సూర్యుడిని ఇంత స్పష్టంగా మీరు ఎప్పుడైనా చూశారా?

సూర్యుడి ఉపరితలం

ఫొటో సోర్స్, NSF/NSO/AURA/MPS

ఫొటో క్యాప్షన్, ఇవి సూర్యుడి ఉపరితలం లేదా ఫోటోస్పియర్‌కు సంబంధించి ఇప్పటివరకు తీసిన అత్యంత స్పష్టమైన చిత్రాలు.
    • రచయిత, విక్టోరియా గిల్
    • హోదా, సైన్స్ కరస్పాండెంట్
  • ప్రచురణ
  • చదివే సమయం: 3 నిమిషాలు

ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సోలార్ టెలిస్కోప్ సాయంతో శాస్త్రవేత్తలు సూర్యుడి ఉపరితలాన్ని మునుపెన్నడూ లేనంత స్పష్టతతో చిత్రీకరించారు.

​ఇంతకుముందు ఎన్నడూ చూడని విధంగా సూర్యుడిపై ‘సుడిగుండాల’ వంటి కదలికలు ఈ ఫోటోలు, వీడియోలు చూపుతున్నాయి.

వేడి వాయువుల వేగవంతమైన కదలికల వల్ల సూర్యుడి అయస్కాంత క్షేత్రం మెలికలు తిరుగుతూ కదులుతుండటంతో ఇవి ఏర్పడుతున్నాయి.

​ఈ నిరంతర సుడిగుండాల కదలికలే సూర్యుడి నుంచి అపారమైన శక్తిని వెదజల్లుతూ 'అంతరిక్ష వాతావరణాన్ని’ సృష్టిస్తోంది.

ఈ వాతావరణం భూమిపై ఉన్న విద్యుత్ గ్రిడ్‌లను, ఉపగ్రహాలను దెబ్బతీయడమే కాకుండా, అంతరిక్షంలో ఉండే వ్యోమగాములకు కూడా ప్రమాదం కలిగించగలదు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
అయస్కాంత క్షేత్రం పేలుళ్ల వెనుక కారణాన్ని అర్ధం చేసుకున్నామంటున్న శాస్త్రవేత్తలు

ఫొటో సోర్స్, NASA/SDO

ఫొటో క్యాప్షన్, సూర్యుడు అంతరిక్షంలోకి పంపే సౌరప్లాస్మా, అయస్కాంత క్షేత్రాలలో ఆకస్మికంగా జరిగే పేలుళ్ల చోదకశక్తిని తాము బంధించినట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

​"ఈ శక్తికి, అంతరిక్ష వాతావరణంలో వచ్చే మార్పులన్నింటికీ సూర్యుడే మూలం" అని అమెరికా నేషనల్ సోలార్ అబ్జర్వేటరీ (ఎన్ఎస్ఓ)కు చెందిన డాక్టర్ డేవిడ్ బోబోల్ట్జ్ వివరించారు.

సౌరకుటుంబంలోని ఈ నక్షత్రాన్ని మరింత క్షుణ్ణంగా చిత్రీకరించడం ద్వారా ఆ అంతరిక్ష వాతావరణాన్ని అర్థం చేసుకుని, దానికి అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవడానికి వీలవుతుందని ఆయన తెలిపారు.

​"అంతరిక్ష వాతావరణాన్ని ముందుగానే అంచనా వేయాలంటే, సూర్యుడి భౌతిక శాస్త్రాన్ని అత్యంత సూక్ష్మ స్థాయిలో సైతం మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది" అన్నారు.

మేఘాలపైన కొలువుదీరిన ఎన్ఎస్ఎఫ్ సోలార్ టెలీస్కోప్

ఫొటో సోర్స్, NSF National Solar Observatory

ఫొటో క్యాప్షన్, హవాయిలో ఏర్పాటు చేసిన టెలిస్కోప్‌

భగ్గుమనే అంతరిక్ష వాతావరణం

​'నేచర్' సైన్స్ పత్రికలో ప్రచురితమైన ఈ పరిశోధనా వివరాలు 'ఇనోయే సోలార్ టెలిస్కోప్' ద్వారా సాధ్యమయ్యాయి. దుమ్ము ధూళి లేని నిర్మలమైన ఆకాశం ఉండే హవాయిలోని ఎత్తైన పర్వత శిఖరంపై ఈ టెలిస్కోప్‌ను ఏర్పాటు చేశారు.

