'బ్రిజ్ భూషణ్ ఇలాకాలో పోటీలా? ఆరుగురు బాధితుల్లో నేనూ ఒకరిని' : రెజ్లర్ వినేశ్ ఫొగాట్

ఫొటో సోర్స్, @Phogat_Vinesh
ఒలింపియన్, భారత మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగాట్ ఆదివారం సోషల్ మీడియా వేదికగా తన భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్ఐ) నిర్వహించనున్న ఒక ర్యాంకింగ్ టోర్నమెంట్‌పై అనుమానాలు లేవనెత్తారు.
అంతేకాకుండా, డబ్ల్యూఎఫ్ఐ మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల ఫిర్యాదు చేసిన ఆరుగురు మహిళా బాధితుల్లో తాను కూడా ఒకరినని ఆమె ఈ సందర్భంగా వెల్లడించారు.
బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ఇలాకా అయిన గోండాలో డబ్ల్యూఎఫ్ఐ ఈ ర్యాంకింగ్ టోర్నమెంట్‌ను నిర్వహిస్తోందని వినేశ్ అన్నారు.
ఈ నేపథ్యంలో, ఆమె తన భద్రతతో పాటు ఈ టోర్నమెంట్ పారదర్శకతపై సందేహాలను వ్యక్తం చేశారు.
వినేశ్ భద్రతకు తాను 'వ్యక్తిగతంగా గ్యారెంటీ' ఇస్తానని డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు సంజయ్ సింగ్ 'ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్' పత్రికతో చెప్పారు. అంతేకాదు, కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న వినేశ్, ఈ అంశాన్ని రాజకీయం చేయకూడదని అన్నారు.

వినేశ్ ఫొగాట్ తన సోషల్ మీడియా ఖాతాల్లో విడుదల చేసిన ఒక వీడియోలో తాను బాధితురాలిననే విషయాన్ని స్వయంగా వెల్లడించారు. ఈ కేసు ప్రస్తుతం కోర్టులో విచారణలో ఉందని, అయితే ప్రస్తుత పరిస్థితుల వల్ల ఈ విషయాన్ని వెల్లడించాల్సి వస్తోందని ఆమె చెప్పారు.
వినేశ్ వ్యాఖ్యలపై బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ నుంచి ఇప్పటివరకు స్పందన రాలేదు. ఆయన స్పందించగానే స్టోరీలో అప్డేట్ చేస్తాం.
2023లో అప్పటి డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడిగా ఉన్న, బీజేపీ మాజీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలతో నిరసన చేపట్టిన మహిళా రెజ్లర్లలో వినేశ్ ఫొగాట్ ఒకరు.

ఫొటో సోర్స్, Boris Streubel/Getty Images for Laureus
వినేశ్ ఫొగాట్ ఏం చెప్పారు?
"నెల కిందట రెజ్లింగ్ ఫెడరేషన్ ఒక ర్యాంకింగ్ టోర్నమెంట్‌ను ప్రకటించింది. ఈ పోటీలు యూపీలోని గోండాలో జరుగుతున్నాయి. అది బ్రిజ్ భూషణ్‌కు పట్టున్న ప్రాంతం, అక్కడ ఆయనకు ప్రైవేటు కాలేజీ కూడా ఉంది" అని వినేశ్ ఫొగాట్ పేర్కొన్నారు.
ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం, ఉత్తరప్రదేశ్‌లో గోండా జిల్లాలోని నందిని నగర్ కాలేజీలో మే 10 నుంచి 12 మధ్య ఈ ర్యాంకింగ్ టోర్నమెంట్ జరగనుంది. గోండా మాజీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ఈ కళాశాల వ్యవస్థాపకులు.
"కష్టపడే ప్రతి ప్లేయర్‌కు అక్కడ న్యాయం జరుగుతుందనేది అసాధ్యం. ఏ మ్యాచ్‌కు ఏ రెఫరీ వెళ్లాలి, ఎవరు ఎన్ని పాయింట్లు ఇవ్వాలి, మ్యాట్ చైర్మన్ ఎక్కడ కూర్చోవాలి, ఎవరిని గెలిపించాలి, ఎవరిని ఓడించాలి అనేవన్నీ బ్రిజ్ భూషణ్ మనుషులే నియంత్రిస్తారు. క్రీడాకారుల బరువును సరిగ్గా తనిఖీ చేస్తారని లేదా వారి కష్టానికి తగిన ఫలితం మ్యాట్‌పై వస్తుందని నేను అనుకోవడం లేదు" అని వినేశ్ అన్నారు.

