ఉత్తరాంధ్ర: ఈ ప్రాంతం ఉన్నది తూర్పు తీరంలో, పిలిచేది మాత్రం వేరేలా, ఎందుకిలా?

ఆంధ్రప్రదేశ్, ఉత్తరాంధ్ర, విశాఖపట్నం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం
  • ప్రచురణ
  • చదివే సమయం: 7 నిమిషాలు

మ్యాప్‌లో చూస్తే ఆంధ్రప్రదేశ్‌లో ఉమ్మడి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు తూర్పున కనిపిస్తాయి. కానీ, వీటిని ‘తూర్పు ఆంధ్ర’ అని కాకుండా ‘ఉత్తరాంధ్ర’ అని పిలుస్తుంటారు. ఇలా ఎందుకు జరుగుతోంది?

ఈ ప్రశ్నకు సమాధానం కేవలం భౌగోళిక స్వరూపంలో మాత్రమే లేదు... దాని వెనుక బ్రిటిష్‌ పరిపాలనా చరిత్ర ఉంది, కళింగ ప్రభావం ఉంది, ప్రత్యేకమైన సంస్కృతి, గుర్తింపూ ఉన్నాయి.

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ జర్నలిజం విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ లీలావర ప్రసాద్ ఏమంటారంటే, "ఇక్కడ 'ఉత్తర' అనేది తూర్పు-పడమర దిశకు సంబంధించిన పదం కాదు. ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తర భాగాన్ని సూచించే పదం. అంటే రాష్ట్ర మ్యాప్‌లో పై వైపున ఉన్న ఆంధ్ర ప్రాంతం."

అలాగే రాష్ట్రాలను కూడా రెండు రకాలుగా చూడొచ్చు. తూర్పు-పడమర, ఉత్తరం-దక్షిణం. ఆంధ్రప్రదేశ్ మ్యాప్‌లో తిరుపతి, నెల్లూరు వంటి జిల్లాలు (దక్షిణ భాగం) కింద భాగంలో ఉంటాయి గుంటూరు, కృష్ణా మధ్యలో (మధ్య భాగం) ఉంటాయి. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం పై భాగంలో (ఉత్తర భాగం) ఉంటాయి. అందుకే ఈ ప్రాంతాన్ని "ఉత్తరాంధ్ర" అని పిలుస్తారని లీలావర ప్రసాద్ వివరించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

"ఒక ప్రాంతం రాష్ట్రానికి తూర్పు వైపున ఉండొచ్చు. . అదే సమయంలో ఆ రాష్ట్రంలో ఉత్తర భాగంలో కూడా ఉండొచ్చు. ఉత్తరాంధ్ర విషయంలో ఇదే జరిగింది.

ఆంధ్రప్రదేశ్‌ మ్యాప్‌లో చూస్తే ఈ ప్రాంతం సముద్ర తీరాన తూర్పున ఉంది. కానీ రాష్ట్రంలోని జిల్లాల క్రమంలో చూస్తే ఇది ఉత్తర దిశలో ఉంటుంది. అందుకే దీనిని 'ఉత్తరాంధ్ర' అని పిలుస్తారు.

‘‘ఉత్తరాంధ్ర విషయంలో రెండూ నిజమే" అని లీలావరప్రసాద్ చెప్పారు.

ఆంధ్రప్రదేశ్, ఉత్తరాంధ్ర, విశాఖపట్నం

ఫొటో సోర్స్, Getty Images

నార్తర్న్ సర్కార్స్ నుంచి ఉత్తరాంధ్ర వరకు....

