రోజంతా హైడ్రామా తర్వాత రాహుల్ గాంధీ విడుదల, జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలన్న కాంగ్రెస్ డిమాండ్‌పై బీజేపీ ఏమన్నది?

ఫొటో సోర్స్, Getty Images
లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీని అదుపులోకి తీసుకున్న దిల్లీ పోలీసులు మంగళవారం(అక్టోబర్ 6) రాత్రి విడుదల చేశారు.
ఘటనా స్థలంలో ఉన్న బీబీసీ జర్నలిస్ట్ దిల్‌నవాజ్ పాషా తెలిపిన వివరాల ప్రకారం అదుపులోకి తీసుకున్న అనంతరం రాహుల్ గాంధీని కింగ్స్‌వే క్యాంప్‌కు తీసుకెళ్లారు. రాత్రి సుమారు 10 గంటలకు ఆయనను విడుదల చేశారు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ, ఇతర కాంగ్రెస్ నాయకులతో కలిసి దిల్లీలోని ఆకాశవాణి భవన్‌లో నిరసన చేపట్టారు.
మంగళవారం సాయంత్రం పోలీసులు అక్కడికి చేరుకుని వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.
రాహుల్ గాంధీని పోలీసులు బలవంతంగా తీసుకువెళ్తున్న వీడియోను పోస్ట్ చేస్తూ కాంగ్రెస్ 'అన్నీ గుర్తుంచుకుంటాం' అని రాసింది.

‘‘మోదీ-షా ఆకాశవాణి భవన్‌కు పోలీసులను పంపించారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఎంపీలను పోలీసులు బలవంతంగా తీసుకువెళుతున్నారు. పోలీసుల అణచివేత ద్వారా మా గొంతును నొక్కేయాలని మోదీ చూస్తున్నారు. కానీ గుర్తుంచుకోండి.. ఈ గర్జనను ఇప్పుడు ఆపలేరు. దేశద్రోహి జ్ఞానేశ్ వెళ్లిపోవాల్సిందే'' అని అంతకుముందు కాంగ్రెస్ 'ఎక్స్'లో పోస్ట్ చేసింది.
ఎన్నికల సంఘం కార్యాలయం వరకు చేపట్టిన మార్చ్‌ను పోలీసులు అడ్డుకున్న అనంతరం రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఆకాశవాణి భవన్ ప్రాంగణంలో సుమారు తొమ్మిది గంటల పాటు ధర్నా చేశారు.
ధర్నాలో ఉన్నప్పుడే రాహుల్ గాంధీ తన ఫేస్‌బుక్ పేజ్‌లో ఒక వీడియో పోస్ట్ చేశారు. అందులో ఆయన, ప్రియాంక గాంధీ ఓ పోలీసు అధికారితో మాట్లాడుతున్నట్టు కనిపిస్తోంది.

ఫొటో సోర్స్, ANI
‘ప్రతిపక్ష ఎంపీలను ఎన్నికల కమిషనర్లు కలవరా?’
పోలీసులు వారిని అక్కడినుంచి వెళ్లిపోవాలని కోరగా వాళ్లు అందుకు అంగీకరించలేదు.
‘‘నేను కూర్చున్నానంతే'' అని రాహుల్ గాంధీ ఆ పోలీసు అధికారితో చెప్పగా "సర్ ఇంటికి వెళ్లండి’’ అని ఆ అధికారి రాహుల్‌ను కోరారు.
‘‘నేను ఇంటికే వెళ్లాలా..? దేశంలో మరెక్కడికీ వెళ్లకూడదా ? నేను రాజకీయ నాయకుడిని. ఇంట్లో కూర్చోలేను. నేను ఎక్కడకు వెళ్లి కూర్చోవాలో మీరే ఓ చోటు చెప్పండి'' అని రాహుల్ గాంధీ బదులిచ్చారు.
"ఈ దేశంలో ఎవరికైనా నిరసన చేపట్టే హక్కు ఉంది. ఇది సాధారణ ప్రజాస్వామ్య ప్రక్రియ. మీరు రాజ్యాంగం కోసం పోరాడుతున్నారు. అధికారపీఠంపై కూర్చున్న ఆ ఇద్దరు వ్యక్తుల కోసం కాదు" అని ప్రియాంకగాంధీ అన్నారు.
దీనికి ముందు రాహుల్, ప్రియాంక ఇద్దరూ ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయానికి వెళ్లేందుకు ఆకాశవాణి భవన్ ప్రాంగణంలోకి వెళ్లారు
పోలీసులు అడ్డుకున్నప్పటికీ వాళ్లిద్దరూ అక్కడికి చేరుకున్నారు.
"దేశానికి ద్రోహం చేసింది ప్రధానమంత్రి మోదీ, అమిత్ షా, ఆర్‌ఎస్‌ఎస్ అధిపతి లేదా జ్ఞానేశ్ కుమార్ ఎవరయినా సరే ఎవరినీ వదిలిపెట్టబోం" అని రాహుల్ గాంధీ అన్నారు .
ప్రతిపక్ష ఎంపీలు ఎన్నికల కమిషనర్లను కలవలేకపోవడంపై రాహుల్ గాంధీ అభ్యంతరం వ్యక్తంచేశారు.
"ఎన్నికల కమిషనర్లను కలవడానికి 300 మందికి పైగా ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంట్ నుంచి ఎన్నికల సంఘం కార్యాలయం వరకు మార్చ్ నిర్వహించారు. మేం కోట్లమంది భారతీయులకు ప్రాతినిధ్యం వహిస్తున్నాం. ఎన్నికల కమిషనర్లు మమ్మల్ని ఎందుకు కలవడం లేదు? పోలీసులు మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నారు, ఎందుకు బెదిరిస్తున్నారు?'' అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు.

