హిందూ జింఖానా: పాకిస్తాన్ పాలకులు ఈ భవనాన్ని ఎందుకు కూలగొట్టాలని చూశారు?

ఫొటో సోర్స్, Rana Tahir
కరాచీలోని చారిత్రక హిందూ జింఖానా గుండా ప్రయాణిస్తున్నవారు ఆ భవనం వైపు చూపు తిప్పకుండా ఉండలేరు.
దాని ఆకృతి అంతలా ఆకర్షిస్తుంది. జింఖానాను చూస్తున్నంతసేపు మనం మొగల్ కాలంనాటికి వెళ్లిపోతాం.
ఈ కారణంతోనే కరాచీలో మొగల్ శైలిలో నిర్మించిన తొలి భవంతి ఇదేనని పూర్తి విశ్వాసంతో చెప్పవచ్చు. ఇది ముస్లిం ఆర్కిటెక్ట్ నిర్మించిన హిందూ భవనం..
ఆగాఖాన్ హుస్సేన్ డిజైన్ల ఆధారంగా ఈ హిందూ జింఖానాను రూపొందించారు. ఆయన కరాచీలోనే తొలి ముస్లిం ఆర్కిటెక్ట్.
కరాచీలోని మరో చారిత్రక భవనమైన మొహత్తా ప్యాలెస్ మ్యాప్‌ని సైతం ఆయనే తయారు చేశారు. ఆగ్రాలోని ఇతిమద్ ఉద్ దౌలా టూంబ్ (సమాధి) ప్రేరణతో హిందూ జింఖానా లేఅవుట్‌ను సిద్ధం చేసినట్లు చెబుతారు.


ఫొటో సోర్స్, Rana Tahir
మొగల్, రాజస్థానీ శైలిలో..
గోడలకు ఉపయోగించిన రాతిని బీజాపుర్ నుంచి దిగుమతి చేసుకున్నారు. ఫతేపుర్ సిక్రీలో మొగల్ చక్రవర్తి అక్బర్ నిర్మాణాల నుంచి స్ఫూర్తి పొంది భవనం వెలుపల గొడుగు ఆకృతులను తీర్చిదిద్దారు.
భవనం మూలల్లో చుట్టూ నిర్మించిన అష్టభుజ టవర్లు రాజస్థానీ శైలిని ప్రతిబింబిస్తాయి.
1921లో హిందూ జింఖానా నిర్మాణం కోసం బ్రిటిష్ ప్రభుత్వం 100 ఏళ్ల పాటు ఈ భూమిని లీజుకి ఇచ్చింది. దీని నిర్మాణం 1925లో పూర్తయ్యింది.
ఈ జింఖానాను హిందూ కమ్యూనిటీయే నిర్మించింది. నిర్మాణంలో సేత్ రామ్ గోపాల్ గోవర్ధన్ దాస్ మొహత్తా కీలక పాత్ర పోషించారు. దీంతో జింఖానాకు ఆయన పేరునే పెట్టారు.
కరాచీలోని చారిత్రక మొహత్తా ప్యాలెస్‌ని సేత్ గోపాల్ గోవర్దన్ దాస్ మొహత్తా తాత శివ్రతన్ చంద్రరతన్ మొహత్తా నిర్మించారు. ప్రస్తుతం అందులో మ్యూజియం నిర్వహిస్తున్నారు.
ఈ హిందూ జింఖానాను నిర్మించడానికి ప్రధాన కారణం, నాటి హిందువులు తమ సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ఓ వేదికను అందించడమే.
కరాచీ హిందువుల్లోని ఉన్నత వర్గాల వారికి ఇదొక క్లబ్‌గా ఉండేది. సాంస్కృతిక వేడుకలకు ఈ భవనం ప్రధాన కేంద్రంగా పనిచేసేదని చరిత్ర పుస్తకాలు చెబుతున్నాయి.

