రాత్రివేళ ఎక్కువ సార్లు మూత్రవిసర్జన అనారోగ్యానికి సంకేతమా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఓంకార్ కరంబేల్కర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 8 నిమిషాలు
రాత్రిలో ఒకసారి మూత్రవిసర్జనకు నిద్రలేవడం సాధారణమని చాలా మంది భావిస్తారు. నిద్రపోయేముందు ఎక్కువగా నీళ్లు తాగడం వల్లే ఇలా జరుగుతుందని వారు తరచూ అనుకుంటారు.
కానీ, ఇది ఒక అలవాటుగా మారి, ప్రతి రాత్రి రెండు లేదా మూడు సార్లు నిద్రలేవాల్సి వస్తే, దానిని నిర్లక్ష్యం చేయకూడదు.
వైద్య పరిభాషలో దీన్ని నాక్టూరియా అంటారు. ఇది మన శరీరంలో ఏదో సమస్య ఉందని తెలిపే ఒక హెచ్చరిక.
చాలామంది పురుషులు తమ వయసు కారణంగా ఈ సమస్య తలెత్తుతోందనుకుంటారు. అందుకే, ఈ సమస్యకు చికిత్స తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ, రాత్రివేళ మూత్ర విసర్జన కోసం తరచూ నిద్ర లేవడం వల్ల, తెల్లవారిన తరువాత అసలు నిద్రపోనట్టుగా అనిపిస్తుంది. అలసట పెరుగుతుంది. రోజంతా చికాకుంగా ఉంటుంది.

ఎంతసేపు నిద్రపోతున్నాం, ఎంత గాఢ నిద్రపోతున్నామనే అంశాలు ఆరోగ్యానికి సంబంధించి అనేక అంశాలతో ముడిపడి ఉంటాయి.
రాత్రివేళ ఎక్కువగా నీరు తాగడం, కాఫీ,టీలు, అల్కాహాల్ సేవనం లాంటి సాధారణ కారణాలు కూడా కొన్నిసార్లు మన నిద్రను ప్రభావితం చేస్తాయి.
కానీ, తరచూ ఇది ప్రోస్టేట్ సమస్య, మూత్రనాళాల ఇన్ఫెక్షన్లు, మూత్రాశయ అతిచురుకుదనం, లేదా మధుమేహంలాంటి ఆరోగ్య పరిస్థితులతో సంబంధం ఉండొచ్చు. అందుకే రాత్రివేళ తరచూ మూత్రవిసర్జన జరగడాన్ని శరీరం ఇచ్చే హెచ్చరికగా భావించడం చాలా అవసరం. సకాలంలో పరీక్షలు చేయించుకుని కారణం తెలుసుకుంటే, తీవ్రమైన అనారోగ్య సమస్యలను నివారించవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
రాత్రివేళ తరచూ మూత్రవిసర్జన దేనికి సంకేతం?
రాత్రివేళ నిద్రలేచి తరచూ మూత్రవిసర్జనకు వెళ్లడం కేవలం మూత్రాశయానికి సంబంధించిన సమస్య మాత్రమే కాదు.
ఇందులో మూత్రపిండాలు, మూత్రాశయం, హార్మోన్లు, మనం నిద్రపోయే విధానాలు కూడా ఉంటాయి. ఈ వ్యవస్థలలో సమతుల్యం దెబ్బతిన్నప్పుడు, పదేపదే మూత్రవిసర్జన కోసం నిద్రలేవాల్సి వస్తుంది.
పురుషుల్లో ప్రొస్టేట్ గ్రంథి పెరగడం ఈసమస్యకు అతిపెద్ద కారణాలలో ఒకటి.
ప్రోస్టేట్ గ్రంథి పెరిగినప్పుడు, అది మూత్రనాళంపై ఒత్తిడిని కలిగిస్తుంది. మూత్రం పూర్తిగా బయటకు రాదు. దీనివల్ల మూత్రాశయం త్వరగా నిండిపోయి, ముఖ్యంగా రాత్రివేళ తరచూ మూత్రవిసర్జన చేయాలనిపిస్తుంటుంది.
పైగా, కొన్నిసార్లు రాత్రిపూట శరీరం మరింత మూత్రాన్ని ఉత్పత్తి చేస్తుంది. డీహైడ్రేషన్, మందులు, మధుమేహం వంటి ఆరోగ్య పరిస్థితులు ఉన్నప్పుడు ఇలా జరుగుతుంది.
