కాంగ్రెస్‌కు, సీజేపీ మధ్య విభేదాలు ఉన్నాయా? అరవింద్ కేజ్రీవాల్ నిరసనలకు ఎందుకు వెళ్లలేదు?

అరవింద్ కేజ్రీవాల్
ఫొటో క్యాప్షన్, అరవింద్ కేజ్రీవాల్
ప్రచురణ
చదివే సమయం: 6 నిమిషాలు

కాంగ్రెస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 2012లో వచ్చిన ఉద్యమం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ ఏర్పడింది.

అదే కాంగ్రెస్ మద్దతుతోనే 2013 డిసెంబర్‌లో అరవింద్ కేజ్రీవాల్ తొలిసారి దిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

2013 దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాలేదు. ఆమ్ ఆద్మీ పార్టీకి 28, బీజేపీకి 31, కాంగ్రెస్‌కు 8 సీట్లు వచ్చాయి. ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అయ్యారు.

అయితే కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ కలిసి ఉన్న ఈ రాజకీయ భాగస్వామ్యం కేవలం 49 రోజులు మాత్రమే కొనసాగింది. తర్వాత 2015 ఫిబ్రవరిలో జరిగిన దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పూర్తిగా కనుమరుగైంది.

బీజేపీ కంటే కాంగ్రెస్‌కే ఎక్కువ రాజకీయ సవాల్ విసిరే పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ అని చాలామంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎక్కడ అధికారంలోకి వచ్చినా, అక్కడ కాంగ్రెస్‌ను ఓడించే అధికారంలోకి వచ్చింది. కానీ ఇప్పటివరకు ఏ రాష్ట్రంలోనూ బీజేపీని ఓడించి అధికారంలోకి రాలేదని చెబుతుంటారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, కేరళ.. ఇలా కొన్ని రాష్ట్రాల్లోనే కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రధాన పోరాటం కాంగ్రెస్‌తో కాదు, బీజేపీతోనే ఉంది. కానీ పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉండటంతో, అక్కడ దాని ప్రధాన పోరాటం కాంగ్రెస్‌తో ఉంది.

దిల్లీ, పంజాబ్ మినహా ఆమ్ ఆద్మీ పార్టీకి దేశంలో పెద్దగా బలమైన ఉనికి లేదు. అంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఒకవైపు బీజేపీకి వ్యతిరేకంగా కనిపించాలి, మరోవైపు కాంగ్రెస్‌కు కూడా వ్యతిరేకంగా ఉండాలి.

ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ విషయంలో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ రెండింటికీ అభ్యంతరాలు ఉన్నాయి. అయితే కాంగ్రెస్ చేపట్టిన ఈ ప్రచారంలో అరవింద్ కేజ్రీవాల్ మాత్రం పాల్గొనడం లేదు.

జూలైలో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) చేపట్టిన నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ నేరుగా పాల్గొనలేదు.

లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నివాసం బయట ధర్నాకు కూర్చున్నప్పుడు, ఆమ్ ఆద్మీ పార్టీ వ్యతిరేకించింది.

కాక్రోచ్ జనతా పార్టీ

ఆమ్ ఆద్మీ పార్టీ విమర్శేంటి

సీజేపీ ఉద్యమాన్ని బలహీనపరిచేందుకు ప్రధాని మోదీయే రాహుల్ గాంధీని ధర్నాలో కూర్చోబెట్టారని ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ 'ఎక్స్‌'లో ఆరోపించారు.

సంజయ్ సింగ్ ఎక్స్‌లో ఏం రాశారంటే.. "కోట్లమంది యువత కోసం సోనం వాంగ్‌చుక్ గత 23 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. జంతర్ మంతర్ వద్ద దేశ యువత ఉద్యమం చేస్తోంది. జూలై 20న యువతపై అత్యంత కఠినంగా దాడి చేశారు. కాంగ్రెస్ నెల రోజులుగా ఈ ఉద్యమాన్ని విమర్శిస్తోంది. ఇప్పుడు రాహుల్ గాంధీ జంతర్ మంతర్‌కు కాకుండా మా ధర్నాకు రండి అని చెబుతున్నారు. అసలు యువత ఉద్యమాన్ని కాంగ్రెస్ ఎందుకు బలహీనపరచాలని చూస్తోంది? జంతర్ మంతర్‌లో జరుగుతున్న ఉద్యమంలో పాల్గొనాలని కాంగ్రెస్ ఎందుకు పిలుపునివ్వడం లేదు?".

అప్పుడు సీజేపీ ఉద్యమంలో ఆమ్ ఆద్మీ పార్టీ చురుగ్గా పాల్గొంది.

