'నాకు ఆరేళ్లకే పీరియడ్స్ వచ్చాయి, డాక్టర్లకు కూడా నా సమస్యేమిటో అంతుపట్టలేదు’
- రచయిత, రెబెకా థార్న్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 6 నిమిషాలు

ఫొటో సోర్స్, Gabby
గాబీకి ఆరేళ్ల వయసులోనే నెలసరి మొదలై, శరీరంపై రోమాలు వచ్చాయి. తన మొదటి సంతానానికి ఇలా జరుగుతుండటంతో కంగారుపడిన తల్లి, బిడ్డను వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు.
" పిల్లల వైద్య బృందంలోని డాక్టర్లు నా సమస్య గురించి అంతకుముందు వినకపోవడంతో, దీనిపై పరిశోధన చేయాల్సి వచ్చింది" అని ఇంగ్లండ్‌కు చెందిన గాబీ బీబీసీ వరల్డ్ సర్వీస్‌తో చెప్పారు.
"దీనికి ఎలా చికిత్స అందించాలో తెలుసుకోవడానికి దేశంలోని ఇతర ఆసుపత్రులను సంప్రదించాల్సి వచ్చింది" అన్నారామె.
ప్రస్తుతం 26 ఏళ్ల వయసులో ఉన్న గాబీ ‘సెంట్రల్ ప్రికోషియస్ ప్యూబర్టీ’ (సిపిపి) సమస్యతో బాధపడుతున్నట్లు నిర్ధరణ అయింది. బాలికల్లో ఎనిమిదేళ్ల కంటే ముందు, బాలురలో తొమ్మిదేళ్ల కంటే ముందే యుక్తవయస్సు రావడాన్ని ఇలా పిలుస్తారు. ఈ సమస్య ఎంతమందికి ఉందో తెలిపే అంచనాలు దేశదేశానికీ గణనీయంగా మారుతుంటాయి. బాలికలే ఎక్కువగా ప్రభావితమవుతుంటారు.
ప్రపంచవ్యాప్తంగా ఏటా నమోదయ్యే కొత్త కేసుల సంఖ్య ప్రతి 10,000 మంది బాలికలలో 0.2 నుంచి 26 వరకు ఉండగా, బాలురలో ప్రతి 10,000 మందికి 0.02 నుంచి 0.9 వరకు ఉంటుంది. అలాగే అకాల యుక్తవయస్సు అనుభవించేవారు తక్షణ ప్రభావాలకు గురవడమే జీవితంలో తర్వాతి కాలంలో అనేక రకాల క్యాన్సర్లు, గుండె సంబంధిత వ్యాధుల బారిన పడే ప్రమాదాన్ని ఎదుర్కొంటారు.

'నాకు కొత్తగా అనిపించింది'
చిన్న వయసులోనే యుక్తవయస్సు రావడంతో, గాబీకి అప్పటి విషయాలు పెద్దగా గుర్తులేవు. కానీ, ఆ కొన్ని క్షణాలు మాత్రం ఎంతో బాధాకరంగా, కలవరపరిచేలా ఉండేవి.
"విపరీతమైన నొప్పితో నేలపై కాళ్లు ముడుచుకుని పడుకున్న జ్ఞాపకాలు నాకు ఉన్నాయి" అని ఆమె చెప్పారు.
దాదాపు ఏడాదిపాటు వైద్య పరీక్షలు చేయించుకుని, నిపుణులను సంప్రదించిన తరువాత ఆమె మెదడులో ఎటువంటి సమస్యలు లేవని ఎంఆర్ఐ స్కానింగ్‌లో తేలింది. ఆమె 'సెంట్రల్ ప్రికోషియస్ ప్యూబర్టీ' బారిన పడినట్లు నిర్ధరణ అయింది.
దాంతో ఆమె హార్మోన్లను నిరోధించే 'గొనాడోట్రోపిన్-రిలీజింగ్ హార్మోన్ ఎగోనిస్ట్స్' (జీఎన్‌ఆర్‌హెచ్) తీసుకోవడం ప్రారంభించారు.
"అన్ని రకాల పరీక్షలు చేయడం, హార్మోన్లను నిరోధించడానికి ప్రతి మూడు వారాలకోసారి ఇంజెక్షన్లు ఇవ్వడంతో నాకు ఎంతో కొత్తగా అనిపించేది" అని ఆమె అన్నారు.
