గ్రీన్ బూట్: ఎవరెస్ట్ మీద 30ఏళ్లుగా పడి ఉన్న పర్వతారోహకుడి మృతదేహాన్ని తెచ్చే ప్రయత్నాలు ఏమవుతాయి, ఆయన కుటుంబం ఏమంటోంది?

పర్వతారోహణ, ఎవరెస్ట్, మోరూప్ , లద్దాఖ్, పర్యటన

ఫొటో సోర్స్, Supplied

ఫొటో క్యాప్షన్, మోరూప్‌దిగా చెబుతున్న ఆకుపచ్చ రంగు బూట్లు ధరించిన మృతదేహ ఎవరెస్ట్ శిఖరాగ్రానికి వెళ్లే మార్గంలో ఒక విషాద చిహ్నంలా కనిపిస్తుంది.
    • రచయిత, జహంగీర్ అలీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 6 నిమిషాలు

'గ్రీన్ బూట్స్' అని పిలిచే ఒక మృతదేహం గత 30 సంవత్సరాలుగా ఎవరెస్ట్ శిఖరాగ్రానికి కొద్ది దూరంలో మంచులో పడి ఉంది.

ఒక బండరాయి కింద చిక్కుకుని మరణించిన భారతీయ పర్వతారోహకుడికి ‘గ్రీన్ బూట్స్’ అనే మారుపేరు వచ్చింది. ఆయన ధరించిన ఆకుపచ్చ బూట్లు ఇప్పటికీ ఆయన కాళ్లకే ఉన్నాయి.

మూడు దశాబ్దాలుగా ఆయన మృతదేహం ఈ శిఖరంవైపు వెళ్లే వారికి ఒక విషాద చిహ్నంగా నిలిచింది.

ఆ మృతదేహాన్ని వెనక్కి తీసుకురావడానికి భారత ప్రభుత్వానికి చెందిన సైనిక విభాగం ఐటీబీపీ ఇప్పుడు ఒక సహాయక బృందం కోసం వెతుకుతోంది.

ప్రభుత్వ చర్యలు సఫలమై ఆ మృతదేహం కుటుంబానికి చేరితే, ఆ కుటుంబం తమ బాధ నుంచి కాస్త ఉపశమనం పొందడానికి సహాయపడవచ్చు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
పర్వతారోహణ, ఎవరెస్ట్, మోరూప్ , లద్దాఖ్, పర్యటన

ఫొటో సోర్స్, Family handout

ఫొటో క్యాప్షన్, లాన్స్‌లాయక్ దోర్జే మోరూప్ ఒక ఔత్సాహికుడైన ఒక పర్వతారోహకుడు కూడా.

అది 1996. భారత్ నుంచి ఎవరెస్ట్ శిఖరాన్ని దాని ఉత్తర దిశ (టిబెట్ వైపు) నుంచి అధిరోహించే మొట్టమొదటి యాత్రలో పాల్గొనడానికి బయలుదేరే ముందు రాత్రి దోర్జే మోరుప్ లద్దాఖ్‌లోని తన ఇంట్లో భార్య కొంచోక్ యాంగ్‌స్కిట్‌తో గడిపారు.

ఒక వీరుడిగా తిరిగి వచ్చి దేశానికి కీర్తిని తెస్తానని ఆయన తన భార్యకు మాట ఇచ్చారు.

హిమాలయ పర్వత సానువుల్లోని ఒక మారుమూల ప్రాంతంలో ఉన్న తన ఇంటి నుంచి ఆయన భార్య యాంగ్‌స్కిట్ బీబీసీతో మాట్లాడారు.

‘‘పిల్లలను జాగ్రత్తగా చూసుకోమని, తాను తిరిగి వచ్చినప్పుడు విమానాశ్రయానికి వచ్చి ఆహ్వానించమని ఆయన నాతో చెప్పారు’’ అని ఆమె గుర్తు చేసుకున్నారు.

ఆ సమయంలోనే తనకు ఏదో తెలియని ఆందోళన కలిగిందని, ఆయనను మళ్లీ చూడగలనా లేదా అని అనిపించిందని ఆమె అన్నారు.