ఫొటో సోర్స్, Rana Tahir
కరాచీ నుంచి భారతీయ హిందూ క్రికెటర్లు..
సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు క్రీడలకు ఆతిథ్యం ఇవ్వడంలోనూ హిందూ జింఖానా ముందుండేది.
ఆ సమయంలో, ఈ జింఖానాకు సొంతంగా మైదానం ఉండేది. అక్కడ అనేక పోటీలు జరిగేవి. అయితే ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు మాత్రం కరాచీ జింఖానాలోనే జరిగేవి.
నవోమల్ జియోమల్ వంటి ప్రతిభావంతులను హిందూ జింఖానా ప్రోత్సహించింది. పాకిస్తాన్ ఆవిర్భావానికి ముందు, కరాచీలో జన్మించిన అనేకమంది హిందూ క్రికెటర్లు ఆ సమయంలో ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడారు.

ఫొటో సోర్స్, Hulton Archive/Getty Images
జింఖానాను హిందువులకే కేటాయించాలని ఉద్యమం..
పాకిస్తాన్ ఏర్పడిన తర్వాత అక్కడి నుంచి భారీ సంఖ్యలో హిందువులు భారత్‌కు వలసొచ్చేశారు. దీంతో హిందూ జింఖానా పాకిస్తాన్ ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చింది.
కాలక్రమేణా, వేర్వేరు కార్యక్రమాల కోసం పలు సంస్థలకు జింఖానా భూములను కట్టబెట్టారు.
హిందూ జింఖానాను హిందువులకు కేటాయించాల్సిందిగా 1960లలో భగవాన్ దాస్ చావ్లా, సేఠ్ మోతన్ దాస్, ఖూబ్చంద్ భాటియా ఓ ఉద్యమాన్ని మొదలుపెట్టారు.
హిందూ జింఖానా కూల్చేయాలని ఆదేశాలు..
ప్రభుత్వ రికార్డుల ప్రకారం, వాస్తవానికి హిందూ జింఖానా విస్తీర్ణం 39,178 చదరపు గజాలు. ప్రస్తుతం అది కేవలం 4,816 చదరపు గజాలకే పరిమితమైంది.
నేటివరకు, జింఖానా భూముల నుంచి పోలీసు శాఖకు 27,346 చ.గలు అప్పగించారు. ఫెడరల్ సర్వీస్ కమిషన్‌కు 6,700 చ.గలు కేటాయించగా, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ ఓల్డ్ బాయ్స్ అసోషియేషన్‌కు 4,164 చ.గలు ఇచ్చేశారు.
అయితే అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ ఓల్డ్ బాయ్స్ అసోషియేషన్ దానికి తగిన చెల్లింపు చేసింది.
అంతేకాదు, సైనిక అధ్యక్షుడు జియా ఉల్ హక్ పాలనలో ఈ హిందూ జింఖానా భవనాన్ని విక్రయించాలని నిర్ణయించారు. దానిని కూల్చివేయాలని కూడా ఆదేశించారు.
భవనం శిథిలావస్థకు చేరుకుందని, అందుకే కూల్చివేయాలని నిర్ణయించినట్లు దీనికి కారణం చెప్పారు.
అయితే, ది హెరిటేజ్ ఫౌండేషన్ సమయానికి కలుగజేసుకొని హిందూ జింఖానాను కూల్చివేయకుండా అడ్డుకుంది.
ఆ తర్వాత, హిందూ జింఖానా భవంతిని అలాగే కాపాడుతూ వచ్చారు. అయితే దాని యాజమాన్యం, నిర్వహణ హక్కులపై వివాదం చెలరేగింది.
ఈ కేసు ఇప్పటికీ సుప్రీం కోర్టులో పెండింగ్‌లోనే ఉంది.