జీఎన్‌ఆర్‌హెచ్ క్రమం తప్పకుండా ఇవ్వడం ద్వారా యుక్తవయస్సు పురోగతి ఆగుతుంది, పిల్లలు వారి వయస్సుకు తగ్గ సాధారణ వేగంతో పెరగడానికి అవకాశం లభిస్తుంది. సాధారణంగా 11 నుంచి 12 ఏళ్ల వయస్సు మధ్య ఈ మందులను నిలిపివేస్తారు, దాంతో యుక్తవయస్సు ప్రక్రియ యథావిధిగా పునఃప్రారంభమవుతుంది.
గాబీ శరీర వికాసాన్ని ఆపడంలో ఈ మందులు ప్రభావవంతంగా పనిచేసినప్పటికీ, ఆమె అప్పటికే యుక్తవయస్సులో వచ్చే శారీరక మార్పులతో ఒక సంవత్సరం గడిపారు.
"అద్దంలో చూసుకున్నప్పుడు నేను ఎవరో నాకు అసలు అర్థమయ్యేది కాదు, ఎందుకంటే నా మానసిక వయస్సు కంటే నా రూపం పెద్దదిగా కనిపించేది. ఆ వయస్సుకు ఉండాల్సిన దానికంటే ఎక్కువ పరిణతి ప్రదర్శించాల్సి వచ్చిందేమోనని నాకు అనిపిస్తుంటుంది" అని ఆమె తెలిపారు.

ఫొటో సోర్స్, Gabby
అకాల యుక్తవయస్సుకు కారణాలు ఏమిటి?
ఈ సమస్య రెండు రకాలుగా ఉంటుంది:
పెరిఫెరల్ ప్రికోషియస్ ప్యూబర్టీ (పీపీపీ): హార్మోన్ల నియంత్రణ కేంద్రంగా పనిచేసే మెదడులోని 'హైపోథాలమస్' ప్రమేయం లేకుండా, అండాశయాలు, వృషణాలు చాలా ముందే లైంగిక హార్మోన్లను విడుదల చేయడం ప్రారంభించినప్పుడు ఇది సంభవిస్తుంది. అండాశయం లేదా వృషణాలలో గడ్డలు, అడ్రినల్ అపసవ్యతలు, లేదా లైంగిక స్టెరాయిడ్ల ప్రభావానికి గురికావడం లాంటి సమస్యలు దీనికి కారణమవుతాయి.
సెంట్రల్ ప్రికోషియస్ ప్యూబర్టీ (సీపీపీ): శరీరం చాలా త్వరగా యుక్తవయస్సులోకి అడుగుపెడుతుంది, కానీ ప్రక్రియ సాధారణంగానే కొనసాగుతుంది. అకాల యుక్తవయస్సు రూపాలలో ఇది అత్యంత సాధారణమైనది. దీనికి సాధారణంగా స్పష్టమైన కారణమేదీ కనిపించదు.
డెన్మార్క్‌లో 1998 నుంచి 2017 మధ్య 8,596 మంది పిల్లలపై 2020లో నిర్వహించిన అధ్యయనంలో ప్రతీ సంవత్సరం సగటున 10,000 మంది బాలికలలో 9.2 మంది, 10,000 మంది బాలురలో 0.9 మంది సీపీపీకి గురవుతున్నట్లు తేలింది.
ఈ 20 సంవత్సరాల కాలంలో బాలికలలో సంభవించే రేటు మూడు రెట్లు, బాలురలో రెండు రెట్లు పెరిగినట్లు పరిశోధకులు గుర్తించారు.
కొరియాలో 2008 నుంచి 2014 మధ్యకాలంలో జాతీయ బీమా క్లెయిమ్‌ల విశ్లేషణ ప్రకారం, ప్రతి 10,000 మంది బాలికలలో 26.28 మంది సిపిపితో బాధపడుతుండగా, బాలురలో ప్రతి 10,000 మందికి కేవలం 0.7 మంది మాత్రమే ఉన్నారు.
బాలికలు ఎక్కువగా ఎందుకు ప్రభావితమవుతున్నారో పరిశోధకులకు పూర్తిగా అర్థం కాలేదు, కానీ పర్యావరణ, జీవసంబంధమైన కారణాల కలయిక కావచ్చునని వారు చెబుతున్నారు. సాధారణ జనాభాలోని బాలికలలో మరింత త్వరగా యుక్తవయస్సు రావడం వైపు మళ్లుతున్న విస్తృత మార్పును కూడా ఇది సూచించవచ్చు.