ఆ సంవత్సరం మే 10న, భారత్ తరఫున ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడానికి ప్రయత్నిస్తున్న ఆరుగురు పర్వతారోహకులలో మోరుప్ ఒకరు. ఎవరెస్ట్ శిఖరం నేపాల్, చైనా ఆధీనంలో ఉన్న టిబెట్ ప్రాంతపు సరిహద్దులో విస్తరించి ఉంది.

చాలామంది పర్వతారోహకులు ఎవరెస్ట్‌ను అధిరోహించడానికి నేపాల్ లేదా దక్షిణంవైపు మార్గాన్ని ఎంచుకుంటారు. ఉత్తరంవైపు అంటే టిబెట్‌వైపు మార్గం చాలా ఏటవాలుగా ప్రమాదకరంగా ఉంటుంది.

పర్వతారోహణ, ఎవరెస్ట్, మోరూప్ , లద్దాఖ్, పర్యటన
ఫొటో క్యాప్షన్, మోరూప్ పాత ఫోటోలు

మంచు తుపాను కారణంగా ఈ యాత్రలో పాల్గొంటున్న ఆరుగురిలో ముగ్గురు వెనుదిరిగారు, కానీ మోరూప్, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) బృందంలోని మరో ఇద్దరు సభ్యులైన లుత్సెవాంగ్ సమన్లా, త్సెవాంగ్ పాల్జోర్‌లు మాత్రం యాత్ర ఆపకుండా కొనసాగించారు.

అయితే, వారు కిందికి దిగుతున్నప్పుడు మంచు తుపానులో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు.

విఫలమైన ఈ యాత్రలో ఆ ఇద్దరు సభ్యుల మృతదేహాలు ఇప్పటికీ లభ్యం కాలేదు. ఇక ‘గ్రీన్ బూట్స్’గా ప్రసిద్ధమైన ఆ మూడో సభ్యుడి మృతదేహం మాత్రం గత మూడు దశాబ్దాలుగా మంచులో గడ్డకట్టి ఉంది.

ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించే ప్రయత్నంలో 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వీరిలో చాలామంది మృతదేహాలు ఇప్పటికీ ఆ పర్వతంపైనే ఉన్నాయి.

పర్వతారోహణ, ఎవరెస్ట్, మోరూప్ , లద్దాఖ్, పర్యటన
ఫొటో క్యాప్షన్, తండ్రి ఫోటోను చూస్తున్న మోరుప్ పెద్ద కుమారుడు దోర్జే పుంచోక్

కొన్నేళ్ల కిందటి నుంచి ఆ మృతదేహాన్ని వెనక్కి తీసుకువచ్చే అవకాశాన్ని ఐటీబీపీ పరిశీలించడం ప్రారంభించింది.

ఆ గ్రీన్‌బూట్స్ మృతదేహం ఆ ముగ్గురిలో ఒకరైన త్సేవాంగ్ పాల్జోర్‌ది అని మొదట భావించారు. అయితే, 2024లో అధికారులు తమ అభిప్రాయాన్ని మార్చుకున్నారు.

అప్పటి యాత్రలో ప్రాణాలతో బయటపడిన వారి వాంగ్మూలాలు, పర్వతారోహకులతో చివరిసారిగా రేడియో సంభాషణ జరిగిన ప్రదేశానికి సంబంధించిన సమాచారం ఆధారంగా ఈ విషయాన్ని తిరిగి పరిశీలించారు. ఇప్పుడు ఆ అవశేషాలు మోరూప్‌వి అని అధికారులు నమ్ముతున్నారు.

"ఆయన దుస్తులు, వస్తువులు ఆయన్ను గుర్తించడంలో సహాయపడ్డాయి" అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక ఐటీబీపీ అధికారి బీబీసీతో అన్నారు.

మృతదేహాన్ని వెలికితీసే ఆపరేషన్‌ను ప్రారంభించడంలో గతంలో రవాణా సౌకర్యాలు పెద్ద సమస్యగా ఉన్నాయని ఆ అధికారి చెప్పారు.

‘‘మేం ఆయన్ను ఎప్పుడూ మర్చిపోలేదు. మృతదేహాన్ని వెలికితీసి, అన్ని లాంఛనాలు పూర్తయిన తర్వాత కుటుంబానికి సమాచారం అందిస్తాం’’ అని ఆయన అన్నారు.

