‘‘నౌక బయల్దేరేవరకు టాయ్‌లెట్‌లో తాళం వేసుకుని ఉండిపోయా’’

మార్తా గెల్‌హార్న్, హెమ్ంగ్‌వే, రచయిత్రి, జర్నలిస్టు, రెండో ప్రపంచ యుద్ధం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఫియోనా మెక్‌డోనల్డ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 6 నిమిషాలు

అమెరికన్ జర్నలిస్ట్, రచయిత్రి మార్థా గెల్‌హార్న్ 1944 జూన్‌లో నార్మండీ నుంచి ప్రత్యక్ష యుద్ధ కథనాలు పంపేందుకు అధికారులను మభ్యపెట్టారు. ఆ సాహసోపేత ఉపాయం గురించి ఆమె 1991లో బీబీసీకి వివరించారు.

రెండో ప్రపంచ యుద్ధంలో నాజీల నుంచి వాయువ్య యూరప్‌కు విముక్తి కల్పించేందుకు జూన్ 6, 1944న మిత్ర రాజ్యదళాలు 80 కిలోమీటర్ల పొడవైన నార్మండీ బీచ్‌లలో కాలుమోపాయి.

నార్మండీ దిగ్బంధనంపై గెల్‌హార్న్ రాసిన కథనంలో ఒక చోట ఇలా వర్ణించారు:

‘‘జనం కిక్కిరిసిపోయిన ఆ ప్రమాదకర తీరంలో ప్రతి ఒక్కరూ హడావుడిలో మునిగిపోయి కనిపించారు. మందుపాతరలను తొలగించి, తెల్లటి టేపులు అమర్చడం ద్వారా, సురక్షితంగా గుర్తించిన ఇరుకైన మార్గంలో జాగ్రత్తగా అడుగులు వేస్తూ నడిచాం. మసక చీకటి వెలుగులో పైకి లేచిన దుమ్ము యుద్ధపు పొగమంచులా కనిపించింది’’ అని 1944 జూన్‌లో డీ-డే ల్యాండింగ్స్ సందర్భంగా పంపిన తన రిపోర్టులో మార్థా గెల్‌హార్న్ రాశారు.

తరువాత ఆ నిరాశపూరిత వాతావరణంలోనూ ఓ మానవీయ అనుభూతి పొందిన విషయాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు. "మేం గడ్డి పైన అడుగుపెట్టాం.ఆరోజు మమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేసిన ఎన్నో విషయాల్లో బహుశా మరీ ఆశ్చర్యకరమైన విషయం ఆ వేసవి గడ్డి వెదజల్లిన మధుర పరిమళం దాంతోపాటు పశువుల వాసన కూడా. ప్రశాంతతను తలపించే ఆ సువాసన నిజంగా వేసవి అనిపించిన రోజులలో భూమిని వెచ్చపరిచిన సూర్యకాంతిని గుర్తుచేసింది’’

రెండో ప్రపంచ యుద్ధంలో నార్మండీ తీరాలలో మిత్రరాజ్యాల దళాల దిగ్బంధనానికి సంబంధించిన ఈ కథనం అనూహ్యంగా సున్నితమైన మానవీయ కోణాన్ని, గెల్‌హార్న్ రచనా ప్రత్యేకతను, పరిశీలనా శక్తిని కూడా వెల్లడిస్తుంది.

సైనిక దళాల కదలికలు, యుద్ధ వ్యూహాల కంటే నిత్యజీవితంలోని చిన్నచిన్న వివరాలపై ఎక్కువ దృష్టి సారిస్తూ యుద్ధంలోని క్రూరత్వాన్ని, మానవీయతను ఏకకాలంలో సజీవంగా ఆవిష్కరించడం గెల్‌హార్న్ రచనలకు ప్రత్యేక గుర్తింపునిచ్చాయి.

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
మార్తా గెల్‌హార్న్, హెమ్ంగ్‌వే, రచయిత్రి, జర్నలిస్టు, రెండో ప్రపంచ యుద్ధం

ఫొటో సోర్స్, Getty Images

నౌకలోకి ఎలా వెళ్లారంటే..

మిస్సోరీలో జన్మించిన ఈ పాత్రికేయురాలు, రచయిత్రి ఆరు దశాబ్దాల తన వృత్తిజీవితంలో స్పెయిన్ అంతర్యుద్ధం, వియత్నాం యుద్ధం, చెకోస్లోవేకియా, ఫిన్లాండ్‌‌లపై దండయాత్రలు, అలాగే డఖౌ నిర్బంధ శిబిరం విముక్తి వంటి చారిత్రక కీలక పరిణామాలను కవర్ చేశారు.

