బ్రెయిన్ ఫ్రీజ్: ఐస్‌క్రీమ్ తిన్నప్పుడల్లా తలనొప్పిగా అనిపిస్తోందా? అయితే, ఇవి తెలుసుకోండి..

ఐస్‌క్రీమ్, మైగ్రేన్, హెడేక్, తలనొప్పి

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఎలిజబెత్ యాన్ బ్రౌన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 5 నిమిషాలు

మీరు ఐస్‌క్రీం తిన్నప్పుడల్లా.. ఒక్కసారిగా తలనొప్పి వచ్చేస్తోందా? అయితే, మీ కటుంబంలో మరెవరికైనా ఇదే సమస్య ఉందేమో ఓసారి గమనించండి.

అలాగే, మీకు వచ్చే సాధారణ తలనొప్పుల గురించి కూడా ఒకసారి పరిశీలించండి.

మండువేసవిలో, ఏదొో ఒకరోజు మీకు ఎంతో ఇష్టమైన ఐస్‌క్రీమ్‌ ఆస్వాదిస్తున్నప్పుడు.. ఒక్కసారిగా నుదుటి మధ్యలో మంచు సూదిని గుచ్చినట్టు తీవ్రమైన నొప్పి మొదలవుతుంది. మెదడు లోపల నుంచే ఆ నొప్పి వస్తున్నట్టుగా అనిపిస్తుంది. చేతిలో కరిగిపోతున్న ఐస్‌క్రీమ్‌ను పట్టుకుని, నొప్పి తగ్గే వరకు అలా నిస్సహాయంగా కూర్చోవడం తప్ప మరేం చేయలేరు.

అసలు ఎందుకిలా జరగుతుంది? దీనిని నివారించడమెలా? ఇక్కడ తెలుసుకుందాం.

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

"ఐస్‌క్రీమ్ వల్ల వచ్చే తలనొప్పి చాలా సహజం" అని మిన్నెసోటాలోని మయో క్లినిక్‌లో న్యూరాలజిస్ట్‌గా పనిచేస్తున్న అమాల్ స్టార్లింగ్ అన్నారు. "అదంత హానికరం కాదు, కొద్దిసేపు వచ్చి మళ్లీ తగ్గిపోతుంది."

అయితే, చల్లని పదార్థాలను వేగంగా తిన్నప్పుడు శరీరం ఇలా ఎందుకు స్పందిస్తుంది?

ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. 'బ్రెయిన్ ఫ్రీజ్' అనేది కేవలం చల్లని, తీయని పదార్థాలను (డిజర్ట్స్) ఆస్వాదించే వారికి కలిగే అనుభవం మాత్రమే కాదు, దశాబ్దాలుగా ఇది శాస్త్రీయ పరిశోధనలకు దోహదపడుతోంది.

అలాగే, మీ ఆరోగ్య పరిస్థితి గురించి గతంలో తెలిసిన వాటికంటే ఎక్కువ విషయాలను తెలియజేయగలదు.

ఐస్‌క్రీమ్, మైగ్రేన్, హెడేక్, తలనొప్పి

ఫొటో సోర్స్, Getty Images

బ్రెయిన్ ఫ్రీజ్ అంటే ఏంటి?

మనలో చాలామందికి బ్రెయిన్ ఫ్రీజ్ లేదా ఐస్‌క్రీమ్ హెడేక్‌గా తెలిసిన ఈ సమస్యను శాస్త్రవేత్తలు "కోల్డ్-స్టిమ్యులస్ హెడేక్"గా పిలుస్తారు.

నోటి పైభాగం లేదా గొంతు వెనుక భాగం ఒక్కసారిగా చల్లబడటం వల్ల ఈ పరిస్థితి తలెత్తుతుందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారని స్టార్లింగ్ చెబుతున్నారు. ఈ వేగవంతమైన చల్లదనం కారణంగా రక్తనాళాలు అకస్మాత్తుగా కుంచించుకుపోతాయి, అనంతరం రక్తప్రసరణను సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు అవి మళ్లీ మామూలు స్థితికి వచ్చేస్తాయి.

ఈ రక్తనాళాల గోడల్లో ఉండే పెయిన్ ఫైబర్లు ముఖం, నుదురు ప్రాంతాల్లో వచ్చే నొప్పి సంకేతాలను మెదడుకు చేరవేసే 'ట్రైజెమినల్ నర్వ్' అనే నరంతో అనుసంధానమై ఉంటాయని ఆమె వివరించారు. అందువల్లే, ఈ బ్రెయిన్ ఫ్రీజ్ లేదా ఐస్‌క్రీమ్ హెడేక్ నోటి లోపల కాకుండా నుదుటిలో, లేదా మెదడులో నొప్పి పుడుతున్నట్లు అనిపిస్తుందని ఆమె తెలిపారు.

