత్ర పోషిస్తాయి" అని ఆయన బీబీసీతో అన్నారు.

"ఈ వర్షాలు వర్షాభావ పరిస్థితులు ఉన్న ప్రాంతాలకు కొంత ఉపశమనం కలిగించే అవకాశం ఉంది. అయితే భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరడం, వాగులు, కాలువలు పొంగిపొర్లడం వంటి సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది. ప్రజలను అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఉండాలి" అని కేఎస్ఆర్ మూర్తి సూచించారు.

విశాఖపట్నం

ఫొటో సోర్స్, IMD

ఇది తుపానుగా మారుతుందా?

ఈ వాయుగుండం తుపానుగా మారుతుందా అనే అంశంపై విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులతో బీబీసీ మాట్లాడింది.

‘‘ప్రస్తుతం దీనిని తుపానుగా పరిగణించడం లేదు. ఐఎండీ తాజా అంచనా ప్రకారం ఇది తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశమే ఉంది" అని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారి వెంకన్నదొర చెప్పారు.

తీర ప్రాంత ప్రజలు వాతావరణ శాఖ, జిల్లా యంత్రాంగం జారీ చేసే తాజా హెచ్చరికలను గమనించాలని సూచించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)