రష్యాలో ప్లేగుపై పరిశోధన చేస్తున్న మహిళ మృతి.. 14వ శతాబ్దంలో యూరప్‌లో సగం జనాభా చనిపోవడానికి కారణమైన ఈ వ్యాధి ఎలా సోకుతుంది?

ప్లేగు, రష్యా, అమెరికా, ట్రంప్, మార్కో రూబియో, న్యూమోనిక్ ప్లేగు
ఫొటో క్యాప్షన్, యెర్సినియా పెస్టిస్ ( ప్రతీకాత్మక చిత్రం)
    • రచయిత, పాట్రిక్ జాక్సన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 5 నిమిషాలు

సైబీరియాలోని ప్లేగు పరిశోధన కేంద్రంలో ల్యాబ్ టెక్నీషియన్ మరణించిన ఘటనను తమ దేశం "నిశితంగా" గమనిస్తోందని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ తెలిపారు.

ఈ ఘటన వల్ల న్యూమోనిక్ ప్లేగు వ్యాపించే ప్రమాదం ఉందనే ఆందోళనల మధ్య వాషింగ్టన్ దీనిపై నిఘా ఉంచిందని, అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అమెరికా విదేశీ వ్యవహారాల మంత్రి మార్కో రూబియో చెప్పారు.

ఆమె మరణాన్ని"కారణం తెలియని న్యూమోనియా"గా ఇర్కుట్స్క్ గవర్నర్ ప్రకటించారు. ఆమె బయోలాజికల్ శాంపిల్స్‌లో ఆమె చేసిన పనికి సంబంధించిన ఎలాంటి "సూక్ష్మజీవులు" లేవని స్పష్టం చేశారు.

అయితే ఆమె రోగకారక క్రిమి ఉన్న టెస్ట్ ట్యూబ్‌ పగలడం లేదా వన్యప్రాణులలో సహజంగా ప్లేగు వ్యాపించే ప్రాంతానికి ఫీల్డ్ ట్రిప్‌కి వెళ్లడం వల్ల అనారోగ్యానికి గురై ఉండవచ్చని కొన్ని కథనాలు ప్రచారంలో ఉన్నాయి. అయితే వీటిని ఎవరూ నిర్ధరించలేదు.

రష్యా నుంచి ప్లేగు వ్యాప్తి చెందే ప్రమాదంపై వాషింగ్టన్ ఏం చేయబోతోందని ప్రశ్నించగా.. దీనిపై తాను క్రెమ్లిన్‌తో మాట్లాడలేదని ట్రంప్ చెప్పారు. "అక్కడ ఇలాంటి పరిస్థితి రావడం నాకు ఇష్టం లేదు" అని ట్రంప్ చెప్పారు. అలాంటి పరిస్థితి ఏర్పడితే తాము సాయం అందిస్తామని అన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ల్యాబ్ టెక్నీషియన్ మరణించినప్పటి నుంచి ప్లేగు ఇనిస్టిట్యూట్ సిబ్బందిలో ఎవరూ వైద్య సాయం కోరలేదని ఇర్కుట్స్క్ గవర్నర్ ఇగోర్ కొబ్జెవ్ తెలిపారు.

బయోలాజికల్ సేఫ్టీ టీమ్ యాంటీ-ప్లేగ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైబీరియా అండ్ ది ఫార్ ఈస్ట్‌ను తనిఖీ చేసిందని, అక్కడ ఎలాంటి అత్యవసర పరిస్థితి లేదని రష్యాకు చెందిన కన్స్యూమర్ అండ్ హెల్త్ వాచ్ డాగ్ 'రోస్పోట్రెబ్నాడ్జోర్' అనే సంస్థ తెలిపింది.

క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ కూడా ప్రజలు వదంతులను నమ్మవద్దని కేవలం రోస్పోట్రెబ్నాడ్జోర్ అధికారిక ప్రకటనలను మాత్రమే విశ్వసించాలని కోరారు.

ప్లేగు, రష్యా, అమెరికా, ట్రంప్, మార్కో రూబియో, న్యూమోనిక్ ప్లేగు
ఫొటో క్యాప్షన్, న్యూమోనిక్ ప్లేగు యాంటీ బయాటిక్స్‌తో తగ్గిపోతుందని రష్యన్ డాక్టర్ సైమన్ క్లార్క్ చెప్పారు

మరణించిన మహిళ ఎవరు?

మరణించిన మహిళతో పరిచయం ఉన్న దాదాపు 200 మందిని ముందుజాగ్రత్త చర్యగా వైద్య పరిశీలనలో ఉంచినట్లు రష్యన్ మీడియా తెలిపింది.