ఇంకా చెప్పాలంటే, చల్లని పదార్థాలు లేదా పానీయాలు గుండె దడకు(దీనినే కోల్డ్ డ్రింక్ హార్ట్ అంటారు), హార్ట్ అరిథ్మియాకు కారణమవుతాయని, మరీముఖ్యంగా మధ్య వయస్కులైన పురుషుల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుందని డేటా సూచిస్తోంది.

ఈ కోల్డ్ స్టిమ్యులస్ హెడేక్స్‌ను నివారించేందుకు.. చల్లని ఆహారం, పానీయాలను నెమ్మదిగా తీసుకోవడం ఉత్తమమని స్టార్లింగ్ సూచిస్తున్నారు. వేగంగా చల్లబడడం వల్ల బ్రెయిన్ ఫ్రీజ్ సమస్య తలెత్తే అవకాశముందని, అందువల్ల చల్లని పానీయాలు తాగేప్పుడు, ఐస్‌క్రీమ్‌ నాకుతున్నుప్పుడు, లేదా ఐస్‌ను కొరుకుతున్నప్పుడు మధ్యమధ్యలో కాస్త విరామం ఇవ్వడం ద్వారా నోటి పైభాగం కాస్త వేడెక్కేందుకు సమయం ఇస్తే ఈ సమస్యను చాలావరకు నివారించవచ్చని ఆమె చెబుతున్నారు.

కానీ మీరు తొందరపడి ఎక్కువగా తినేశాక (అలా ఎవరు చేయలేదు చెప్పండి!) ఇప్పటికే ఐస్‌క్రీమ్ తలనొప్పి వచ్చేసిందంటే, దాన్ని తగ్గించే కొన్ని సులభమైన మార్గాలు ఉన్నాయని, నాలుక దిగువ భాగాన్ని నోటి పైభాగానికి ఆనించడం ద్వారా ఆ ప్రాంతం మళ్లీ వేడెక్కుతుంది, లేదా గోరువెచ్చని పానీయాలు తాగడం కూడా ఉపశమనాన్నిస్తుందని ఆమె తెలిపారు.

ఐస్‌క్రీమ్, మైగ్రేన్, హెడేక్, తలనొప్పి

ఫొటో సోర్స్, Getty Images

కొందరికే ఎందుకు తలనొప్పి?

కానీ, కొంతమందిలోనే ఈ బ్రెయిన్ ఫ్రీజ్ వస్తుంది? మిగిలినవారు ఎలాంటి ఇబ్బందీ లేకుండా మిల్క్‌షేక్‌లు తాగగలుగుతున్నారు? అనే విషయాలను తెలుసుకునేందుకు ఇటలీలోని పాడువా విశ్వవిద్యాలయంలో చైల్డ్ న్యూరాలజీ, సైకియాట్రీ ప్రొఫెసర్ ఐరీన్ టోల్డో, ఆమె సహోద్యోగులు ఐస్‌క్రీమ్ తలనొప్పులపై గత నాలుగు దశాబ్దాల శాస్త్రీయ అధ్యయనాన్ని విశ్లేషించారు.

తైవాన్, జర్మనీ, కెనడాలోని వేలాది మంది విద్యార్థులతో పాటు బ్రెజిల్, తుర్కియే, బ్రిటన్‌లలోని మైగ్రేన్ బాధితులపై జరిగిన అధ్యయనాలతో సహా ప్రపంచవ్యాప్తంగా జరిగిన పరిశోధనలను క్రోడీకరించి టోల్డో పలు నమూనాలను గుర్తించారు.

ఈ పరిశోధనల్లో ఒక ముఖ్యమైన విషయం బయటపడింది. బ్రెయిన్ ఫ్రీజ్ ఎక్కువగా ఒకే కుంటుంబానికి చెందిన వారిలో కనిపిస్తోంది. తల్లిదండ్రులకు ఈ తరహా తలనొప్పులు ఉంటే, పిల్లలకూ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే, దీనికి కారణమయ్యే జన్యువులను శాస్త్రవేత్తలు ఇంకా గుర్తించలేదు.