కొందరి పురుషుల్లో ఓవర్‌యాక్టివ్ బ్లాడర్ కూడా పదేపదే మూత్ర విసర్జన చేయాలనే భావనను పెంచుతుంది. మూత్రాశయం పూర్తిగా నిండకపోయినా ఈ భావన కలుగుతుంటుంది.
స్లీప్ అప్నియా వంటి నిద్ర సంబంధిత సమస్యల వల్ల కూడా ఈ లక్షణం ఏర్పడవచ్చు. తరచూ, అనేక కారణాలు ఒకే సమయంలో పనిచేస్తుంటాయి.
అందువల్ల, ఈ సమస్యను 'సాధారణమైనది'గా భావించకుండా, దానికి కచ్చితమైన కారణాన్ని కనుక్కోవడం అవసరం.
సరైన కారణాన్ని అర్థం చేసుకోవడం వల్ల చికిత్స కూడా ప్రభావవంతంగా ఉంటుంది, నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
ఏమిటీ నాక్టూరియా?
మెలకువగా ఉన్నప్పుడు మూత్రవిసర్జన చేయాలనిపించడానికీ, నాక్టూరియాకూ మధ్య తేడా ఉంది. నాక్టూరియాలో, మూత్రవిసర్జన చేయాలనే భావన విపరీతంగా కలగడం ఒక వ్యక్తిని నిద్ర నుంచి మేల్కొనేలా చేస్తుంది.
ముఖ్యంగా నిద్రపోయే ముందు ఎక్కువగా నీళ్ళు తాగినట్లయితే ఆరోగ్యంగా ఉన్న చాలామంది పెద్దవారు రాత్రికి ఒకసారి మేల్కోవచ్చు.
అయితే, రోజూ రెండూ లేదా అంతకంటే ఎక్కువ సార్లు మేల్కొనడం సాధారణమైనది కాదు. ఇది మీ నిద్ర నాణ్యతపై, రోజువారీ కార్యకలాపాలపై, మొత్తం ఆరోగ్యంపై ప్రభావం చూపడం ప్రారంభిస్తే, వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
నాక్టూరియా ఒక వ్యాధి కాదు. ఇదొక లక్షణం. మూత్రవిసర్జన వ్యవస్థ, మెటబాలిజం, కిడ్నీలు, గుండె లేదా నిద్రకు సంబంధించి కొన్ని అంతర్గత సమస్యలను ఇది సూచిస్తుంది.
నలభైల్లోనో, యాభైల్లోనో ఉన్న పురుషులు రాత్రిపూట తరచూ ఎందుకు మూత్రవిసర్జనకు వెళ్తుంటారని ముంబయిలోని జస్లోక్ హాస్పిటల్, రీసర్చ్ సెంటర్ యూరాలజీ డిపార్ట్‌మెంట్ కన్సల్టెంట్ డాక్టర్ సంతోష్ గ్వావ్లీని అడిగాం.
"వయసు పెరిగే కొద్దీ రాత్రివేళ మూత్రవిసర్జన సమస్య సర్వసాధారణం అవుతుంది. నలభై-యాభై ఏళ్ల వయసు తర్వాత శరీరంలో అనేక మార్పులు వస్తుంటాయి. దీనివల్ల నాక్టూరియా (రాత్రిపూట మూత్రవిసర్జన) వచ్చే అవకాశాలు పెరుగుతాయి" అని చెప్పారు.
''దీనికి ప్రధాన కారణాల్లో ప్రొస్టేట్ గ్రంథి సాగడం ఒకటి. దీన్నే బెనైన్ ప్రొస్టాటిక్ హైపర్‌ప్లాసియా (బీపీహెచ్) అని పిలుస్తారు. ప్రొస్టేట్ సాగినప్పుడు, మూత్రనాళంపై కొంత ఒత్తిడి పెరుగుతుంది. ఇది మూత్ర ప్రవాహానికి ఆటంకం కలిగిస్తుంది. ఫలితంగా, మూత్రాశయం పూర్తిగా ఖాళీ అవ్వదు" అని తెలిపారు.
పైగా, మూత్రాశయం కండరాలు కూడా వయసును బట్టి మారుతూ ఉంటాయి. మూత్రాశయం సున్నితంగా మారుతుంది. దీనివల్ల కొద్ది మొత్తంలో మూత్రం ఉన్నా, మూత్ర విసర్జన చేయాలనే భావన కలగవచ్చు.
