India A vs Sri lanka A: వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్, శ్రీలంక టార్గెట్ 378

ఫొటో సోర్స్, Getty Images
శ్రీలంకలో జరుగుతున్న ముక్కోణపు వన్డే సిరీస్ ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంక 'ఏ' జట్టుపై భారత 'ఏ' జట్టు ఆటగాడు వైభవ్ సూర్యవంశీ 11 బంతుల్లోనే అర్ధశతకం సాధించాడు. దీని ద్వారా లిస్ట్ 'ఏ' క్రికెట్‌లో అత్యంత వేగంగా అర్ధశతకం చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
భారత్, శ్రీలంక, అఫ్గానిస్తాన్ దేశాల 'ఏ' జట్లు తలపడుతున్న ముక్కోణపు సిరీస్ శ్రీలంకలో జరుగుతోంది. లీగ్ రౌండ్ ముగిసే సమయానికి మొదటి రెండు స్థానాల్లో నిలిచిన శ్రీలంక ఏ(6 పాయింట్లు), భారత్ ఏ(4 పాయింట్లు) జట్లు దంబుల్లా అంతర్జాతీయ మైదానంలో ఆదివారం ఫైనల్ మ్యాచ్ ఆడుతున్నాయి.
టాస్ గెలిచిన శ్రీలంక 'ఏ' జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత 'ఏ' జట్టు తరఫున ప్రియాంశ్ ఆర్య, వైభవ్ సూర్యవంశీ ఓపెనర్లుగా దిగారు. ప్రారంభం నుంచే దూకుడు ప్రదర్శించిన వైభవ్ సూర్యవంశీ మొదటి ఓవర్లో తాను ఎదుర్కొన్న మొదటి రెండు బంతులను బౌండరీలుగా మలిచాడు.
ఆ తర్వాత మూడో ఓవర్లో మళ్లీ స్ట్రైక్ తీసుకున్న వైభవ్ మొదటి బంతిని బౌండరీకి, తర్వాతి రెండు బంతులను సిక్సర్లు కొట్టాడు. శ్రీలంక బౌలర్ మొహమ్మద్ సిరాజ్ వేసిన మూడో ఓవర్లోనే 2 బౌండరీలు, 3 సిక్సర్లతో 26 పరుగులు రాబట్టాడు.

లిస్ట్ 'ఏ'లో ప్రపంచ రికార్డు
ఇక ఆ తర్వాత, నాలుగో ఓవర్లో వరుసగా ఒక బౌండరీ, 2 సిక్సర్లు కొట్టిన వైభవ్ సూర్యవంశీ 11 బంతుల్లోనే తన అర్ధశతకం సాధించాడు.
వైభవ్ సూర్యవంశీ ఎదుర్కొన్న మొదటి 11 బంతుల్లో ఒకే డాట్ బాల్ ఉంది. దీని ద్వారా లిస్ట్ 'ఏ' క్రికెట్ మ్యాచుల్లో అత్యంత వేగంగా అర్ధశతకం చేసిన ఆటగాడిగా వైభవ్ సూర్యవంశీ ప్రపంచ రికార్డు సృష్టించాడు.
అంతకుముందు, 2006లో శ్రీలంకకు చెందిన కౌసల్య వీరరత్నే 12 బంతుల్లో సాధించిన అర్ధశతకం ప్రపంచ రికార్డుగా ఉండేది.
ఆ తర్వాత కూడా రన్ రేట్ ఏమాత్రం తగ్గించకుండా ఆడిన వైభవ్ సూర్యవంశీ 29 బంతుల్లో 94 పరుగులు చేసి ఔటయ్యాడు. 9వ ఓవర్ ఐదో బంతికి వైభవ్ ఔట్ అయ్యే సమయానికి భారత స్కోరు 132 పరుగులుగా ఉంది. ఈ మ్యాచ్‌లో వైభవ్ 10 బౌండరీలు, 8 సిక్సర్లు కొట్టాడు.

ఫొటో సోర్స్, Getty Images
వైభవ్ ఆధిపత్యం చెలాయించే ఫార్మాట్: సంజయ్
వైభవ్ ఆటపై భారత మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ ఎక్స్ పోస్టులో "50 ఓవర్ల క్రికెట్‌ను వైభవ్ తాను ఆధిపత్యం చెలాయించగల ఫార్మాట్‌గా భావిస్తున్నాడని ఇప్పుడే గ్రహించాను. ఎందుకంటే, ఇందులో 10 ఓవర్ల పాటు 'సర్కిల్' వెలుపల ఆరుగురు ఫీల్డర్లకు బదులుగా ఇద్దరు మాత్రమే ఉంటారు" అని తెలిపారు.
మొదటి ఇన్నింగ్స్ ముగిసే సమయానికి భారత జట్టు 9 వికెట్ల నష్టానికి 377 పరుగులు చేసింది. కెప్టెన్ తిలక్ వర్మ 90 బంతుల్లో 67 పరుగులు చేశాడు. రుతురాజ్ గైక్వాడ్ 51 బంతుల్లో 40 పరుగులు చేశాడు. చివర్లో అనుకుల్ రాయ్ మెరుపు ఇన్సింగ్స్ ఆడి 15 బంతుల్లో 39 పరుగులు చేశాడు.
శ్రీలంక తరఫున వనుజ సహాన్, రవిందు ఫెర్నాండో, గుగదాస్ మదులన్ తలో 2 వికెట్లు తీశారు. ఫైనల్లో శ్రీలంక జట్టుకు భారత్ 378 పరుగుల లక్ష్యాన్ని ఇచ్చింది.
(ఈ స్టోరీ అప్‌డేట్ అవుతోంది).
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




























