పురుష మృతదేహాల ప్రైవేట్ పార్ట్స్‌పై వైద్య విద్యార్థిని అభ్యంతరకర వ్యాఖ్యలు.. విచారణకు ఆదేశం, అసలేం జరిగింది?

ఫొటో సోర్స్, Video Grab/FACEBOOK/Pranit More Official/BBC
స్టాండప్ కమెడియన్ ప్రణీత్ మోరే షోలో పురుషుల శవాల ప్రైవేట్ భాగాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వైద్యవిద్యార్థిని సెజల్ పవార్‌పై చర్యలు తీసుకున్నారు.
గతంలో ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు తాజాగా వైరల్ కావడం, దీనిపై వివాదం రేగడంతో ముంబయిలోని కేఈఎం ఆస్పత్రి ఈ వైద్యవిద్యార్థినిపై చర్యలు తీసుకుంది.
సెజల్ పవార్‌ను 15 రోజుల పాటు సస్పెండ్ చేసినట్లు కేఈఎం డీన్ కార్యాలయం ప్రకటనలో పేర్కొంది. ఆమెను హాస్టల్, కాలేజీ ప్రాంగణంలోకి రాకుండా నిషేధం విధించింది.
ఈ వ్యవహారంపై విచారణ జరపడానికి ఐదుగురు సభ్యుల కమిటీని నియమించారు. ఈ కమిటీ వారంలోగా విచారణజరిపి నివేదిక సమర్పించాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
ప్రస్తుతం సెజల్ పవార్ భద్రతను దృష్టిలో ఉంచుకుని, ఆమెను కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు అధికారులు తెలిపారు.


ఫొటో సోర్స్, @ians_india
తాను చేసిన వ్యాఖ్యలపై వివాదం ముదరడంతో మెడికో సెజల్ పవార్ క్షమాపణలు చెబుతూ ఒక వీడియో విడుదల చేశారు. 'నేను చాలా తప్పుగా మాట్లాడాను' అని ఆమె ఆ వీడియోలో అన్నారు.
మరోపక్క స్టాండప్ కమెడియన్ ప్రణీత్ మోరే కూడా సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేస్తూ బహిరంగ క్షమాపణలు చెప్పారు. తన షోలో హిమాన్షు జాంగ్డా అనే వ్యక్తి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదంగా మారడంతో మోరే క్షమాపణలు చెప్పారు. ''నాది తప్పే, నన్ను క్షమించి ఒక్క అవకాశం ఇవ్వండి'' అని ప్రణీత్ మోరే కోరారు.
ప్రణీత్ మోరేతో పాటు హిమాన్షు జాంగ్డా, వైద్యవిద్యార్థిని సెజల్ పవార్, ఇతరులపై జూన్ 11న మహారాష్ట్ర సైబర్ సెల్ పోలీసులు కేసు నమోదు చేశారు.
హాస్పిటల్ ప్రకటనలో ఏముంది?
సెజల్ పవార్ వ్యాఖ్యలను చాలా తీవ్రంగా పరిగణించినట్లు సేథ్ జీఎస్ మెడికల్ కాలేజీ, కేఈఎం హాస్పిటల్ యాజమాన్యం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది.
‘‘ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్న సెజల్ పవార్ ఓ కామెడీ షోలో చేసిన వ్యాఖ్యలు, సంబంధిత వీడియోసామాజిక మాధ్యమాలలో వైరల్ కావడం, దీనిపై వ్యక్తమైన ఆందోళలనను పరిగణనలోకి తీసుకున్నాం. ఫిర్యాదు అందిన వెంటనే ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించాం. సెజల్ వాదనలు విన్నాం. ఆమె వివరణను, క్షమాపణలను రికార్డ్ చేశాం. సదరు వీడియో, దానికి సంబంధించిన ఇతర ఆధారాలను పరిశీలించాం.
ప్రాథమిక విచారణలో వెల్లడైన అంశాలు, కేసు తీవ్రత, మరణించిన వ్యక్తులు,శరీరదానం చేసిన వారి గౌరవాన్ని కాపాడటం, వైద్య విద్యార్థులకు ఉండాల్సిన వృత్తిపరమైన విలువలను దృష్టిలో పెట్టుకొని సెజల్ పవార్‌పై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నాం.
ఈమేరకు 2026 జూన్ 13 నుంచి సెజల్ పవార్‌ను 15 రోజుల పాటు సెలవుపై పంపించాం. సమగ్ర విచారణ పూర్తయ్యే వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయి. జూన్ 13న ఉదయం 10.30 గంటలకు సెజల్ పవార్‌ను ఆమె తల్లిదండ్రులకు అప్పగించాం. విచారణ కమిటీకి పూర్తి సహకారం అందించాలని సెజల్‌ను ఆదేశించాం'' అని ఆ పత్రికా ప్రకటనలో డీన్ కార్యాలయం పేర్కొంది.
‘మృతుల గౌరవాన్ని కాపాడాలి’
ఈ వ్యవహారంపై లోతైన విచారణ కోసం ఏర్పాటైన కమిటీ ఈ మొత్తం ఘటనను, దాని ప్రభావాన్ని, సోషల్ మీడియా వ్యాప్తి, సంబంధిత రికార్డులను అధ్యయనం చేసి తదుపరి చర్యలను సిఫార్సు చేయనుంది.
రోగులు, మరణించిన వ్యక్తులు, శరీరదానం చేసేవారు, వారి కుటుంబాలను గౌరవించడం వైద్య విద్యలోని ప్రాథమిక విలువ అని కాలేజీ యాజమాన్యం స్పష్టం చేసింది.
ఈ వ్యవహారాన్ని చాలా జాగ్రత్తగా, సున్నితంగా, నిష్పక్షపాతంగా విచారిస్తామని హాస్పిటల్ యాజమాన్యం తమ ప్రకటనలో పేర్కొంది.
సమగ్ర విచారణ నివేదిక అందిన తర్వాత నేషనల్ మెడికల్ కమిషన్, మహారాష్ట్ర యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్, హాస్పిటల్ నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.
ప్రస్తుతం విచారణ ప్రక్రియ కొనసాగుతున్నందున అప్పుడే ఈ అంశంపై ఎలాంటి ముగింపునకు రావొద్దని విజ్ఞప్తి చేసింది.