పర్వతారోహణ, ఎవరెస్ట్, మోరూప్ , లద్దాఖ్, పర్యటన
ఫొటో క్యాప్షన్, మోరుప్ భార్య యాంగ్‌స్కిట్

‘‘ఆయన చనిపోయారంటే నమ్మడానికి నా మనసు సిద్ధంగా లేదు’’

మోరుప్ కుటుంబం ఎవరెస్ట్‌కు పశ్చిమాన 1,000 కిలోమీటర్లకు పైగా దూరంలో లద్ధాఖ్‌లో స్కుర్బుచన్ గ్రామంలో నివసించేది. భారత-చైనా సరిహద్దులో రక్షణ బాధ్యతలు చూసే ఐటీబీపీలో మోరూప్ 'లాన్స్ నాయక్'గా పనిచేశారు.

ఒక రైతు కుటుంబంలో 1948లో జన్మించిన మోరుప్, పేదరికం నుంచి బయటపడేందుకు 1969లో ఐటీబీపీలో చేరారు. 1971లో యాంగ్‌స్కిట్‌ను వివాహం చేసుకున్నారు.

సుమారు 75 ఏళ్ల వయసున్న యాంగ్‌స్కిట్ ఇప్పుడు షుగర్, వినికిడి లోపంతో బాధపడుతున్నారు. ఆమెకు తన పెళ్లి రోజు కూడా సరిగ్గా గుర్తులేదు.

అయినప్పటికీ, ఆ విషాద సంఘటన తర్వాత జరిగిన రోజులు ఆమె జ్ఞాపకాల్లో ఇంకా ఉన్నాయి. ‘‘మొదట్లో కుటుంబంలో ఎవరూ నాకు ఏమీ చెప్పలేదు’’ అన్నారామె.

మోరుప్ బహుశా మరణించి ఉండొచ్చని కుటుంబ సభ్యులకు తెలియజేసింది ఐటీబీపీ.

‘‘ఆయన మృతదేహం ఏమైందని అధికారులను అడిగినప్పుడు, దానిని తిరిగి తీసుకురావడం సాధ్యం కాదని వారు చెప్పారు" అని భారత సైన్యంలో పనిచేసి పదవీ విరమణ పొందిన మోరుప్ సోదరుడు తాషి సోనం అన్నారు.

మృతదేహం లేకుండానే అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు, బంధువులు నిర్ణయించుకున్నారు.

యాంగ్‌స్కిట్‌కు చదువు రాదు. తన భర్త మొదలుపెట్టిన ఆ సాహసయాత్రలో ఉండే ప్రమాదాల గురించి ఆమెకు ఏమీ తెలియదు.

‘‘పర్వతంపై తుపాను వచ్చిందని మాత్రమే నాకు తెలుసు. మేం ఇంట్లోనే అంత్యక్రియలకు సంబంధించిన పూజలు చేశాం. కానీ ఆయన చనిపోయాడన్న విషయాన్ని నా మనసు అంగీకరించలేదు. ఆయన మృతదేహాన్ని చూడలేదు, అందుకే ఆ విషయాన్ని నమ్మడం నాకు కష్టంగా అనిపించింది" అన్నారు యాంగ్‌స్కిట్

పర్వతారోహణ, ఎవరెస్ట్, మోరూప్ , లద్దాఖ్, పర్యటన
ఫొటో క్యాప్షన్, మోరుప్ కుటుంబం మృతదేహం కోసం ఎదురుచూస్తోంది.

మృతదేహాన్ని తిరిగి తీసుకురావడం ఎంత కష్టం?

మౌంట్ ఎవరెస్ట్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం. దీని ఎత్తు 8,849 మీటర్లు. మృతదేహం 8,500 మీటర్ల ఎత్తులో ఉంది. సెప్టెంబర్ నాటికి మృతదేహాన్ని వెలికితీయాలని ఐటీబీపీ యోచిస్తోంది.

