రాజేశ్ ‘రియల్ హీరో’: వరదలో కొబ్బరి చెట్టుకు వేలాడుతున్న వృద్ధుడికి తన లైఫ్ జాకెట్ ఇచ్చి తాను కొట్టుకుపోయిన యువకుడి కథ

కేరళ వరదలు

ఫొటో సోర్స్, @vdsatheesan/X

ఫొటో క్యాప్షన్, రాజేశ్
    • రచయిత, సిరాజ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 4 నిమిషాలు

ఏటా జులై, ఆగస్టు నెలల్లో కేరళలో భారీ వర్షాలు, వరదలు వస్తుంటాయి.

కేరళ 2018లో తీవ్రమైన వరదలకు గురైంది. అప్పట్లో దాదాపు 50 ఏళ్లలో ఎన్నడూ లేనంత వర్షపాతం, వరదలను ఆ రాష్ట్రం చవిచూసింది.

ఆ విపత్తు సమయంలో కేరళకు చెందిన అనేకమంది సహాయక చర్యలలో పాల్గొనడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. వారిలో తిరువనంతపురానికి చెందిన రాజేశ్ ఒకరు.

ఈ ఏడాది కూడా రుతుపవనాల ప్రభావం కేరళలోని అనేక ప్రాంతాలపై తీవ్రంగా పడింది. రాజేశ్ మరోసారి సహాయ చర్యలలో పాలుపంచుకోవడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు.

ఆగస్టు 1 సాయంత్రం, కన్నూర్ జిల్లాలో వరద నీటిలో చిక్కుకున్న 61 ఏళ్ల వృద్ధుడిని రక్షించే ఆపరేషన్‌లో రాజేశ్ పాల్గొన్నారు. ఆ వృద్ధుడిని రక్షించేందుకు తన లైఫ్ జాకెట్‌ను ఆయనకు తొడిగారు. వృద్ధుడినైతే సురక్షితంగా బయటపడేశారుగానీ, రాజేశ్ మాత్రం ఆ ప్రవాహంలో కొట్టుకుపోయారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
కేరళ వరదలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కేరళ వరదలు (ఫైల్ ఫోటో)

వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన రాజేశ్ ప్రాణాలతో దొరుకుతాడని కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆశించారు.

అయితే, మూడు రోజుల గాలింపు తర్వాత ఆయన మృతదేహం లభ్యంకాగా, ఆగస్టు 6న పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.

తిరువనంతపురంలోని తెట్టివిలకు చెందిన రాజేశ్ వయసు 36 ఏళ్లు. ఆయన రాపెల్లింగ్(నిలువు రాళ్లపైనుంచి తాళ్ల సహాయంతో కిందకు దిగడం) ట్రైనర్. ప్రకృతి వైపరీత్యాల సమయంలో సహాయ చర్యలలో పాల్గొనే స్వచ్ఛంద బృందమైన ‘అడ్వెంచర్ డిజాస్టర్ సొసైటీ’లో సభ్యుడు.

కేరళ వరదలు

ఫొటో సోర్స్, @vdsatheesan/X

ఫొటో క్యాప్షన్, రాజేశ్ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని కేరళ ముఖ్యమంత్రి వీడీ సతీశన్ హామీ ఇచ్చారు.

"రాజేశ్ మరణంతో ఆయన కుటుంబమే కాకుండా మొత్తం తెట్టివిల్లా శోకంలో మునిగి పోయింది" అని రాజేశ్ స్నేహితుడు విష్ణు అన్నారు.

"2024లో వయనాడ్ కొండచరియల విపత్తు సమయంలో జరిగిన సహాయ చర్యలలోనూ ఆయన పాల్గొన్నారు. విపత్తు నిర్వహణ, సహాయక చర్యల మెలకువల్లో ఆయన చాలా మందికి శిక్షణ ఇచ్చారు. నేషనల్ క్యాడెట్స్ కోర్ (ఎన్‌సీసీ) విద్యార్థులకు పర్వతారోహణలో శిక్షకుడిగా పనిచేశారు" అని విష్ణు అన్నారు.

ఆగస్టు 1వ తేదీన, కన్నూర్ జిల్లాలో కురిసిన భారీ వర్షాల కారణంగా కర్ణాటక సరిహద్దు సమీపంలోని చెరుపుళ దగ్గర ఉన్న పులింగోం గ్రామంలో తీవ్రమైన వరదలు వచ్చాయి.

రాజేశ్ రక్షించిన 61 ఏళ్ల వ్యక్తి పేరు బెన్నీ. ఆయనకు ఆ ప్రాంతంలో ఒక కాఫీ తోట ఉంది.

"రాజేశ్ అక్కడ లేకపోయి ఉంటే, నేను కచ్చితంగా బతికి ఉండేవాడిని కాదు. కానీ నాలాంటి 61 ఏళ్ల వృద్ధుడిని కాపాడటానికి రాజేశ్ తన ప్రాణాలు పోగొట్టుకోవడం దురదృష్టకరం" అని బెన్నీ మీడియాతో అన్నారు.

‘‘ఆగస్టు 1వ తేదీన ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నా నేను నా కాఫీ తోటలో పనికి వెళ్లా. మొదట్లో నీరు నా పాదాలు మునిగేంత వరకే ఉంది. అకస్మాత్తుగా వరద పెరగడం మొదలైంది. నేను బయటకు రావడానికి ప్రయత్నించేసరికి, నీరు నా నడుము వరకు వచ్చింది. భయపడి, నా కుటుంబాన్ని పిలిచా. నిమిషాల వ్యవధిలోనే, నేను వరదలో కొట్టుకుపోయా" అని ఆయన చెప్పారు.