ఫొటో సోర్స్, @INC
ఎన్నికల సంఘం ఏం చెప్పింది?
ప్రతిపక్ష ఎంపీలు ఎన్నికల కమిషనర్లను కలవడానికి ముందుగా సమయం కోరలేదని ఎన్నికల కమిషన్ 'ఎక్స్'లో ప్రకటించింది.
"సాయంత్రం నాలుగు గంటల వరకు, ఏ రాజకీయ పార్టీ కూడా తన అధికార ప్రతినిధి ద్వారా కమిషన్‌ను కలవడానికి సమయం కోరలేదు. ఆ తర్వాత రాహుల్ గాంధీ నేతృత్వంలోని ఎంపీల బృందం ఎన్నికల సంఘాన్ని కలిసి ఒక వినతిపత్రాన్ని సమర్పించాలనుకుంటున్నట్టు దిల్లీ పోలీసులు కమిషన్‌కు తెలియజేశారు.
పార్లమెంట్ హౌస్ అనుబంధ భవనంలో 240 మంది ఎంపీల బృందంతో సమావేశం కావాలని కోరడం అసాధారణమైనది, అది సాధారణ నిబంధనలకు అనుగుణంగా లేదు. ఆ వినతిపత్రాన్ని స్వీకరించడానికి అత్యంత సీనియర్ అధికారిని పంపడానికి కమిషన్ ముందుకొచ్చింది. అయితే ఎంపీలు ఆ ప్రతిపాదనను కూడా అంగీకరించలేదు.
దేశ పార్లమెంటరీ, ప్రజాస్వామ్య ప్రక్రియలను గౌరవిస్తాం. ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్నికల సంఘంతో సమావేశమవుతామని కోరవచ్చు. కమిషన్ సౌకర్యం మేరకు సమావేశానికి సమయం కేటాయిస్తాం'' అని ఎన్నికల సంఘం ప్రకటనలో తెలిపింది.
అంతకుముందు ప్రతిపక్ష ‘ఇండియా’ బ్లాక్‌కు చెందిన ఎంపీలు పార్లమెంట్ నుంచి ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం వైపు మార్చ్‌గా వెళ్తుండగా నీతి ఆయోగ్ కార్యాలయం ముందు పోలీసులు వారిని అడ్డుకున్నారు.
ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయానికి వెళ్లే మార్గంలో నీతి ఆయోగ్, ఆకాశవాణి భవన్ మధ్య ప్రతిపక్ష ఎంపీలను ముందుకు వెళ్లకుండా అడ్డుకోవడంతో వాళ్లు అక్కడే రోడ్డుపైనే కూర్చొని నిరసన తెలిపారు.
దీనికి ముందు "జ్ఞానేశ్... అయిపోయింది బ్రో. ఇప్పుడు రాజీనామా చేయాల్సిన సమయం వచ్చింది" అని రాహుల్ గాంధీ 'ఎక్స్'లో రాశారు.
నిరసన సందర్భంగా ప్రతిపక్ష ఎంపీలు ఆర్‌ఎస్‌ఎస్ యూనిఫాంలో ఉన్న జ్ఞానేశ్ కుమార్ కటౌట్‌లను కూడా ప్రదర్శించారు. "బీజేపీయే ప్రధాన ఎన్నికల కమిషనర్", "ఓటు దొంగలారా పదవి వదిలేయండి, "ప్రజాస్వామ్యం అమ్మకానికి కాదు" వంటి నినాదాలు చేశారు.

