రాజస్థాన్: ఇస్లాంపుర్ పేరును శ్రీరామ్‌పుర్‌గా మార్చాలనే సిఫార్సుపై ఆ గ్రామ ప్రజలేమంటున్నారు?

ఫొటో సోర్స్, Mohar Singh Meena
- రచయిత, మోహర్ సింగ్ మీనా
- హోదా, బీబీసీ కోసం
- ప్రచురణ
- చదివే సమయం: 8 నిమిషాలు
రాజస్థాన్‌లోని ఝున్జును జిల్లాలోని ఇస్లాంపుర్ గ్రామం రాజకీయ, సామాజిక చర్చలకు కేంద్రంగా మారింది.
ఈ గ్రామం పేరును శ్రీరాంపుర్‌గా మార్చాలనే సిఫార్సు ఇస్లాంపుర్ వీధుల నుంచి రాజధాని జైపుర్ వరకు చర్చనీయాంశమైంది.
ఒక వర్గం దీన్ని సాంస్కృతిక గుర్తింపుతో ముడిపెడుతుండగా, మరో వర్గం దీన్ని గ్రామ చరిత్ర, వారసత్వంలో జోక్యం అంటోంది.
గ్రామంలో చాలామంది భారతీయ జనతా పార్టీ సామాజిక వాతావరణాన్ని దెబ్బతీస్తోందని ఆరోపిస్తుండగా కొందరు పేరు మార్చాలనే సిఫార్సుతో ఏకీభవిస్తున్నారు.
"మొఘల్ కాలానికి ముందు ఈ గ్రామం పేరు శ్రీరాంపుర్‌గానే ఉండేది. అందుకే కొంతమంది స్థానికులు మళ్లీ అదే పేరును పెట్టాలని కోరుకుంటున్నారు" అని ఈ సిఫార్సు చేసిన స్థానిక బీజేపీ ఎమ్మెల్యే రాజేంద్ర బామ్బు బీబీసీతో చెప్పారు.
అయితే దీనికి సంబంధించిన పత్రాలు ఏవైనా చూపించమని అడగ్గా, ఆ పత్రాలను సేకరించే ప్రయత్నంలోనే ఉన్నానని ఆయన అన్నారు.


ఫొటో సోర్స్, Mohar Singh Meena
వివాదం ఎలా మొదలైంది?
ఝున్జును జిల్లా కేంద్రం నుంచి సుమారు 18 కిలోమీటర్ల దూరంలో ఇస్లాంపుర్ గ్రామం ఉంది.
ప్రభుత్వ పాఠశాల నుంచి హైవే సైన్‌బోర్డుల వరకు, ఈ గ్రామం పేరు ఇస్లాంపుర్ అనే ఉంటుంది.
ఈ గ్రామంలోని ఇరుకైన వీధులకు ఇరువైపులా పురాతన భవనాలు, శిథిలమైన కట్టడాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ వీధుల్లో ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు దాదాపు ప్రతి ఒక్కరూ ఈ అంశంపైనే విస్తృతంగా చర్చించుకుంటున్నారు.
ఇస్లాంపుర్ పేరును శ్రీరాంపుర్‌గా మార్చాలనే ప్రతిపాదన బయటకు వచ్చాక ఈ వివాదం మొదలైంది. ఆ ప్రతిపాదన వెలువడిన వెంటనే గ్రామంలో, చుట్టుపక్కల ప్రాంతాల్లో నిరసనలు చెలరేగాయి.
"2026 ఫిబ్రవరి 17న స్థానిక బీజేపీ ఎమ్మెల్యే రాజేంద్ర బామ్బు ఇస్లాంపుర్ పేరును శ్రీరాంపుర్‌గా మార్చాలని సిఫార్సు చేస్తూ ముఖ్యమంత్రికి ఒక లేఖ రాశారు. తర్వాత జూన్ 3న, తహసీల్దార్ ఫోన్ చేసి, గ్రామసభలో పేరు మార్పు తీర్మానాన్ని ఆమోదించి, దాన్ని వెంటనే పంపించాలని కోరారు" అని సర్పంచ్ అమీన్ మనియార్ బీబీసీతో చెప్పారు.
అయితే పంచాయతీలో అలాంటి తీర్మానం ఏదీ ఆమోదించలేదని సర్పంచ్ స్పష్టం చేశారు. పేరు మార్పుకు సంబంధించి ఎటువంటి తీర్మానాన్ని ఆమోదించలేదని తెలియజేస్తూ పంచాయతీ తహసీల్దార్‌కు లేఖ పంపింది.
గ్రామం పేరును మార్చాలనే సిఫార్సుపై గ్రామస్థులు ఆగ్రహంగా ఉన్నారని సర్పంచ్ అమిన్ మనియార్ కూడా ఝున్జును జిల్లా కలెక్టర్ డాక్టర్ అరుణ్ గార్గ్‌కు లేఖ రాశారు.
అప్పటి నుంచి ఈ అంశంపై గ్రామస్థుల నిరసన కొనసాగుతూనే ఉంది.

