పాములా బుస కొట్టే బొద్దింకలు.. వీటిని ఎందుకు పెంచుతున్నారు?

అక్రమ విదేశీ బొద్దింకలు, ఆస్ట్రేలియా అధికారులు స్వాధీనం

ఫొటో సోర్స్, Supplied: DCCEEW

ఫొటో క్యాప్షన్, ప్రపంచంలోని అతి పెద్ద బొద్దింక జాతులలో మడగాస్కర్ హిస్సింగ్ కాక్రోచెస్ ఒకటి.
    • రచయిత, లానా లామ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 3 నిమిషాలు

న్యూ సౌత్ వేల్స్‌లోని ఒక కమర్షియల్ బ్రీడర్ (పెంపకందారు) నుంచి లక్షకు పైగా విదేశీ బొద్దింకలను ఆస్ట్రేలియా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో కొన్ని అరచేతి పరిమాణంలో ఉన్నాయి.

సిడ్నీకి పశ్చిమంగా 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాథర్స్ట్‌లోని ఒక పెంపకందారు వద్ద దొరికిన ఈ బొద్దింకల విలువ సుమారు రూ.1.35 కోట్లు(2 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్లు) ఉంటుందని అంచనా.

స్వాధీనం చేసుకున్న వాటిలో మడగాస్కర్ హిస్సింగ్ కాక్రోచెస్, దుబియా కాక్రోచెస్ ఉన్నాయి.

ఈ రెండు జాతులను ఆస్ట్రేలియాలోకి చట్టబద్ధంగా దిగుమతి చేసుకోవడానికి గానీ, ఉంచడానికి గానీ, పెంచడానికి గానీ, విక్రయించడానికి గానీ అనుమతి లేదు.

వెన్నెముక లేని విదేశీ జీవులను ఇంత పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకోవడం ఇదే మొదటిసారని అధికారులు తెలిపారు.

ఇవి వ్యాధులను వ్యాప్తి చేయగలవని, స్థానిక వన్యప్రాణులకు, వ్యవసాయానికి హాని కలిగిస్తాయని చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఈ బొద్దింకలను ఏం చేస్తారు?

పెంపుడు సరీసృపాలకు తరచూ ఆహారంగా ఇచ్చే ఈ ఇల్లీగల్ కాక్రోచెస్‌ను అధికారులు చంపేయనున్నారు.

"విదేశీ బొద్దింకలను అక్రమంగా పెంచడం, వ్యాపారం చేయడం మేం గమనిస్తున్నాం. పెంపుడు జంతువుల వ్యాపార సంస్థలను, యజమానులను హెచ్చరిస్తున్నాం" అని వాతావరణ మార్పులు, ఇంధనం, పర్యావరణం, నీటి శాఖ ప్రతినిధి తెలిపారు.

"దుబియా, మడగాస్కర్ హిస్సింగ్ కాక్రోచెస్ వంటి విదేశీ బొద్దింకలను కలిగి ఉన్నట్లు, పెంచినట్లు లేదా వ్యాపారం చేసినట్లు తేలితే వాటిని స్వాధీనం చేసుకుంటాం. ఫెడరల్ చట్టం కింద మీరు జరిమానాలు ఎదుర్కోవలసి ఉంటుంది" అన్నారు.

సరీసృపాలను పెంచే వారు ఆహారం కోసం దుబియా బొద్దింకలను వాడటం ఆపేసి, చట్టబద్ధమైన ప్రత్యామ్నాయాలైన మిడతలు, చెక్క బొద్దింకలు వంటి వాటిని వినియోగించాలని ఆ ప్రతినిధి కోరారు.

అక్రమ విదేశీ బొద్దింకలు, ఆస్ట్రేలియా

ఫొటో సోర్స్, Supplied: DCCEEW

ఫొటో క్యాప్షన్, ఈ బొద్దింకలను పెంపుడు సరీసృపాల ఆహారంగా విక్రయించి ఉండవచ్చని అధికారులు చెబుతున్నారు.

బుసకొట్టే శబ్దం

ప్రపంచంలోని అతి పెద్ద బొద్దింక జాతులలో ఒకటైన 'మడగాస్కర్ హిస్సింగ్ బొద్దింకల'కు ఆ పేరు రావడానికి కారణం ఉంది. ఇవి అందరికీ వినపడేంత పెద్దగా బుసకొట్టే శబ్దాన్ని (హిస్సింగ్ సౌండ్) చేయగలవు.

ఈ వెన్నెముక లేని జీవులను సరీసృపాల ఆహారంగా ఆన్‌లైన్‌లో విక్రయించడాన్ని చూసినట్లు బాథర్స్ట్‌కు చెందిన పాములు పట్టే స్టెఫానీ లెస్సర్ చెప్పినట్లు ఆస్ట్రేలియన్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (ఏబీసీ) రిపోర్ట్ చేసింది.

"ఇవి చాలా పెద్దవిగా, దాదాపు అరచేతి పరిమాణంలో ఉండటం వల్లే ప్రజలు వీటిని పెంచుకుంటారు. పైగా ఇవి తక్కువ ఖర్చుతో కూడుకున్నవి కావచ్చు. చాలా చిన్నవిగా ఉండే చెక్క బొద్దింకలను ఒక్కో బల్లికి మూడు లేదా నాలుగు తినిపించడం కంటే, ఈ విదేశీ బొద్దింకను కేవలం ఒకటి ఇస్తే సరిపోతుంది" అని ఆమె ఏబీసీతో చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)