ఉత్తరాంధ్ర పేరుకు బ్రిటిష్ కాలంతో కూడా బలమైన సంబంధం ఉంది. చరిత్ర అధ్యయనకారుడు ఎడ్వర్డ్ పాల్ ప్రకారం, బ్రిటిష్ పాలనలో ఈ ప్రాంతాన్ని నార్తర్న్ సర్కార్ అని పిలిచేవారు. 'సర్కార్' అనే పదం పర్షియన్ భాష నుంచి వచ్చింది. మొఘల్ కాలంలో 'సర్కార్' అంటే ఒక పరిపాలనా ప్రాంతం లేదా రెవెన్యూ డివిజన్ అనే అర్థం ఎడ్వర్డ్ పాల్ బీబీసీకి చెప్పారు.

బ్రిటిష్ కాలానికి ముందు ఈస్ట్ కోస్ట్‌ అంటే ఇప్పటి ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో కొన్ని ముఖ్యమైన ప్రాంతాలు ఉండేవి. వీటిని గోల్కొండ సుల్తానులు, తర్వాత మొఘలులు పరిపాలించారు. ఆ సమయంలో ఈ ప్రాంతాలను కొన్ని 'సర్కార్' లుగా విభజించారు.

"ప్రధానంగా చికాకోల్‌ (ఇప్పటి శ్రీకాకుళం ప్రాంతం), రాజమండ్రి, ఏలూరు, కొండపల్లి, గుంటూరు ఇలాంటి ప్రాంతాలను కలిసి 'సర్కార్స్' అని పిలిచేవారు. బ్రిటిష్ వారు మద్రాస్ వైపు నుంచి ఈ ప్రాంతాలను చూసినప్పుడు... ఇవి ఉత్తర దిశలో ఉండటంతో "నార్తర్న్ సర్కార్స్" అని పిలవడం మొదలుపెట్టారు" అని ఎడ్వర్డ్ పాల్ చెప్పారు.

బ్రిటిష్‌ వారు తమ పరిపాలనా కేంద్రాన్ని మద్రాసు (ప్రస్తుతం చెన్నై)లో ఏర్పాటు చేసుకున్నారు. తూర్పు తీరంలోని ఈ తెలుగు ప్రాంతాలు వారి పాలనలో మద్రాస్‌ ప్రెసిడెన్సీకి చెందినవిగా ఉండేవి. అందుకే వారు మద్రాస్‌ను ఆధారంగా తీసుకుని ప్రాంతాలను గుర్తించేవారు.

మద్రాస్‌కు ఉత్తర దిశలో ఉన్న ఈ తీర జిల్లాలను వారు 'నార్తర్న్ సర్కార్స్' అని పిలిచేవారు. అంటే "మద్రాస్‌కు ఉత్తరంగా ఉన్న సర్కార్లు (ప్రాంతాలు)" అన్నమాట.

విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాలున్న ప్రదేశం మద్రాసు నుంచి చూస్తే ఉత్తరం దిక్కునే ఉంటుంది. అందుకే బ్రిటిషర్లు దీనిని నార్త్ ఆంధ్ర అని పిలిచేవారని ఎడ్వర్డ్ పాల్ తెలిపారు.

ఇది కేవలం పేరు మాత్రమే కాదు, బ్రిటిష్ పాలనలో చాలా ముఖ్యమైన ప్రాంతం కూడా. ఎందుకంటే సముద్ర తీర ప్రాంతం కావడం, పోర్టులు ఉండడం, వాణిజ్యానికి అనుకూలం కావడం, మద్రాస్ నుంచి కలకత్తా వెళ్లే మార్గంలో ఉండడం వల్ల ఈ ప్రాంతానికి వ్యూహాత్మకంగా ప్రాధాన్యం పెరిగింది.

అలాగే "తమిళనాడు ప్రాంతీయులు తెలుగు ప్రాంతాన్ని వడగలై అని పిలిచేవారు. వడగలై అంటే ఉత్తర దేశం. వడుగర్ అంటే ఉత్తర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్లని తెలుగు ప్రజలు లేదా ఆంధ్రవాళ్లు అనే వాడుకలు ఉన్నాయి. విజయనగర కాలంలో తమిళనాడుకు వెళ్లిన తెలుగు నాయకులను, సైనికులను, వలస వచ్చిన ప్రజలను "వడుగర్" అని పిలిచేవారు. అంటే తమిళుల దృష్టిలో ఆంధ్ర ప్రాంతం అంటే ఉత్తర దిశ అనే భావన ఉండేది" అని ఆంధ్రా యూనివర్సిటీ చరిత్ర, పురావస్తు శాస్త్ర విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ కొల్లూరు సూర్యనారాయణ చెప్పారు.