ఫొటో సోర్స్, Mohar Singh Meena
సీఎం కార్యాలయం నుంచి కలెక్టర్‌కు లేఖ
‘ఇస్లాంపుర్ గ్రామం పేరును శ్రీరాంపుర్‌గా మార్చడానికి సంబంధించి’ అనే సబ్టెక్ట్‌తో ఎమ్మెల్యే రాజేంద్ర బామ్బూ లేఖను ప్రస్తావిస్తూ మే 29న ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ కార్యాలయం ఝున్జును జిల్లా కలెక్టర్‌కు ఒక లేఖ పంపింది.
"మొఘల్ కాలంలో ఆక్రమణదారులు రాకముందు ఈ గ్రామం పేరు శ్రీరాంపుర్‌గా ఉండేది. 1990లో విశ్వ హిందూ పరిషత్ ఉత్తర ప్రత్యుత్తరాలలో కూడా శ్రీరాంపుర్ పేరు ప్రస్తావించారు" అని ఝున్జును ఎమ్మెల్యే రాజేంద్ర చెప్పారు.
తాను గ్రామస్తుల నుంచి ఆధారాలు సేకరించి సమర్పిస్తానని రాజేంద్ర అంటున్నారు.
"గ్రామంలోని హిందువుల వద్ద దీనికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. వారు కూడా గ్రామం పేరు మార్చాలని కోరుకుంటున్నారు. ఏ నిర్ణయమైనా చట్టప్రకారమే తీసుకుంటారు" అని రాజేంద్ర చెప్పారు.
‘‘ఇస్లాంపుర్ గ్రామం పేరు మార్పుకు సంబంధించి ఓ నివేదిక అందింది. పేరు మార్పుకు ఉన్న నియమనిబంధనల మేరకు సమాచారాన్ని సేకరిస్తున్నాం’’ అని కలెక్టర్ అరుణ్ గార్గ్ చెప్పారు. అలాగే పేరుమార్పుకు కొంతమంది అనుకూలంగానూ, మరికొందరు ప్రతికూలంగాను వినతిప్రతాలు సమర్పించారని, వినతిపత్రాలతోపాటు ఆధారాలు కూడా సమర్పించారని, అధికారులు రికార్డులలోని ఆధారాలను పరిశీలిస్తున్నారని , నిబంధనల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని గార్గ్ చెప్పారు.
'గ్రామం పేరుపై దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. ప్రభుత్వానికి ఇంకా ఎలాంటి నివేదిక సమర్పించలేదు. దర్యాప్తులో వెల్లడయ్యే వాస్తవాల ఆధారంగా నివేదికను సిద్ధం చేస్తాం' అని అరుణ్ గార్గ్ చెప్పారు.

