ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్: మెటాకు మరోసారి సుమారు రూ.5,400 కోట్ల జరిమానా.. మెటా కంటెంట్‌ను ‘పబ్లిక్ న్యూసెన్స్’గా పేర్కొన్న జడ్జ్

సోషల్ మీడియా, మెటా, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్

ఫొటో సోర్స్, Reuters

    • రచయిత, కేలీ హేస్
    • హోదా, టెక్నాలజీ రిపోర్టర్
  • ప్రచురణ
  • చదివే సమయం: 4 నిమిషాలు

తమ ప్లాట్‌ఫామ్‌ల వల్ల చిన్నారులకు కలిగే హాని గురించి హెచ్చరించడంలో విఫలమైనందుకు మెటా సంస్థ మరో 567 మిలియన్ డాలర్లు(సుమారు 5,400 కోట్ల రూపాయలు) జరిమానా చెల్లించాలని న్యూమెక్సికోలోని అమెరికా న్యాయమూర్తి గురువారం ఆదేశాలు జారీ చేశారు.

బాలల భద్రతకు సంబంధించి ఆ సంస్థకు వ్యతిరేకంగా వచ్చిన తీర్పుల్లో బహుశా ఇది భారీ ఎదురుదెబ్బ.

సోషల్ మీడియా దిగ్గజం మెటాను వాయుకాలుష్యంతో పోల్చిన న్యాయమూర్తి బ్రియాన్ బిడ్‌షీడ్.. ఇది పబ్లిక్ న్యూసెన్స్‌ అని వ్యాఖ్యానించారు.

భవిష్యత్ నష్ట నివారణకు ఉద్దేశించిన నిధికి ఈ డబ్బును జమ చేయాలని ఆదేశించారు.

ఈ కేసులో ఇప్పటికే విధించిన 375 మిలియన్ డాలర్ల(సుమారు రూ.3,500 కోట్లు) జరిమానాకు ఇది అదనం. దీంతో మొత్తం జరిమానా 942 మిలియన్ డాలర్లకు (దాదాపు రూ.8,900 కోట్లు) చేరింది.

మెటాను ఒక కర్మాగారంతో పోల్చిన న్యాయమూర్తి బిడ్‌షీడ్, "ప్రకటనలు, కంటెంట్ దాని ఉత్పత్తులు కాగా.. మానసికపరంగా చిన్నారులకు కలిగే నష్టం, లైంగిక దోపిడీ వంటివి నివారించాల్సిన కాలుష్యం" అని పేర్కొన్నారు.

ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, వాట్సాప్, థ్రెడ్స్ ప్లాట్‌ఫామ్‌ల యజమాని అయిన మెటా సంస్థ అధికార ప్రతినిధి మాట్లాడుతూ, "మేం ఈ తీర్పుతో విభేదిస్తున్నాం, దీనిపై అప్పీల్‌‌కు వెళ్తాం" అని అన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

"మా ప్లాట్‌ఫామ్‌లలో యూజర్ల భద్రత కోసం మేం నిరంతరం శ్రమిస్తున్నాం. హానికరమైన వ్యక్తులను, హానికరమైన కంటెంట్‌ను తొలగించడంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడంలో మేం పారదర్శకంగా వ్యవహరించాం. ఆన్‌లైన్‌లో టీనేజర్ల రక్షణకు సంబంధించి మా పనితీరుపై మాకు పూర్తి నమ్మకముంది. నిజాలను తప్పుగా చూపే ఆరోపణల విషయంలో మేం మా వైఖరిని కొనసాగిస్తాం."

ఈ కేసులో గత 375 మిలియన్ డాలర్ల జరిమానా తీర్పు సమయంలోనూ మెటా ఇదే విధమైన వివరణ ఇచ్చింది, తీర్పుపై అప్పీల్‌కు వెళ్లనున్నట్లు తెలిపింది. బాలల భద్రతకు సంబంధించి ఒక రాష్ట్రం మెటాపై కేసు గెలవడం ఇదే మొదటిసారి.

ప్రస్తుతం, మెటా అమెరికాలో వేల సంఖ్యలో ఇదే తరహా కేసులను ఎదుర్కొంటోంది. న్యూమెక్సికోతో పాటు, ఈ ఏడాది ఆరంభంలో మెటా సంస్థ లాస్ ఏంజెల్స్‌లో మరో కేసులో కూడా ఓడిపోయింది.

న్యూ మెక్సికో కేసు 2023లో ఆ రాష్ట్ర అటార్నీ జనరల్స్ దాఖలు చేసిన వ్యాజ్యంతో మొదలైంది. మెటా ప్లాట్‌ఫామ్‌లు పిల్లలను ప్రమాదంలో పడేశాయని, వారికి లైంగికపరమైన కంటెంట్ అందుబాటులో ఉంచడంతో పాటు లైంగిక వేధింపులకు పాల్పడే వారితో పరిచయాలు ఏర్పడే పరిస్థితులు కల్పించాయని, అందుకు ఆ సంస్థదే బాధ్యతగా పరిగణించాలని వారు వాదించారు.

కేసు విచారణ మొదటి దశలో, రికమండేషన్ అల్గారిథమ్‌లు యువ వినియోగదారులను హానికరమైన కంటెంట్, హానికరమైన వ్యక్తులతో పరిచయాల దిశగా మళ్లించాయని, ఇది న్యూమెక్సికోలోని 'అన్‌ఫెయిర్ ప్రాక్టీసెస్ యాక్ట్'ను పదేపదే ఉల్లంఘించడమేనని తేలింది.

