యుగాంతం - ఏఐ: కృత్రిమ మేధ క్రీస్తు వ్యతిరేకి అని, సైతానును ఆరాధించేలా చేస్తుందని ఎందుకు నమ్ముతున్నారు?

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్రైస్తవం, క్రీస్తు, బైబిల్, టెక్నాలజీ
ఫొటో క్యాప్షన్, మానవాళికి కలిగే ఆందోళనలను సైతానుకు ముడిపెట్టడం అన్ని కాలాల్లోనూ ఉంది
    • రచయిత, లెబో డిసెకో
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 7 నిమిషాలు

‘యుగాంతంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కీలక పాత్ర పోషిస్తుంది" ఈ మాటలు మానవాళికి పొంచి ఉన్న ముప్పు గురించి హెచ్చరిస్తున్న ఏ టెక్నాలజీ నిపుణుడో అన్నవి కాదు.

అట్లాంటాకు చెందిన ప్రముఖ పాస్టర్ ఫిలిప్ ఆంథోనీ మిచెల్ వ్యాఖ్యలివి. 'యుగాంతం' అంటే ఆయన ఉద్దేశం ప్రపంచం అంతం కావడం.

మిచెల్ ఈ వ్యాఖ్యలు చేసిన ఏడాది దాటిన తరువాత కూడా ఇప్పుడు టిక్‌టాక్, పాడ్‌కాస్ట్‌లు, పుస్తకాల ద్వారా మరెంతో మంది ప్రముఖ క్రైస్తవ బోధకులు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచ వినాశనానికి కారణం కాగలదా అనే అంశంపై చర్చిస్తున్నారు.

‘‘యుగాంత పరిస్థితులలో ఏఐ కూడా ఒక భాగం కావచ్చా’’ అని మెగా చర్చ్ పాస్టర్ గ్రెగ్ లారీ ప్రశ్నిస్తున్నారు. ‘‘అది సాధ్యం కావచ్చు’’ అని కూడా ఆయన అంటున్నారు.

మరోవైపు పాస్టర్ మైక్ సిగ్నోరెల్లీ ఒక పాడ్‌కాస్ట్ శ్రోతలతో మాట్లాడుతూ ‘‘క్రీస్తు విరోధి ఎలా వెలుగులోకి వస్తుంది అనే అంశంలో ఇదికీలకమైన భాగం’’ అని హెచ్చరించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను మంచి పనుల కోసం ఉపయోగించవచ్చని ఈ పాస్టర్లందరూ అంగీకరిస్తున్నారు.

అయితే దేవుడికి బదులుగా తనను ఆరాధించేలా మోసేందుకు సైతాను కృత్రిమ మేధను ఉపయోగించవచ్చని వారు హెచ్చరిస్తున్నారు.

క్రైస్తవంలో "యుగాంతం" అనే పదం ప్రపంచం అంతానికి సంబంధించిన భవిష్య వాణిని సూచిస్తుంది. క్రీస్తు విరోధిని దేవుడికి శత్రువుగా భావిస్తారు.

సైతాను అధికారాన్ని చేజిక్కించుకున్నాక చివరకు ఏసు చేతిలో ఓడిపోతాడు. ఈ భావనలన్నీ చాలా వరకు బైబిల్‌లోని చివరిదైన "ప్రకటన గ్రంథం" ( ది బుక్ ఆఫ్ రివిలీషన్) నుంచి ఎక్కువగా ప్రభావితమయ్యాయి.

ఈ గ్రంథంలో ఏడు తలలు, పది కొమ్ములు ఉన్న "సముద్రపు మృగం" వంటి భయంకరమైన రూపాలు ఉన్నాయి. ఇవి సైతానును సూచిస్తాయని నమ్ముతారు.

చాలా మంది క్రైస్తవులు ప్రకటన గ్రంథాన్ని ఒక రూపకంగా భావిస్తారు.మరి కొందరు అవి తొలి క్రైస్తవ సంఘంపై రోమన్‌ సామ్రాజ్యం చేసిన హింసకు సంబంధించినవని చెబుతారు.