44 అధ్యయనాలను విశ్లేషిస్తూ 2025లో చేసిన ఒక మెటా అనాలసిస్ ప్రకారం, 1977 నుంచి 2013 మధ్య బాలికలలో రొమ్ముల వికాసం ప్రారంభమయ్యే సగటు వయస్సు ప్రతి పదేళ్లకు దాదాపు మూడు నెలలు తగ్గింది.
బాలురలో ఈ మార్పు అంత తీవ్రంగా లేనప్పటికీ, వారు కూడా ముందే యుక్తవయస్సులోకి వస్తుండవచ్చని అధ్యయనాలు చూపుతున్నాయి.

ఫొటో సోర్స్, Bruno Bernardi
ఈ సమస్యతో బాధపడుతున్న ఏడాది వయసున్న పసిపిల్లలకు కూడా తాము చికిత్స అందించినట్లు బ్రెజిల్‌లోని సావో పాలో విశ్వవిద్యాలయానికి చెందిన ఎండోక్రినాలజిస్ట్ డాక్టర్ అనా పిన్హెయిరో మచాడో కాంటన్ చెప్పారు.
ఇలాంటి తీవ్రమైన కేసులలో, మెదడులోని హైపోథాలమస్‌పై ఉండే లోపాలే ప్రధాన కారణం కావచ్చు. మెదడులో కణితులు ఉండటం వల్ల కూడా అకాల యుక్తవయస్సు మొదలవుతుందని తెలిసింది.
ఆహారం, పర్యావరణం వంటి బాహ్య అంశాల ప్రభావం కూడా ఉండవచ్చని కాంటన్, ఆమె పరిశోధనా బృందం భావిస్తున్నారు.
"పిల్లల్లో అధిక బరువు శాతం ఎక్కువగా ఉండటం మనం గమనించాల్సిన ఒక ముఖ్యమైన అంశం, ఎందుకంటే పిల్లలు అధిక బరువు ఉన్నప్పుడు యుక్తవయస్సు ప్రక్రియ వేగవంతమవుతుంది" అని ఆమె తెలిపారు.
కొవ్వు కణజాలం ఈస్ట్రోజెన్‌తో పాటు ఎముకల ఎదుగుదలకు దోహదపడే 'లెప్టిన్' అనే హార్మోన్ స్థాయిలను పెంచుతుందని తేలింది. ఇవి కొందరు పిల్లల్లో అకాల యుక్తవయస్సుకు కారణమవుతుండవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.
ఈ ప్రక్రియలో జన్యువులు కూడా ఒక పాత్ర పోషిస్తాయి.
2013లో ఈ బృంద నాయకురాలు ప్రొఫెసర్ అన్నా క్లాడియా లాట్రానిక్, హార్వర్డ్ విశ్వవిద్యాలయం కలిసి చేసిన పరిశోధనలో, 'ఎంకేఆర్ఎన్3' అనే జన్యువులోని మ్యుటేషన్.. సెంట్రల్ ప్రికోషియస్ ప్యూబర్టీకి కారణమవుతుందని గుర్తించారు.
లారా (10), బీట్రిజ్ (8) అనే అక్కాచెల్లెళ్లిద్దరూ ఈ మ్యుటేషన్ కలిగి ఉన్నారు. లారాకు చిన్న వయస్సులోనే రొమ్ము అభివృద్ధి సంకేతాలు కనిపించినప్పుడు మాత్రమే ఇది వెలుగులోకి వచ్చింది.
"పరిస్థితి చూసి నేను చాలా భయపడ్డాను, ఎందుకంటే అప్పటికి తన వయస్సు ఐదేళ్ల పది నెలలు మాత్రమే, ఈ మార్పులు తట్టుకోవడానికి తను ఇంకా చాలా చిన్న పిల్ల" అని ఆమె తల్లి లెయా బెర్నార్డి చెప్పారు.
జన్యు పరీక్షల ద్వారా, ఈ మ్యుటేషన్ తండ్రి వైపు నుంచి వచ్చిందని, చిన్నకుమార్తె బీట్రిజ్‌కు కూడా సీపీపీ వచ్చే అవకాశం దాదాపు ఖాయమని కాంటన్, ఆమె బృందం గుర్తించగలిగారు.
దీంతో ఏడేళ్ల వయస్సులో ఆమెలో ఎదుగుదల సంకేతాలు కనిపించడం ప్రారంభమవ్వగానే, వెంటనే చికిత్స ప్రారంభించడానికి వీలైంది.