పర్వతారోహణ సీజన్‌లో ఒకటైన సెప్టెంబర్‌లో మృతదేహాన్ని వెలికితీయాలంటే తాళ్లు బిగించడం, ఇతర అవసరమైన ఏర్పాట్లు చేయడం వంటివి చేయాల్సి ఉంటుందని, ఇది చాలా కష్టమైన పని అని షెర్పా వర్గాలు బీబీసీ‌కి తెలిపాయి.

పర్వతారోహకులు సాధారణంగా మార్చి, మే నెలల మధ్య పర్వతారోహణ చేయడానికి ఇష్టపడతారు.

‘డెత్ జోన్’ నుంచి మృతదేహాలను వెలికితీయడం ప్రమాదకరమైన, ఖర్చుతో కూడుకున్న పని. ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు -40°C వరకు పడిపోవచ్చు. ఆక్సిజన్ స్థాయి సముద్ర మట్టంలో ఉన్నదానిలో మూడింట ఒకవంతు మాత్రమే ఉంటుంది. చాలా కుటుంబాలకు ఈ ఖర్చును భరించడం సాధ్యం కాదు.

నిపుణుల అభిప్రాయం ప్రకారం, మృతదేహాలను కిందికి తీసుకురావడానికి సుమారు 35 నుంచి 75 లక్షల రూపాయల ఖర్చు కావొచ్చు. మృతదేహాన్ని భౌతికంగా కిందికి మోసుకెళ్లాల్సి ఉన్నందున ఈ పని మరింత కష్టం.

దీనికి ఆరుగురి నుంచి పదిమంది లేదా అంతకంటే ఎక్కువమంది ఉన్న షెర్పాల బృందం అవసరం కావచ్చు.

పర్వతారోహణ, ఎవరెస్ట్, మోరూప్ , లద్దాఖ్, పర్యటన

ఫొటో సోర్స్, Family handout

ఫొటో క్యాప్షన్, ఎవరెస్ట్ శిఖరాన్ని మోరూప్ విజయవంతంగా అధిరోహించినట్లు ధృవీకరిస్తూ చైనా ప్రభుత్వం జారీ చేసిన ధృవీకరణ పత్రం.

ఇది చాలా కష్టమైన పని అని నేపాల్‌కు చెందిన ప్రముఖ పర్వతారోహకుడు, యాత్రల మార్గదర్శి అయిన షెరింగ్ జాంగ్బు షెర్పా అన్నారు.

‘‘వాతావరణం, మంచు పరిస్థితులు కీలకం. ఉత్తరంవైపున మంచు పగుళ్లు తక్కువగా ఉన్నప్పటికీ, అది మరింత ప్రమాదకరం. ఒకవేళ నేపాల్ వైపు ఏదైనా సమస్య వస్తే, హెలికాప్టర్ ద్వారా త్వరగా తరలించవచ్చు. చైనా‌వైపు అలాంటి ఏర్పాటు ఏదీ లేదు" అని అన్నారు.

మృతదేహాన్ని వెలికితీసే ఆపరేషన్‌ను ప్లాన్ చేసేటప్పుడు, దాని ప్రస్తుత భౌతిక పరిస్థితిని కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఫోరెన్సిక్ నిపుణులు చెబుతున్నారు.

మృతదేహాన్ని వెలికితీయడం తమపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనని మోరూప్ కుటుంబం ఆందోళన చెందుతోంది. మృతదేహం గుర్తింపును నిర్థరించడానికి డీఎన్ఏ మ్యాపింగ్ ఇంకా చేయలేదు.

‘‘కొన్ని సంవత్సరాల కిందట ఐటీబీపీ మా బ్లడ్ శాంపిల్స్‌ను సేకరించింది. కానీ సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న చర్చలు తప్ప, మాకు ఎవరూ ఏమీ చెప్పలేదు’’ అని బీబీసీతో మోరూప్ కుమారులలో ఒకరైన దోర్జయే అన్నారు.

పర్వతారోహణ, ఎవరెస్ట్, మోరూప్ , లద్దాఖ్, పర్యటన
ఫొటో క్యాప్షన్, దోర్జే మోరూప్ కుటుంబం ఉండే స్కూర్బుచాన్ గ్రామం ఒక మారుమూల ప్రాంతంలో ఉంది.

