అన్నవాహిక లేకుండా పుట్టిన బిడ్డకు రెండున్నరేళ్ల తరువాత నోటి ద్వారా ఆహారం తీసుకునేలా ఎలాంటి ఆపరేషన్ చేశారు?

ఫొటో సోర్స్, Bhargav Parikh
- రచయిత, భార్గవ్ పారిఖ్
- హోదా, బీబీసీ గుజరాత్ కోసం
- ప్రచురణ
- చదివే సమయం: 5 నిమిషాలు
"రెండున్నరేళ్ల క్రితం మా బాబు అన్నవాహిక లేకుండా పుట్టాడు, పాలు కూడా తాగలేకపోయేవాడు. వైద్యులు మరుసటి రోజే గొంతు, జీర్ణాశయంలోకి ట్యూబ్ వేసి ద్రవ రూపంలో ఆహారం ఇవ్వడం ప్రారంభించారు. రెండున్నరేళ్ల శ్రమ తర్వాత వాడి బరువు పెరిగింది. ఐదు గంటల ఆపరేషన్ తర్వాత ఈరోజు నా బిడ్డ తొలిసారి తన నోటితో ఒక గుటక నీళ్లు తాగుతుంటే.. ఓ తల్లిగా నేను అనుభవించిన సంతోషం ప్రపంచంలో మరెవరూ అనుభవించి ఉండరనిపించింది’’
మహారాష్ట్రలోని అహ్మదాబాద్ జిల్లా సానంద్ పరిధిలోని వసోధర గ్రామానికి చెందిన రష్మీబెన్ పటేల్ మాటలివి.
అన్నవాహిక లేకుండా పుట్టిన ఆ చిన్నారికి గొంతు, జీర్ణాశయంలో వేసిన ట్యూబ్‌కు ఇన్ఫెక్షన్ సోకకుండా అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రి పర్యవేక్షణలో రెండున్నరేళ్ల పాటు సంరక్షించారు.
ప్రతిరోజూ ఎంత మోతాదులో ప్రోటీన్లు, కొవ్వులు, కార్బోహైడ్రేట్లతో పాటు విటమిన్లు, మినరల్స్ అందాలో వైద్యులు స్పష్టమైన డైట్ చార్ట్ రూపొందించారు. నిర్ణీత సమయంలో ఆహారం ఇస్తూ బరువును నియంత్రించారు. రెండున్నరేళ్ల పాటు ఎంతో ఓపికతో ఎదురుచూసిన అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రి వైద్యులు, ఐదు గంటల పాటు సుదీర్ఘంగా 'గ్యాస్ట్రిక్ పుల్-అప్' సర్జరీ చేసి అన్నవాహికను తయారు చేశారు.
అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో ప్రభుత్వ పథకం కింద ఈ సర్జరీని ఉచితంగా చేశారు.


ఫొటో సోర్స్, Bhargav Parikh
'వాడు ఆహారం తీసుకోవాలని నిరంతరం ప్రార్థించేవాళ్లం'
సాణంద్‌లోని వాసోధరలో నివసించే శైలేష్ పటేల్ తన తాత పొలంలో వ్యవసాయం చేస్తూ, ఒక అగ్రో కంపెనీలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నారు.
"మా ఇంట్లో 2023 నవంబర్ 7న బాబు జన్మించాడు, ఇల్లంతా ఎంతో సంతోషంగా ఉండేది. కానీ, బాబు పుట్టిన తర్వాత పాలు పట్టే సమయంలో మా సంతోషమంతా ఆవిరైపోయింది. వాడు నీళ్లు గానీ, పాలు గానీ తాగలేకపోయాడు. దీంతో, వైద్యులు ఒక మార్గం చూపించారు" అని శైలేష్ పటేల్ బీబీసీతో చెప్పారు.
"బాబు గొంతు, జీర్ణాశయంలో పైపులు వేసి ద్రవాహారం ఇవ్వాలని వైద్యులు చెప్పారు. బాబు బరువు పెరిగేందుకు ఒక డైట్ చార్ట్ తయారు చేసి ఇచ్చారు. శస్త్రచికిత్స చేసి అన్నవాహికను తయారు చేస్తామని హామీ ఇచ్చారు" అని చెప్పారు.
"ఈ ఆపరేషన్ విజయవంతం కాకపోతే వీడు జీవితాంతం ట్యూబ్ ద్వారానే ఆహారం తీసుకోవాల్సి వస్తుందేమోనని నిరంతరం ఆందోళన చెందేవాళ్లం" అని శైలేష్ పటేల్ చెప్పారు.