ఆమె వోగ్ పత్రికకు కూడా రచనలు చేశారు. అమెరికాలో మహా మాంద్యంపై నివేదికలు అందించే క్రమంలో ప్రముఖ ఫోటోగ్రాఫర్ డోరోతియా లాంగ్‌తో కలిసి డస్ట్ బౌల్ ప్రాంతాలలో పర్యటించారు.

నార్మండీ తీరాలలో మిత్రరాజ్యాల దళాలు కాలుమోపిన డి-డే సందర్భంగా ఆమె అందించిన ప్రత్యక్ష కథనం ఆమె సాహసోపేతంగా చేసిన ఓ పని తరువాతే సాధ్యమైంది. ఈ సాహసం గెల్‌హార్న్‌ ఎంత బలమైన వ్యక్తిత్వంగలదో తేటతెల్లం చేస్తోంది.

గెల్‌హార్న్ తన 82 ఏళ్ల వయసులో 1991లో బీబీసీకి ఇచ్చిన అరుదైన టీవీ ఇంటర్వ్యూలో ‘‘నేనో ఆస్పత్రి నౌకలోకి రహస్యంగా ఎక్కాను’’ అని చెప్పారు. ‘‘తీరం దగ్గర ఏం చేస్తున్నావని ఎవరో అడిగారు. ‘మహిళలకు సంబంధించిన ప్రత్యేక కథనం కోసం నర్సులను ఇంటర్వ్యూ చేయడానికి ఆ నౌకలోకి వెళుతున్నా’’ అనిచెప్పానని గుర్తు చేసుకున్నారు.

‘‘అలాంటి మాటలు ఎప్పడూ పనిచేస్తాయి. ఎందుకంటే ఇలాంటివి పెద్దగా ప్రమాదం లేనివి, అంత ప్రాముఖ్యం కూడా ఇచ్చేవారు కాదు . ‘‘మహిళలకు సంబంధించిన కోణంలోంచి స్టోరీ చేస్తున్నాను అనగానే ఎవరికీ ఆసక్తి ఉండేది కాదు. ఆ తరువాత నౌక బయల్దేరే వరకు నేను మరుగుదొడ్డిలో తాళం వేసుకుని ఉండిపోయాను’’

ఆ బలమైన వ్యక్తిత్వమే గెల్‌హార్న్ వ్యక్తిగత జీవితాన్ని అసాధారణంగా మలిచింది.

అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ రూజ్‌వెల్ట్ కుటుంబంతో ఆమెకు సన్నిహిత సంబంధాలు ఉండేవి. వారితో కలిసి శ్వేతసౌధంలో అతిథిగా బస చేశారు. రచయిత హెచ్‌జీ వెల్స్ వద్ద మొహమాటం లేకుండా ఆశ్రయం కోరారు.రచయిత ఎర్నెస్ట్ హెమింగ్‌వేని వివాహం చేసుకున్నారు. కానీ ఆయన నీడలో జీవించేందుకు మాత్రం ఎప్పుడూ అంగీకరించలేదు.

వీటన్నింటి మధ్యా ఆమె మానవ చరిత్రలోని చీకటికాలాల సంఘటనలు నమోదు చేస్తూనే వచ్చారు. ఆమె మాటల్లో చెప్పాలంటే ఆమె ‘‘కళ్లున్న నడిచే టేప్ రికార్డర్‌గా మారిపోయారు. ఇతరులు గుర్తించలేని సూక్ష్మమైన విషయాలను గుర్తిస్తూ, యుద్ధం సాధారణ ప్రజలను ఎలా ప్రభావితం చేస్తుందో శక్తిమంతంగా వర్ణించారు.

మార్తా గెల్‌హార్న్, హెమ్ంగ్‌వే, రచయిత్రి, జర్నలిస్టు, రెండో ప్రపంచ యుద్ధం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, హెమ్ంగ్‌వేతో మార్తా

‘‘నువ్వు యుద్ధ విలేఖరివా, నా భార్యవా?’’

యూరప్‌కు వెళ్లాలని 1943 సెప్టెంబర్‌లో గెల్‌హార్న్ నిర్ణయించుకునే సమయానికి ఆమెకు హెమింగ్వేతో పెళ్లయి మూడేళ్లు గడిచాయి. క్యూబాలోని లుకౌట్ ఫామ్‌లో వీరిద్దరూ నివసిస్తున్న రోజులలో హేమింగ్వే తన చేపలపడవతో జర్మన్ జలాంతర్గములను వెతికే ప్రయత్నాల్లో విఫలమవుతుండగా, గెల్‌హార్న్ క్రమంగా ఒకచోట నిలువలేని ఆత్రుతకు చేరారు.

