లైంగిక వేధింపుల కేసులో జర్నలిస్ట్ తరుణ్ తేజ్‌పాల్‌‌‌కు పదేళ్ల జైలుశిక్ష విధించిన బాంబే హైకోర్ట్

తరుణ్ తేజ్‌పాల్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, లైంగిక వేధింపుల కేసులో తరుణ్ తేజ్‌పాల్‌కు జైలుశిక్ష పడింది
ప్రచురణ
చదివే సమయం: 4 నిమిషాలు

'తెహెల్కా' మేగజీన్ మాజీ ఎడిటర్-ఇన్-చీఫ్ తరుణ్ తేజ్‌పాల్‌ను అత్యాచారం కేసులో గురువారం నాడు దోషిగా నిర్ధరించిన బాంబే హైకోర్టు గోవా బెంచ్, ఆయనకు 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.

తరుణ్ తేజ్‌పాల్‌పై 2013 నవంబర్‌‌లో అత్యాచారం కేసు నమోదైంది. ఆయన్ను నిర్దోషిగా విడుదల చేసిన 2021 నాటి సెషన్స్ కోర్టు తీర్పును హైకోర్టు తాజా తీర్పుతో రద్దు చేసింది.

'లైవ్ లా' వెబ్‌సైట్ ప్రకారం, గోవా ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌ను అనుమతిస్తూ, ఈ కేసును విచారించిన జస్టిస్ డాక్టర్ నీలా గోఖలే, జస్టిస్ అమిత్ బోర్కర్‌లతో కూడిన డివిజన్ బెంచ్, తేజ్‌పాల్‌ను దోషిగా నిర్ధరించింది.

శిక్షకాలాన్ని ప్రకటించడానికి ముందు మీడియాతో మాట్లాడుతూ, ఈ తీర్పును సుప్రీం కోర్టులో సవాలు చేస్తానని తరుణ్ తేజ్‌పాల్ తెలిపారు. ‘‘ట్రయల్ కోర్టులో ఏడున్నరేళ్లపాటు న్యాయపోరాటం చేసిన తర్వాత నిర్దోషులుగా విడుదలయ్యాం. ఇప్పుడు వాళ్లు మళ్లీ మాపై పడ్డారు. తమకు అనుకూలంగా ఉన్నవారిని వదిలేసి, వ్యతిరేకంగా జర్నలిజం చేసిన వారిని నిత్యం వేధిస్తున్నారు’’ అని వ్యాఖ్యానించారు.

తీర్పు వెలువడిన సమయంలో తరుణ్ తేజ్‌పాల్ కోర్టులోనే ఉన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
తేజ్‌పాలత్

ఫొటో సోర్స్, Hindustan Times via Getty Images

ఫొటో క్యాప్షన్, తెహల్కా మేగజీన్ 2013లో నిర్వహించిన హై-ప్రొఫైల్ కాన్ఫరెన్స్‌ సందర్భంగా మహిళా ఉద్యోగిపై హోటల్‌ ఎలివేటర్‌లో ఆయన బలత్కారానికి ప్రయత్నించినట్లు తేజ్‌పాల్‌ (కుడి)పై ఫిర్యాదు నమోదైంది.

ఈ అప్పీల్‌ను సీఐడీ దాఖలు చేసింది. ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, గోవా అడ్వకేట్ జనరల్ దేవిదాస్ పంగమ్‌లు వాదనలు వినిపించారు.

బార్ అండ్ బెంచ్‌ వెబ్‌సైట్ చెప్పినదాని ప్రకారం ‘‘ మేం దిగువ కోర్టు తీర్పును, ఉత్తర్వును రద్దు చేసి తేజ్‌పాల్‌ను దోషిగా నిర్ధరించాం. భారత శిక్షా స్మృతి (ఐపీసీ) లోని సెక్షన్లు 376(2)(ఎఫ్) (కె), 354ఏ, 354బీ కింద మేం ఆయన్ను దోషిగా నిర్ధరించాం" అని న్యాయమూర్తులు పేర్కొన్నారు.

సెక్షన్ 354ఏ లైంగిక వేధింపులను నేరంగా పరిగణిస్తుంది. ఇందులో ఇష్టం లేని శారీరక స్పర్శ, లైంగిక ప్రయోజనాల కోసం స్పష్టమైన డిమాండ్లు, లేదా లైంగిక చర్యల కోసం అభ్యర్థనలు ఉండవచ్చు. సెక్షన్ 354బీ ఒక మహిళను వివస్త్రను చేసే ఉద్దేశ్యంతో ఆమెపై దాడి చేయడాన్ని లేదా నేరపూరితంగా బలప్రయోగం చేయడాన్ని నేరంగా పరిగణిస్తుంది.

తరుణ్ తేజ్‌పాల్

ఫొటో సోర్స్, GettyImages

లైవ్ లా వెబ్‌సైట్ చెప్పినదాని ప్రకారం ‘‘మేము ఈరోజు మధ్యాహ్నం 2:30 గంటలకు శిక్షా కాలానికి సంబంధించిన ఉత్తర్వును వెల్లడిస్తాం. తేజ్‌పాల్ ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్నందున, అప్పటి వరకు ఆయన్ను అదుపులోకి తీసుకోం" అని జస్టిస్ గోఖలే అన్నారు.