అలాగే శరీరంలో హార్మోన్ల సమతుల్యత కూడా వయసు కారణంగా మారుతుంటుంది. దీనివల్ల రాత్రిపూట ఎక్కువ మూత్రం ఉత్పత్తి కావచ్చు. మధుమేహం, అధిక రక్తపోటు, కిడ్నీ సమస్యలు, ఊబకాయం, గుండె సంబంధిత వ్యాధి, నిద్ర రుగ్మతలు అన్నీ కూడా వయసుతో మరింత సాధారణంగా మారి, నాక్టూరియాకు దారితీయచ్చు అని తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
నాక్టూరియా ఉంటే ప్రోస్టేట్ సమస్య ఉన్నట్టేనా?
నాక్టూరియా లక్షణం ఉంటే, తప్పనిసరిగా ప్రోస్టేట్ వ్యాధి ఉన్నట్లేనా? అనే ప్రశ్నకు సమాధానమిచ్చిన డాక్టర్ సంతోష్ గావ్లీ... "రాత్రిపూట తరచూ మూత్ర విసర్జన చేయడం అంటే ఆటోమేటిక్‌గా ప్రోస్టేట్ సమస్య ఉన్నట్లే అని చాలా మంది అనుకుంటారు. కానీ ఇది ఎప్పుడూ నిజం కాదు" అని తెలిపారు.
వయసు పెరగడం వల్ల ప్రోస్టేట్ గ్రంథి సాగడం ఒక ప్రధాన కారణం అయినప్పటికీ, ఇలాంటి లక్షణాలు అనేక ఇతర వ్యాధుల వల్ల కూడా కనిపించవచ్చని చెప్పారు.
వాటిల్లో కొన్ని వ్యాధులు..
- మధుమేహం
- మూత్రనాళ ఇన్ఫెక్షన్ (యూటీఐ)
- ఓవర్‌యాక్టివ్ బ్లాడర్
- కిడ్నీ వ్యాధి
- గుండె సమస్య (హార్ట్ ఫెయిల్యూర్)
- స్లీప్ అప్నియ (నిద్ర సంబంధిత రుగ్మత)
- పార్కిసన్స్ లేదా స్ట్రోక్ వంటి నాడీ సంబంధిత వ్యాధులు
- కొన్నిరకాల మందులు
- నిద్రకు ముందు ఎక్కువగా నీరు తాగడం
కొందరి పురుషులలో ప్రొస్టేట్ సైజు సాధారణంగా ఉన్నప్పటికీ.. ఓవర్‌యాక్టివ్ బ్లాడర్ ఉండొచ్చు. కాబట్టి లక్షణాలు ఒకేలా ఉన్నప్పటికీ, కారణం వేరుగా ఉండవచ్చు.
అందుకే చికిత్స సమయంలో కేవలం ప్రోస్టేట్‌పైనే దృష్టి పెట్టకుండా, అసలు కారణాన్ని కనుక్కోవడం ముఖ్యం. సరైన కారణం తెలిసినప్పుడే చికిత్స ప్రభావవంతంగా ఉంటుందని తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
ఓవర్‌యాక్టివ్ బ్లాడర్ అంటే ఏంటి?
ఓవర్‌యాక్టివ్ బ్లాడర్ అనేది ఒక సమస్య. దీనిలో మూత్రాశయం అతి చురుకుగా మారుతుంది. దీనివల్ల రాత్రింబవళ్లు పదేపదే మూత్రవిసర్జనకు వెళ్లడం, అకస్మాత్తుగా, ఎక్కువగా మూత్రవిసర్జన చేయాలనే భావన కలగడం వంటివి ఉంటాయి.
నాక్టూరియా కూడా ఒక సాధారణ లక్షణం. దీనిలో రోగి రాత్రిపూట మూత్రవిసర్జన కోసం పదేపదే నిద్రలేవాల్సి వస్తుంది. ఈ లక్షణాలన్నీ ఒకేసారి కనిపించినప్పుడు, దాని వెనుక తరచుగా స్పష్టమైన శారీరక సమస్య కారణంగా ఉంటుంది.
చాలా అరుదైన సందర్భాల్లోనే.. ప్రొస్టేట్ గ్రంథి లేదా ఇతర అడ్డంకులు ఏమీ లేనప్పుడు 'ప్రైమరీ ఓవర్‌యాక్టివ్ బ్లాడర్' కలుగుతుంది. ముఖ్యంగా మహిళలలో ఇది సాధారణంగా కనిపిస్తుంది.
వయసు పెరుగుతోందని చెప్పడానికి నాక్టూరియా ఒక సంకేతమా? అని నావీ ముంబయిలోని ఫోర్టిస్ హిరానందని ఆస్పత్రికి చెందిన రోబోటిక్ సర్జరీ, యూరో ఆంకాలజీ, యూరాలజీ డైరెక్టర్ డాక్టర్ సౌమ్యన్ డేని అడిగాం.
