ఇథనాల్ కలిపిన పెట్రోల్ వాడితే బండి మైలేజ్ తగ్గిపోతుందా? వాహనం పాడైతే ఇన్సూరెన్స్ వర్తించదా? 10 ప్రశ్నలు - సమాధానాలు

ఫొటో సోర్స్, ANI
- రచయిత, గుల్షన్‌కుమార్ వన్‌కర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 6 నిమిషాలు
మీ కారు లేదా బైక్ ట్యాంకులోని ఇంధనంలో పెట్రోల్ శాతం ఎంత, ఇథనాల్ శాతం ఎంత? ఇథనాల్ వల్ల వాహనాల మైలేజీ తగ్గిపోతుందా? భవిష్యత్తులో కేవలం ఇథనాల్‌తోనే నడిచే వాహనాలే వస్తాయా?
ఈ మధ్య కాలంలో మీ మనసులో కూడా ఇలాంటి ప్రశ్నలు ఏవైనా వచ్చాయా, ఎందుకంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా వీటిపైనే ఎక్కువగా చర్చ జరుగుతోంది.
ఇంతకీ ఇథనాల్ అంటే ఏమిటి? ఇ 85 ఇంధనాన్ని ఏ వాహనాల్లో వాడొచ్చు?


ఫొటో సోర్స్, ANI
1. ఇథనాల్ అంటే?
ఇథనాల్ ఒక రకమైన ఆల్కహాల్.
'ఇథైల్ ఆల్కహాల్' నుంచి ఇది వచ్చింది. దీని రసాయన ఫార్ములా C2H5OH.
ఈ ద్రవ పదార్ధానికి ఎలాంటి రంగు లేకుండా, పారదర్శకంగా ఉంటుంది.
ఇథనాల్‌ను చెరకు, మొక్కజొన్న నుంచి తయారు చేస్తారు. త్వరగా మండే స్వభావం కలిగి ఉండటం వల్ల, దీనిని పెట్రోల్‌లో కలిపి ఇంధనంగా వాడటాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఇలా కలపడాన్ని 'బ్లెండింగ్' అంటారు. ఇంధనలో ఇథనాల్ కలిపిన పరిమాణం ఆధారంగా వాటి శాతాన్ని తెలుపుతారు. అంటే పెట్రోెల్‌లో 10 శాతం ఇథనాల్ కలిపితే అది ఇ10 అవుతుంది, 20 శాతం కలిపితే ఇ20 అవుతుంది.
2. ఇథనాల్ బ్లెండింగ్ ఎందుకు?
కేవలం లాభం కోసమే పాలలో నీళ్లు కలపడాన్ని కల్తీ అంటారు. అదే ఒక పదార్థాన్ని మరొక పదార్థంతో కావాలని, అన్నిరకాల పరీక్షలు చేసిన తర్వాత కలిపితే దానిని 'బ్లెండింగ్' లేదా 'మిశ్రమం' అంటారు.
ఇథనాల్ మిశ్రమాన్ని అన్ని జాగ్రత్తలు తీసుకుని, పూర్తి సమీక్షల తర్వాతే చేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. దీనికి సంబంధించి ప్రభుత్వం కొన్ని కారణాలను వివరించింది.
భారత్ ముడి చమురును విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది, దీని కోసం డాలర్ల రూపంలో చెల్లింపులు చేయాల్సి వస్తోంది. ఒకవేళ ఇంధనంలో 20 శాతం ఇథనాల్ కలిపితే, అంతే పరిమాణంలో స్వచ్ఛమైన పెట్రోల్, ముడి చమురు అవసరం తగ్గుతుంది. దీనివల్ల డాలర్లు ఆదా అవుతాయి.
మొక్కజొన్న, చెరకు నుంచి ఇథనాల్ ఉత్పత్తి అవుతుంది. అందుకే, వ్యవసాయ రంగం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కూడా ఈ ఉత్పత్తిలో భాగస్వాములు అవుతున్నాయి.
కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం, జూన్ 2026 నాటికి దేశవ్యాప్తంగా ఉన్న చెరకు, మొక్కజొన్న రైతులు దీని ద్వారా 1.58 లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని పొందారు. పెట్రోల్‌తో పోలిస్తే ఇథనాల్ మండినప్పుడు తక్కువ పొగ వస్తుంది. దీనివల్ల కార్బన్ డై ఆక్సైడ్, ఇతర గ్రీన్‌హౌస్ వాయువుల మొత్తం ఉద్గారాలను 61 శాతం వరకు తగ్గించవచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

