జముయి లైంగిక హింస లాంటి వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారా? అయితే జాగ్రత్త

జముయి లైంగిక దాడి కేసు, వైరల్ వీడియో, బిహార్, సోషల్ మీడియా కేసులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం
ప్రచురణ
చదివే సమయం: 5 నిమిషాలు

జముయి లైంగిక వేధింపుల కేసులో ప్రధాన నిందితుడు నందన్ యాదవ్‌ను అరెస్టు చేసినట్లు బిహార్ పోలీస్ ఏడీజీ (లా అండ్ ఆర్డర్) కేఎస్ అనుపమ్ ధ్రువీకరించారు.

ఈ కేసు దర్యాప్తునకు సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) ఏర్పాటైందని, విచారణను వేగవంతం చేసేందుకు త్వరలోనే ఛార్జిషీటు దాఖలు చేస్తామని ఆమె వార్తా సంస్థ 'ఏఎన్ఐ' వార్తాసంస్థకు తెలిపారు.

ఈ కేసులో ప్రధాన నిందితుడితో పాటు మొత్తం ఐదుగురిని అరెస్టు చేశామని, వీడియోను షేర్ చేసినందుకు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని జముయి ఎస్పీ బిశ్వజీత్ దయాల్ వెల్లడించారు.

మైనర్ల లైంగిక దాడి వీడియోను వైరల్ చేసిన వారిపై 'పోక్సో' (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్) చట్టం కింద కేసులు నమోదు చేశామని ఏడీజీ కేఎస్ అనుపమ్ స్పష్టం చేశారు.

పోక్సో చట్టం ప్రకారం పిల్లలకు సంబంధించిన ఇలాంటి వీడియోలు తీయడం, సర్క్యులేట్ చేయడం నాన్-బెయిలబుల్ (బెయిల్ రాని) నేరమని, దాన్ని షేర్ చేసిన ప్రతి ఒక్కరిపైనా చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.

ప్రధాన నిందితుడు నందన్ యాదవ్‌ అరెస్ట్ సమయంలో కాల్పులు జరిగినట్లు పోలీసులు చెప్పారు. నిందితుడి వద్ద నాటు తుపాకీ ఉందని, అతడే ముందుగా కాల్పులు జరపడంతో తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులు తిరిగి కాల్పులు జరపాల్సి వచ్చిందని కేఎస్ అనుపమ్ ఏజెన్సీతో చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
జముయి లైంగిక దాడి కేసు, వైరల్ వీడియో, బిహార్, సోషల్ మీడియా కేసులు, బిహార్ ఏడీజీ (లా అండ్ ఆర్డర్) కేఎస్ అనుపమ్

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, బిహార్ ఏడీజీ (లా అండ్ ఆర్డర్) కేఎస్ అనుపమ్

వీడియో షేర్ చేసిన వారిపైనా ఎఫ్‌ఐఆర్

సోమవారం జముయి జిల్లాకు చెందిన వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయింది. అందులో ఒక గుంపు నడిరోడ్డుపై ఇద్దరు మైనర్లను చుట్టుముట్టి వారిపై హింసకు, లైంగిక వేధింపులకు పాల్పడటం కనిపిస్తోంది.

ఈ కేసు నిందితులతో పాటు, ఈ వీడియోను చిత్రీకరించి, సోషల్ మీడియాలో షేర్ చేసిన వారిపై కూడా చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.

Skip ఎక్కువమంది చదివినవి and continue reading
ఎక్కువమంది చదివినవి

End of ఎక్కువమంది చదివినవి

ఒకవేళ మీ సోషల్ మీడియా ఫీడ్‌లోనూ జముయి వీడియో వచ్చి ఉండి, మీరు దాన్ని షేర్ చేసి ఉంటే అప్రమత్తం అవ్వండి. వెంటనే ఆ పోస్ట్‌ను డిలీట్ చేయండి, భవిష్యత్తులో ఇలాంటి వీడియోలను షేర్ చేసే ముందు పోలీసుల చర్యలు కూడా ఉంటాయని గుర్తుంచుకోండి.