రష్యాలో అనుమానిత ప్లేగు కేసు అప్‌డేట్ గురించి రిపోర్టర్ అడిగిన ప్రశ్నపై స్పందించిన అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో.. "ల్యాబ్‌లోని ఒక కార్మికురాలు దీని బారిన పడ్డారని, అది కనీసం అంతర్గతంగానైనా వ్యాపించి ఉంటుందనే ఆందోళన ఉందని తెలుస్తోంది. అందుకే వారు క్వారంటైన్ వంటి చర్యలు చేపట్టడం మీరు చూశారు. ఇలాంటిది బయటకు వస్తే వేగంగా వ్యాపిస్తుంది. అందుకే మేము దీనిపై నిఘా ఉంచి నిశితంగా పరిశీలిస్తున్నాం. ఇది ఆందోళన చెందాల్సిన విషయం కాదు. కానీ దీనిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది" అని చెప్పారు.

మరణించిన మహిళ పేరు దారియా అని, ఆమెకు 20 ఏళ్లని రష్యన్ మీడియా తెలిపింది.

ఆమె ఇటీవల మంగోలియా సరిహద్దులోని బురియాటియా ప్రాంతాన్ని సందర్శించారు.

14వ శతాబ్దంలో బ్లాక్‌డెత్‌గా గుర్తింపు పొందిన, ఐరోపా జనాభాలో సగానికి పైగా ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన ప్లేగు బాక్టీరియా యెర్సినియా పెస్టిస్.. ఈ ప్రాంతంలోని మార్మోట్ వంటి ఎలుకల జాతి జీవులలో కనిపిస్తుంది.

1920లలో ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు దాదాపు 100 సంవత్సరాల క్రితం ఈ యాంటీ-ప్లేగ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆఫ్ సైబీరియా అండ్ ది ఫార్ ఈస్ట్‌ను స్థాపించారు.

ప్లేగు, రష్యా, అమెరికా, ట్రంప్, మార్కో రూబియో, న్యూమోనిక్ ప్లేగు
ఫొటో క్యాప్షన్, రష్యాలో ప్లేగు గురించి తాము నిశితంగా పరిశీలిస్తున్నామని డోనల్డ్ ట్రంప్ చెప్పారు.

ప్లేగు ప్రమాదకరమా?

యెర్సినియా పెస్టిస్‌ న్యూమోనిక్ వెర్షన్‌కు సకాలంలో చికిత్స అందించకపోతే అది ప్రాణాంతకంగా మారుతుందని ..అయితే యాంటీబయాటిక్స్‌తో దీన్ని నయం చేయవచ్చని రీడింగ్ యూనివర్సిటీలో సెల్యులర్ మైక్రోబయాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సైమన్ క్లార్క్ బిబిసి రేడియో 4పీఎమ్ కార్యక్రమంలోచెప్పారు.

"న్యూమోనిక్ ప్లేగ్‌ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. అందుకే దీని గురించి ఆందోళన చెందుతున్నారు" అని ఆయన అన్నారు.

"ఏదైనా అంటువ్యాధి వచ్చినప్పుడు ప్రజల ఆలోచనలు లాక్‌డౌన్‌లు, కోవిడ్ వైపు మళ్లుతాయి. కానీ ఇక్కడ అలాంటిదేమీ జరగదు" అని ఆయన స్పష్టం చేశారు.

"ప్లేగు అనేది వందల సంవత్సరాల క్రితమే అంతరించిపోయిందని ప్రజలు అనుకుంటారు. కానీ అది నిజం కాదు. ఇది ఇప్పటికీ ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలలో మానవ ఆరోగ్యానికి ముప్పుగా ఉంది. అందుకే దీనిపై పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉంది" అని క్లార్క్ పేర్కొన్నారు.

ఈ వ్యాధి కారకాన్ని జీవాయుధంగా ఉపయోగించే అవకాశంపై పరిశోధనలు జరిగి ఉండవచ్చా అని అడిగినప్పుడు అందుకు అవకాశం ఉందని అన్నారు.

"ఇది రష్యా కాబట్టి ప్రజల ఆలోచనలు ఆ దిశగా వెళ్తున్నాయి. కానీ నేను ముందుగా చెప్పిన వివరణ మాత్రమే నిజం కావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి" అని క్లార్క్ అభిప్రాయపడ్డారు.

ప్లేగు, రష్యా, అమెరికా, ట్రంప్, మార్కో రూబియో, న్యూమోనిక్ ప్లేగు

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, న్యూమోనిక్ ప్లేగు ఇంక్యుబేషన్ పీరియడ్ చాలా తక్కువగా కొన్నిసార్లు కేవలం 24 గంటలు మాత్రమే ఉంటుంది.

దీనికి ప్రారంభంలోనే రోగనిర్ధరణ చేసి చికిత్స అందించకపోతే ప్రాణాంతకం కావచ్చు.

ప్లేగు ఇలా వ్యాపిస్తుంది:

  • ప్లేగు సోకిన నల్లి లేదా ఈగ కరవడం వల్ల
  • శరీర ద్రవాలు లేదా కలుషితమైన పదార్థాలతో నేరుగా కాంటాక్ట్ కావడం వల్ల
  • శ్వాసకోశ కణాలను పీల్చడం వల్ల

లక్షణాలు:

  • శ్వాస ఆడకపోవడం
  • దగ్గు, దగ్గినప్పుడు రక్తంతో కూడిన కఫం రావడం

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)