ఎన్విడియా ప్రెసిడెంట్, సీఈఓగా జెన్సన్ హ్వాంగ్ పునర్నియామకం

ఎన్విడియా, జెన్సన్ హ్వాంగ్, డోనల్డ్ ట్రంప్, అమెరికా, చిప్ కంపెనీ
ఫొటో క్యాప్షన్, చైనా గూఢచారి అని ఆరోపణలు ఎదుర్కొన్న మహిళతో వివాహేతర సంబంధం ఉన్నట్లు అంగీకరించాక హ్వాంగ్ తన పదవికి రాజీనామా చేశారు.
ప్రచురణ
చదివే సమయం: 4 నిమిషాలు

ఎన్విడియా కంపెనీ ప్రెసిడెంట్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా జెన్సన్ హ్వాంగ్ తిరిగి నియమితులయ్యారు. ఈ విషయాన్ని ఆ సంస్థ సోమవారం ప్రకటించింది.

కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లలో కూడా ఆయన మళ్లీ చేరారు. జెన్సన్ హ్వాంగ్ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని ఎన్విడియా తెలిపింది.

జెన్సన్ హ్వాంగ్‌తో పలు దఫాలుగా చర్చలు, సమావేశాలు జరిపిన తర్వాత ఆయనను తిరిగి తీసుకోవడానికి ఎన్విడియా డైరెక్టర్ల బోర్డు ఏకగ్రీవంగా ఓటు వేసింది.

ఈ చర్చల్లో జెన్సన్ హ్వాంగ్ తన అభిప్రాయాలను పూర్తి స్పష్టతతో నిజాయితీతో చెప్పారని, ఎన్విడియాను నడిపించగల సామర్థ్యం ఆయనకు ఉందని బోర్డు భావించినట్లు కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది.

ఈ నిర్ణయం తీసుకునే ముందు బోర్డు అమెరికా ప్రభుత్వ సీనియర్ అధికారులతో కూడా సంప్రదింపులు జరిపింది. వారి అభిప్రాయాల మేరకు, జెన్సన్ హ్వాంగ్ తిరిగి రావడం వల్ల జాతీయ భద్రతకు ఎలాంటి ముప్పు లేదని బోర్డు నిర్థరణకు వచ్చింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

"ఎన్విడియాను నడిపించడానికి జెన్సన్ సరైన వ్యక్తి అని బోర్డు నమ్ముతోంది" అని బోర్డు ఛైర్మన్ హార్వే సి. జోన్స్ అన్నారు.

"ఆయన పునర్నియామకం కంపెనీ వాటాదారులు, ఉద్యోగులు, భాగస్వాములు, వినియోగదారులందరికీ ఎంతో మేలు చేస్తుంది" అని ఆయన చెప్పారు.

"మాకు జెన్సన్‌పై పూర్తి నమ్మకం ఉంది. ఆయన తిరిగి కంపెనీ పగ్గాలు చేపడుతున్నందున ఆయనతో కలిసి పనిచేయడానికి మేము ఉత్సాహంగా ఉన్నాం. ఎన్విడియా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూనే, తాత్కాలిక సీఈఓగా అద్భుతంగా పనిచేసిన కొలెట్ క్రెస్‌కు కూడా మేం కృతజ్ఞతలు చెబుతున్నాం" అని జోన్స్ అన్నారు.

కంపెనీ బోర్డు ఛైర్మన్‌గా హార్వే జోన్స్ కొనసాగుతారు.

ఎన్విడియా, జెన్సన్ హ్వాంగ్, డోనల్డ్ ట్రంప్, అమెరికా, చిప్ కంపెనీ
ఫొటో క్యాప్షన్, హ్వాంగ్‌కు ట్రంప్ అనేక సందర్భాల్లో మద్దతు పలికారు.

ట్రంప్ ఏమన్నారు?

ఎన్విడియాలోకి జెన్సన్ హ్వాంగ్ తిరిగి రావడాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వాగతించారు. ఇది "సముచిత నిర్ణయం" అన్నారు.