అలాగే, మైగ్రేన్ సమస్య ఉన్నవారిలో బ్రెయిన్ ఫ్రీజ్ మరింత తీవ్రంగా ఉంటుందని టోల్టో తెలిపారు. మైగ్రేన్ అనేది గంటల తరబడి, కొన్ని సందర్భాల్లో రోజుల పాటు కొనసాగే తీవ్రమైన తలనొప్పి.

1970లలో జరిగిన ఒక చిన్న అధ్యయనంలో, మైగ్రేన్ ఉన్నవారిలో 93 శాతం మందికి ఐస్‌క్రీమ్ తలనొప్పి కూడా వచ్చినట్టు గుర్తించారు. వారిలో కొంత మంది స్వల్పమైన మరికొందరు తీవ్రమైన తలనొప్పిని అనుభవించారు. అయితే, మైగ్రేన్ లేని వారిలో మూడో వంతు మందిలోనే ఈ సమస్య కనిపించింది.

స్టార్లింగ్ స్వయంగా మైగ్రేన్‌తో పాటు తీవ్రమైన ఐస్‌క్రీమ్ తలనొప్పులతో బాధపడతారు. "మైగ్రేన్ కారణంగా నా ట్రైజెమినల్ నర్వ్ చాలా సున్నితంగా మారింది. అందుకే చల్లదనం తగిలినప్పుడు అది తీవ్రంగా స్పందిస్తుంది" అని ఆమె అన్నారు.

ఐస్‌క్రీమ్, మైగ్రేన్, హెడేక్, తలనొప్పి

ఫొటో సోర్స్, Getty Images

1960ల నుంచే శాస్త్రవేత్తలు మైగ్రేన్‌ను అర్థం చేసుకోవడానికి 'బ్రెయిన్ ఫ్రీజ్'ను ప్రయోగాత్మక నమూనాగా ఉపయోగిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వైకల్యానికి ప్రధాన కారణాల్లో ఒకటైన మైగ్రేన్‌పై పరిశోధనలు చేయడం సులభం కాదు. ఎందుకంటే, మైగ్రేన్ ఎప్పుడు వస్తుందో ముందుగా అంచనా వేయడం కష్టం.

అలాంటి సమయంలో బ్రెయిన్ ఫ్రీజ్ పరిశోధకులకు ఉపయోగపడింది. ఐస్‌క్రీమ్, మంచు ముక్కలు లేదా అత్యంత చల్లని నీటితో ఈ పరిస్థితిని సృష్టించవచ్చు. ముఖ్యంగా, మైగ్రేన్‌లాగే ఇదీ ట్రైజెమినల్ నర్వ్‌ను ప్రభావితం చేస్తుంది. అందువల్ల మైగ్రేన్ సమయంలో మెదడులో జరిగే మార్పులను అధ్యయనం చేయడానికి ఇది శాస్త్రవేత్తలకు ఉపయోగపడుతుంది.

"తలనొప్పులపై ప్రారంభ దశ పరిశోధనల్లో బ్రెయిన్ ఫ్రీజ్ చాలా అనుకూలమైన ప్రయోగ నమూనాగా ఉపయోగపడింది" అని స్టార్లింగ్ చెబుతున్నారు. దీని ద్వారా రక్తప్రసరణ, నరాల వ్యవస్థ పాత్రపై శాస్త్రవేత్తలు కీలకమైన విషయాలను తెలుసుకున్నారు.

ఇటీవలి కాలంలో మైగ్రేన్‌ను ప్రేరేపించడానికి నైట్రోగ్లిసరిన్ వంటి ఇతర పద్ధతులను ఉపయోగిస్తున్నారు.

ఐస్‌క్రీమ్, మైగ్రేన్, హెడేక్, తలనొప్పి

ఫొటో సోర్స్, Getty Images

అయితే, మైగ్రేన్ ఉన్నవారు ఐస్‌క్రీమ్‌ను పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదని ఐరీన్ టోల్డో స్పష్టం చేస్తున్నారు. "ఐస్‌క్రీమ్ తినడం ఆపాల్సిన అవసరం లేదు. ఐస్‌క్రీమ్ హెడేక్‌ను ఎలా నియంత్రించాలో నేర్చుకోవచ్చు" అని ఆమె అంటున్నారు.

మొత్తానికి నిపుణుల సలహా ఒక్కటే చల్లని పదార్థాలను కొంచెం నెమ్మదిగా తినండి. అప్పుడు బ్రెయిన్ ఫ్రీజ్‌ను తప్పించుకోవడమే కాకుండా, రుచిని కూడా మరింతగా ఆస్వాదించగలుగుతారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)