గెల్‌హార్న్ యుద్ధ వార్తా కథనాల వైపు మళ్లడానికి కారణం కూడా హెమింగ్వేనే. గెల్‌హార్న్ మాటల్లో చెప్పాలంటే, "1937 మార్చిలో నేను స్పెయిన్‌కు వెళ్లాను. యాదృచ్ఛికంగానే యుద్ధ విలేఖరిగా మారాను."

ఆమె జీవిత చరిత్ర రచయిత్రి కరోలైన్ మూర్‌హెడ్ బీబీసీతో మాట్లాడుతూ, హెమింగ్వేతో కలిసి ఉండేందుకే గెల్‌హార్న్ స్పెయిన్‌కు వెళ్లారని చెప్పారు.

"ఆమె అక్కడికి చేరుకున్నాక, 'యుద్ధం గురించి ఎందుకు రాయడం లేదు?' అని హెమింగ్వే అడిగారు. దానికి ఆమె, 'ఆయుధాలు, యుద్ధాల గురించి నాకు ఏమీ తెలియదు' అని సమాధానమిచ్చారు. నీకు తెలిసిన వాటి గురించే రాయి. అదే మనుషులు' అని హెమింగ్వే చెప్పారు

1937లో స్పెయిన్ పర్యటనకు అవసరమైన ఖర్చును ఆమె వోగ్ పత్రిక కోసం రాసిన బ్యూటీ ప్రాబ్లమ్స్ ఆఫ్ ది మిడిల్-ఏజ్డ్ ఉమన్ అనే వ్యాసానికి వచ్చిన పారితోషికంతో సమకూర్చుకున్నారు. ఆ వ్యాసం కోసం కఠినమైన రసాయనిక చర్మ చికిత్సను కూడా ఆమె పరీక్షించుకున్నారు.

ఆ తరువాత మాడ్రిడ్ ముట్టడిలో సాధారణ ప్రజల జీవితాలపై కథనం రాసిన తరువాత అదే తన నిజమైన పని అని గెల్‌హార్న్‌కు అర్థమైంది. అందుకే ఒక ఫ్రెండ్‌తో మాట్లాడుతూ ‘‘మనుషుల బాధల గురించే రాస్తాను. అదే నా పని. మిగిలినవన్నీ పోనీయ్’’ అన్నారు.

హెమింగ్వే, గెల్‌హార్న్ 1940లో పెళ్లి చేసుకున్న తరువాత ఆమె ఇంట్లోనే ఉండాలని హెమింగ్వే కోరుకున్నారు. 1943లో ఇటలీలోని మోంటే కాస్సినో సమరరంగానికి అమెరికా సేనలతో కలిసి ఆమె వెళ్లడంతో.. అసహనానికి గురైన హెమింగ్వే ‘‘నువ్వు యుద్ధ విలేఖరివా, లేక నా మంచంపై ఉండాల్సిన భార్యవా?’’ అని కేబుల్ సందేశం పంపారు.

ఆమె 1944లో క్యూబాకు తిరిగి వచ్చే సమయానికి భార్యాభర్తలిద్దరి మధ్య వాదోపవాదాల పరిస్థితి వచ్చింది.

మార్తా గెల్‌హార్న్, హెమ్ంగ్‌వే, రచయిత్రి, జర్నలిస్టు, రెండో ప్రపంచ యుద్ధం

ఫొటో సోర్స్, Getty Images

ఏకైక మహిళా పాత్రికేయురాలుగా రికార్డు

డి-డే దండయాత్రను కవర్ చేయాలని గెల్‌హార్న్ ఆశించారు. కానీ ఆ అవకాశం హెమింగ్వే దక్కించుకున్నారు. అయన లండన్‌కు విమానంలో వెళ్లగా, ఆమె మాత్రం పేలుడు పదార్థాలతో నిండిన నార్వేజియన్ సరుకు నౌకలో రెండు వారాల ప్రయాణం చేసి యూరప్ చేరుకున్నారు.

మిత్రరాజ్యాల దళాలు నార్మండీ తీరాలలో కాలుమోపిన ఘటనను కవర్ చేయడానికి మహిళా పాత్రికేయులకు అమెరికా సైన్యం అనుమతి నిరాకరించినప్పటికీ, గెల్‌హార్న్ వెనక్కి తగ్గలేదు.

