‘‘స్నైపర్ల దాడులు, బాంబు మోతల మధ్య రోజూ స్కూలుకు వెళతా.. ’’

స్నైపర్లు, బాంబు దాడులు, యెమెన్, హూతీలు
ఫొటో క్యాప్షన్, స్కూలుకు వెళ్లే ప్రయాణం తనను భయపెడుతుందని రఫీఫ్ చెబుతోంది.
    • రచయిత, నవల్ అల్-మఘాఫీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 6 నిమిషాలు

(ఈ కథనంలో కలిచివేసే అంశాలుంటాయి.)

ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు 10 ఏళ్ల రఫీఫ్, ఆమె తమ్ముడు స్కూలుకు వెళ్లేందుకు సిద్ధమవుతారు. క్రీమ్, బ్రౌన్ రంగుల యూనిఫాం ధరించి ఇంటి నుంచి బయలుదేరుతారు.

స్నేహితులను కలుసుకోవడం, లెక్కల నుంచి అరబిక్, ఇస్లామిక్ విద్య వరకు వివిధ విషయాలు నేర్చుకోవడం రఫీఫ్‌కు ఎంతో ఇష్టం. వచ్చే ఏడాది ఇంగ్లిష్ చదవడం ప్రారంభించబోతున్నందుకు ఎంతో ఉత్సాహంగా ఉంది. కానీ, రఫీఫ్‌కు రోడ్డు దాటడం లేదా బస్సు మిస్ కావడం కంటే పాఠశాలకు వెళ్లే ప్రయాణంలో ఎదుర్కొనే ప్రమాదాలు చాలా ఎక్కువ.

యెమెన్ నైరుతి ప్రాంతంలోని తైజ్‌లో రఫీఫ్ చదువుతున్న స్కూలు ఒక కొండపై ఉంది. ఆ కొండ కింద ఉన్న లోయను నో మ్యాన్స్ ల్యాండ్‌గా అని అంటారు. సౌదీ అరేబియా మద్దతు , అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన యెమెన్ ప్రభుత్వ అనుకూల దళాలు, ఇరాన్ మద్దతున్న హూతీలకు మధ్య జరుగుతున్న అంతర్యుద్ధంలో ఇది తీవ్రంగా పోటీ ఉన్న ప్రాంతం.

పాఠశాలకు ఒకపక్క ప్రభుత్వ నియంత్రణలో ఉన్న ప్రాంతం ఉండగా, మరోవైపు హూతీల స్నైపర్ల (సాయుధ శిక్షణ పొందిన వ్యక్తులు) స్థావరాలు ఉన్నాయి.

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

రఫీఫ్ ఇల్లు కొండపై మరింత దిగువన ఉంది. ఆమె పాఠశాలకు వెళ్లే ప్రతిసారీ స్నైపర్ల వైపు వీపు పెట్టి కొండ ఎక్కాల్సి వస్తుంది.

"నాకు భయంగా ఉంటుంది" అని ఆమె అన్నది.

గత నెలలో యుద్ధం మరింత తీవ్రం కావడానికి ముందే యెమెన్‌లో సుమారు 32 లక్షల మంది పిల్లలు పాఠశాల చదువులకు దూరమయ్యారని యునిసెఫ్ పేర్కొంది.

స్నైపర్లు, బాంబు దాడులు, యెమెన్, హూతీలు
ఫొటో క్యాప్షన్, లోయకు ఆవల ఉన్న పర్వతాలపై ఉన్న హూతీ స్థావరాల నుంచి రఫీఫ్ పాఠశాల దృశ్యం

‘‘ మోర్టార్ మా ఇంట్లోకి దూసుకొచ్చింది’’

2014లో యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇప్పటి వరకు వేలమంది పిల్లలు మరణించారని లేదా తీవ్రంగా గాయపడ్డారని యునిసెఫ్ చెబుతోంది. మరోవైపు, ఇరుపక్షాలకు చెందిన సాయుధ బృందాలు వేలమంది పిల్లలను తమ దళాలలో చేర్చుకున్నాయి.

అయినప్పటికీ, ఈ ప్రమాదాల మధ్య కూడా స్కూలు మానేయాలని రఫీఫ్ అనుకోవడం లేదు. స్నేహితులను కలుసుకోవడం తనకు ఎంతో ఇష్టమని, వాళ్లను కలిసేందుకు తనకున్న ఏకైక అవకాశం పాఠశాలేనని ఆమె అంటోంది.

రఫీఫ్ తల్లిదండ్రులు ఆమెను బయటకు వెళ్లనివ్వరు. కేవలం స్కూలుకు వెళ్లేందుకు మాత్రమే ఆమెకు అనుమతి ఉంది. చదువుకోవాలని, మెరుగైన జీవితం పొందే అవకాశం కలగాలని తాము కోరుకుంటున్నామని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తాను డాక్టర్ కావాలని కోరుకుంటోంది రఫీఫ్.

హూతీలు అక్కడ నియంత్రణ సాధించిన సమయంలో భద్రత కోసం రఫీఫ్ కుటుంబం తీరప్రాంత నగరమైన హుదైదా నుంచి తైజ్‌కు తొమ్మిదేళ్ల కిందట వచ్చింది.