ఫొటో సోర్స్, Sanchit Khanna/Hindustan Times via Getty Images
3. ఇథనాల్ బ్లెండింగ్: ప్రభుత్వ లక్ష్యం ఏమిటి?
భారత ప్రభుత్వం 2014లో పెట్రోల్‌లో 1.5 శాతం ఇథనాల్‌ను కలపడం ప్రారంభించింది. జూన్ 2022 నాటికి 10 శాతం ఇథనాల్ కలపాలనే లక్ష్యాన్నిసాధించారు. ఆ తర్వాత 2023లో దీనిని 20 శాతానికి పెంచారు. 2025 నాటికే దేశవ్యాప్తంగా ఇ20 బ్లెండింగ్ లక్ష్యాన్ని విజయవంతంగా సాధించినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
నిజానికి, దీని కోసం మొదట 2030 సంవత్సరాన్ని గడువుగా నిర్ణయించారు. ప్రస్తుతం భారతదేశంలో విక్రయిస్తున్న, బీఎస్6 ఉద్గార నిబంధనలను పాటించే పెట్రోల్ వాహనాలలో ఇ20 (అంటే 20 శాతం ఇథనాల్ ఉన్న పెట్రోల్) వాడటానికి అనుమతి ఉంది. అంతకంటే ఎక్కువ ఇథనాల్ పరిమాణం ఉన్న ఇంధనం ఈ వాహనాలకు సరిపోదు.
4. మైలేజీ తగ్గుతుందా?
పెట్రోల్‌తో పోలిస్తే ఇథనాల్‌లో శక్తి (ఎనర్జీ) తక్కువగా ఉంటుంది. ఇదే కారణం వల్ల మీ బైక్ లేదా కారు మైలేజీ తగ్గే అవకాశం ఉంది.
వాహన ఇంజిన్‌లో కొన్ని సాంకేతిక మార్పులు చేయడం, కొన్ని అదనపు విడిభాగాలు అమర్చడం ద్వారా దీనిని సరిచేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.
అయితే ప్రస్తుతం ఈ సాంకేతికత అన్నిచోట్లా అందుబాటులో లేదు.
ఇ20 ఇంధనం వల్ల వాహనాల మైలేజ్ కేవలం 2 నుంచి 6 శాతం మాత్రమే తగ్గుతుందని భారత ప్రభుత్వం వాదిస్తోంది.
కానీ, వాహనాలను వాడుతున్న అసలైన వినియోగదారులు మాత్రం 30 నుంచి 50 శాతం వరకు మైలేజీ పడిపోయిందని ఫిర్యాదు చేస్తున్నారు.

5. ఇ85 అంటే ఏమిటి?
20 శాతం ఇథనాల్ ఉన్న పెట్రోల్‌ను ఇ20 అన్నట్లే, 85 శాతం ఇథనాల్ ఉన్న పెట్రోల్‌ను ఇ85 అని పిలుస్తారు. దేశంలో ఇ85 ఇంధనాన్ని 5 జూన్ 2026న ప్రారంభించారు. దీని ధర సాధారణ ఇ20 పెట్రోల్ కంటే లీటరుకు 20 రూపాయలు తక్కువ.
కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి మాట్లాడుతూ, "కొన్ని విషయాల్లో ఇ85 బెటర్. కానీ ఇంధన శక్తి నిల్వ సామర్థ్యం వంటి వాటిని పరిగణనలోకి తీసుకుంటే ఇంజిన్ పవర్ తగ్గుతుంది. అయితే ధర పరంగా లభిస్తున్న రాయితీ, ఈ పవర్ లేదా శక్తి లోపాన్ని భర్తీ చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు" అని పేర్కొన్నారు.
అంటే, ఈ ఇంధనం 20 శాతం చౌకగా ఉన్నప్పటికీ.. ఇ85 ఇంధనం కానీ, దానితో నడిచే వాహనాలు కానీ ప్రస్తుతం అన్ని చోట్లా అందుబాటులో లేవు.
జూన్ 3న హీరో మోటోకార్ప్ సంస్థ ఫ్లెక్స్ ఫ్యూయల్ సాంకేతికతతో నడిచే రెండు టూ-వీలర్స్ - స్ప్లెండర్, హెచ్ఎఫ్ డీలక్స్ మోడళ్లను మార్కెట్లోకి తెచ్చింది. ఆ మరుసటి రోజు, జూన్ 4న మారుతి సుజుకి తన వేగన్-ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్ వెర్షన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది.
సమాచారం కోసం చెప్పాలంటే, ఈ ఫ్లెక్స్ ఫ్యూయల్ వేగన్-ఆర్ ధర సాధారణ పెట్రోల్ (ఇ20) వేగన్-ఆర్ కంటే ఎక్కువగా ఉంది. అందువల్ల ఇంధనం దొరకకపోవడం అనే ఇబ్బందితో పాటు కొత్త సాంకేతికత కోసం అయ్యే అధిక ఖర్చు భారం కూడా ఉంది.