ఆంధ్రప్రదేశ్, ఉత్తరాంధ్ర, విశాఖపట్నం

ఫొటో సోర్స్, Getty Images

"చికాకోల్ సర్కార్" అంటే...

ఇప్పటి శ్రీకాకుళాన్ని ఒకప్పుడు "చికాకోల్" అని పిలిచేవారు.

చికాకోల్ సర్కార్ అనే పేరు మొఘల్, నిజాం, బ్రిటిష్ కాలాల్లో వినిపించేదని, నేటి ఉత్తరాంధ్ర భావనకు బీజం అప్పుడే పడిందని అని లీలావరప్రసాద్ అభిప్రాయపడ్డారు.

1765లో మొఘల్ చక్రవర్తి షా ఆలమ్-II ఈ ప్రాంతాలపై హక్కును బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇచ్చారు. తర్వాత నిజాం కూడా ఒప్పందాల ద్వారా వీటిని బ్రిటిష్ పాలనకు అప్పగించడంతో "నార్తర్న్ సర్కార్స్" అనే పేరు మరింత స్థిరపడింది.

ఆంధ్రప్రదేశ్, ఉత్తరాంధ్ర, విశాఖపట్నం

ఫొటో సోర్స్, Getty Images

కళింగ నుంచి ఉత్తరాంధ్ర వరకు...

కొల్లూరి సూర్యనారాయణ చెప్పిన వివరాల ప్రకారం ఉత్తరాంధ్ర చరిత్ర చాలా పురాతనమైనది.

"ఉత్తరాంధ్ర'' అనే పేరు కొత్తదైనా, ఆ ప్రాంత చరిత్ర మాత్రం కళింగం వరకు వెళ్తుంది" అని ఆయన చెప్పారు.

కళింగ అనే పేరు ఉత్తరాంధ్రకు సంబంధించిన అత్యంత పురాతన గుర్తింపుగా చరిత్రలో కనిపిస్తుంది.

ఈ కళింగ ప్రాంతం కేవలం నేటి శ్రీకాకుళం మాత్రమే కాదు. ఉత్తర ఆంధ్ర, దక్షిణ ఒడిశా, కొంత ఛత్తీస్‌గఢ్ వరకు విస్తరించి ఉండేదని చరిత్రకారులు చెబుతున్నారు. అశోకుడు చేసిన 'కళింగ యుద్ధం' కూడా ఈ ప్రాంత చరిత్రలో కీలక ఘట్టంగా భావిస్తారు.

ఆంధ్రప్రదేశ్, ఉత్తరాంధ్ర, విశాఖపట్నం

ఫొటో సోర్స్, Getty Images

త్రికళింగం.... కళింగాంధ్ర

కాలక్రమేణా ఈ ప్రాంతానికి మరికొన్ని పేర్లు కూడా వచ్చాయి. 'త్రికళింగం' అనే పేరు కొన్ని శాసనాల్లో కనిపిస్తుంది. 'త్రికళింగం' అంటే మూడు కళింగ ప్రాంతాల సమాహారం అని చరిత్రకారులు భావిస్తున్నారు. తర్వాత తెలుగు ప్రభావం పెరగడంతో "ఆంధ్ర కళింగం" లేదా కళింగాంధ్ర అనే పేర్లు కూడా వినిపించాయని ప్రొఫెసర్ కొల్లూరు సూర్యనారాయణ చెప్పారు.