"దిల్లీ కాంగ్రెస్‌లో ఇప్పుడు అసలు నాయకులు ఎవరైనా మిగిలి ఉన్నారా? కాంగ్రెస్ యువజన విభాగం, ఎన్ఎస్‌యూఐ, మీరంతా ఎక్కడ ఉన్నారు? కనీసం జనాన్ని కూడా సమీకరించలేకపోతున్నారు. ఇదే నిరసన లక్నోలో జరిగి ఉంటే, ఇక్కడి కంటే ఎక్కువ మంది అక్కడికి వచ్చేవారు" అని అక్టోబర్ 7న ‘ఎక్స్‌’లో ఒక యూజర్ రాశారు.

"రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తమ ప్రజాదరణను నమ్ముకుని అన్నీ నడిపిస్తున్నారు. జనాన్ని చూపించడానికి వారి దగ్గర ఇండియా కూటమికి చెందిన 300 మంది ఎంపీలు ఉన్నారు. అయినప్పటికీ నిరసన బాగానే జరిగింది!" అని ఈ పోస్టును రీపోస్ట్ చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ నేత సౌరభ్ భరద్వాజ్ రాశారు.

సౌరభ్ భరద్వాజ్ చేసిన ఈ పోస్టులో ఖండన కంటే వ్యంగ్యమే ఎక్కువగా ఉంది.

దీనికి సమాధానంగా ఇండియన్ యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ సేవాదళ్ చీఫ్ ఆర్గనైజర్ శ్రీనివాస్ బీవీ ఒక పోస్ట్ చేశారు. అందులో.. "ఒకసారి ఆలోచించండి. కాంగ్రెస్‌ను ఎగతాళి చేయాలని ప్రయత్నించారు. కానీ మీ ట్వీట్‌లోనే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు ఇండియా కూటమికి చెందిన 300 మంది ఎంపీలు అక్కడ ఉన్నారని రాశారు. సౌరభ్ మొత్తం ప్రతిపక్షాన్ని లెక్కపెట్టేశారు. ఎవరు నిజంగా పోరాడుతున్నారో, ఎవరు బీజేపీ ఒడిలో హాయిగా కూర్చున్నారో అనుకోకుండా చెప్పేశారు" అన్నారాయన.

నిజానికి బీజేపీకి ప్రత్యామ్నాయంగా చూపించుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ కోరుకుంటోంది. మరోవైపు బీజేపీతో పోరాడుతున్నది తామేనని కాంగ్రెస్ భావిస్తోంది.

2014లో మోదీకి వ్యతిరేకంగా వారణాసి నుంచి ఎన్నికల్లో పోటీ చేయడానికి వెళ్లినప్పుడు కూడా, మోదీని సవాలు చేయగలిగేది తామేననే సందేశాన్ని ఇవ్వడమే కేజ్రీవాల్ లక్ష్యంగా ఉండేది.

అయితే ప్రతిపక్షం విడిపోతే, దాని వల్ల ఆమ్ ఆద్మీ పార్టీకీ ప్రయోజనం ఉండదనే విశ్లేషణ కూడా ఉంది.

రాహుల్ గాంధీ
ఫొటో క్యాప్షన్, రాహుల్ గాంధీ వామపక్ష సంస్థలకు చెందిన విద్యార్థి నాయకులను కలిశారు. కానీ సీజేపీ నాయకులను మాత్రం కలవలేదు.

సీజేపీ, కాంగ్రెస్‌ మధ్య విభేదాలు?

ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా జరిగిన మార్చ్‌లో ఇండియా కూటమిలోని ఎక్కువ భాగం పార్టీలు పాల్గొన్నాయి. అయితే ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే), ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మాత్రం దీనికి దూరంగా ఉన్నాయి.

తమిళనాడులో తన ప్రత్యర్థి పార్టీ తమిళగ వెట్రి కజగం (టీవీకే)తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే విషయంలో రాహుల్ గాంధీపై డీఎంకే అసంతృప్తిగా ఉంది.

అయితే ఆప్ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక మరింత సంక్లిష్టమైన, వివాదాస్పద కారణాలు ఉన్నట్లు కనిపిస్తున్నాయి.

కాంగ్రెస్ పార్టీ చాలా కాలంగా ఆప్‌ను "బీజేపీకి బీ-టీమ్"గా అభివర్ణిస్తోంది. అంటే ఎన్నికల వ్యూహంలో భాగంగా కాంగ్రెస్‌ను వ్యతిరేకించడం వల్ల ఆప్‌కు ప్రయోజనం కలుగుతుందని, దాని వల్ల బీజేపీ బలపడుతుందని కాంగ్రెస్ భావిస్తోంది.

ఆసక్తికరమైన విషయం ఏంటంటే జూలైలో జంతర్ మంతర్ వద్ద నిరసనకు నాయకత్వం వహించిన సీజేపీ కూడా అక్టోబర్ 6న ఇండియా కూటమి ఆధ్వర్యంలో జరిగిన మార్చ్‌లో పాల్గొనలేదు.