ఫొటో సోర్స్, Mohar Singh Meena
గ్రామస్థులు ఏం చెప్పారు?
శోఖావాటి ప్రాంత ప్రజలు గ్రామం పేరును తమ గుర్తింపులో భాగంగా చూస్తారు. వీరికి తమ పేరు చివర గ్రామం పేరు కూడా చేర్చుకునే సంప్రదాయం ఉంది.
"గ్రామంలో అభివృద్ధి, విద్య, తాగునీరు, ఉపాధి వంటి సమస్యలు ఉన్నప్పుడు, వాటికంటే ముందు పేరు మార్చడానికే ఎందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు?" అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక వృద్ధుడు ప్రశ్నించారు.
ఈ చర్య గ్రామంలోని పరస్పర సామరస్య వాతావరణానికి నష్టం కలిగించే ప్రయత్నంగా కనిపిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇస్లాంపుర్‌కు చెందిన 66 ఏళ్ల మణిరామ్ తన ఇంట్లోనే ఒక చిన్న కిరాణా దుకాణాన్ని నడుపుతున్నారు.
ఇస్లాంపుర్ పేరును శ్రీరాంపుర్‌గా మార్చాలన్న ప్రతిపాదనను తాను వ్యతిరేకిస్తున్నానని ఆయన చెప్పారు.
"శతాబ్దాలుగా మా గ్రామం పేరు ఇస్లాంపుర్‌గానే ఉంది. ఇక్కడ హిందువులు, ముస్లింలు సోదరభావంతో జీవిస్తున్నారు" అని ఆయన అన్నారు.
గ్రామానికి చెందిన సబా ఖానం అనే యువతి బీ.ఎడ్ చదువుతున్నారు. తమ ఊరుపేరు ఇస్లాంపుర్‌గానే ఉండాలని ఆమె అంటున్నారు. ప్రజలను విభజించడానికే పేరు మార్పు అంశాన్ని వాడుకుంటున్నారని ఆమె అభిప్రాయపడ్డారు.
పేరు మార్పు అంశం ద్వారా స్థానిక బీజేపీ ఎమ్మెల్యే రాజేంద్ర ప్రజలను విభజిస్తున్నారని అరవై ఏళ్ల సోనీ దేవి ఆరోపిస్తున్నారు. దీనివల్ల గ్రామంలో ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉందని ఆమె అంటున్నారు.
భారత సైన్యంలో పనిచేసి పదవీ విరమణ చేసిన 82 ఏళ్ల కెప్టెన్ ఇస్మాయిల్ ఖాన్ కూడా ఇదే గ్రామంలో జన్మించారు. సరైన పరిశీలన, విస్తృత ఏకాభిప్రాయం లేకుండా పేరు మార్పు ప్రతిపాదనను ముందుకు నెడుతున్నారని అన్నారు.
"గ్రామస్థులు కలెక్టర్‌కు పాత పుస్తకాలు, పాత పాఠశాల రసీదులు, భూమి శిస్తు చెల్లింపు పత్రాలు, 1904 నాటి విద్యాశాఖ రిపోర్టుతో సహా అనేక ఆధారాలను అందించారు. ఈ పత్రాలన్నింటిలోనూ గ్రామం పేరు ఇస్లాంపుర్‌గానే ఉంది " అని 52 ఏళ్ల ఇబ్రహీం ఖాన్ బీబీసీకి తెలిపారు.

ఫొటో సోర్స్, Mohar Singh Meena
ఈ వివాదం ఇప్పుడు కేవలం గ్రామానికే పరిమితం కాలేదు. చర్చల స్థాయిని దాటి పేరు మార్పును నిరసిస్తూ ప్రజలు వీధుల్లోకి వచ్చారు. జూన్ 15న గ్రామస్థులు సుమారు 18 కిలోమీటర్లు పాదయాత్ర చేసి, జిల్లా కలెక్టర్‌కు ఒక వినతిపత్రాన్ని సమర్పించారు.
గ్రామస్థుల నిరసనకు మాజీ మంత్రి, జిల్లా రాజకీయాలలో పలుకుబడి కలిగిన రాజేంద్ర సింగ్ గుఢా మద్దతు తెలిపారు. ప్రజల్లో హింసను ప్రేరేపించడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు.
"పాదయాత్ర చేసి జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించాం. వందేళ్లకు పైగా పాతవైన పత్రాలను ఆయనకు ఇచ్చాం. అందులో గ్రామం పేరు ఇస్లాంపుర్ అనే ఉంది" అని సర్పంచ్ అమీన్ మనియార్ అన్నారు.
"మా డిమాండ్లు నెరవేర్చకపోతే, జైపుర్‌కు పాదయాత్ర చేసి రాజస్థాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తాం ఆమరణ నిరాహార దీక్ష కూడా చేస్తాం" అన్నారు.
అయితే ఈ విషయంలో ప్రభుత్వ యంత్రాంగం ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోదని కలెక్టర్ హామీ ఇచ్చారని సర్పంచ్ తెలిపారు.
"నేను ఎమ్మెల్యేను కలిసి పేరు మార్పుపై నా వ్యతిరేకతను తెలియజేశాను. కానీ ప్రభుత్వం గ్రామం పేరు మార్చాలని కోరుకుంటోందని ఆయన చెప్పారు" అని మనియార్ అన్నారు.

