'మా టీచర్‌ను కాల్చినపుడు నేను ఆమె ముందే నిలబడి ఉన్నా'- థాయ్‌లాండ్ స్కూల్‌లో అసలేం జరిగింది?

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, జోనాథన్ హెడ్, థాన్యారత్ దోక్సోన్, టిఫానీ టర్న్‌బుల్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
- ప్రచురణ
- చదివే సమయం: 4 నిమిషాలు
థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్ శివార్లలోగల నోంతబురిలోని దేబ్‌సిరిన్ స్కూలులో జరిగిన కాల్పుల్లో కనీసం ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.
శుక్రవారం ఉదయం క్లాసులు జరుగుతుండగా 14 ఏళ్ల (9వ తరగతి) బాలుడు ఈ కాల్పులు జరిపాడు. మృతుల్లో ఉపాధ్యాయులతో పాటు బాలుడి తాతయ్య, అమ్మమ్మ కూడా ఉన్నారు.
ఈ దాడిలో 30 మందికి పైగా గాయపడగా, వారిలో 9 మంది పరిస్థితి విషమంగా ఉందని థాయ్‌లాండ్ ప్రధాని అనుతిన్ చార్న్‌విరాకుల్ వెల్లడించారు. ఇది ముందస్తు ప్రణాళికతో, స్పష్టమైన లక్ష్యంతో చేసిన దాడి అని ప్రధాని పేర్కొన్నారు. దాడికి పాల్పడిన బాలుడు కూడా మరణించాడని అధికారులు తెలిపారు.
కాల్పుల శబ్ధంతో భయాందోళనలకు గురైన విద్యార్థులు పాఠశాల ఆవరణ నుంచి బయటకు పరుగులు తీశారు.
ఒక ఏడో తరగతి విద్యార్థిని బీబీసీతో మాట్లాడుతూ, ‘‘ మా టీచర్ నాతో మాట్లాడుతుండగా అతను అక్కడికి వచ్చాడు. ఆమెను కాల్చినప్పుడు నేను ఆమె ముందే నిలబడి ఉన్నాను. తప్పించుకోవడానికి నేను, నా స్నేహితులు పాఠశాల గోడ దూకి పారిపోవాల్సి వచ్చింది" అని ఆ బాలిక చెప్పింది.
ఈ కాల్పులవల్ల తాను బతకనేమోనని, నిన్ను మళ్లీ చూడలేనని అనుకున్నానని తన కూతురు తనతో అన్నట్లు ఆ బాలిక తల్లి చెప్పారు.
పై అంతస్తు నుంచి బుల్లెట్లు నేలను తాకుతున్న శబ్ధాలు వినిపించాయని, తాను చనిపోవడం ఖాయమని భావించానని 17 ఏళ్ల మరో విద్యార్థిని చెప్పారు.
మొదట బాణసంచా కాలుస్తున్నారని అనుకున్నట్లు ఒక 18 ఏళ్ల విద్యార్థి రాయిటర్స్‌తో చెప్పారు.
"మొదట్లో అది తుపాకీ అనుకోలేదు. చాలాసార్లు డాంగ్ డాంగ్ డాంగ్ అని శబ్దాలు వచ్చాయి. ఆ తర్వాత కాసేపు నిశ్శబ్దం ఆవరించింది, మళ్లీ శబ్దాలు మొదలయ్యాయి" అన్నారు.


ఫొటో సోర్స్, Reuters

ఫొటో సోర్స్, AFP via Getty Images
ఘటనా స్థలంలో భయాందోళనలు
పాఠశాల గేట్లకు కొద్ది మీటర్ల దూరంలో, గుమిగూడిన జనాలు ఒకరినొకరు పట్టుకుని ఏడుస్తుండగా, పారామెడికల్ సిబ్బంది గాయపడిన వారిని అంబులెన్స్‌లలోకి ఎక్కించి ఆసుపత్రికి తరలించారు.
పిల్లలకు గాయాలయ్యాయని సమాచారం అందుకున్న రెస్క్యూ వర్కర్ కియాతిఖున్ వీరపోంగ్‌ప్రదిత్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు.
‘‘కాల్పుల్లో గాయపడిన విద్యార్థులను చూశా. కొందరికి చేతికి, కొందరికి వీపుపై, కొందరికి ఛాతీపై బుల్లెట్లు తగిలాయి. దాంతో నేను ముందుగా వారిని ఆసుపత్రికి తరలించడానికి సహాయం చేశా’’ అని 47 ఏళ్ల ఆ రెస్క్యూ వర్కర్ రాయిటర్స్ వార్తాసంస్థకు తెలిపారు.
అదే పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు ఒకరు తాను తన స్నేహితురాలైన ఉపాధ్యాయురాలిని కోల్పోయానని చెప్పారు.
"మేమిద్దరం విద్యార్థులుగా ఈ పాఠశాలలోనే కలిసి చదువుకున్నాం. ఇద్దరం ఇక్కడే ఉపాధ్యాయులుగా చేరాం’’ అని చెప్పారు.