సూర్యుడి ఉపరితలాన్ని జూమ్ చేసి చూడటం ద్వారా సుడిగుండాల రూపాన్ని పరిశోధకుల బృందం స్పష్టంగా చిత్రీకరించింది.

"ఈ మెలికలు తిరిగే కదలికలే అయస్కాంత శక్తిని ఉత్పత్తి చేస్తున్నాయి. ఆ శక్తి పెరిగి పెద్ద ఎత్తున పేలుళ్లకు దారితీస్తుంది" అని ఎన్‌ఎస్‌ఓ ఖగోళ శాస్త్రవేత్త డాక్టర్ డేవిడ్ కురిడ్జే బీబీసీ‌తో చెప్పారు.

​సూర్యుడిపై శాస్త్రవేత్తలు గుర్తించిన ఈ ప్రక్రియను "కెల్విన్-హెల్మ్‌హోల్ట్జ్ ఇన్‌స్టెబిలిటీ" అని పిలుస్తారు.

​ద్రవాలు లేదా వేడి వాయువులు ఒకదాని పక్కన ఒకటి వేగంగా కదులుతున్నప్పుడు, చిన్నపాటి అలజడులు పెద్ద సుడిగుండాలుగా మారే క్రమాన్ని ఇది వివరిస్తుంది. సముద్రంలో చిన్న చిన్న అలలు రాకాసి అలలుగా ఎలా మారతాయో అర్థం చేసుకోవడానికి కూడా ఈ సూత్రమే ఉపయోగపడుతుంది.

​సూర్యుడి ఉపరితలంపై దీనిని గుర్తించడం ద్వారా అంతరిక్ష వాతావరణం వెనుక ఉన్న కారణాలే కాకుండా, సూర్యుడి ఉపరితలం అంత వేడిగా ఎందుకు ఉందో కూడా అర్థమవుతుందని ఎన్‌ఎస్ఓ‌కు చెందిన మరొక శాస్త్రవేత్త డాక్టర్ ఫ్రీడ్రిచ్ వోగర్ వివరించారు. శక్తి కింది నుంచి పై పొరలకు ఎలా ప్రసరిస్తుందో ఇది తెలియజేస్తుంది.

సూర్యడు

ఫొటో సోర్స్, NASA

​"పై పొరల్లో తగినంత శక్తి చేరిన తర్వాత, అది సౌర జ్వాలలు లేదా 'కరోనల్ మాస్ ఎజెక్షన్' రూపంలో బయటకు విడుదలవుతుంది" అని ఆయన పేర్కొన్నారు.

​అంతరిక్ష వాతావరణం నుంచి మనల్ని మనం రక్షించుకోవడంతో పాటు, సూర్యుడు ఒక "అరుదైన ప్రయోగశాల" అనే విషయాన్ని ఈ కొత్త పరిశోధనలు గుర్తుచేస్తున్నాయని బోబోల్ట్జ్ అన్నారు.

​"మనకు అత్యంత సమీపంలో ఉన్న నక్షత్రం సూర్యుడే. భౌతిక శాస్త్ర ప్రాథమిక సూత్రాలను అర్థం చేసుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఐన్‌స్టీన్ సాధారణ సాపేక్షతా సిద్ధాంతానికి సంబంధించి తొలి ప్రయోగపూర్వక నిరూపణ కూడా సూర్యగ్రహణ పరిశీలనల నుంచే లభించింది. కాబట్టి, మానవ జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి కూడా ఇటువంటి ప్రయోగాలు అత్యంత అవసరం" అని ఆయన చెప్పారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)