"ఇది కళింగ చరిత్రలో భాగమే అయినా, తెలుగు సంస్కృతి కూడా బలపడటంతో రెండు గుర్తింపులు కలిసిన ప్రాంతంగా మారింది" అని ఆయన వివరించారు.

ఆంధ్రప్రదేశ్, ఉత్తరాంధ్ర, విశాఖపట్నం

ఫొటో సోర్స్, Getty Images

'ఉత్తరాంధ్ర' పేరు ఎప్పుడు బలపడింది?

"ఉత్తరాంధ్ర" అనే పదం 20వ శతాబ్దం మధ్యకాలం తర్వాత ఎక్కువగా వాడుకలోకి వచ్చింది. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం, భాషా ప్రాతిపదిక రాష్ట్రాల ఏర్పాటుతో కోస్తా, రాయలసీమ, ఉత్తరాంధ్ర వంటి ప్రాంతీయ విభజనలు ప్రాచుర్యంలోకి వచ్చాయి. అలా ఉత్తరాంధ్ర పేరు ప్రజల్లో స్థిరపడిందని కొల్లూరి సూర్యనారాయణ చెప్పారు.

"1953లో ఆంధ్ర రాష్ట్రం, 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఈ ప్రాంత గుర్తింపు మరింత బలపడింది" అని లీలావరప్రసాద్ అన్నారు.

కాలక్రమేణా 'ఉత్తరాంధ్ర' అనేది కేవలం భౌగోళిక పదంగా కాకుండా, ఒక ప్రాంతీయ గుర్తింపుగా మారింది. ఉద్యోగాలు, అభివృద్ధి, రాజకీయ ప్రాతినిధ్యం, యాస, సంస్కృతి వంటి అంశాల్లో ఈ ప్రాంత ప్రజలు తమ ప్రత్యేకతను 'ఉత్తరాంధ్ర' అనే పేరుతో వ్యక్తీకరించడం ప్రారంభించారు.

ఇప్పుడు 'ఉత్తరాంధ్ర' అంటే సాధారణంగా ఉమ్మడి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం అనే మూడు జిల్లాలను సూచిస్తారు. కానీ ఆ పేరులో కేవలం దిశ మాత్రమే లేదు. కళింగ చరిత్ర ఉంది. బ్రిటిష్ పరిపాలన గుర్తులు ఉన్నాయి. అలాగే ఒడిశాతో సరిహద్దు ఉండటంతో ఉత్తరాంధ్ర భాష, వంటకాలు, జానపదం, జాతరలపై కూడా ఒరియా ప్రభావం కనిపిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.

ఆంధ్రప్రదేశ్, ఉత్తరాంధ్ర, విశాఖపట్నం

ఫొటో సోర్స్, Getty Images

ఉత్తరాంధ్ర యాస ప్రత్యేకం...

ఉత్తరాంధ్ర యాసలో వినిపించే కొన్ని పదాలు, పలుకుబడులు ఆ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపుగా నిలిచాయి. ఉదాహరణకు 'బేగిరా' (వేగంగా రా), 'ఎలిపోచ్చి' (వెళ్లి రా), 'ఇకటానికి' (సరదాకి) వంటి మాటలు ఉత్తరాంధ్ర యాస మాట్లాడే తీరులో ప్రత్యేకతను చూపిస్తాయి. సినిమాల్లోనూ ఉత్తరాంధ్ర మాండలికం వినిపిస్తుంది, అలాగే ఉత్తరాంధ్ర ప్రత్యేక సంస్కృతిపై పదుల సంఖ్యలో సినిమాలు కూడా తీశారు.

అందుకే 'ఉత్తరాంధ్ర' అనే పేరు కేవలం మ్యాప్‌లోని ఒక దిశను సూచించదు. అది కళింగ చరిత్రను, బ్రిటిష్ పాలనను, తీరప్రాంత జీవనాన్ని, ప్రత్యేక యాసను, ఒక ప్రాంతీయ సంస్కృతిని మోసుకొస్తున్న గుర్తింపుగా నిలిచిపోయింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)