ఫొటో సోర్స్, Reuters

ఫొటో సోర్స్, Reuters
బాలుడు ఉపయోగించిన 9ఎంఎం పిస్టల్ అతడి తాతయ్యదని, ఆయన కూడా ఉపాధ్యాయుడేనని పోలీసులు భావిస్తున్నారు. ఫోరెన్సిక్ అధికారులు పరిశీలించి, కాల్పులు చాలా కచ్చితత్వంతో జరిగాయని, బాధితుల శరీరాల్లోని ముఖ్యమైన భాగాలకు గాయాలయ్యాయని వెల్లడించారు.
విచారణ ప్రారంభ దశలోనే ఉండటంతో కాల్పుల వెనుక ఉన్న కారణం గురించి పోలీసులు ఇప్పటివరకు ఏమీ వెల్లడించలేదు.
ఆ బాలుడు మంచి విద్యార్థనీ, కూల్‌గా ఉండేవాడనీ, మంచి మార్కులు సాధించేవాడని పాఠశాల ఉపాధ్యాయుడు ఒకరు చెప్పారు. వీడియో గేమ్‌లు ఎక్కువగా ఆడతాడని విద్యాశాఖ అధికారులు తెలిపారు.
థాయ్‌లాండ్‌లో నిబంధనలు ఉన్నప్పటికీ ఆయుధాలు సంపాదించడం ఆ దేశలో సులభం. అక్కడ ఈ ఏడాది జరిగిన రెండో స్కూల్ షూటింగ్ ఘటన ఇది. ప్రస్తుతం దేబ్‌సిరిన్ పాఠశాల పరిసర ప్రాంతాలకు దూరంగా ఉండాలని ప్రజలను అధికారులు కోరారు.

ఫొటో సోర్స్, AFP via Getty Images
తుపాకీ సంస్కరణలకై మళ్లీ డిమాండ్లు
ఇది థాయ్‌లాండ్‌లో గడిచిన కొన్నేళ్లలో చోటుచేసుకున్న అత్యంత దారుణమైన ఘటన.
ఈ ఏడాది ఫిబ్రవరిలో దక్షిణ థాయ్‌లాండ్‌లోని ఒక పాఠశాలలో 18 ఏళ్ల దుండగుడు జరిపిన దాడిలో హెడ్ మాస్టర్‌తో పాటు ఒక విద్యార్థిని ప్రాణాలు కోల్పోయారు. నాలుగేళ్ల కిందట తూర్పు నాంగ్ బువా లాంఫు ప్రావిన్స్‌లో 34 ఏళ్ల వ్యక్తి ఒక నర్సరీలో జరిపిన కాల్పులు, కత్తి దాడిలో 37 మంది మరణించారు. వారిలో ఎక్కువమంది చిన్నపిల్లలే ఉన్నారు.
ఈ ఘోరాలు దేశంలో తుపాకీ నియంత్రణపై మళ్లీ అనేక ప్రశ్నలను లేవనెత్తాయి.
ప్రపంచంలోనే అత్యధికంగా తుపాకీ యాజమాన్య హక్కులు కలిగిన దేశాల్లో థాయ్‌లాండ్ ఒకటి. ఇక్కడ 70 లక్షల కంటే ఎక్కువ మంది వద్ద తుపాకులు ఉన్నాయని అంచనా. వారిలో 10 లక్షల కంటే ఎక్కువ మంది వద్ద సరైన లైసెన్సులు లేవు.
నాలుగు ఇతర దేశాలతో సరిహద్దులు కలిగి ఉండటం వల్ల ఇక్కడ బ్లాక్ మార్కెట్ ఎక్కువగా సాగుతోంది. పోలీసు, మిలిటరీ వ్యవస్థల్లో అవినీతి, సడలించిన నిబంధనల కారణంగా ఆయుధాలు తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి వెళ్తున్నాయి.
శుక్రవారం నాటి కాల్పుల ఘటనపై ప్రధాని అనుతిన్ చార్న్‌విరాకుల్ స్పందిస్తూ.. మూడేళ్ల కిందట తాను హోంమంత్రిగా ఉన్నప్పుడే నిబంధనలను కఠినతరం చేశానని, కొత్త తుపాకీ అనుమతులను నిలిపివేశానని తెలిపారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




