"మేం ఊళ్లో ఉంటాం. బిడ్డకు చిన్నపాటి ఇన్ఫెక్షన్ కూడా సోకకుండా చూసుకోవాలని వైద్యులు చెప్పారు. అందుకే మేం ఇంట్లో ఒక గదిని ప్రత్యేకంగా కేటాయించాం. ఏ సమయంలో ఏ పదార్థాన్ని ద్రవ రూపంలో తినిపించాలో వైద్యులు ఒక జాబితా ఇచ్చారు" అని శైలేష్ భార్య రష్మీబెన్ చెప్పారు.
"నేను వాడి ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకునేదాన్ని. నా బిడ్డ భోజన సమయంలో ఎటువంటి మార్పులు చేసేదాన్ని కాదు. చాలాసార్లు ఇంట్లో ఒక పూట మాత్రమే వంట జరిగేది, కొన్నిసార్లు నా భర్త ఆఫీసుకు వెళ్లేటప్పుడు సమయానికి టిఫిన్ చేసి ఇవ్వలేకపోయేదాన్ని, కానీ మంతవ్య కోసం ఇంట్లోని వారందరూ సర్దుకుపోయేవారు" అన్నారు.
సమయానుగుణంగా బాబు గొంతు, జీర్ణాశయంలో ఉన్న ట్యూబ్‌ను మారుస్తుండేవాళ్లమని కుటుంబ సభ్యులు తెలిపారు. సివిల్ ఆసుపత్రిలో క్రమం తప్పకుండా చెకప్ చేయించేవారిమని, మెల్లమెల్లగా తమ కుమారుడు మంతవ్య బరువు పెరుగుతూ వచ్చాడని చెప్పారు.
"వాడి బరువు పెరిగి ఆపరేషన్‌కు సిద్ధమైనప్పుడు, జులై 3న శస్త్రచికిత్స ఖరారైంది. ఐదు గంటల పాటు సాగిన ఆపరేషన్ తర్వాత 23 నుంచి 24 రోజుల వరకు వాడిని వైద్యుల పరిశీలనలో ఉంచారు. వాడు ఆహారం తీసుకోవాలని మేం నిరంతరం ప్రార్థించేవాళ్లం. ఆగస్టు 1న తొలిసారిగా వాడికి కొద్దిగా ద్రవాహారం ఇచ్చారు, వాడు దాన్ని తాగగలిగాడు. ఆ సమయంలో నాకు కలిగిన సంతోషం మంతవ్య పుట్టినప్పుడు కలిగిన దానికంటే 100 రెట్లు ఎక్కువ" అని రష్మీబెన్ చెప్పారు.

ఫొటో సోర్స్, Bhargav Parikh
ఆపరేషన్‌కి ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు?
"ప్రతి 40 వేల మంది పిల్లలలో ఒకరికి పుట్టుకతోనే అన్నవాహిక లేకపోవడం అనే సమస్య కనిపిస్తుంది. వైద్య పరిభాషలో దీనిని 'ప్యూర్ ఈసోఫేజియల్ అట్రేసియా' అని పిలుస్తారు" అని అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రి సూపరింటెండెంట్, ఈ సంక్లిష్టమైన ఆపరేషన్ నిర్వహించిన డాక్టర్ రాకేష్ జోషి బీబీసీతో చెప్పారు.
అటువంటి కేసుల్లో పుట్టుకతోనే అన్నవాహిక తయారుకాదని ఆయన తెలిపారు. దానివల్ల నోటి లాలాజలం పొట్టలోకి వెళ్లకుండా, ఊపిరితిత్తుల్లోకి చేరితే ప్రాణాపాయం ఏర్పడే ప్రమాదం ఉందన్నారు. అందుకే శిశువు పుట్టిన మరుసటి రోజే 'ఈసోఫాగోస్టమీ' చేసి, గొంతు భాగంలో రంధ్రం ద్వారా ట్యూబ్ వేసి ఒక మార్గాన్ని ఏర్పరిచినట్లు చెప్పారు. అలాగే 'గ్యాస్ట్రోస్టమీ' ప్రక్రియ ద్వారా జీర్ణాశయంలోకి నేరుగా ట్యూబ్ అమర్చామన్నారు.