"వయసును బట్టి కొన్నిసార్లు రాత్రిపూట మూత్ర విసర్జన చేయడం సాధారణంగా పరిగణించవచ్చు. రాత్రిపూట ఒకటి లేదా రెండుసార్లు మూత్రవిసర్జన చేయాల్సి రావడానికి శారీరక లేదా వయస్సు సంబంధిత కారణం ఉంటే, అది సాధారణ విషయమే. అయితే, మీరు తరచుగా మూత్రవిసర్జన చేయాల్సి వస్తుంటే, దానికి సాయంత్రం వేళల్లో ఎక్కువగా ద్రవాలు తీసుకోవడం కారణం కావచ్చు. లేదా అది వేరే ఏదైనా ఆరోగ్య సమస్యకు లక్షణం కూడా కావచ్చు" అని చెప్పారు.
అయితే ఇక్కడ ప్రశ్నేంటంటే.. సాధారణ నీరు తాగడం వల్ల కలిగే మూత్రవిసర్జనకూ, ఏదైనా అనారోగ్య సమస్య వల్ల కలిగే మూత్రవిసర్జనకూ మధ్య తేడాను ఎలా గుర్తించాలి? అనే ప్రశ్నను డాక్టర్ సౌమ్యన్ డేని అడిగాం.
"తాగే నీరు లేదా ఆహారపు అలవాట్ల వల్ల రాత్రిపూట మూత్రవిసర్జన జరగడానికీ, ఏదైనా వైద్య సమస్య వల్ల జరగడానికీ మధ్య తేడాను గుర్తించడానికి అత్యంత ముఖ్యమైన మార్గం ఏమిటంటే.. నిద్రపోవడానికి ముందు రెండు గంటల పాటు ద్రవపదార్థాల సేవనం ఆపాలి. ఆ తర్వాత మూత్రవిసర్జన చేయాలనే భావన తగ్గుతోందో లేదా ఆగిపోతుందో గమనించుకోవాలి. ఇది ఒక సులభమైన పరీక్ష, ప్రథమ చికిత్స కూడా" అని డాక్టర్ సౌమ్యన్ తెలిపారు.
''దీంతో పాటు, కొన్ని ప్రాథమిక పరీక్షలు చేయించుకోవడం అవసరం. ఉదాహరణకు, మూత్ర నాళాల ఇన్ఫెక్షన్ ఉందో లేదో తనిఖీ చేయడానికి సాధారణ మూత్ర పరీక్ష చేయించుకోవచ్చు. అలాగే, మూత్రవిసర్జన తర్వాత మూత్రాశయంలో ఎంత యూరిన్ మిగిలి ఉందో చూడటానికి సోనోగ్రఫీని ఉపయోగించవచ్చు. ఇవి కాకుండా, ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ (పీఎస్ఏ) పరీక్ష, యూరోఫ్లోమెట్రీ కూడా చేస్తారు. ఈ పరీక్షలు మూత్ర ప్రవాహం గురించి సమాచారాన్ని అందిస్తాయి. ప్రోస్టేట్ లేదా మరేదైనా శారీరక సమస్య ఉందో లేదో గుర్తిస్తాయి. ఈ పరీక్షలన్నింటి ఆధారంగా, సాధారణ కారణాలు, వైద్యపరమైన సమస్యల మధ్య స్పష్టమైన వ్యత్యాసాన్ని గుర్తించవచ్చు'' అని డాక్టర్ సౌమ్యన్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
నాక్టూరియాకు జీవనశైలికి సంబంధమెలా?
చాలా మంది రోగులలో రాత్రిపూట తరచూ మూత్రవిసర్జన చేయడంలో జీవనశైలికి సంబంధించిన అలవాట్లు ప్రధాన పాత్ర పోషిస్తాయి.
సాయంత్రం వేళ ఎక్కువ మొత్తంలో నీరు, టీ, కాఫీ, శీతల పానీయాలు, ఎనర్జీ డ్రింక్స్ లేదా మద్యం సేవించడం వల్ల రాత్రిపూట మూత్ర ఉత్పత్తి ఎక్కువగా పెరగవచ్చు.
యాంటీడైయూరెటిక్ హార్మోన్‌ను ఆల్కహాల్ అణచివేస్తుంది. ఈ హార్మోన్ శరీరం నీటిని నిలుపుకోవడానికి సహాయపడుతుంది. అందుకే, ఆల్కహాల్ తాగడం వల్ల రాత్రిపూట ఉత్పత్తి చేసే మూత్రం పరిమాణం పెరుగుతుంది.