ఫొటో సోర్స్, David Ramos/Getty Images
వినేశ్ మాట్లాడుతూ, "మూడేళ్ల కిందట మేం లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా గళం విప్పాం. ఆరుగురు మహిళా క్రీడాకారిణులు ఫిర్యాదు చేశారు, వాటి ఆధారంగానే నేడు విచారణ జరుగుతోంది. బాధితుల గుర్తింపును బయటపెట్టకూడదని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి. కానీ, నేడు తప్పనిసరి పరిస్థితుల్లో మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఆ ఫిర్యాదు చేసిన ఆరుగురు బాధితుల్లో నేను కూడా ఒకరిని."
"ముందే అథ్లెట్లపై చాలా ఒత్తిడి ఉంటుంది. అలాంటి ప్రదేశానికి వెళ్లి నేను నా నూటికి నూరు శాతం ప్రతిభను కనబరచగలనని అనుకోవడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో పోటీ పడటం ఒక అమ్మాయికి చాలా కష్టం. ఈ పరిస్థితిని అనుభవిస్తున్న ఏ క్రీడాకారుడైనా నా ఆవేదనను అర్థం చేసుకోగలరు"
భద్రత గురించి ప్రస్తావిస్తూ.. "ఒకవేళ నేను ఆ పోటీలకు వెళ్తే, నా టీమ్, నా శ్రేయోభిలాషులు కూడా నాతో వస్తారు. అక్కడ ఎవరికైనా ఏదైనా ప్రమాదం జరిగితే దానికి నేరుగా భారత ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది" అని అన్నారు.
"నేను నా కోసం ఎలాంటి ప్రత్యేక సదుపాయాలు లేదా ప్రత్యేక గౌరవం కోరుకోవడం లేదు. మ్యాట్‌పై ఇచ్చే తీర్పు కేవలం ప్లేయర్ కష్టం మీద ఆధారపడి ఉండాలి తప్ప, ఒక గూండా లేదా రౌడీ ఇష్టానుసారం కాదు. ఆయనకు నచ్చిన వారిని గెలిపిస్తారు, ఇష్టం లేని వారిని ఓడిస్తారు."

ఫొటో సోర్స్, Vipin Kumar/Hindustan Times via Getty Images
'భద్రతకు నాది గ్యారెంటీ'
ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం.. వినేశ్ ఫొగాట్ వ్యాఖ్యలపై డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు సంజయ్ సింగ్ స్పందించారు. వినేశ్ భద్రతకు తాను 'వ్యక్తిగతంగా గ్యారెంటీ' ఇస్తున్నానని ఆయన ప్రకటించారు. అయితే, ఆమె కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా అని గుర్తు చేస్తూ, ఈ అంశాన్ని రాజకీయం చేయకూడదని పేర్కొన్నారు.
సంజయ్ సింగ్ ఆ పత్రికతో మాట్లాడుతూ.. "వినేశ్ భద్రత విషయంలో నేను వ్యక్తిగతంగా హామీ ఇస్తున్నాను. డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడిగా ఆమెకు, ఆమె బృందానికి గోండాలో పూర్తి రక్షణ ఉంటుందని భరోసా ఇస్తున్నాను. వారి భద్రతను నేనే స్వయంగా పర్యవేక్షిస్తాను. దయచేసి వచ్చి మ్యాట్‌పై మీ అత్యుత్తమ ప్రదర్శన కనబరచండి" అని కోరారు.
"ఆమె రాజకీయం చేయాలనుకుంటే అది ఆమె ఇష్టం. ఈ వ్యవహారం కోర్టులో ఉంది కాబట్టి, నేను దానిపై వ్యాఖ్యానించను. నిజం ఏమిటో బయటకు రానివ్వండి" అని సంజయ్ సింగ్ అన్నారు.
గోండాలో జరిగే నేషనల్ ఓపెన్ ర్యాంకింగ్ టోర్నమెంట్ కోసం సుమారు 1200 ఎంట్రీలు వచ్చాయని, అందులో 800 మంది హరియాణా రెజ్లర్లే ఉన్నారని సంజయ్ సింగ్ వెల్లడించారు. వీరిలో మరెవరూ ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదని ఆయన అన్నారు.
పక్షపాత రెఫరీల గురించి వినేశ్ వ్యక్తం చేసిన ఆందోళనపై సంజయ్ సింగ్ స్పందిస్తూ.. "ఈ పోటీల కోసం ఎంపికయ్యే రెఫరీలందరూ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, భారత ఒలింపిక్ సంఘం ప్యానల్ నుంచి ఉంటారు. ఈ ఎంపిక ప్రక్రియ పూర్తిగా నిష్పక్షపాతంగా జరుగుతుంది. రెఫరీల ఎంపికలో బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు గానీ, నాకు గానీ ఎటువంటి సంబంధం ఉండదు" అని చెప్పారు.

ఫొటో సోర్స్, Arun THAKUR / AFP) (Photo by ARUN THAKUR/AFP via Getty Images
లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా పోరాటం
డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై 2023లో లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. కొందరు భారతీయ రెజ్లర్లు నిరసనలు కూడా చేపట్టారు. అయితే, బ్రిజ్ భూషణ్ ఈ ఆరోపణలను మొదటి నుంచి తిరస్కరిస్తూనే ఉన్నారు.
ఈ నిరసనల క్రమంలో రెజ్లర్లు బజరంగ్ పునియా, వినేశ్ ఫొగాట్ తమకు లభించిన ప్రభుత్వ పురస్కారాలైన 'ఖేల్ రత్న', 'అర్జున' అవార్డులను దిల్లీలోని కర్తవ్య పథ్ వద్ద వదిలివెళ్లారు. వాటిని ప్రధాన మంత్రికి అందజేయాలని వారు దిల్లీ పోలీసులను కోరారు.
గత సంవత్సరం మే నెలలో బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై నమోదైన 'పోక్సో' కేసును కొట్టివేస్తున్నట్లు దిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు తెలిపింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



