అయితే తైజ్ నగరం కూడా అంతర్యుద్ధాన్ని ఎదుర్కొంది. రెండేళ్ల కిందట తన కొత్త ఇంటి బయట మోర్టార్ దాడి జరిగిందని రఫీఫ్ చెప్పింది.

‘‘ నేను, నా తమ్ముడు ఇంట్లో ఉన్నాం. అందరూ బయట ఉన్నారు. అకస్మాత్తుగా ఎక్కడి నుంచి వచ్చిందో ఒక మోర్టార్ దూసుకొచ్చింది. దాని పేలుడు ముక్కలు తలుపును చీల్చుకుని ఇంట్లోకి దూసుకొచ్చాయి" అని ఆమె చెప్పింది.

ఆ ఘటనలో ఆమె చేయి విరిగింది. ఆ పేలుడు ముక్క తగిలిన చోట ఇప్పటికీ ఒక మచ్చ ఉంది.

ఇటీవలి రోజుల్లో ఈ ప్రాంతంలో ఘర్షణలు మరింత తీవ్రతరమయ్యాయి. ఆదివారం హూతీలు తైజ్‌ను ఏడెన్‌తో కలిపే కీలకమైన సరఫరా మార్గాన్ని మూసివేశారు. దీంతో తైజ్ నగరాన్ని దాదాపు పూర్తిగా చుట్టుముట్టే పరిస్థితి ఏర్పడింది. ఈ మార్గంపై నియంత్రణ గతంలో పలుమార్లు మారింది.

ఏ క్షణంలోనైనా హూతీలు నగరాన్ని స్వాధీనం చేసుకోవచ్చని భయపడుతున్నామని స్థానికులు బీబీసీకి చెప్పారు.

స్నైపర్లు, బాంబు దాడులు, యెమెన్, హూతీలు
ఫొటో క్యాప్షన్, అహ్మద్ అనే మూడేళ్ల బాలుడు మోర్టార్ దాడికి గురైనప్పుడు ధరించిన బూట్లు

ఈ వారంలో ప్రభుత్వ బలగాలు ఇతర ప్రాంతాల్లో పురోగతి సాధించాయని వారు తెలిపారు. కీలకమైన సముద్ర రవాణా మార్గమైన బాబ్ అల్ మండెబ్ జలసంధిలోని వ్యూహాత్మక ప్రాంతాలపై తిరిగి నియంత్రణ సాధించడంతో పాటు, రాజధాని సనాను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు దాడులు ప్రారంభించాయని చెప్పారు.

తైజ్‌లోని ఇళ్లు ఎక్కువగా కొండ వాలుల్లో విస్తరించి ఉన్నాయి. అయితే పోరాటాల నుంచి తప్పించుకునేందుకు అనేక కుటుంబాలు ఇళ్లను వదిలి వెళ్లిపోయాయి.

రఫీఫ్, ఆమె కుటుంబం నివసించే ప్రాంతాన్ని సందర్శించేందుకు మేము రెండుసార్లు ప్రయత్నించాం. అయితే అక్కడి కమ్యూనిటీ నాయకుడు ఆ ప్రాంతం చాలా ప్రమాదకరంగా ఉందని, అక్కడికి వెళ్లడం సురక్షితం కాదని సూచించారు.

మొదటిసారి వెళ్లినప్పుడు ఆ ప్రాంతంలోని ముగ్గురు వ్యక్తులను స్నైపర్లు కాల్చి చంపారని అక్కడి నివాసితులు మాకు చెప్పారు. రెండోసారి మరో వ్యక్తిపై కాల్పులు జరిగినట్లు తెలిపారు.

రఫీఫ్ చదువుతున్న పాఠశాలలోని 45 ఏళ్ల ఉపాధ్యాయుడు అబ్దుల్ రఖీబ్ అల్ ఒబైదీ మమ్మల్ని పాఠశాల మిద్దె మీదకు తీసుకెళ్లారు. ఎదురుగా ఉన్న కొండల్లో హూతీల సైనిక శిబిరాలు, బారక్‌లు, స్నైపర్ల స్థావరాలు ఉన్నాయని ఆయన చూపించారు.

మేము పైకప్పుపై నిలబడి ఉండగా, మాతో వచ్చిన యెమెన్ భద్రతా సలహాదారు ఒక్కసారిగా లోపలికి వెళ్లాలని సూచించారు. ఆ స్థావరాల నుంచి మనం స్పష్టంగా కనిపిస్తున్నామని, అక్కడి నుంచి కాల్పులు జరగవచ్చని ఆయన చెప్పారు.

అబ్దుల్ రఖీబ్ ప్రమాదాన్ని అంగీకరిస్తూ నవ్వారు. గతంలో కూడా పాఠశాలపై కాల్పులు జరిగాయని ఆయన చెప్పారు.