"పిల్లల బాల్యంలో కొంత భాగాన్ని కోల్పోయామని అనిపించి, నేను చాలా ఆందోళన చెందాను" అని లెయా అన్నారు.

ఫొటో సోర్స్, Gabby
క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాలు
చికిత్స తీసుకోని సెంట్రల్ ప్రికోషియస్ ప్యూబర్టీ ప్రభావం మానసికంగా, శారీరకంగా తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలకు దారితీస్తుందని కాంటన్ హెచ్చరిస్తున్నారు.
"ఆరేళ్లు లేదా ఏడేళ్ల వయస్సులోనే రొమ్ము అభివృద్ధి ప్రారంభమైన ఒక చిన్నారి.. పాఠశాలలో తన స్నేహితులు, తోటి బాలికల కంటే చాలా భిన్నంగా మారుతుంది. ఇది మానసికంగా చాలా కష్టమైన అంశం" అన్నారామె.
జీవసంబంధంగా చూస్తే, చిన్న వయస్సులోనే యుక్తవయస్సులోకి వచ్చే పిల్లలు పొట్టిగా ఉండిపోయే అవకాశం ఉంది.
"ఎముకల పరిపక్వతకు లైంగిక హార్మోన్లు బాధ్యత వహిస్తాయి. కాబట్టి యుక్తవయస్సు ముందే వస్తే, ఎముకల పరిపక్వత చాలా వేగంగా జరిగి, త్వరగానే ఆగిపోతుంది" అని కాంటన్ వివరించారు.
పెద్ద ఎత్తున జరిపిన అధ్యయనాలలో చిన్న వయస్సులోనే యుక్తవయస్సు రావడం గుండె సంబంధిత వ్యాధులు, రొమ్ము, ఎండోమెట్రియల్ క్యాన్సర్ వంటి లైంగిక హార్మోన్లతో ముడిపడి ఉన్న క్యాన్సర్ల ప్రమాదాన్ని పెంచుతుందని తేలింది.
అయితే ముందస్తు నిర్ధరణ, వీలైనంత త్వరగా వైద్య సహాయం అందించడం ద్వారా ఈ ప్రమాదాలను తగ్గించవచ్చని కాంటన్ చెబుతున్నారు.
"మేం ప్రస్తుతం ఉపయోగిస్తున్న ఈ రకమైన చికిత్సను దాదాపు గత మూడు లేదా నాలుగు దశాబ్దాలుగా ఉపయోగిస్తున్నాం, ఇది ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుంది" అని ఆమె అన్నారు.

ఫొటో సోర్స్, Bruno Bernardi
మొదట్లో ఎంతో భయపడినప్పటికీ, తమ కుమార్తెలు సాధారణ బాల్యాన్ని గడపడం చూసి తల్లిదండ్రులు లెయా, బ్రూనో ఉపశమనం పొందారు.
"లారాకు ఈ ప్రక్రియ ప్రారంభమైనప్పుడు, ఇది తనకే ఎందుకు జరుగుతోందని ఆలోచించేది. తను ఎందుకు వేరుగా ఉంది? తను ఈ మందులు ఎందుకు తీసుకోవాలి అని అడిగేది" అని లెయా చెప్పారు.
తమ అనుభవాన్ని పంచుకోవడం ద్వారా ఇతర తల్లిదండ్రులలో అవగాహన పెంచవచ్చని, వారు త్వరగా వైద్య సహాయం పొందేలా ప్రోత్సహించవచ్చని వారు ఆశిస్తున్నారు.
గాబీ కూడా ఈ విషయం గురించి బహిరంగంగా మాట్లాడటానికి ఆసక్తి చూపుతుంటారు. ఈ సమస్య పట్ల ఇతరులలో ఉన్న సంకోచాన్ని పోగొట్టడానికి తన సోషల్ మీడియా వేదికలను ఉపయోగిస్తుంటారు.
"ఈ విషయం గురించి అందుబాటులో చాలా తక్కువ సమాచారం ఉండటం నాకు కొంత కోపం తెప్పించింది. చాలామంది నన్ను సంప్రదించడం చూసినప్పుడు, నేను దీనిని అనుభవించానని ప్రపంచానికి చెప్పి సరైన పనే చేశానని అనిపించింది" అని గాబీ అన్నారు.
(అదనపు రిపోర్టింగ్: పౌలా అడామో ఇడోయేటా)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




