6. సాధారణ కార్లలో ఇ85 ఇంధనాన్ని నింపితే..?
ఇ85 ఇంధనంలో ఇథనాల్ పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుందని, దీనివల్ల గ్యాసోలిన్ లేదా ఇ20 ఇంధనం కోసం డిజైన్ చేసిన ఇంజిన్లలో సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పైగా, ఇథనాల్‌కు తేమను పీల్చుకునే స్వభావం ఉంటుంది. అంటే ఇది గాలిలోని తేమను గ్రహిస్తుంది. అందువల్ల, ఇథనాల్ ఉన్న ఇంధనం ఇంజిన్ విడిభాగాలు, ఇంధన పైపులు, ఇంధన ట్యాంకులు, ట్యాంక్ సీల్స్ వంటి వాటిని పాడు చేయవచ్చు లేదా అవి త్వరగా అరిగిపోయేలా చేస్తుంది. దీంతో, ఇలాంటి వాహనాల సర్వీసింగ్, నిర్వహణ ఖర్చులు పెరుగుతాయి.
ఆ భారం తెలియకుండానే వినియోగదారులపై పడుతుంది. అందుకే, ప్రస్తుత కార్లలో పెట్రోల్ ట్యాంక్ మూత (క్యాప్) పై ఇథనాల్ గరిష్ఠంగా ఎంత శాతంమేరకు ఉండాలనే సమాచారాన్ని అందిస్తున్నారు.

ఫొటో సోర్స్, ICICI Lombard Blog
7. ఇథనాల్ వాడితే వాహన బీమా రద్దవుతుందా?
ఇ20 ఇంధనం వాడటం వల్ల జరిగే నష్టాలను కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు కవర్ చేయవనే వార్తలు ఈ మధ్య కొన్నిచోట్ల వచ్చాయి.
ఐసీఐసీఐ లాంబార్డ్ ఇన్సూరెన్స్ కంపెనీ జూన్ 9న ప్రచురించిన ఒక బ్లాగ్‌లో "ఒకవేళ మీరు ఇ20 ఇంధనం కోసం తయారు చేసిన వాహనాలలో ఇ20 ఇంధనాన్నే వాడితే, మీ ఇన్సూరెన్స్ చెల్లుబాటు అవుతుంది. కానీ, మీ వాహనానికి సరిపడని ఇంధనాన్ని వాడితే, దానిని దుర్వినియోగం లేదా నిర్లక్ష్యంగా పరిగణిస్తారు" అని తెలిపింది.
ఈ బ్లాగ్ పోస్ట్‌పై వివాదం చెలరేగడంతో, ఆ కంపెనీ మరో ప్రకటన ఇచ్చింది.
"వాహన ఇన్సూరెన్స్ అనేది ప్రమాదాలు లేదా దొంగతనం వంటి అత్యవసర పరిస్థితుల కోసం ఉంటుంది. దానికి వాహనంలో వాడే ఇంధన రకంతో ఎలాంటి సంబంధం లేదు. కాబట్టి, సాధారణ ఇంధనం వాడినప్పుడు ఆమోదించే ఎలాంటి క్లెయిమ్‌నైనా ఇ20 ఇంధనం వాడినప్పుడు కూడా ఆమోదించడం జరుగుతుంది. మీరు వాడే ఇంధనం ఆధారంగా ఐసీఐసీఐ లాంబార్డ్ క్లెయిమ్‌ను తిరస్కరించదు" అని తెలిపింది.
12 ఆగస్టు 2025న కేంద్ర ప్రభుత్వం కూడా ఇలాంటి వార్తలను ఖండించింది. ఇ20 ఇంధనం వాడకం వల్ల వాహన ఇన్సూరెన్స్‌పై ఎలాంటి ప్రభావం పడదని స్పష్టం చేసింది.