దీనికి తేజ్‌పాల్ తరఫు న్యాయవాది స్పందించారు. ‘‘ఉన్నత న్యాయస్థానంలో అప్పీలు చేసుకునే హక్కు నాకు ఉంది. ఉన్నత న్యాయస్థానం లొంగిపోమని ఆదేశిస్తే లొంగిపోతా. నాకు బెయిల్ మంజూరు చేయాలని ఆదేశిస్తే నేను దానికి కట్టుబడి ఉంటా. నన్ను జైలుకు పంపడం ద్వారా ఆ హక్కుకు భంగం కలిగించకూడదు" అని తేజ్‌పాల్ తరఫున ఆయన కోర్టుకు వెల్లడించారు.

తేజ్‌పాల్ ఎన్నడూ పరారీలోలేరని, కోర్టు ఆదేశాలను పాటించారనీ, ఆయన పాస్‌పోర్ట్‌ కూడా ప్రభుత్వ అధికారుల వద్దే ఉందనీ, అరెస్టయినప్పటి నుంచి ఆయన విదేశాలకు వెళ్లలేదన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని తేజ్‌పాల్ తరఫు న్యాయవాది కోర్టును కోరారు.

గోవా పోలీసులు సుమారు 3,000 పేజీల చార్జిషీట్‌ను దాఖలు చేశారు. అందులో తేజ్‌పాల్‌పై ‘‘ అక్రమ నిర్బంధం, లైంగిక వేధింపులు, దాడి, తన అధికారిక పదవిని దుర్వినియోగం చేసి లైంగిక దోపిడీకి పాల్పడటం’’ అనే ఆరోపణలు చేశారు.

తరుణ్ తేజ్‌పాల్ అన్ని ఆరోపణలను ఖండించి, తాను నిర్దోషినని వాదించారు.

ప్రాసిక్యూషన్ 156 మంది సాక్షుల జాబితాను సమర్పించినప్పటికీ, చివరికి సుమారు 70 మందిని మాత్రమే క్రాస్-ఎగ్జామినేషన్ చేశారు.

తరుణ్ తేజ్‌పాల్

ఫొటో సోర్స్, Getty Images

అసలేం జరిగింది?

నవంబర్ 2013లో తెహెల్కా పత్రిక గోవాలోని ఒక ఫైవ్-స్టార్ హోటల్‌లో ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమం సందర్భంగా, హోటల్ ఎలివేటర్‌లో తరుణ్ తేజ్‌పాల్ తనపై లైంగిక దాడి చేశారని ఒక యువ మహిళా సహోద్యోగి ( భారత చట్టాల ప్రకారం ఆమె గుర్తింపును వెల్లడించలేము) ఆరోపించారు.

మొదట, తేజ్‌పాల్ తాను "అంచనా వేయడంలో పొరపాటు" చేశానని, "పరిస్థితిని తప్పుగా అర్థం చేసుకున్నానని" దానివల్లే "ఈ దురదృష్టకర సంఘటన" జరిగిందని పేర్కొన్నారు.

అయితే, ఈ విషయం ముదిరిపోవడంతో, "జరిగిన సంఘటనల పూర్తి క్రమం వెనుక ఉన్న నిజానిజాలు మరింత కచ్చితంగా వెల్లడయ్యేందుకు" సీసీటీవీ ఫుటేజీని పరిశీలించాలని అధికారులను కోరుతూ ఆయన ఒక ప్రకటన జారీ చేశారు.

ఈ కేసు బయటకు వచ్చినప్పుడు దిల్లీలో ఒక మహిళపై జరిగిన దారుణమైన సామూహిక అత్యాచారం, హత్య ఘటన తర్వాత భారతదేశంలో లైంగిక హింస పట్ల ఒక చర్చ తీవ్రంగా జరుగుతోంది.

లింగ అసమానత, స్త్రీలపై ద్వేషానికి వ్యతిరేకంగా వార్తలు రాయడంలో పేరుగాంచిన 'తెహెల్కా' పత్రికపై కపటత్వం, ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారని విమర్శకులు ఆరోపించారు.

తరుణ్ తేజ్‌పాల్‌కు వ్యతిరేకంగా మహిళా సంఘాలు, ఏబీవీపీ (బీజేపీ యువజన విభాగం) సభ్యులు వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపారు.

2013 నవంబరు 30న ఆయన అరెస్టు అయ్యారు. ఏడు నెలల తర్వాత జులై నుంచి ఆయన బెయిలుపై విడుదల అయ్యారు. తనపై ఆరోపణలు కొట్టివేయాలని అప్పట్లో గోవా హైకోర్టు, సుప్రీం కోర్టులలో కూడా తరుణ్ పిటిషన్ వేశారు. కానీ ఫలితం లేకపోయింది.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)