"ఈ ఆపరేషన్ చేయడానికి బాబు బరువు కనీసం 5.5 నుంచి 6 కిలోలు ఉండాలి. అందుకే మంతవ్య తల్లిదండ్రులు శైలేష్ భాయ్, రష్మీబెన్‌లకు ఒక డైట్ చార్ట్ అందించాం. ప్రతి రెండు గంటలకు ఒకసారి ఆ ప్రకారమే ఆహారం ఇవ్వాలని సూచించాం. వారు దాన్ని కచ్చితంగా పాటించారు. రెండున్నరేళ్లకు బాబు బరువు ఆపరేషన్‌కు తగినట్లుగా పెరిగినప్పుడు, జులై 3న శస్త్రచికిత్సకు ఏర్పాటు చేశాం" అని డాక్టర్ రాకేష్ జోషి వివరించారు.
గ్యాస్ట్రిక్ పుల్-అప్ సర్జరీ అంటే ఏమిటి?
వైద్యుల ప్రకారం ఇది అత్యంత సంక్లిష్టమైన శస్త్రచికిత్స.
డాక్టర్ రాకేష్ జోషి మాట్లాడుతూ "ఈసోఫేజియల్ అట్రేసియా సమస్యతో పుట్టుకతోనే అన్నవాహిక లేని పిల్లల్లో గ్యాస్ట్రిక్ పుల్-అప్ సర్జరీ నిర్వహిస్తారు. ఈ ప్రక్రియలో బాబు జీర్ణాశయం పైభాగానికి తగిన రూపాన్ని ఇచ్చి, ఛాతీ వైపునకు పైకి లాగి, గొంతు భాగంతో జోడించడం ద్వారా కొత్త అన్నవాహికను తయారు చేస్తారు. ఆపరేషన్‌కు తగినట్లుగా చిన్నారి బరువు పెరిగినప్పుడు జీర్ణాశయం కూడా బాగా అభివృద్ధి చెందుతుంది. ఆ సమయంలో జీర్ణాశయం ఈ భాగాన్ని ఛాతీ గుండా గొంతు భాగం వరకు పైకి లాగడానికి వీలవుతుంది" అని వివరించారు.
ఈ ఆపరేషన్ పూర్తయిన వెంటనే బాబుకి నోటి ద్వారా ఆహారం ఇవ్వరని, కుట్లు పూర్తిగా మానేవరకు ఐవి సెలైన్స్ ద్వారా ద్రవరూపంలో పోషకాలు అందిస్తారని డాక్టర్ చెప్పారు.
"జీర్ణాశయం పైభాగాన్ని గొంతు వరకు లాగి, కుట్టినపుడు అయిన అన్నవాహిక గాయాలు 15 నుంచి 27 రోజుల్లో మానుతాయి. ఆ తర్వాత కొద్ది కొద్ది మోతాదులో నోటి ద్వారా ఆహారం ఇవ్వడం ప్రారంభిస్తారు" అన్నారు.
ఈ శస్త్రచికిత్స గురించి డాక్టర్ రాకేష్ జోషి సమాచారం ఇస్తూ.. "ఐదు గంటల పాటు సాగిన ఈ ఆపరేషన్‌లో కీలకమైన అంశం ఏంటంటే, ఇటువంటి పిల్లలలో అన్నవాహిక పైభాగం మూసుకుపోయి ఉంటుంది. ఇది శ్వాసనాళంతో అనుసంధానమై ఉండదు, దీనివల్ల బాబు నోటి లాలాజలాన్ని కూడా మింగలేడు. అందుకే ఆ మార్గంలో శస్త్రచికిత్స చేసి ఒక అన్నవాహికను తయారు చేశాం. ఆ తర్వాత 23 రోజుల పాటు ఆపరేషన్ కుట్లు మానడానికి, ఎటువంటి ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే బాబును వైద్యుల పరిశీలనలో ఉంచాం. ఆగస్టు 1న తొలిసారిగా బాబుకి నోటి ద్వారా ద్రవాహారం ఇచ్చాం, మంతవ్య దాన్ని తాగగలిగాడు. ఆ తర్వాత మా బృందం పర్యవేక్షణలో కొన్ని రోజుల్లోనే ద్రవాలను, ఇతర ఆహారాన్ని ఇవ్వడం ప్రారంభించాం. రెండున్నరేళ్ల తర్వాత ఇప్పుడు వాడు నోటి ద్వారా చక్కగా ఆహారం తీసుకోగలుగుతున్నాడు" అని చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




