మోరూప్ ఇంట్లో ఆయనకు సంబంధించిన జ్ఞాపకాలుగా మిగిలి ఉన్నవి కేవలం ఆయన పతకాలు, ట్రోఫీలు, ఆయన పర్వతారోహణ యాత్రలకు సంబంధించిన కొన్ని పాత ఫోటోలు, కశ్మీర్‌ లోయలో ఆయన కొన్న ఒక గ్లాసు మాత్రమే.

అన్నింటికన్నా ముఖ్యమైనది చైనా ప్రభుత్వం జారీ చేసిన ఒక ధృవపత్రం. అందలో మోరూప్ 1996 మే 10వ తేదీన సాయంత్రం 5:30 గంటలకు ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకున్నట్లు ఉంది.

మోరూప్ టిబెట్‌వైపు నుండి ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకున్నారు. అందువల్ల ఆయన సాధించిన ఈ ఘనతకు గుర్తింపుగా చైనా ప్రభుత్వం ఈ ధృవపత్రాన్ని ప్రదానం చేసింది.

పర్వతారోహణ, ఎవరెస్ట్, మోరూప్ , లద్దాఖ్, పర్యటన
ఫొటో క్యాప్షన్, చాలా ఏళ్లుగా తన సోదరుడు కలలో కనిపిస్తున్నాడని మోరుప్ సోదరుడు తాషి సోనం చెబుతున్నారు.

'ఇన్నేళ్లుగా మీరు ఎక్కడ ఉన్నారు?' అని అడుగుతా...: యాంగ్ స్కిట్

ప్రతి సంవత్సరం మే 10న మోరుప్ కుటుంబం ఆయన జ్ఞాపకార్థం ప్రత్యేక బౌద్ధమత ప్రార్థనలు నిర్వహిస్తుంది.

ఆయన భౌతికకాయాన్ని తిరిగి తీసుకువచ్చే ప్రయత్నం విజయవంతమైతే, లద్దాఖ్ రాజధాని లేహ్‌లోని 'మార్టైర్స్ పార్క్' (అమరవీరుల స్మారకం ) సమీపంలో అంత్యక్రియలు నిర్వహిస్తామని మోరుప్ మరో కుమారుడు పంచోక్ దోర్జీ బీబీసీతో అన్నారు.

"మా నాన్న దేశం కోసం ప్రాణాలర్పించారు, ఆయనను ఒక అమరవీరుడిగా గుర్తించి గౌరవించాలి" అని దోర్జీ అన్నారు. అదే సమయంలో ప్రాణాలు కోల్పోయిన తన తండ్రి సహచరులకు కూడా అటువంటి గౌరవమే దక్కాలని ఆయన పేర్కొన్నారు.

మోరుప్ జ్ఞాపకార్థం ఆయన 'సమ్మిట్ సర్టిఫికేట్' (శిఖరాగ్ర యాత్ర ధృవీకరణ పత్రం)తో పాటు ఆయనకు సంబంధించిన ఒక గుర్తును ఇంట్లో గర్వంగా భద్రపరుస్తామని ఆయన చెప్పారు. "ఆ 'గ్రీన్ బూట్స్'‌ను మా దగ్గరే ఉంచుకోవాలని అనుకుంటున్నాం" అని ఆయన తెలిపారు.

ఆ భౌతికకాయాన్ని వెలికితీసే ప్రయత్నం విజయవంతమై, చివరికి మోరుప్ మృతదేహం ఇంటికి చేరుకుంటుందని భార్య యాంగ్స్‌కిట్, సోదరుడు సోనమ్, కుటుంబ సభ్యులందరూ ఆశాభావంతో ఉన్నారు.

అయితే, మూడు దశాబ్దాల పాటు పర్వతంపై ఉండిపోయిన ఆ మృతదేహాన్ని గుర్తించడం సాధ్యమవుతుందా అనే ఆందోళన కూడా వారిలో ఉంది.

‘‘ఆయన ఇంటికి వచ్చినప్పుడు, ఇన్నేళ్లుగా మీరు ఎక్కడ ఉన్నారు? అని నేను ఆయన్ని అడుగుతాను’’ అని ఉద్వేగంతో అన్నారు యాంగ్స్‌కిట్.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)