మరణశిక్షను ఎదుర్కొంటూ 41 ఏళ్ల జైలు జీవితం గడిపిన వ్యక్తికి బెయిల్ మంజూరు... అసలేం జరిగింది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జార్జ్ రైట్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 4 నిమిషాలు
అమెరికాలో ఓ మహిళను హత్య చేసిన కేసులో మరణ శిక్షను ఎదుర్కోంటూ 41 ఏళ్ల పాటు జైలు జీవితం గడిపిన ఓ వ్యక్తి సోమవారం(సెప్టెంబర్ 28) బెయిల్‌పై విడుదలయ్యారు.
ఇటీవలే జరిపిన డీఎన్ఏ పరీక్షల్లో ఈ హత్యతో ఆయనకు ఎలాంటి సంబంధం లేదని తేలింది.
యూటా రాష్ట్రంలో 1985లో ఈవా ఒలెసెన్ అనే మహిళను హత్య చేసిన కేసులో డగ్లస్ స్టీవర్ట్ కార్టర్ జైలుపాలయ్యారు. ఇప్పుడు ఆయనకు 71 ఏళ్లు.
ఈ కేసులో కార్టర్కి మరణ శిక్ష పడింది. అయితే తనకూ, ఈ హత్యకు ఎలాంటి సంబంధం లేదని ఆయన ఎప్పుడూ చెబుతూనే ఉన్నారు. వాంగ్మూలంపై తనతో బలవంతంగా సంతకం పెట్టించారని చెప్పారు.
దర్యాప్తు అధికారులు తప్పుగా వ్యవహరించారని, ఈ కేసును మరోసారి విచారించాలని యూటా సుప్రీంకోర్టు కిందటేడాది ఆదేశించింది.

ఈ క్రమంలోనే బాధితురాలి కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ, కార్టర్‌కు సోమవారం ఓ న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు.
బెయిల్‌పై ఉన్న సమయంలో కార్టర్ ఎక్కడికి వెళ్లినా జీపీఎస్ మానిటర్ని ధరించాల్సి ఉంటుంది.
యూటాలోని ప్రొవో నగరంలో 1985 ఫిబ్రవరిలో ఒలెసెన్ తన ఇంటిలో హత్యకు గురయ్యారు. పలుమార్లు ఆమెను పొడిచి, తల వెనుక కాల్చి చంపేశారు. ఈమె స్థానిక పోలీస్ అధికారి బంధువు కూడా.
‘బలవంతంగా నేరం అంగీకరించా’
షికాగోకు చెందిన కార్టర్ ఈ హత్య జరిగిన సమయంలో యూటాలో తన తల్లితో కలిసి నివసిస్తున్నారు. దొంగతనం సమయంలో ఒలెసెన్ని కార్టర్ హత్యచేసి ఉంటారని పోలీసులు అనుమానించినట్లు కోర్టు డాక్యుమెంట్లు తెలుపుతున్నాయి.
మరొక కేసులో తనను అనుమానిస్తున్నారని భావించిన కార్టర్.. యూటా నుంచి పారిపోయారు. చివరకు టెన్నెసీ రాష్ట్రంలోని నాష్విల్ నగరంలో దొరికిపోయారు.
పోలీసుల విచారణ సమయంలో నేరాంగీకార పత్రంపై కార్టర్ సంతకం చేశారు. అయితే దానిపై తాను బలవంతంగా సంతకం పెట్టాల్సి వచ్చిందని ఆయన ఆ తర్వాత చెప్పారు.
నేరస్థలానితో కార్టర్కి సంబంధం ఉన్నట్లు ఎటువంటి భౌతిక ఆధారాలు లభించినప్పటికీ నేరాంగీకారపత్రం, ఇద్దరు సాక్షుల వాంగూల్మం ఆధారంగా కోర్టు ఆయనను దోషిగా తేల్చింది. ఈ నేరం తానే చేసినట్టు కార్టర్ గొప్పలు చెప్పుకున్నారని ఆ సమయంలో సాక్షులు కోర్టుకు తెలిపారు.