రాజేశ్, ఆయన బృందం తనను రక్షించడానికి వచ్చినప్పుడు, తాను ఒక కొబ్బరి చెట్టును పట్టుకుని వేలాడుతున్నానని బెన్నీ చెప్పారు.

రెస్క్యూ ఆపరేషన్ సమయంలో రాజేశ్‌తో‌ ఉన్న బిజు, ఆ రోజు జరిగిన సంఘటనను బీబీసీకి వివరించారు.

"బెన్నీ వేలాడుతున్న చెట్టువైపు ఒక తాడు విసిరారు. ఆయన దాన్ని పట్టుకుని కొబ్బరి చెట్టుకు కట్టడానికి ప్రయత్నించారు. కానీ ఆయన ఇబ్బంది పడటం చూసిన రాజేశ్ స్వయంగా ఆయన వద్దకు ఈదుకుంటూ వెళ్లారు. చెట్టుకు తాడు కట్టిన తర్వాత బెన్నీని రక్షించే పని మొదలుపెట్టారు. బెన్నీ పూర్తిగా అలసిపోవడంతో రాజేశ్ తన లైఫ్ జాకెట్‌ను తీసి ఆయనకు తొడిగారు. రాజేశ్‌తో పాటు మరో ఇద్దరు సహాయ బృంద సభ్యులు కూడా ఉన్నారు. వారందరూ తాడును పట్టుకుని నది ఒడ్డుకు తిరిగి రావడం ప్రారంభించారు. అకస్మాత్తుగా నది ప్రవాహం బలపడటంతో రాజేశ్ అందులో కొట్టుకుపోయారు" అని బిజు చెప్పారు. రాజేశ్ కోసం వెంటనే గాలింపు మొదలుపెట్టామని బిజు వెల్లడించారు.

"రాజేశ్ మంచి ఈతగాడు. ఇలాంటి పరిస్థితులలో పనిచేసిన అనుభవం చాలా ఉంది. కానీ ఎక్కువసేపు చల్లటి నీటిలో ఉండటం వల్ల, ఆయన కండరాలకు నొప్పులు వచ్చి ఉండవచ్చు. దానివల్ల ఈత కొట్టడం కష్టమై ఉంటుంది. ఆయన ప్రాణాలతో దొరుకుతాడనే నమ్మకంతో మేం సహాయ చర్యలు కొనసాగించాం" అని బిజు చెప్పారు.

కేరళ వరదలు
ఫొటో క్యాప్షన్, రాజేశ్‌ కోసం రెస్క్యూ బృందాలు మూడు రోజులపాటు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి.

మూడు రోజుల తర్వాత ఆగస్టు 4న కరియంగోడ్ నదిలో రాజేశ్ మృతదేహం లభ్యమైంది. అనంతరం ఆయన మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకువెళ్లగా, అక్కడ అంత్యక్రియలు నిర్వహించారు.

‘‘రాజేశ్‌కు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడానికి నిర్ణయించాం. ఆయన మరొకరిని కాపాడటానికి తన ప్రాణాలను త్యాగం చేశారు. ఎన్నో విపత్తుల సమయంలో సేవ చేశారు. ఆయన కుటుంబానికి సాధ్యమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తాం. అసంపూర్తిగా ఉన్న ఆయన ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేయడానికి కూడా ప్రభుత్వం సహాయం చేస్తుంది" అంత్యక్రియలకు ముందు రాజేశ్‌కు నివాళులర్పిస్తూ కేరళ ముఖ్యమంత్రి వీడీ సతీశన్ అన్నారు.

రాజేశ్‌కు భార్య షఫియా, ఇద్దరు కుమారులు అర్షన్, అభిషేక్ ఉన్నారు.

‘‘ఆయన కుటుంబం ఆర్థికంగా బలహీనంగా ఉంది. ఈ సంఘటన జరగడానికి కేవలం వారం రోజుల ముందే, ఆయన కన్నూర్‌లో విపత్తు నిర్వహణ శిక్షణ పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వచ్చారు. గ్రామంలో ఏదైనా ప్రజా సేవా కార్యక్రమం జరిగినప్పుడల్లా రాజేశ్ అందరికంటే ముందుంటారు" అని ఆయన స్నేహితుడు విష్ణు అన్నారు.

కేరళ వరదలు
ఫొటో క్యాప్షన్, ఆగస్టు 1న కన్నూరు జిల్లాలో తీవ్రమైన వరదలు వచ్చాయి.

టోవినో థామస్, కుంచాకో బోబన్, ఆసిఫ్ అలీ నటించిన ‘2018’ అనే మలయాళ చిత్రాన్ని కేరళలో సంభవించిన తీవ్ర వరదల కథాంశంతో నిర్మించారు. ఈ సినిమాలో వరదలో మునిగిన ఒక వృద్ధుడిని కాపాడే ప్రయత్నంలో మరణించిన అనూప్ అనే యువకుడి పాత్రను టోవినో థామస్ పోషించారు.

సోషల్ మీడియాలో చాలామంది రాజేశ్‌ను ఈ పాత్రతో పోలుస్తూ, ఆయన్ను కేరళ ‘రియల్ హీరో’ అని పొగుడుతున్నారు.

"ప్రతి సంవత్సరం కేరళలో భారీ వర్షాలు, వరదలు సంభవించినప్పుడు, రాజేశ్ వంటి వలంటీర్లు ప్రజలకు సహాయం చేయడానికి ముందుగా ముందుకు వస్తారు. కాబట్టి ప్రభుత్వం రాజేశ్ కుటుంబానికి అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందించాలి" అని విష్ణు విజ్ఞప్తి చేశారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)