కొరియన్ కనకరాజు రివ్యూ: కొరియన్ ఆత్మతో నవ్వులు పండాయా?

సినిమా, తెలుగు సినిమా, టాలీవుడ్, వినోదం

ఫొటో సోర్స్, uvcreationsofficial/insta

    • రచయిత, సాహితి
    • హోదా, బీబీసీ కోసం
  • ప్రచురణ
  • చదివే సమయం: 4 నిమిషాలు

ఇండియాలో కొరియన్ సినిమాలు, సిరీస్‌ల‌కు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. కానీ, కొరియన్ నేపథ్యాన్ని తెలుగు కమర్షియల్ సినిమాతో కలపాలనే ప్రయత్నం ఇప్పటివరకు పెద్దగా కనిపించలేదు.

ఇప్పుడు వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఆ ప్రయత్నం చేశాడు.

స్వ‌చ్ఛ‌మైన వినోదం పండించగల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న మేర్లపాక గాంధీ.. అనంతపురం, కొరియా బ్యాక్‌డ్రాప్‌లను కలిపి ఓ హారర్ కామెడీ కథను సిద్ధం చేశారు.

మరి, ఈ ఆలోచన ఎంతవరకు వర్కౌట్ అయింది?

అసలు కథేంటంటే..

అనంతపురం జిల్లా పెనుగొండకు చెందిన కనకరాజు (వరుణ్ తేజ్‌) ఊర్లో చెక్కభజన చేస్తూ సరదాగా తిరిగే కుర్రాడు.

కియా ఫ్యాక్టరీలో పనిచేసే చైత్ర (రితిక )ను చూసి ప్రేమలో పడతాడు. చైత్రకు కొరియన్ సినిమాలు, అక్కడి కల్చర్ అంటే విపరీతమైన ఇష్టం.

అనుకోకుండా ఓ కొరియన్ ఆత్మ కనకరాజు శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఆ ఆత్మ ఎవరు? దాని గతం ఏమిటి? దాన్ని తన శరీరం నుంచి బయటకు పంపేందుకు కనకరాజు పడిన అవస్థలే మిగతా కథ.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
సినిమా, తెలుగు సినిమా, టాలీవుడ్, వినోదం

ఫొటో సోర్స్, uvcreationsofficial/insta

కొరియన్ ఆత్మ సరే..

ట్రైలర్‌లోనే సినిమా ప్రధాన పాయింట్‌ను బయటపెట్టేశారు. అలాంటప్పుడు థియేటర్లో ట్రీట్మెంట్‌తో ప్రేక్షకుడిని ఆకట్టుకోవాలి.

తెలిసిన కథ అయినప్పటికీ, సన్నివేశాల్లో కొత్తదనం ఉంటే ప్రేక్షకుడు కథను మర్చిపోయి సినిమాను ఆస్వాదిస్తాడు. కానీ, కొరియన్ కనకరాజులో ఆ కొత్తదనం చాలా వరకు కనిపించదు.

కనకరాజుకు కొరియన్ ఆత్మ ఆవహించడం, అది కొరియాలోని ఓ గ్యాంగ్‌స్టర్ ఆత్మ అని తెలియడం... ఇవ‌న్నీ ట్రైలర్‌లోనే చూపించారు.

ఈ లైన్ చుట్టూ దర్శకుడు రాసుకున్న ట్రీట్మెంట్ ఆశ్చర్యపరిచేలా ఉండదు.

అనంతపురం, కియా ఫ్యాక్టరీ, కొరియన్ ఆత్మ అనే ఆలోచన కొత్తగా అనిపించినా, ఆ కొత్తదనం స్క్రీన్‌ప్లేలో కొనసాగలేదు.

కనకరాజు కుటుంబం, చెక్కభజన, సునీల్‌తో శత్రుత్వం వంటి సన్నివేశాలతో కథ మొదలవుతుంది. సత్య పాత్ర ఎంట్రీ తో కొన్ని సహజమైన నవ్వులు పుడతాయి.

అయితే, అసలు కథలోకి వెళ్లేందుకు దర్శకుడు అవసరానికి మించిన సమయం తీసుకున్నాడు. ట్రైలర్‌లో చెప్పిన ప్రధాన అంశం ప్రీ-ఇంటర్వెల్ వరకు రాకపోవడంతో తొలి భాగం కొంత నెమ్మదిగా సాగుతుంది. పైగా ఆత్మ కనకరాజు ప్రవేశించడానికి దర్శకుడు ఎంచుకున్న సన్నివేశాలు సాగాదీతగా అనిపిస్తుంది.

కనకరాజు అన్నయ్య పాత్రలో తీసుకొచ్చిన ఎమోషన్ ఆసక్తికరంగా మొదలైనా, రెండో భాగంలో దాన్ని ప్రభావవంతంగా వాడుకోలేదు. కాకపోతే, తొలి భాగంలోని రెండు పాటలు, సత్య కామెడీ, అలాగే కొరియన్ ఆత్మ ఆవహించిన తర్వాత వచ్చే హారర్ టచ్ కొన్ని చోట్ల బాగానే వర్కౌట్ అయ్యాయి.