బీజేపీ ఏమంటోంది?
ఇండియా కూటమి మార్చ్, రాహుల్ గాంధీ ఆరోపణలపై బీజేపీ ఎదురుదాడి చేసింది.
''అరాచకం సృష్టించడానికి, రాహుల్ గాంధీని మళ్లీ రాజకీయంగా నిలబెట్టడానికి కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు చేస్తున్న మరో ప్రయత్నం ఇది'' అని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా అన్నారు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలను రాహుల్ గాంధీ వక్రీకరిస్తున్నారని కూడా ఆరోపించారు.
ఫారం- 6ను చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు ప్రకటించలేదని, ఈ విషయంలో నోటీసు మాత్రమే జారీ చేసిందని, దీనిపై మరింత దర్యాప్తు జరుగుతుందని పాత్రా చెప్పారు. దేశంలో రాహుల్ గాంధీ "గందరగోళం" సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు.
"ఎస్ఐఆర్‌ను వ్యతిరేకించడం ద్వారా కాంగ్రెస్ 2.8 కోట్ల మంది మరణించిన వారి పేర్లను ఓటర్ల జాబితాలో ఉంచాలని చూస్తోందా? రాహుల్ గాంధీ, సోనియా గాంధీ 'ఓట్ల దొంగతనం' ద్వారానే ఎంపీలు అయ్యారా? ఒకవేళ ఎస్ఐఆర్ చట్టవిరుద్ధమైతే, కర్ణాటక, కేరళ, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా చట్టవిరుద్ధమేనా?" అని ఆయన ప్రశ్నించారు.
బీజేపీ ఎంపీ సుధాంశు త్రివేది కూడా రాహుల్ గాంధీపై విమర్శలు చేశారు. ఎస్ఐఆర్ విషయంలో రాహుల్ "తప్పుదోవ పట్టించే, నిరాధారమైన, పొంతన లేని" ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు.
"ఇళ్లల్లో లేనివాళ్లు, చిరునామా మార్చుకున్న వారు, మరణించిన వారు, నకిలీ ఓటర్లకు ఓటు హక్కు కల్పించడం ద్వారా కాంగ్రెస్ ఎవరికి ప్రయోజనం చేకూర్చాలనుకుంటోంది?" అని ప్రశ్నించారు.

ఫొటో సోర్స్, @INC
ప్రతిపక్షాల ఆరోపణలేంటి?
ఎస్ఐఆర్‌లో అవకతవకలు జరిగాయని ప్రతిపక్ష ఇండియా కూటమి ఎంపీలు ఆరోపిస్తున్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని, ఎస్ఐఆర్ నిర్ణయాలను పున:సమీక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఓటర్ల జాబితాలో మార్పులు, ఫారం-6కు సంబంధించిన నిర్ణయాల్లో నిబంధనలను పాటించలేదని ప్రతిపక్షం ఆరోపిస్తోంది.
ఫారం- 6కు సంబంధించిన కేసుపై సుప్రీంకోర్టులో సోమవారం(అక్టోబర్ 5)విచారణ జరిగింది.
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ఫారం-6లో చట్టవిరుద్ధమైన, ఏకపక్ష మార్పులు చేశారని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ ఆరోపణను బీజేపీ తిరస్కరించింది.

ఫొటో సోర్స్, Getty Images
సుప్రీంకోర్టు సోమవారం ఏం చెప్పింది?
ఓటర్ల జాబితాలో పేర్లను నమోదుచేసుకోడానికి ఉపయోగించే ఫారం-6పై సోమవారం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్య చేసింది.
ఫారం-6లో చేసిన మార్పును సుప్రీంకోర్టు ఆమోదించలేదని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అన్నారు.
సవరించిన ఫారం-6లో కొత్త ఓటర్లుగా నమోదు చేసుకుంటున్న వారిని, గత ఎస్ఐఆర్ తర్వాత తయారుచేసిన ఓటర్ల జాబితాలో వారి పేర్లుగానీ లేదా వారి తల్లిదండ్రుల పేర్లుగానీ ఉన్నాయా అని అడిగే విధంగా మార్పులు చేశారు.
భారత ప్రధాన న్యాయమూర్తి చేసిన ఈ వ్యాఖ్య సెప్టెంబర్ 26 నాటి ప్రెస్‌నోట్‌లో ఎన్నికల సంఘం పేర్కొన్న విషయాలకు భిన్నంగా ఉంది.
"ఎస్ఐఆర్ కోసం ఫారం-6తో పాటు సమర్పించిన డిక్లరేషన్‌ను గౌరవనీయ సుప్రీంకోర్టు సమర్థించింది" అని సెప్టెంబర్ 26 నాటి ప్రెస్‌నోట్‌లో ఎన్నికల సంఘం పేర్కొంది.
ఎన్నికల సంఘంలో ఇంతకుముందెన్నడూ లేని రాజ్యాంగపరమైన విభేదాలు, చట్టవిరుద్ధ కార్యకలాపాలు" ఉన్నాయని ఆరోపిస్తూ న్యాయవాది శైలేంద్ర మణి త్రిపాఠి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సమయంలో సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
తర్వాత ఫారం-6లో ఎవరు మార్పులు చేశారో రికార్డులు అందుబాటులోకి వచ్చిన చూడాలనుకుంటున్నట్టు కూడా కోర్టు తెలిపింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



