ఫొటో సోర్స్, Rana Tahir
కోర్టులు చెప్పినా వినడం లేదా?
"2005లో జనరల్ పర్వేజ్ ముషారఫ్ పాలనలో, జియా మోహియుద్దీన్‌కు ప్రత్యేక ఉపకారంగా హిందూ జింఖానా ఒరిజినల్ స్టేటస్‌ని రద్దు చేశారు. అక్కడ నేషనల్ అకాడమీ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ (ఎన్ఏపీఏ )ని స్థాపించి, దానికి ఆయనను అధ్యక్షుడిని చేశారు" అని శ్రీరత్నేశ్వర్ మహాదేవ్ వెల్ఫేర్ సేవా మండలి కమిటీ వైస్ ప్రెసిడెంట్ అశోక్ మోత్వానీ తెలిపారు.
"ఈ అకాడమీలో నాటక, సంగీత శాస్త్రాల్లో మూడేళ్ల డిప్లొమా కోర్సులను అందిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ 111 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అకాడమీని అక్కడి నుంచి తరలించి హిందూ జింఖానాను హిందువులకే అప్పగించాలని 2007లో మేము సింధ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాం. ఆ తర్వాత ఈ అంశం సుప్రీంకోర్టుకు చేరుకుంది" అని అశోక్ మోత్వానీ వెల్లడించారు.
"2014 నుంచి ఈ కేసు పెండింగ్‌లోనే ఉంది. ఈ హిందూ జింఖానాను ఏ ఉద్దేశంతో ఏర్పాటు చేశారో దానికోసమే వినియోగించాలని కోరుతున్నాం." అని మోత్వానీ అన్నారు.
2008లో నేషనల్ అకాడమీ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ కి సింధ్ ప్రభుత్వం ఓ నోటీస్ జారీచేసింది. ఒప్పందానికి విరుద్ధంగా చేపడుతున్న నిర్మాణ పనులను వెంటనే నిలిపివేసి, భవనాన్ని ఖాళీ చేయాలని ఆదేశించింది.
అయితే తాము ఎలాంటి అక్రమ నిర్మాణం చేపట్టలేదని ఆ సంస్థ వాదించింది.
సంస్థను మరో చోటుకి తరలించాలని 2018లో కోర్టు ఆదేశించింది. అయితే ఈ తీర్పు ఇప్పటికీ అమలు కాలేదు.
హిందూ జింఖానాను దాని పూర్వ స్థితికి పునరుద్ధరించాలని 2021 అక్టోబర్‌లో సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ గుల్జార్ అహ్మద్ ఆదేశించారు. అయితే అకడమీకి ప్రత్యామ్నాయ ప్రదేశం లభించేంతవరకు అక్కడే కొనసాగవచ్చని కూడా పేర్కొన్నారు.
అయితే నేషనల్ అకాడమీని తరలించడంలో జరగుతున్న జాప్యంపై కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
2021లో మరో విచారణలో భాగంగా, ఒకవేళ హిందూ జింఖానాను హిందూ సమాజానికే కేటాయిస్తే దానిని ఎవరు నిర్వహిస్తారు? అనే ప్రశ్నను కూడా సుప్రీంకోర్టు లేవనెత్తింది.

ఫొటో సోర్స్, Rana Tahir
"ఇప్పటివరకు మిగిలిందైనా ఇవ్వండి.."
"ఈ విషయంలో మేము సుప్రీంకోర్టుకు కొన్ని సూచనలు చేశాం. మా సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాలను తిరిగి ప్రారంభించేందుకు ఇప్పటివరకు ఎంత మిగిలితే అంత హిందూ సమాజానికి అప్పజెప్పాలని కోరుతున్నాం" అని డా. మోత్వానీ తెలిపారు.
"ప్రభుత్వం కావాలనుకుంటే దాని ప్రతినిధి ఒకరిని ఇందులో చేర్చవచ్చు. హిందూ జింఖానాను దాని వాస్తవ స్వరూపానికి తిరిగి తీసుకురావడమే మా లక్ష్యం. మేము కూడా పాకిస్తాన్ పౌరులమే. మేము ఈ నేల విడిచి వెళ్లలేదు. ఇక్కడే ఉన్నాం" అని అన్నారు.
"సుప్రీం కోర్టు ఆదేశానుసారం, ప్రత్యేక పర్వదినాల్లో పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ భవనంలో మేము కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాం. అయితే అందుకు సింధ్ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకొని అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది" అని చెప్పారు.
ప్రస్తుతం కరాచీలో కరాచీ జింఖానా, కరాచీ క్లబ్ అనే రెండు ప్రధాన ప్రైవేటు వ్యక్తుల కేంద్రాలు ఉన్నాయి. సామాజిక, సాంస్కృతిక, క్రీడా కార్యక్రమాలకు అవి ప్రసిద్ధి.
ఈ రెండింటిలోనూ హిందువులు అధిక సంఖ్యలో సభ్యులుగా ఉన్నారు. అన్ని కార్యక్రమాల్లో వారు చురుకుగా పాల్గొంటారు. అయితే ఇలాంటి కార్యక్రమాల కోసం వారికంటూ ఓ ప్రత్యేక స్థలం లేదు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