అయితే, మరికొందరు దీన్ని భవిష్య వాణిగా భావిస్తారు. వీరిలో కొందరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానవాళిని యాంటీక్రిస్ట్‌ను ఆరాధించేలా మోసం చేసే 'రెండో మృగం' లేదా 'నకిలీ ప్రవక్త' అని లేదా స్వయంగా సైతాను అని కూడా కొందరు వాదిస్తున్నారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్రైస్తవం, క్రీస్తు, బైబిల్, టెక్నాలజీ

ఆందోళనలు, అభద్రతా భావం

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని మారుస్తోందనడంలో సందేహం లేదు. దీని శక్తి, సామర్థ్యాలపై కూడా ఆందోళనలు పెరుగుతున్నాయి. ఆంథ్రోపిక్‌ సంస్థలో గతంలో పరిశోధకుడిగా పనిచేసిన జాకబ్‌ కాక్సన్‌ "సమీప భవిష్యత్తులో మనమంతా చనిపోయే అవకాశం ఉంది" అని చెప్పడం నుంచి, అభివృద్ధి వేగాన్ని తగ్గించకపోతే కృత్రిమ మేధ వల్ల కలిగే ప్రమాదాల గురించి బిగ్‌టెక్‌ సంస్థల అధిపతులు హెచ్చరించడం వరకు దీనికి ఉదాహరణలు ఉన్నాయి.

"పెద్ద ఎత్తున మార్పులు లేదా సంక్షోభాలు వచ్చినప్పుడు యుగాంతం గురించిన చర్చలు పెరుగుతాయి" అని సెయింట్ జాన్స్ సెమినరీకి చెందిన థియాలజీ ప్రొఫెసర్ నోరీన్ హెర్జ్‌ఫెల్డ్ వివరించారు.

"సమాజంలో నెలకొన్న ఒత్తిడిని అర్థం చేసుకోవడానికి ఇది ప్రజలకు ఒక మార్గాన్ని ఇస్తుంది. జరుగుతున్నది యాదృచ్ఛికం కాదని, దేవుని ప్రణాళికలో భాగమేనని భావించేలా చేస్తుంది" అని ఆమె చెబుతున్నారు.

ఉద్యోగాలపై ఏఐ ప్రభావం గతంలో పారిశ్రామిక విప్లవం తెచ్చిన మార్పుల వంటిదేనని హెర్జ్‌ఫెల్డ్ పోల్చారు. దానితో పాటు భారీ స్థాయిలో అనిశ్చితి, ఆందోళన కూడా వస్తున్నాయని ఆమె చెబుతున్నారు.

"మనం వేగంగా మారుతున్న కాలంలో జీవిస్తున్నాం. గతంలో ఎన్నడూ లేనంత వేగంగా సమాచార సాంకేతికత అభివృద్ధి చెందుతోంది" అని ఆమె అన్నారు.

"టెక్నాలజీ వల్ల ఉద్యోగాలు పోతాయని, ఇది అన్నింటినీ విప్లవాత్మకంగా మార్చేస్తుందని మనకు చెబుతున్నారు. ఇంత వేగవంతమైన మార్పులను తట్టుకోవడం ప్రజలకు చాలా కష్టం" అని హెర్జ్‌ఫెల్డ్ చెప్పారు

దీనితో పాటు నియంత్రణ కోల్పోతున్నామనే భావన కూడా ఉంది. మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన జీవితాల్లో ఒక భాగమైపోయింది.

"ఏఐ మనందరినీ నాశనం చేయడానికి 10 నుంచి 15శాతం అవకాశం ఉంది" అని సిలికాన్ వ్యాలీ ప్రముఖులు హెచ్చరిస్తున్నారు.