ఫొటో సోర్స్, ICICI Lombard
8. డీజిల్ వాహనాల్లో ఇథనాల్ వాడొచ్చా?
ప్రస్తుతానికి ఇథనాల్‌ను కేవలం పెట్రోల్‌లో కలపడానికి మాత్రమే ఉత్పత్తి చేస్తున్నారు. అందువల్ల డీజిల్ ఇప్పటికీ చాలా వరకు స్వచ్ఛంగానే ఉందని చెప్పవచ్చు.
అయితే, ఇదే పద్ధతిలో ఐసోబ్యూటెనాల్ అనే మరొక ఆల్కహాల్‌ను డీజిల్‌లో కలపవచ్చని, దీనిపై చర్చలు జరుగుతున్నాయని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కొన్నిరోజుల కిందట చెప్పారు.
9. ఇ100 అంటే ఏమిటి?
ఇ100 అంటే 100 శాతం ఇథనాల్ అని అర్థం. ఇందులో ఎలాంటి ఇతర ఇంధనాల మిశ్రమం ఉండదు.
జూన్ 10న నితిన్ గడ్కరీ నాగ్‌పూర్‌లో మాట్లాడుతూ, 100 శాతం ఇథనాల్‌తో నడిచే వాహనాలకు కూడా తమ ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని చెప్పారు. త్వరలోనే మారుతి సుజుకి, ఎంజీ, హ్యుందాయ్, టయోటా వంటి కంపెనీలు తమ కార్ల ఇ100 వెర్షన్లను మార్కెట్లోకి తీసుకురానున్నాయన్నారు.
ఈ ఇంధనం ఇ85 కంటే తక్కువ ధరకే లభించే అవకాశం ఉంది. కానీ, దీనికి కావలసిన వాహనాల తయారీ ఖర్చు మాత్రం ఎక్కువగా ఉండవచ్చు.

ఫొటో సోర్స్, Jwala Kotesh/NurPhoto via Getty Images
10. ఒక లీటరు ఇథనాల్ తయారీకి ఎంత నీరు కావాలి?
ఇథనాల్‌ను మొక్కజొన్న, చెరకు నుంచి తయారు చేస్తారు. ప్రపంచంలో ఈ రెండు పంటలు ఎక్కడైతే ఎక్కువగా పండుతాయో, అక్కడ ఇథనాల్ ఉత్పత్తి కూడా భారీగా జరుగుతుంది.
ఉదాహరణకు అమెరికా, బ్రెజిల్ వంటి దేశాలు.
ఇథనాల్ వినియోగానికి సంబంధించి భారత ప్రభుత్వం విడుదల చేసిన ఒక డాక్యుమెంట్ ప్రకారం, ఒక టన్ను చెరకు నుంచి 100 కిలోల చక్కెర, 70 లీటర్ల ఇథనాల్ ఉత్పత్తి చేయవచ్చు. ఒక లీటరు ఇథనాల్ తయారీకి దాదాపు 3000 లీటర్ల నీరు అవసరమవుతుంది.
అయితే, మొక్కజొన్నకు అంతకంటే తక్కువ నీరు (దాదాపు 2,570 లీటర్లు) సరిపోతుందని.. అందుకే మిగిలిన ధాన్యాలతో పోలిస్తే మొక్కజొన్న నుంచి ఇథనాల్ తయారు చేయడం చాలా చౌక అని డాక్యుమెంట్ పేర్కొంది
2016లో జరిగిన ఒక అధ్యయనం ఆధారంగా, బియ్యం, గోధుమల నుంచి ఒక లీటరు ఇథనాల్ ఉత్పత్తి చేయడానికి దాదాపు 4,480 లీటర్ల నుంచి 4,900 లీటర్ల నీరు అవసరం పడుతుందని కూడా ఆ డాక్యుమెంట్‌లో వివరించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