సినిమా, తెలుగు సినిమా, టాలీవుడ్, వినోదం

ఫొటో సోర్స్, UV Creations/FB

ద్వితీయార్థం ఆత్మ క్షోభ

ఇంటర్వెల్ తర్వాత కొరియన్ ఆత్మ నేపథ్యాన్ని దర్శకుడు త్వరగానే వివరిస్తాడు. కానీ, అక్కడి నుంచి కథకు స్పష్టమైన లక్ష్యం కనిపించదు.

ఆత్మకైనా, కనకరాజుకైనా బలమైన గోల్ లేకపోవడంతో సన్నివేశాలు దిశ లేకుండా సాగుతున్నాయనే భావన కలుగుతుంది.

అయినా, సత్య పాత్ర నుంచి వచ్చే కామెడీ, క్లైమాక్స్‌కు ముందు వచ్చే క్షుద్ర పూజ ఎపిసోడ్ కొంత వినోదాన్ని పంచుతాయి.

అయితే, క్లైమాక్స్ మాత్రం పూర్తిగా ఓవర్ ది టాప్‌గా అనిపిస్తుంది. ముఖ్యంగా, గ్రాఫిక్స్ ఫైట్ కథలో సహజంగా కలవకుండా, వేరే సినిమా చూస్తున్న ఫీలింగ్ ఇస్తుంది.

సినిమా, తెలుగు సినిమా, టాలీవుడ్, వినోదం

ఫొటో సోర్స్, UV Creations and First Frame Entertainments/YT

వరుణ్ డబుల్ యాక్షన్

వరుణ్ తేజ్‌లో కావ‌ల్సినంత‌ కామెడీ టైమింగ్ ఉందని F2, F3లోనే నిరూపించాడు. ఇందులో కూడా కామెడీ, హారర్, యాక్షన్ మూడు కోణాల్లో నటించే అవకాశం దక్కింది.

అనంతపురం కుర్రాడు కనకరాజుగా, కొరియన్ గ్యాంగ్‌స్టర్‌గా రెండు షేడ్స్‌లో మంచి అభినయం కనబరిచాడు. అనంతపురం యాసను కూడా సహజంగా పలికించాడు.

అయితే, ఈ రెండు పాత్రలను మరింత బలంగా రాసి ఉంటే ప్రభావం ఇంకాస్త పెరిగేది.

రితికా నాయక్ చైత్ర పాత్రలో అందంగా కనిపించింది. కొరియా నేపథ్యంలో వచ్చే సన్నివేశాల్లో ఆమె పాత్ర సహజంగా అనిపిస్తుంది.

సినిమా, తెలుగు సినిమా, టాలీవుడ్, వినోదం

ఫొటో సోర్స్, UV Creations and First Frame Entertainments/YT

సత్య షో

ఈ సినిమాలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది సత్య గురించే. కృష్ణప్ప పాత్రలో హీరోతో సమానమైన నిడివి ఉన్న పాత్ర దక్కింది. చాలా సన్నివేశాల్లో తన టైమింగ్ నవ్విస్తుంది.

ముఖ్యంగా క్షుద్ర పూజ, క్లైమాక్స్, కొరియన్ ఆత్మతో మాట్లాడే సన్నివేశాల్లో మంచి వినోదాన్ని అందించాడు.

మురళీధర్ గౌడ్ తన పాత్రలో నవ్వించే ప్రయత్నం చేశాడు. శ్రీనివాస్ అవసరాల పాత్ర కథకు కీలకమైనదే అయినా, దాని ఎమోషన్ పండలేదు. సునీల్ పాత్ర కూడా చాలా పరిమితంగానే ఉంటుంది.

సినిమా, తెలుగు సినిమా, టాలీవుడ్, వినోదం

ఫొటో సోర్స్, UV Creations/X

సాంకేతిక విభాగం

ఈ సినిమాకు తమన్ సంగీతం ప్రత్యేక బలంగా నిలిచింది. అనంతపురం నుంచి కొరియా వరకు మారే బ్యాక్‌డ్రాప్‌, కామెడీ నుంచి హారర్‌కు మారే జానర్‌ను బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో బాగా మోశాడు.

పాటలు కూడా కమర్షియల్ సినిమాకు తగ్గట్టుగా ఉన్నాయి.

కొరియాలో చిత్రీకరించిన విజువల్స్ సినిమాకు ఫ్రెష్ ఫీలింగ్ తీసుకొచ్చాయి.

అనంతపురం కుర్రాడికి ఓ కొరియన్ ఆత్మ ఆవహించడం అనే పాయింట్ వినడానికి చాలా ఆసక్తికరంగా ఉంటుంది. కానీ, దాన్ని తెరపైకి తీసుకొచ్చే సమయంలో బలమైన స్క్రీన్‌ప్లే, సహజమైన డ్రామా లోపించాయనిపిస్తుంది. కొత్త ఆలోచన ఉన్నా, దానికి తగ్గ కొత్త సన్నివేశాలు లేకపోవడం సినిమాను వెనక్కి లాగుతుంది.

అయితే, ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా, లాజిక్కులు పట్టించుకోకుండా ఓ కమర్షియల్ హారర్ కామెడీ చూడాలనుకునే ప్రేక్షకులకు 'కొరియన్ కనకరాజు' ఒకసారి చూసేయొచ్చు అనిపించే సినిమా.

(గమనిక: అభిప్రాయాలు సమీక్షకుల వ్యక్తిగతం)

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)