బాధిత మైనర్ల గుర్తింపును బహిర్గతం చేయకూడదన్న నిబంధనను ప్రస్తావిస్తూ.. వారికి సంబంధించిన వీడియోలను పోస్ట్, షేర్ లేదా ఫార్వర్డ్ చేయవద్దని జముయి పోలీసులు సూచించారు.

"మైనర్ల గుర్తింపును బహిర్గతం చేయడం భారతీయ న్యాయ సంహిత-2023, ఐటీ చట్టం 2000, జేజే (జువైనల్ జస్టిస్) చట్టంతో పాటు పోక్సో కింద కూడా నేరంగా పరిగణిస్తారు. ఇలా చేసే వారికి కఠిన శిక్ష పడే అవకాశం ఉంది" అని జముయి పోలీసులు ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

ఈ కేసులో బీఎన్‌ఎస్ సెక్షన్ 74 (మహిళ గౌరవానికి భంగం కలిగించడం), 76/3(5) (మహిళ దుస్తులు తొలగించడం), పోక్సో చట్టంలోని సెక్షన్ 08/12 (పిల్లలపై లైంగిక వేధింపులు) కింద జముయి పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న వీడియో.. పోక్సో చట్టంలోని సెక్షన్ 23, ఐటీ చట్టం, జువైనల్ జస్టిస్ చట్టంలోని సెక్షన్ 74 కింద నేరమని జముయి ఎస్పీ బిశ్వజీత్ దయాల్ ఒక ప్రకటనలో తెలిపారు.

"ఈ చట్టాల ఆధారంగా సైబర్ పోలీస్ స్టేషన్‌లో 120 సోషల్ మీడియా అకౌంట్ల యూజర్లపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశాం. మైనర్ బాధితుల గోప్యతను గౌరవించాలని, ఇలాంటి వీడియోలను వైరల్ చేయవద్దని ప్రతి ఒక్కరికీ విజ్ఞప్తి చేస్తున్నాం" అని ఆయన పేర్కొన్నారు.

జముయి లైంగిక దాడి కేసు, వైరల్ వీడియో, బిహార్, సోషల్ మీడియా కేసులు

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, జమయి ఘటనకు నిరసనగా పట్నాలో యూత్ కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది.

పోక్సో చట్టంలోని సెక్షన్ 23 ఏం చెబుతోంది?

జముయి ఘటన మైనర్లకు సంబంధించినది కావడంతో, ఈ వీడియోను బహిర్గతం చేసిన వారిపై పోక్సో చట్టంలోని సెక్షన్ 23 కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.

ఈ సెక్షన్ ప్రకారం మైనర్ బాధితులు, వారి తల్లిదండ్రుల గుర్తింపును ఎట్టిపరిస్థితుల్లోనూ బయటపెట్టకూడదు. ఈ నిబంధనను ఉల్లంఘిస్తే పోక్సో చట్టం సెక్షన్ 23 కింద శిక్ష పడుతుంది.

అసలు ఈ చట్టం ఏం చెబుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

2012 నాటి పోక్సో చట్టం సెక్షన్ 23 ప్రకారం, పూర్తి, సరైన సమాచారం లేకుండా ఏ వ్యక్తి కూడా మీడియా, స్టూడియో లేదా ఫోటోగ్రఫీ ద్వారా పిల్లల ప్రతిష్టకు భంగం కలిగించేలా లేదా వారి గోప్యతను ఉల్లంఘించేలా ఎలాంటి రిపోర్టులు ఇవ్వకూడదు, వ్యాఖ్యలు చేయకూడదు.

