అయోధ్య హుండీ చోరీ కేసు: కానుకల దొంగతనం ఆరోపణల నుంచి అరెస్టుల వరకూ.. ఎప్పుడు ఏం జరిగింది?

అయోధ్య, అయోధ్య రామమందిరం, హిందూ, హుండీలో కానుకల చోరీ ఆరోపణలు, బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అయోధ్య రామమందిరం హుండీల కానుకల చోరీ ఆరోపణలు జూన్ ఆరంభం నుంచి మొదలయ్యాయి.
ప్రచురణ
చదివే సమయం: 7 నిమిషాలు

అయోధ్య రామమందిరంలో విరాళాలు, కానుకల దొంగతనం, దుర్వినియోగం ఆరోపణలతో ఇప్పటివరకు 8 మంది నిందితులను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అరెస్టు చేసింది.

ఈ ఎనిమిది మంది నిందితులకు విధించిన 3 రోజుల జ్యుడీషియల్ కస్టడీ ముగిసిన వెంటనే, సోమవారం జూన్ 29న మరో 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి పంపారు.

జ్యుడీషియల్ కస్టడీ ముగిసిన వెంటనే నిందితులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అవినీతి నిరోధక కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి రజత్ వర్మ ఎదుట హాజరుపరిచారని పీటీఐ వార్తా సంస్థ తెలిపింది.

రామమందిరం కానుకల చోరీ కేసులో నిందితుల తరఫున వాదించకూడదని జూన్ 29 సోమవారం జరిగిన బార్ కౌన్సిల్ సమావేశంలో ఫైజాబాద్ బార్ అసోసియేషన్ నిర్ణయించింది.

నిందితుల తరఫున వాదిస్తే రూ.5 లక్షల జరిమానాతో పాటు సదరు న్యాయవాది సభ్యత్వాన్ని రద్దు చేయాలని కూడా బార్ అసోసియేషన్ నిర్ణయించింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

అయోధ్య రామమందిరం విరాళాలలో అవకతవకల వ్యవహారం జూన్‌ నెలలో ప్రధాన చర్చనీయాంశమైంది.

ఈ అంశం రాజకీయంగా హీట్ పెంచడమే కాకుండా ఆరోపణలు, ప్రత్యారోపణలకు దారితీసింది.

అసలు ఈ వ్యవహారం ఎప్పుడు, ఎక్కడ మొదలైంది? తెలుసుకుందాం.

అయోధ్య, అయోధ్య రామమందిరం, హిందూ, హుండీలో కానుకల చోరీ ఆరోపణలు, బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీ

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, అఖిలేశ్ యాదవ్ ఎక్స్‌ పోస్ట్ తర్వాత అయోధ్య కానుకల విషయం వెలుగులోకి వచ్చింది.
అయోధ్య రామమందిరం, హుండీ చోరీ కేసు

రామమందిరం హుండీల్లో నుంచి నగదు, ఇతర విలువైన వస్తువులు మాయమవుతున్నాయన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయంటూ జూన్ నెల ఆరంభంలో మీడియాలో కొన్ని కథనాలు వచ్చాయి.

ఆ తర్వాత, ఇదే అంశంపై అయోధ్యకు చెందిన స్థానిక నాయకుల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు మొదలయ్యాయి.

అయోధ్య రామమందిరం, హుండీ చోరీ కేసు

రామమందిరం హుండీ కానుకల దొంగతనం ఆరోపణల విషయాన్ని అయోధ్యకు చెందిన మాజీ ఎమ్మెల్యే, సమాజ్‌వాదీ పార్టీ నేత పవన్ పాండే లేవనెత్తారు. అనంతరం, ఆ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఈ విషయంలో పలు డిమాండ్లు చేశారు.

రామమందిరానికి వచ్చిన కోట్ల రూపాయల కానుకల్లో అవకతవకలు జరిగాయని అఖిలేశ్ ఎక్స్‌లో ఒక పోస్ట్ చేశారు.

"రామమందిరానికి వచ్చిన కోట్ల రూపాయల కానుకలు కనిపించకుండా పోవడమనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీరాముడి భక్తులకు జీర్ణించుకోలేని విషయం. ఇది ఆలయ ట్రస్టుకు అవమానకరం. దీనిపై వివరణ ఇచ్చేందుకు కూడా ఎవరూ ముందుకు రావడం లేదు" అని ఆయన రాశారు.