ఫొటో సోర్స్, Mohar Singh Meena
మరోవైపు ఇస్లాంపుర్ స్థానికులలో కొంతమంది శ్రీరాంపుర్‌గా పేరు మార్చడానికి మద్దతు తెలుపుతున్నారు.
సుమారు ఐదు వేల మంది ఈ పేరు మార్పుకు మద్దతు ఇస్తున్నారని ఇస్లాంపుర్‌కు చెందిన సుమేర్ సింగ్ చెప్పారు.
"ఈ గ్రామాన్ని గతంలో శ్రీరాంపుర్ అని పిలిచేవారు, కానీ మొఘలుల కాలంలో దీనికి సలాంపుర్ అని పేరు మార్చారు. 1958లో పంచాయతీ రాజ్ కాలంలో పలుకుబడి ఉన్న పఠాన్ ప్రజలు ఈ గ్రామం పేరును ఇస్లాంపుర్‌గా మార్చారు" అని ఆయన బీబీసీకి చెప్పారు.
"గ్రామం పేరు శ్రీరాంపుర్‌గానే ఉండాలి. దీనికి మద్దతుగా కొన్ని ఆధారాలను కూడా సేకరిస్తున్నాం. వాటిని త్వరలోనే ప్రభుత్వానికి సమర్పిస్తాం" అని సుమేర్ సింగ్ అంటున్నారు.
గ్రామానికి చెందిన మరో వ్యక్తి సౌరభ్ యోగి బీబీసీతో మాట్లాడుతూ "మాకు శ్రీరాంపుర్ అనే పేరే కావాలి. ఎన్నికల సమయంలోనే మా ఎమ్మెల్యే ముందు ఈ డిమాండ్ పెట్టాం. గ్రామం పేరు గతంలో శ్రీరాంపుర్‌గానే ఉండేది. రెండు రోజుల్లో హరిద్వార్‌కు వెళ్తున్నాం. అక్కడి నుంచి కూడా మా పూర్వీకులకు సంబంధించిన రికార్డులు తీసుకొస్తాం. మళ్లీ మా గ్రామం పేరును శ్రీరాంపుర్‌గా మార్చే వరకు విశ్రమించం" అన్నారు.

ఫొటో సోర్స్, Mohar Singh Meena
బీజేపీపై ఆరోపణలు
"పేరు మార్చడం ద్వారా వివాదం సృష్టించి గ్రామ వాతావరణాన్ని చెడగొట్టాలని కొందరు చూస్తున్నారు" అని మణిరామ్ అంటున్నారు.
‘‘భారతీయ జనతా పార్టీ విధానాల్లో పేర్లు మార్చడం ఒక భాగంగా ఉంది. ఇప్పుడు అదే విధానాన్ని మా గ్రామంలో అమలు చేయాలని చూస్తున్నారు" అని చెప్పారు సర్పంచ్ అమీన్ మనియార్.
‘‘చావడానికైనా సిద్ధమే కానీ పేరు మాత్రం మారనివ్వం’’ అని అరవై ఏళ్ల సోనీ దేవి అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇస్లాంపుర్ శివార్లలో నివసించే 82 ఏళ్ల రిటైర్డ్ కెప్టెన్ ఇస్మాయిల్ ఖాన్ ఆ ప్రాంతంలో తమ కుటుంబమే ఏకైక ముస్లిం కుటుంబమని చెప్పారు.
"నాకు ఎలాంటి సమస్యలు లేవు, మేమందరం సోదరభావంతో జీవిస్తున్నాం. మా మధ్యే ఎలాంటి సమస్యలు లేనప్పుడు, గ్రామం పేరు ఎందుకు సమస్య కావాలి?" అని ఆయన అన్నారు.
"పేరు మార్చాల్సిందే అనుకుంటే ముందుగా ప్రజల అభిప్రాయం తీసుకోవాలి. ప్రజల సమ్మతి ఉంటే పేరు మార్చవచ్చు. అలా చేస్తే ఉద్రిక్త వాతావరణం ఏర్పడేది కాదు. ఇది రాజకీయ లబ్ధి కోసం వాతావరణాన్ని పాడుచేసే ప్రయత్నం" అని ఇబ్రహీం ఖాన్ అన్నారు.
హిందూ, ముస్లింలను విభజించడానికి ఈ సమస్యను వాడుకుంటున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. బీబీసీ ప్రశ్నపై ఎమ్మెల్యే రాజేంద్రమాట్లాడుతూ, "అలాంటిదేమీ లేదు. మా జిల్లాలో సామరస్య వాతావరణం ఉంది. గతంలో ఉన్న సోదరభావం ఈనాటికీ కొనసాగుతోంది" అన్నారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




