బాధితుల పేరు, చిరునామా, ఫోటోలు, కుటుంబ వివరాలు, బడి, చుట్టుపక్కల ప్రాంతాలు.. ఇలా పిల్లల గుర్తింపును బహిర్గతం చేసే ఎలాంటి సమాచారాన్నీ ఏ మీడియాలోనూ ప్రసారం చేయకూడదు, ప్రచురించకూడదు. అయితే, లిఖితపూర్వక కారణాలతో ఈ చట్టం కింద విచారణ జరిపే ప్రత్యేక న్యాయస్థానం మాత్రమే ఆ సమాచారాన్ని వెల్లడించడానికి అనుమతి ఇవ్వగలదు. అది కూడా ఆ పిల్లల ప్రయోజనాలకు మేలు జరుగుతుందని న్యాయస్థానం భావిస్తేనే ఈ మినహాయింపు ఉంటుంది.

తమ ఉద్యోగులు చేసే తప్పులు, నిర్లక్ష్యానికి ఆయా మీడియా సంస్థలు, స్టూడియోలు లేదా ఫోటోగ్రఫీ యజమానులు, పబ్లిషర్లు ఉమ్మడిగా, వ్యక్తిగతంగా బాధ్యత వహించాల్సి ఉంటుంది.

సెక్షన్ 23లోని సబ్-సెక్షన్ (1) లేదా సబ్-సెక్షన్ (2) నిబంధనలను ఉల్లంఘించిన వారికి ఆరు నెలల నుంచి ఏడాది వరకు జైలు శిక్ష లేదా జరిమానా, లేదా ఆ రెండూ విధించే అవకాశం ఉంది.

ఇక జేజే (జువైనల్ జస్టిస్) చట్టంలోని సెక్షన్ 74.. నేరం చేసిన, రక్షణ అవసరమైన, లేదా ఏదైనా నేరంలో బాధితులుగా, సాక్షులుగా ఉన్న పిల్లల గుర్తింపు, గోప్యత, ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు ఉద్దేశించినది.

ఏ కేసులోనైనా సరే.. సంబంధిత పిల్లల వ్యక్తిగత సమాచారాన్ని బహిర్గతం చేయడాన్ని ఈ సెక్షన్ పూర్తిగా నిషేధిస్తోంది.

ఈ నిబంధనను ఉల్లంఘిస్తే ఆరు నెలల వరకు జైలు శిక్ష, రెండు లక్షల రూపాయల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది.

పోలీసుల కఠిన చర్యలు

బిహార్ వ్యవహారంపై రాజకీయ ప్రకటనలు వెలువడుతున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ నేతలు, జాతీయ మహిళా కమిషన్ సైతం ఈ కేసుపై చురుగ్గా స్పందిస్తున్నాయి.

సోషల్ మీడియా నుంచి ఈ వీడియోను తొలగించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నామని జముయి పోలీసులు పలుమార్లు స్పష్టం చేశారు. ఈ వీడియోను వేరే ఖాతాల నుంచి మళ్లీ అప్‌లోడ్ చేయడం గానీ, షేర్ చేయడం గానీ జరగకుండా చూసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.

ఈ వీడియోను వైరల్ చేస్తూ, ప్రచారం చేస్తున్న సోషల్ మీడియా ఖాతాలపై కూడా దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు చెప్పారు. చట్ట ప్రకారం ఇందులో ఎవరి ప్రమేయం ఉన్నట్లు తేలినా.. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

బిహార్ ఏడీజీ (లా అండ్ ఆర్డర్) కేఎస్ అనుపమ్ కూడా ఓ మీడియా సమావేశం నిర్వహించారు. వైరల్ అవుతున్న వీడియోలో బాలిక ముఖాన్ని బ్లర్ చేయకుండా (మసకబార్చకుండా) ఎవరైనా షేర్ చేస్తే.. వారిపై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేస్తామని ఆమె హెచ్చరించారు.

ఇప్పటికే పలు సోషల్ మీడియా ఖాతాలను గుర్తించిన పోలీసులు, ఆయా వీడియోలను తొలగించాలంటూ నోటీసులు కూడా పంపారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)