"దేవుడే అన్నింటినీ నియంత్రిస్తున్నాడని, ప్రతిదానికీ ఒక ఉద్దేశం ఉంటుందని, అంతా ముందే నిర్ణయమవుతుందని ప్రజలు నమ్మితే..'నేను ఈ సమయాన్ని ఎలా ఎదుర్కోవాలి? నేనేమి చేయాలి? చెడు వైపు కాకుండా మంచి వైపు ఎలా నిలబడాలి?' అని వారు ఆలోచించుకోగలుగుతారు" అని హెర్జ్‌ఫెల్డ్ అభిప్రాయపడ్డారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్రైస్తవం, క్రీస్తు, బైబిల్, టెక్నాలజీ
ఫొటో క్యాప్షన్, ఓ సర్వే ప్రకారం యుగాంతంలో జీవిస్తున్నామని నమ్ముతున్న 47శాతం మంది అమెరికన్లలో పాస్టర్ మైక్ సింగోరెల్లీ ఒకరు.

చరిత్ర పునరావృతమవుతోంది

ప్యూ రీసెర్చ్ సెంటర్ 2022 నాటి సర్వే ప్రకారం దాదాపు 40శాతం మంది అమెరికన్ వయోజనులు తాము యుగాంతంలో జీవిస్తున్నామని నమ్ముతున్నారు.

క్రైస్తవులలో ఈ సంఖ్య 47శాతంగా ఉంది. ప్రతి దశాబ్దంలోనూ ఈ ధోరణి పునరావృతమవుతుందని నిపుణుల అభిప్రాయం.

ఆయా కాలాల్లో ఉండే ఆందోళనలను క్రైస్తవ విరోధి రూపానికి ఆపాదిస్తుంటారు.

"మా అమ్మమ్మ ఫ్రాంక్లిన్ డెలానో రూజ్‌వెల్ట్‌ను క్రీస్తు వ్యతిరేకి అని నమ్మేది" అని నార్త్ కరోలినాలోని ఎలాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ జెఫ్రీ సి. పగ్ చెప్పారు. అమెరికా అధ్యక్షుడిగా రూజ్‌వెల్ట్ బాధ్యతలు చేపట్టినప్పుడు దేశం మహామాంద్యంలో ఉంది. అది తీవ్ర అనిశ్చితి, పేదరికం నెలకొన్న కాలం. దీనికి విరుగుడుగా ఆయన ప్రతిపాదించిన ‘న్యూడీల్’ను విప్లవాత్మకమైనదిగా భావించారు.

ప్రస్తుత సంఘటనలను ఒక నిర్దిష్ట బైబిల్‌ కథనంతో ముడిపెట్టేందుకు ప్రయత్నించడం ఎంత అర్థరహితంగా మారుతుందో తన అమ్మమ్మ అభిప్రాయం నిరూపిస్తుందని పగ్‌ అంటున్నారు.

అమెరికాలో యుగాంతం గురించిన చర్చలు పాతవే అయినప్పటికీ 1960ల కాలంలో ఇవి మరింత ఊపందుకున్నాయి.

"అది తీవ్ర సామాజిక అలజడుల కాలం" అని పగ్ వివరించారు.

"మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్‌తో సహా ముగ్గురు రాజకీయ నాయకులు హత్యకు గురయ్యారు. శ్వేతజాతీయుల అణచివేతపై నల్లజాతీయుల ఆగ్రహంతో నగరాలు అట్టుడికాయి. యుద్ధ వ్యతిరేక నిరసనలు, కౌంటర్-కల్చర్ ఉద్యమాల ద్వారా యువత మునుపెన్నడూ లేని విధంగా గళం విప్పారు" అని పగ్ చెప్పారు.

ఆందోళలను యుగాంతానికి ఆపాదిస్తున్నామా?

1970లలో వచ్చిన 'ది లేట్ గ్రేట్ ప్లానెట్ ఎర్త్' అనే పుస్తకం బాగా ప్రజాదరణ పొందింది.

ఇది యుగాంత ప్రవచనాలను, సమకాలీన సంఘటను, భౌగోళిక, రాజకీయ పరిణామాలతో ముడిపెట్టింది.

"ఆ క్షణం నుండి, ప్రతి సామాజిక మార్పును యుగాంతం అనే ఆలోచనతోనే ముడిపెట్టడం మొదలైంది" అని పగ్ చెప్పారు. కోల్డ్ వార్ సమయంలో సోవియట్ యూనియన్, కమ్యూనిజాన్ని క్రీస్తు వ్యతిరేకిగా చూశారు. 9/11 దాడుల తర్వాత కొందరు క్రైస్తవులు ఇస్లాంను కూడా అలాగే చూశారు.