"కంపెనీ విజయం, అభివృద్ధితో పాటు అమెరికా ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందడానికి ఎన్విడియాలో జెన్సన్ నాయకత్వం దేశానికి అవసరం" అని ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ట్రూత్ సోషల్'లో రాశారు.

హ్వాంగ్ తిరిగి రావడం వల్ల జాతీయ భద్రతకు ప్రమాదం ఉంటుందని అమెరికా ప్రభుత్వం భావించడం లేదని కూడా ఆయన స్పష్టం చేశారు.

హ్వాంగ్‌ దేశభక్తుడు, జాతీయ సంపద అని ట్రంప్ ప్రశంసించారు.

ఎన్విడియా, జెన్సన్ హ్వాంగ్, డోనల్డ్ ట్రంప్, అమెరికా, చిప్ కంపెనీ
ఫొటో క్యాప్షన్, నాస్‌డాక్ స్టాక్‌ఎక్స్ఛేంజ్ మొదలుకాగానే ఎన్విడియా తన వైఖరిని మార్చుకోవడంతో దాని స్టాక్ మార్కెట్ విలువ ట్రిలియన్ డాలర్లు పెరిగింది.

పునరాగమనాన్ని గతంలో తోసిపుచ్చిన ఎన్విడియా

జెన్సన్ హ్వాంగ్ తిరిగి కంపెనీలోకి వచ్చే అవకాశాలను ఎన్విడియా గత వారం పూర్తిగా కొట్టిపారేసింది.

హ్వాంగ్ ఆకస్మిక రాజీనామా తర్వాత కంపెనీ తొలిసారి తన ఆర్థిక ఫలితాలను విడుదల చేసినప్పుడు అంతా సాధారణంగానే నడుస్తోందని తాత్కాలిక సీఈఓ కొలెట్ క్రెస్ చెప్పారు.

"అన్ని వ్యవహారాలను చక్కబెట్టాం" అని ఇన్వెస్టర్లకు తెలిపారు.

ఎలన్ మస్క్ కూడా గతంలో జెన్సన్ హ్వాంగ్‌ను ప్రశంసించారు. కంపెనీ సరఫరా గొలుసును హ్వాంగ్ అద్భుతంగా నడిపించారని మస్క్ నవంబర్ 14న 'ఎక్స్' వేదికగా రాశారు.

కంపెనీకి సంబంధించిన అనేక ముఖ్యమైన ఒప్పందాలు రాతపూర్వక కాంట్రాక్టుల కంటే హ్వాంగ్‌పై ఉన్న పరస్పర నమ్మకం, అవగాహనతోనే జరిగాయని ఎలన్ మస్క్ అభిప్రాయపడ్డారు. హ్వాంగ్ లేకపోతే ఈ కీలక ఒప్పందాల్లో కొన్నింటిని కోల్పోయే ప్రమాదం ఉండేదని ఆయన పేర్కొన్నారు.

ఇదే విషయంపై జెన్సన్ హ్వాంగ్ స్వయంగా నవంబర్ 17న 'ఎక్స్'లో పోస్ట్ చేశారు. తాను వైదొలిగినప్పటి నుంచి ఎన్విడియా ఉద్యోగులు, ఇన్వెస్టర్లు, వ్యాపార భాగస్వాములు వినియోగదారులు తిరిగి సీఈఓగా రావాలని తనను కోరుతున్నారని ఆయన చెప్పారు.

వాటాదారులు, ఉద్యోగులు, కంపెనీ, అమెరికా ప్రయోజనాల దృష్ట్యా తన రాక అవసరమని కంపెనీ బోర్డు భావిస్తే, తాను తిరిగి సీఈఓగా బాధ్యతలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నానని హ్వాంగ్ అప్పట్లో తెలిపారు.

వరుసగా రెండు వివాహేతర సంబంధాల వార్తలు బయటకు రావడంతో జెన్సన్ హ్వాంగ్ నవంబర్ 12న తన పదవికి రాజీనామా చేశారు.

మొదటి వార్తలో ఒక మహిళా వ్యాపారవేత్తతో ఆయనకు ఉన్న సంబంధం బయటపడింది. ఆ మహిళ చైనా గూఢచారి అనే ఆరోపణలు ఉన్నాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)