"ఇది శ్రీరాముడిపై యావత్ సనాతన సమాజానికున్న ప్రగాఢ విశ్వాసానికి సంబంధించిన అంశం, కాబట్టి కోర్టు సుమోటోగా స్వీకరించాలన్న డిమాండ్ ఉంది. ఈ వ్యవహారంలో ప్రభుత్వ మౌనం కూడా అనుమానాస్పదంగా ఉంది" అని ఆయన రాశారు.

అయోధ్య, అయోధ్య రామమందిరం, హిందూ, హుండీలో కానుకల చోరీ ఆరోపణలు, బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీ

ఫొటో సోర్స్, Deepak Gupta/Hindustan Times via Getty Images

ఫొటో క్యాప్షన్, ఇది దేశంలోనే అతిపెద్ద దోపిడీ అని, శ్రీరాముడి ఆలయానికి సంబంధించిన దోపిడీ అని ప్రతిపక్షం ఆరోపణలు చేసింది.
అయోధ్య రామమందిరం, హుండీ చోరీ కేసు

ఈ వ్యవహారంపై అధికార, ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగాయి. రామమందిరం విరాళాలు, కానుకల అవకతవకల ఆరోపణలను ఖండిస్తూ శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ఒక వీడియో విడుదల చేశారు.

మరోవైపు, దీనిపై కేంద్ర సంస్థలతో దర్యాప్తు జరపించాలని కోరుతూ బీజేపీ సీనియర్ నేత రజనీష్ సింగ్ ప్రధాన మంత్రి కార్యాలయానికి(పీఎంవో) లేఖ రాసినట్లు కూడా మీడియా కథనాలు వచ్చాయి.

ఈ మొత్తం వ్యవహారంపై ట్రస్ట్ నుంచి పీఎంవో నివేదిక కోరినట్లు కూడా ఆ కథనాల్లో పేర్కొన్నారు.

అయోధ్య, అయోధ్య రామమందిరం, హిందూ, హుండీలో కానుకల చోరీ ఆరోపణలు, బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీ

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, సిట్ ఏర్పాటు తర్వాత ఈ కేసు దర్యాప్తు ప్రారంభమైంది.
అయోధ్య రామమందిరం, హుండీ చోరీ కేసు

ఈ వివాదం మరింత ముదరడంతో ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ సర్కార్ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది.

ఈ సిట్ బృందంలో ఐఏఎస్ అధికారి విజయ్ విశ్వాస్ పంత్, ఐపీఎస్ అధికారి కిరణ్ ఎస్, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి నీల్ రతన్ సభ్యులుగా ఉన్నారు. జూన్ 15న సిట్ దర్యాప్తు ప్రారంభించింది.

అయితే, సిట్‌‌ విచారణను నమ్మలేమన్న ప్రతిపక్షాలు సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశాయి.

అయోధ్య రామమందిరం, హుండీ చోరీ కేసు

ఈ కేసు విచారణకు సిట్ ఏర్పాటైన తర్వాత, జూన్ 19న యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తొలిసారి దీనిపై స్పందించారు.

'పాలు పాలుగా, నీళ్లు నీళ్లుగా తేలిపోతాయని' సీఎం యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు.

అయోధ్య, అయోధ్య రామమందిరం, హిందూ, హుండీలో కానుకల చోరీ ఆరోపణలు, బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీ

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, సిట్ తన ప్రాథమిక నివేదికను హోం శాఖ అడిషనల్ సెక్రటరీ సంజయ్ ప్రసాద్‌కు సమర్పించింది.
అయోధ్య రామమందిరం, హుండీ చోరీ కేసు

పది రోజుల్లోనే, అంటే జూన్ 23న తన ప్రాథమిక నివేదికను సిట్ రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది.

అనంతరం, జూన్ 25 సాయంత్రం 8 మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, వారిని అరెస్టు చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న నిందితులందరూ మందిరంలోని 40 హుండీల్లోని కానుకలను లెక్కించే బృందంలోని సభ్యులే.

ఆలయ నిధుల దుర్వినియోగం ఆరోపణలకు సంబంధించి వారి పాత్రపై విచారణ జరుగుతోంది.

శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యుడు కృష్ణ మోహన్ ఫిర్యాదు మేరకు రామ జన్మభూమి పోలీస్ స్టేషన్‌లో వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది.

ఉద్యోగి చేతివాటం, నమ్మకద్రోహం, మోసం, నేరపూరిత కుట్రకు సంబంధించి ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది.

ఎఫ్ఐఆర్‌లో నిందితులుగా పేర్కొన్న వారిలో టిన్నూ యాదవ్, అనుకల్ప్ మిశ్రా, లవకుశ్ మిశ్రా, అవినాష్ శుక్లా, మనీష్ యాదవ్, సుభాష్ శ్రీవాస్తవ, కరుణేష్ పాండే, రామ్‌శంకర్ మిశ్రా ఉన్నారు.

అయోధ్య, అయోధ్య రామమందిరం, హిందూ, హుండీలో కానుకల చోరీ ఆరోపణలు, బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీ

ఫొటో సోర్స్, Sonu Mehta/Hindustan Times via Getty Images

ఫొటో క్యాప్షన్, అవకతవకల ఆరోపణలను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తోసిపుచ్చారు. (ఫైల్ ఫోటో)
అయోధ్య రామమందిరం, హుండీ చోరీ కేసు

శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, సభ్యుడు అనిల్ మిశ్రా లు జూన్ 27న తమ పదవులకు రాజీనామా చేశారు.

రాజీనామాల వార్త శుక్రవారం నుంచే మీడియాలో ప్రచారంలో ఉన్నప్పటికీ, ట్రస్ట్ జూన్ 27న దీనికి సంబంధించి లేఖ విడుదల చేసింది.

లేఖ విడుదల చేసినట్లు ట్రస్ట్ ట్రెజరర్ గోవింద్ గిరి బీబీసీకి ధ్రువీకరించారు. ఇద్దరూ రాజీనామా చేసినట్లు చెప్పారు. అయితే, చంపత్ రాయ్‌కు సన్నిహితంగా ఉండేవారు మాత్రం ఆ లేఖను తాము విశ్వసించడం లేదని అంటున్నారు.

ఈ వ్యవహారంపై చంపత్ రాయ్ నుంచి ఎలాంటి ప్రకటనా రాలేదు.

అయోధ్య, అయోధ్య రామమందిరం, హిందూ, హుండీలో కానుకల చోరీ ఆరోపణలు, బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీ

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, ఎనిమిది మంది నిందితుల్లో టిన్నూ యాదవ్ ఒకరు.
అయోధ్య రామమందిరం, హుండీ చోరీ కేసు

అరెస్టు అనంతరం, 8 మంది నిందితులను మూడు రోజుల జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ఆ కస్టడీ ముగిసిన వెంటనే, జూన్ 29న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్పెషల్ యాంటీ కరప్షన్ కోర్టు జడ్జి రజత్ వర్మ ఎదుట హాజరుపరిచారు.

న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది.

అదే రోజు జరిగిన బార్ కౌన్సిల్ సమావేశంలో, రామమందిరం కానుకల అవకతవకల కేసులో నిందితుల తరఫున ఎవరూ వాదించకూడదని ఫైజాబాద్ బార్ అసోసియేషన్ నిర్ణయించింది.

అయోధ్య రామమందిరం, హుండీ చోరీ కేసు

అయోధ్య రామమందిరంలో అవకతవకల ఆరోపణల కేసులో సిట్ దర్యాప్తు నివేదికను బయటపెట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.

కేసుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఆరు డిమాండ్లు ప్రభుత్వం ముందుంచింది.

  • సిట్ నివేదికను యోగి ప్రభుత్వం బయటపెట్టాలి.
  • శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టును రద్దు చేయాలి.
  • చంపత్ రాయ్, ఇతరులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి విచారణ జరపాలి.
  • కానుకలన్నింటినీ, మొదటి నుంచి నిష్పక్షపాతంగా ఆడిట్ చేయించాలి.
  • ఈ ఆరోపిత స్కామ్‌పై సుప్రీం కోర్టు జడ్జితో విచారణ జరిపించాలి.
  • ప్రధాని మోదీ మౌనం వీడి భక్తులకు క్షమాపణ చెప్పాలి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)