"నా దృష్టిలో నియమాలు రూపొందించేవారు వాటిని ఉల్లంఘించడానికే చేస్తారు’’ అని ఆమె 1991లో బీబీసీతో అన్నారు. ఆ ధిక్కార స్వభావం వల్లే నార్మండీకి చేరుకున్న తొలి ఆస్పత్రి నౌకలో ఆమె ప్రయాణించారు. జూన్ 7 ఉదయం ఓమాహా బీచ్‌కు చేరుకున్న గెల్‌హార్న్, డి-డే సందర్భంగా అక్కడి నేలపై అడుగుపెట్టిన ఏకైక మహిళా విలేఖరిగా నిలిచారు.

లండన్ తిరిగి చేరుకున్న తర్వాత అనుమతి లేకుండా నార్మండీ వెళ్లిందన్న కారణంతో సైనిక పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. నర్సుల శిక్షణ శిబిరానికి పంపించారు. కానీ అక్కడ కూడా ఎక్కువకాలం ఉండలేదు. బ్రిటిష్ వైమానిక దళానికి చెందిన ఓ పైలట్ సహాయంతో ఇటలీ చేరుకుని మిత్రదేశాల పురోగతిని మళ్లీ కవర్ చేశారు.

‘ఇతరులే కాదు, లింగం ఆధారంగా తనను తాను కూడా నిర్వచించడానికి ఆమె అవకాశం ఇవ్వలేదు’’ అంటారు బీబీసీ అంతర్జాతీయ ప్రధాన ప్రతినిధి లైస్ డూసెట్.

"అప్పుడు పురుషుల ఆధిపత్యం ఉన్న వృత్తిలో మహిళలు యుద్ధ వార్తలు అందించగలరని మాత్రమే కాదు, ఆ రంగంలో అత్యున్నత స్థాయికి చేరుకోగలరని కూడా గెల్‌హార్న్ నిరూపించారు. నేటికీ గెల్‌హార్న్ నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది" అన్నారు.

మార్తా గెల్‌హార్న్, హెమ్ంగ్‌వే, రచయిత్రి, జర్నలిస్టు, రెండో ప్రపంచ యుద్ధం
ఫొటో క్యాప్షన్, మార్తా గెల్‌హార్న్

సంఘటనా స్థలంలోనే ఉండటం వల్ల ఒమాహా బీచ్ వాస్తవాన్ని సజీవంగా హెమింగ్వే కన్నా సజీవంగా ఆవిష్కరించగలిగారు. నిజానికి హెమింగ్వే అక్కడకు రాకుండానే ఆయన రాసిన కథనం గెల్‌హార్న్ కథనం కన్నా రెండువారాల ముందే కొలియర్స్ ముఖచిత్ర కథనంగా ప్రచురితమైంది.

డి-డే గురించి ఆమె పంపిన కథనంలో భయంకరమైన దృశ్యాల వివరాలు చిన్న చిన్న విషయాలను కవితాత్మకంగా చిత్రించిన తీరులో కలగలిసిపోయాయి.

నౌకల నుంచి దళాలు దిగడం, తీరంపై కదులుతున్న ట్యాంకుల మోత, బూడిదరంగు మేఘాల వెనుక కనిపించకుండా ఎగురుతున్న విమానాలు వంటి విస్తృత దృశ్యాలను వర్ణిస్తూనే, ఆశ్చర్యానికి గురిచేసే సూక్ష్మ వివరాలనూ ఆమె గమనించారు.

ల్యాండింగ్ క్రాఫ్ట్‌లో దండెంపై ఆరేసిన బట్టలను కూడా ఆమె గమనించారు.

బీచ్‌లో మందుపాతరలను పేల్చే శబ్దాల నడుమ, ఆ ల్యాండింగ్ క్రాఫ్ట్‌లోని రేడియో నుంచి సంగీతం వినిపిస్తోంది. ఘర్షణల భయోత్పాతాన్ని ప్రత్యక్షంగా చూసి నమోదు చేయాలన్న గెల్‌హార్న్ నిబద్ధత జీవితాంతం కొనసాగింది. 1959లో వెలువడిన ఆమె కథనాల సంకలనానికి ‘ది ఫేస్ ఆఫ్ వార్’ అనే పేరు పెట్టారు. యుద్ధంలో మానవ అనుభవానికే ప్రాధాన్యమివ్వాలన్న ఆమె దృష్టికోణాన్ని ఆ సంకలనం ప్రతిబింబించింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)