సెజల్ పవార్ క్షమాపణలు
పురుష శవాలపై చేసిన వ్యాఖ్యల వల్ల సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్, విమర్శలు రావడంతో వైద్యవిద్యార్థిని సెజల్ పవార్ క్షమాపణలు చెప్పారు.
''నేను చాలా తప్పుగా మాట్లాడాను. అందరికీ మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నా. నా వల్ల చాలా పెద్ద తప్పు జరిగింది. దీనికి చాలా బాధపడుతున్నా'' అని సోషల్ మీడియాలో పంచుకున్న వీడియోలో సెజల్ అన్నారు.
ప్రస్తుతం వైరల్ అవుతున్న తన వ్యాఖ్యల క్లిప్ 2 నెలల కిందటదని సెజల్ తెలిపారు.
‘‘రెండు నెలల కిందటి ఈ క్లిప్ ఇంత పెద్ద వివాదానికి దారితీస్తుందని అస్సలు ఊహించలేదు. నా వ్యాఖ్యలను సమర్థించుకోను. నేను చేసింది తప్పే. సోషల్ మీడియాలో ప్రజలు నన్ను విమర్శించడం సరైనదే. వైద్యవిద్యలో మేం మృతదేహాలను ఎప్పుడూ గౌరవించేవాళ్లం. కానీ ఆ షోలో నేను అలా మాట్లాడకుండా ఉండాల్సింది. భవిష్యత్‌లో మళ్లీ ఇలాంటి తప్పు జరగకుండా చూసుకుంటాను'' అని సెజల్ అన్నారు.

ఫొటో సోర్స్, Video Grab/FACEBOOK/Pranit More Official
అసలేం జరిగింది?
ఈ గొడవంతా ప్రణీత్ మోరే షోలో హిమాన్షు జాంగ్డా అనే ఒక వ్యక్తి చెప్పిన కథతో మొదలైంది. ఒక అమ్మాయితో తాను డేటింగ్‌కు వెళ్లిన అనుభవాన్ని హిమాన్షు ఈ షోలో పంచుకున్నారు.
డేట్ సందర్భంగా ఆమెకు చికెన్ బిరియానీ కోసం 370 రూపాయలు ఖర్చు చేశానని, ఆ ఖర్చుకు బదులుగా ఆమె నుంచి సెక్సువల్ ఫేవర్ ఆశించినట్లు లేదా ఆ డబ్బును రీఫండ్ చేయాల్సిందిగా అడిగినట్లు ఆయన వివరించారు. దీనికి ప్రణీత్ మోరేతో పాటు అక్కడున్న ప్రేక్షకులు పెద్దగా నవ్వారు.ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాలలో దుమారం రేేపాయి.
ఈ క్రమంలో ప్రణీత్ మోరే షోలోనే గతంలో వైద్యవిద్యార్థిని సెజల్ శవపరీక్షల సమయంలో పురుష మృతదేహాల శరీర భాగాలపై చేసిన వ్యాఖ్యల వీడియో కూడా వైరల్ అయింది. ఆ తర్వాత ఈ వివాదం మరింత ముదిరింది.
పురుష శవాల ప్రైవేట్ భాగాలపై సెజల్ పవార్ చేసిన అభ్యంతరకర, వివాదాస్పద వ్యాఖ్యలపై నెటిజన్లు విమర్శలు చేశారు.
ఇక బిర్యానీ వ్యాఖ్యల నేపథ్యంలో హిమాన్షు జాంగ్డాను కంపెనీ ఉద్యోగం నుంచి తీసేసింది. మరోపక్క వైద్యవిద్యార్థిని సెజల్ పవార్‌పై విచారణకు కేఈఎమ్ హాస్పిటల్ ఆదేశించింది.

ఫొటో సోర్స్, VIDEO GRAB/Pranit More Official/Facebook
కేసు నమోదు
ప్రణీత్ మోరేతో పాటు హిమాన్షు జాంగ్డా, డాక్టర్ సెజల్ పవార్, ఇతరులపై జూన్ 11న మహారాష్ట్ర సైబర్ సెల్ పోలీసులు కేసు నమోదు చేశారు.
జాతీయ మహిళా కమిషన్ కూడా ఈ విషయాన్ని సుమోటోగా స్వీకరించి ప్రణీత్ మోరే, హిమాన్షు జాంగ్డాలకు సమన్లు జారీ చేసింది.
యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ అయిన వీడియో క్లిప్స్ ఆధారంగా పోలీసులు ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



