ఇది మాత్రమే కాక.. మరికొన్ని ఇతర అంశాలు కూడా నాక్టూరియాను పెంచుతాయి..
- రాత్రిపూట ఎక్కువగా ఆహారం తినడం
- ఊబకాయం
- ధూమపానం
- నిద్ర అలవాట్లు సరిగ్గా లేకపోవడం
- శారీరక కార్యకలాపాలు లోపించడం
కొందరు వ్యక్తుల్లో జీవనశైలి విధానాలను మార్చుకోవడం ద్వారా ఈ సమస్యను మెరుగుపర్చుకోవచ్చు.
దీనికి ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలని డాక్టర్ సౌమ్యన్ డేని అడిగినప్పుడు, ''రోగి కచ్చితంగా 24 గంటల బ్లాడర్ డైరీని (యూరిన్ రికార్డు) ఇంట్లోనే నిర్వహించుకోవాలి. యూరిన్ టెస్ట్, సీరం క్రియాటినైన్, సీరం ఎలక్ట్రోలైట్లను చేయించుకోవాలి.
హెచ్‌బీఏ1సీ టెస్ట్ ద్వారా దీర్ఘకాలిక బ్లడ్ షుగర్ కంట్రోల్‌ను చెక్ చేయచ్చు. అంతేకాక, మూత్రవిసర్జన తర్వాత మూత్రాశయంలో ఎంత మూత్రం మిగిలి ఉందో కొలవడానికి అబ్డామినల్ సోనోగ్రఫీ చేస్తారు. ఇది కాకుండా, యూరోఫ్లోమెట్రీ, సీరం పీఎస్ఏ పరీక్షలు కూడా ప్రాథమిక పరీక్షలో భాగంగా ఉంటాయి" అని సౌమ్యన్ డే చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
దీనికెలాంటి చికిత్స ఉంది?
నాక్టూరియాకు చికిత్స అది దేని వల్ల వచ్చిందనే దానిపై ఆధారపడి ఉంటుందని డాక్టర్ సంతోష్ గ్వావ్లీ చెప్పారు.
''ఒకవేళ ప్రొస్టేట్ గ్రంథి సాగితే, ప్రొస్టేట్ కండరాలు లేదా దాని సైజును తగ్గించేందుకు మందులు ఇస్తారు. కొన్ని తీవ్రమైన కేసుల్లో.. సర్జరీ అవసరం పడుతుండొచ్చు. మూత్రాశయ సంకోచాలను తగ్గించే మందులు ఓవర్‌యాక్టివ్ బ్లాడర్‌కు ప్రభావవంతంగా పనిచేస్తాయి" అని ఆయన అన్నారు.
''ఒకవేళ మధుమేహం దీనికి కారణమైతే, బ్లడ్ షుగర్‌ను నియంత్రించడం వల్ల లక్షణాలను మెరుగుపర్చుకోవచ్చు. మూత్రనాళ ఇన్ఫెక్షన్లకు యాంటిబయోటిక్స్ వాడాలి. స్లీప్ అప్నియా వంటి ఆరోగ్య పరిస్థితులుంటే.. సీపీఏపీ థెరపీ వంటి ప్రత్యేక చికిత్స తీసుకోవాలి. రాత్రిపూట ఎక్కువగా మూత్రవిసర్జనకు వెళ్తుంటే, వైద్యుని పర్యవేక్షణలో కొన్ని మందులను వాడొచ్చు. సానుకూల విషయం ఏమిటంటే, నాక్టూరియాకు సంబంధించిన చాలా కేసులకు చికిత్స చేయవచ్చు. సరైన రోగ నిర్ధరణ జరిగిన తర్వాత చాలా మంది రోగుల లక్షణాలలో గణనీయమైన మెరుగుదల కనిపించింది" అని తెలిపారు.
మీ శరీరాన్ని, లక్షణాలను వైద్యునితో సరిగ్గా పరీక్షించుకుని, వారి సలహాతో మాత్రమే జీవనశైలి మార్పులు చేసుకోవడం మంచిది. వైద్యుడిని సంప్రదించకుండా సొంతంగా చికిత్స చేసుకోవడం ప్రమాదకరం.
(ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏవైనా సమస్యలుంటే మీ వైద్యుడిని సంప్రదించండి)
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