రికమండేషన్ అల్గారిథమ్‌లు అంటే, ఒక యూజర్ తమ ప్లాట్‌ఫామ్‌లలో ఏ కంటెంట్ చూడాలో అవే స్వయంగా నిర్ణయించే సాంకేతిక ఉపకరణాలు(టూల్స్).

విచారణ రెండో దశ తీర్పులో, మెటా వల్ల కలిగిన హాని పబ్లిక్ న్యూసెన్స్ స్థాయికి చేరుకుందని న్యాయమూర్తి బిడ్‌షీడ్ పేర్కొన్నారు. అంటే, ప్రజల ఆరోగ్యం, భద్రతకు సంబంధించిన సమస్య మరింత విస్తృతమై, సాధారణ ప్రజలపై ప్రతికూల ప్రభావం చూపుతోందన్నారు.

బాలల భద్రత విషయంలో మెటాకు ఇప్పటివరకు విధించిన అతిపెద్ద జరిమానా ఇదే. అంతేకాకుండా, ఒక సోషల్ మీడియా కంపెనీని పబ్లిక్ న్యూసెన్స్‌గా పరిగణించడం కూడా బహుశా ఇదే తొలిసారి.

"ఒక ఫ్యాక్టరీ నుంచి వెలువడే కాలుష్యం స్వచ్ఛమైన గాలిని పీల్చుకునే ప్రజల సాధారణ హక్కుకు ఎలా భంగం కలిగిస్తుందో, అలాగే మెటా ప్లాట్‌ఫామ్‌ల వల్ల పిల్లలపై పడే హానికర ప్రభావం కూడా ఆ ప్లాట్‌ఫామ్‌లకే పరిమితం కావు. ఆ ప్రభావం ఇంటర్నెట్ అంతటా వ్యాపించడమే కాకుండా ఆందోళనకర స్థాయిలో నిజజీవితాలకు కూడా విస్తరిస్తున్నాయి.

బాధిత చిన్నారులు, వారి కుటుంబాలు, పాఠశాలలు, ఆస్పత్రులు, చట్టాలు అమలు చేసే వ్యవస్థలపై కూడా తీవ్రమైన సామాజిక భారాన్ని మోపుతాయి, తీవ్రనష్టం కలిగిస్తాయి" అని న్యాయమూర్తి పేర్కొన్నారు.

సోషల్ మీడియా, మెటా, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్

ఫొటో సోర్స్, Getty Images

'ఇలాంటి తీవ్రమైన నష్టాల ప్రభావాన్ని తగ్గించేందుకు' ఈ నిధిని వినియోగించాలని న్యాయమూర్తి బిడ్‌షీడ్ తెలిపారు.

ఈ తీర్పు ప్రకారం, మొత్తం నిధిలో ప్రధాన భాగం దాదాపు 420 మిలియన్ డాలర్లను మెటా ప్లాట్‌ఫామ్‌ల వల్ల ఇప్పటికే జరిగిన నష్టనివారణ చికిత్సలకు వినియోగిస్తారు. అందుకోసం తగిన క్లినికల్ సేవలు, మానసిక ఆరోగ్య కార్యక్రమాలు, నిపుణుల కోసం వెచ్చిస్తారు.

మరో భాగాన్ని అవగాహన కార్యక్రమాలు, నివారణకు సంబంధించిన శిక్షణ కార్యక్రమాలకు వినియోగిస్తారు. సోషల్ మీడియా కారణంగా చిన్నారులపై పడే ప్రతికూల ప్రభావాన్ని ఎలా ఎదుర్కోవాలనే విషయమై ఉపాధ్యాయులు, ఆరోగ్య నిపుణులకు ఇచ్చే శిక్షణ కూడా ఇందులో భాగం.

అదనపు చర్యలకు ఆదేశాలు

అదనంగా, మరికొన్ని చర్యలు చేపట్టాలని కూడా న్యాయమూర్తి మెటాను ఆదేశించారు.

  • 18 ఏళ్లలోపు యూజర్ల అకౌంట్లను వయోజనులకు సిఫార్పు చేయకూడదు.
  • 18 ఏళ్లు దాటిన ఏ వ్యక్తీ ఆ వయసులోపు వ్యక్తులకు మెసేజ్‌లు పంపకుండా నిరోధించాలి.
  • మరీముఖ్యంగా, మైనర్లు నగ్న చిత్రాలను పంపడం, రిసీవ్ చేసుకోవడం నిషేధించాలి.
  • చిన్నారులపై లైంగిక దోపిడీకి పాల్పడే వారి కోసం వన్‌ స్ట్రైక్ పాలసీ వంటివి అమలు చేయాలి.
  • 18 ఏళ్లలోపు యూజర్లకు 'లైక్'ల సంఖ్య కనిపించకుండా చేయాలి.
  • మైనర్లకు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు పుష్ నోటిఫికేషన్లు నిలిపేయాలి. అలాగే, వారాంతాలు మినహా సాధారణ పనిదినాల్లో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పుష్ నోటిఫికేషన్లను నిషేధించాలి.
  • 18 ఏళ్లలోపు వారికి ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌ రెండూ కలిపి నెలకు గరిష్టంగా 90 గంటల వినియోగ పరిమితిని (రోజుకు సుమారు 3 గంటలు మాత్రమే) అమల్లోకి తీసుకురావాలి.

వచ్చేవారం, కాలిఫోర్నియాలో మెటాపై మరోకేసు విచారణ మొదలుకానుంది. పిల్లల ప్రైవసీ చట్టాలను ఉల్లంఘించినందుకు గానూ అమెరికాలోని దాదాపు 36 రాష్ట్రాల అటార్నీ జనరల్స్ మెటాపై కేసులు వేశారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)