అయితే 2011లో ఆ ఇద్దరు సాక్షులు తాము అబద్ధం చెప్పామని తెలిపారు. కార్టర్కి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పకపోతే దేశం నుంచి గెంటేస్తామని పోలీసులు తమను బెదిరించి, డబ్బులు, బహుమతులు ఇచ్చి అబద్దం చెప్పించారని తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
‘పారిపోయిన వ్యక్తి ఎవరు?’
పదేళ్లకుపైగా న్యాయపోరాటం జరిగిన తర్వాత మరోసారి విచారణ జరపాలని యూటా సుప్రీంకోర్టు గతేడాది ఆదేశించింది.
కార్టర్ నల్లజాతీయుడు. ఆయన తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. " హత్య జరిగిన చోటు నుంచి ఓ తెల్ల జాతీయుడు పారిపోవడాన్నిసాక్షులు చూశారు. బాధితురాలి భర్త ఓర్లా ఒలెసెన్ ఈ హత్య చేశారని సూచించే ఆధారాలను ఓ దర్యాప్తు అధికారి కప్పిపుచ్చారు" అని చెప్పారు.
దర్యాప్తు అధికారులు ఓర్లా ఒలెసెన్పై కేసు నమోదు చేసే క్రమంలో ఓ పోలీసు అధికారి వారిని అడ్డుకున్నారు. దీంతో వారు ఈ కేసు దర్యాప్తును ముందుకు తీసుకెళ్లలేకపోయారు.
ఆ సమయంలో తమ ఇంట్లో భార్య చనిపోయి ఉండటాన్ని చూసినట్టు ఒలెసెన్ భర్త పోలీసులకు తెలిపారు. ఆయన 2009లో చనిపోయారు.
బాధితురాలిని ఆమె వంటగదిలోని కత్తితోనే పొడిచారు. అది ఆమె శవానికి సమీపంలోనే దొరికింది. అయితే గన్ మాత్రం కనిపించలేదు.
డోర్ మీద పడిన రక్తపు మరకలు, కత్తి మీద ఉన్న జన్యు అవశేషాల ఆధారంగా ఈ హత్యతో కార్టర్కి సంబంధం లేదని ఈ నెలలోనే జరిపిన డీఎన్ఏ విశ్లేషణలో తేలినట్టు న్యాయవాదులు వెల్లడించారు.
అయితే కార్టర్ విడుదల పట్ల ఒలెసెన్ కుటుంబం అసంతృప్తిగా ఉంది.
కార్టర్ విడుదలపై తమకు తీవ్రమైన ఆందోళన ఉన్నట్టు ఈవా ఒలెసెన్ కోడలు థెరెసా ఒలెసెన్ చెప్పారు. మరోసారి విచారణ జరిగే వరకు ఆయన్ను జైలులోనే ఉంచాలన్నారు.
"కచ్చితమైన ఆధారాలు లభిస్తాయనే ఆశిస్తున్నాం. డీఎన్ఏ విశ్లేషణ కార్టర్‌తో మ్యాచ్ అవ్వనప్పటికీ ఆయన అక్కడ లేడు అని చెప్పలేం" అని థెరెసా అన్నారు.
అయితే ఈ కేసును మొత్తానికే కొట్టివేయాలని కార్టర్ తరపు న్యాయవాది నీల్ హామిల్టన్ కోరారు.
"యూటా ప్రభుత్వం అనుకున్నదే జరిగి ఉంటే .. ఈ దర్యాప్తులో జరిగిన తప్పులను మేం కనిపెట్టడానికి ముందే 15-20 ఏళ్ల క్రితమే కార్టర్కి ఉరిశిక్ష పడి ఉండేది" అని ఆయన అసోసియేటెడ్ ప్రెస్‌తో అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)


