"ఆయా కాలాల భయాలను ఈ యుగాంత కథనాలకు ఆపాదించడం సహజం" అని డాక్టర్ పగ్ చెప్పారు.

'మేడ్ ఇన్ అవర్ ఇమేజ్: గాడ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ యు' పుస్తక రచయిత ఆస్ట్రేలియా పాస్టర్ స్టీఫెన్ డ్రిస్కాల్‌ మాత్రం క్రీస్తు విరోధి అంటే ఏమిటో, ఎవరో కూడా తనకు తెలియదని అంటున్నారు.

కృత్రిమ మేధ "మనం ఇప్పటివరకు రూపొందించిన అత్యంత భయపెట్టే సాంకేతికతల్లో ఒకటి" అని ఆయన చెబుతున్నారు. అందువల్ల అది క్రీస్తు విరోధి అయ్యే అవకాశంగా మనకు కనిపించవచ్చని అంటున్నారు. అయితే, భవిష్యత్తును అంచనా వేసేందుకు బైబిల్‌ మీద ఆధారపడటం అంతగా ఉపయోగకరం కాదని ఆయన అభిప్రాయం.

"యాంటీక్రిస్ట్ ఎవరనే అంచనాల కంటే బైబిల్ మనకు చాలా ఎక్కువ విషయాలను అందిస్తుంది. ఇది మనల్ని మార్పుకు సిద్ధం చేస్తుంది. పని పట్ల సరైన దృక్పథాన్ని అందిస్తుంది. ఏఐని సరిగ్గా అర్థం చేసుకోవడానికి అవసరమైన సాధనాలను అందిస్తుంది" అని డ్రిస్కాల్ స్పష్టం చేశారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్రైస్తవం, క్రీస్తు, బైబిల్, టెక్నాలజీ

‘సకలం దేవుడి నియంత్రణలోనే’

పాత నిబంధనల్లో వ్యవసాయ రంగంలోని సాంకేతిక ఆవిష్కరణల గురించి కూడా ప్రస్తావన ఉందని డ్రిస్కాల్‌ చెబుతున్నారు. "నూర్పిడి పలకలు, వంటి వ్యసాయ సాంకేతికతల గురించి అందులో ఉంది. ఇవన్నీ దేవుడి నుంచి వచ్చినవేనని కూడా చెబుతుంది" అని ఆయన అంటున్నారు.

"దేవుడు సాంకేతిక జ్ఞానాన్ని ఇస్తాడు" రాతి యుగం నుంచి కాంస్య యుగం, ఇనుము నుంచి ఉక్కు, అణుశక్తి నుండి ఏఐ వరకు ప్రతి సాంకేతిక యుగంపై ఆయనకే అంతిమ నియంత్రణ ఉంటుంది.

పాత నిబంధనలో డానియల్ పరాయి దేశంలో ప్రవాసంలో ఉన్నప్పుడు విభిన్న సాంకేతికతలను ఉపయోగించిన పలు సామ్రాజ్యాల కింద జీవించాడని డ్రిస్కాల్ వివరించారు.

"రాబోయే సామ్రాజ్యాల ఎదుగుదలను, వాటి వల్ల జరిగే నష్టాలను అడ్డుకునే శక్తి అతనికి లేదు. కానీ అతను నమ్మకంగా ఆశతో జీవించగలిగాడు. ప్రజలను ప్రేమించాడు. ఎక్కడున్నా దేవుడికి విశ్వాసిగా ఉన్నాడు" అని డిస్క్రౌల్ చెప్పారు.

కాబట్టి యుగాంతంతో సంబంధం లేకుండా అంతిమంగా అంతా మంచే జరుగుతుందని భావించాలని ఆయన సూచించారు.

"జరిగే ప్రతిదీ మంచిదే కాకపోవచ్చు, కానీ అన్నింటికంటే ముఖ్యంగా దేవుడు మంచివాడు. సకలమూ ఆయన నియంత్రణలోనే ఉన్నాయి" అని డ్రిస్కాల్ చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)