అయితే సీజేపీ కూడా జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. వాస్తవానికి రోజంతా జరిగిన పరిణామాల సమయంలో సీజేపీ నాయకులు సోషల్ మీడియాలో చాలా వరకు మౌనంగానే ఉన్నారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో వారి మౌనంపై విమర్శలు పెరగడంతోనే పరిమిత స్థాయిలో మద్దతు తెలిపారు.

ఆప్‌తో సీజేపీకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని భావిస్తున్నారు. సీజేపీ 12 మంది సభ్యుల కోర్ టీమ్‌లో ఆరుగురు, అందులో నాయకులు అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, ఆశుతోష్ రాంకా కూడా ఉన్నారు. గతంలో ఆప్‌తో నేరుగా అనుబంధం కలిగి ఉన్నారు లేదా బహిరంగంగా ఆప్‌కు మద్దతు తెలిపారని ది ప్రింట్ కథనం ద్వారా తెలుస్తోంది.

నిజానికి సీజేపీకు ఆప్‌తో సంబంధాలున్నాయన్న అనుమానంతోనే కాంగ్రెస్ జూలైలో జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనలకు దూరంగా ఉంది.

అయితే ఆ తర్వాత రాహుల్ గాంధీ వామపక్ష సంస్థలకు చెందిన కార్యకర్తలను కలిశారు. కానీ సీజేపీ విషయంలో దూరం పాటించారు.

కాంగ్రెస్, బీజేపీ
ఫొటో క్యాప్షన్, జూన్ 28వ తేదీన విద్యావేత్త, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్, సీజేపీతో కలిసి జంతర్ మంతర్ వద్ద నిరవధిక నిరాహార దీక్షకు దిగారు.

మరికొన్ని విభేదాలు

ఇండియా కూటమి, సీజేపీ మధ్య మరికొన్ని ముఖ్యమైన విభేదాలు కూడా ఉన్నాయి.

కాంగ్రెస్, ఇండియా కూటమి భాగస్వాములకు మూడు ప్రధాన డిమాండ్లు ఉన్నాయని అక్టోబర్ 5న కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చెప్పారు.

  • ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి.
  • సర్‌ను రద్దు చేయాలి.
  • ఈవీఎంల స్థానంలో మళ్లీ బ్యాలెట్ పేపర్‌తో ఎన్నికలు నిర్వహించాలి.

ఎన్నికల్లో అన్ని పార్టీలకు సమాన అవకాశాలు ఉండాలని కాంగ్రెస్ కోరుతోంది.

అదే సమయంలో ఎన్నికలను బహిష్కరించాలని ప్రతిపక్ష పార్టీలను కోరింది సీజేపీ. ప్రతిపక్షాలు ఎన్నికలను బహిష్కరిస్తే ఎన్నికల చట్టబద్ధతపై ప్రశ్నలు తలెత్తే అవకాశం ఉంది.

అయితే దీనివల్ల బీజేపీకి ప్రయోజనం కలగవచ్చని కూడా విశ్లేషణ ఉంది.

ఎన్నికలకు చట్టబద్ధత ఉందని చూపించడానికి బీజేపీ తన మిత్రపక్షాల్లో కొన్ని పార్టీలను ఎన్నికల్లో పోటీ చేయించవచ్చు. బీజేపీకి ప్రజల మద్దతు తగ్గుతూ, ప్రతిపక్ష పార్టీలకు మద్దతు పెరుగుతున్న సమయంలో ప్రతిపక్షాలు ఎన్నికలకు దూరంగా ఉంటే, అది వాటి ప్రయోజనాలకు నష్టం కలిగించవచ్చని ఈ విశ్లేషణ చెబుతోంది.

ప్రతిపక్ష పార్టీల మధ్య ఇలాంటి విభేదాలు ఉంటే, బీజేపీని ఎదుర్కొనే వారి ప్రయత్నాలు బలహీనపడే అవకాశం ఉంది.

రాబోయే నెలల్లో ఈ విభేదాలను మరింత పెంచేందుకు బీజేపీ ప్రయత్నాలు చేయవచ్చని కూడా పేర్కొంటున్నారు.

బీజేపీ అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది కూడా ఇండియా కూటమి మార్చ్‌లో డీఎంకే, ఆమ్ ఆద్మీ పార్టీ పాల్గొనలేదని ప్రస్తావించారు.

సీజేపీ, వామపక్ష సంస్థలు అక్టోబర్ 10న దిల్లీలో నిరసనకు పిలుపునిచ్చాయి.

అయితే కాంగ్రెస్ తన అనుమానాలను పక్కన పెట్టి సీజేపీ, వామపక్ష సంస్థలకు మద్దతు ఇవ్వడానికి సిద్ధమవుతుందా? అనే ప్రశ్న తలెత్తుతోంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)