"మనం క్లాసులో కూర్చున్నా, నిద్రపోతున్నా, పాఠశాలలో ఉన్నా, వీధిలో ఉన్నా ఏ క్షణంలోనైనా పరిసరాలలో పేలుళ్లు జరగొచ్చు. మా భవిష్యత్తు ఎలా ఉంటుందో, రేపు ఏమవుతుందో మాకు తెలియదు" అని ఆయన అన్నారు.

అబ్దుల్ రఖీబ్‌కు ఇలాంటి ప్రమాదాలు ఇప్పుడు నిత్యజీవితంలో భాగమైపోయాయి.

యెమెన్‌లో కొనసాగుతున్న అంతర్యుద్ధంలో తైజ్ చాలాకాలంగా కీలకమైన యుద్ధభూమి. 2015లో హూతీలు రాజధాని సనా నుంచి ప్రభుత్వాన్ని తరిమికొట్టిన తర్వాత తైజ్‌ను కూడా తమ ఆధీనంలోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. అయితే స్థానిక మిలీషియా వారిని నగరంలోని చాలా ప్రాంతాల నుంచి తరిమికొట్టాయి.

తైజ్‌ను స్వాధీనం చేసుకుంటే యెమెన్ ఉత్తర ప్రాంతంపై హూతీలకు పూర్తి నియంత్రణ లభిస్తుంది. ఇప్పుడు వారు చేపట్టిన తాజా దాడుల్లో ఇతర ఆయుధాలతో పాటు డ్రోన్లను కూడా విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.

స్నైపర్లు, బాంబు దాడులు, యెమెన్, హూతీలు
ఫొటో క్యాప్షన్, షార్ప్‌నెల్ (పేలుడు శకలం) వల్ల గాయపడిన అమ్జద్ దగ్గర విలపిస్తున్న అతని తల్లి

గుండెలోకి దూసుకెళ్లిన పేలుడు ముక్క

కొన్నిసార్లు ఈ పోరాటాల్లో సాధారణ పౌరులు కూడా అనుకోకుండా బలవుతుంటారు.

ఆ రోజు సాయంత్రం ఆ స్కూలుకు కాస్త దూరంలో ఉన్న ఆసుపత్రి నుంచి మాకు ఫోన్ వచ్చింది. మోర్టార్ దాడిలో ఇద్దరు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారని చెప్పారు.

మేము అల్ రౌదా ఆసుపత్రికి చేరుకున్నప్పుడు, ఇంటెన్సివ్ కేర్ యూనిట్ బయట ఒక నర్సు నిలబడి ఉన్నారు. ఆమె చేతిలో రక్తపు మరకలతో ఉన్న లేత గోధుమరంగు రబ్బరు చెప్పులు ఉన్నాయి.

అవి మూడు సంవత్సరాల బాలుడు అహ్మద్‌వి. నగరంలోని ఒక మెకానిక్ షాపుపై మోర్టార్ పడటంతో అహ్మద్ మరణించాడని మాకు తెలిసింది.

ఆ చెప్పుల గురించి అడిగినప్పుడు నర్సు ఇక్రామ్ షమ్సాన్ కన్నీళ్లు పెట్టుకున్నారు.

"ఈ చిన్నారి గానీ, అతని కుటుంబం గానీ ఏం తప్పు చేశారు చెప్పండి" అని ఆమె అడిగారు.

మోర్టార్ పేలుడు ముక్క అహ్మద్ వీపు నుంచి గుండెల్లోకి దూసుకెళ్లడంతో అతను మరణించాడు. మెకానిక్ షాపులో తన మోటార్‌సైకిల్ టైర్‌కు గాలి కొట్టించేందుకు వెళ్లిన అతని తండ్రితో పాటు అహ్మద్ కూడా ఉన్నాడు. తండ్రికి గాయాలేమీ కాలేదు.

‘‘అహ్మద్‌ను బయటకు తీసుకెళ్లాలని తండ్రి అనుకోలేదు. కానీ, తానూ బయటకు వస్తానని ఏడుస్తుంటే బండి మీద షాపుకు తీసుకొచ్చారు’’ అని ఒక వైద్యుడు చెప్పారు.

చిన్న పని కోసం బయటకు వెళ్లడం వారి జీవితంలోనే అత్యంత విషాదకరమైన రోజుగా మారింది.

ఆసుపత్రి నుంచి తన కుమారుడి మృతదేహాన్ని తీసుకెళ్తూ అతని తల్లిని బిగ్గరగా విలపించారు.

మరో 11 ఏళ్ల బాలుడు అమ్జద్ కూడా ఆ మెకానిక్ షాపులో ఉన్నాడు. అతను తన సోదరుడితో కలిసి మెకానిక్ వద్ద పనిచేస్తూ, స్వగ్రామంలో ఉన్న కుటుంబానికి డబ్బు పంపేవాడు.

పేలుడు ముక్కలు అమ్జద్ ఊపిరితిత్తుల్లోకి, పొత్తికడుపులోకి దూసుకెళ్లాయి. మేము అతన్ని చూసే సమయానికి ఇంటెన్సివ్ కేర్‌లో చికిత్స పొందుతున్నాడు. బెడ్ పక్కన కుటుంబ సభ్యులెవరూ లేరు.

అతని పరిస్థితి విషమంగా ఉందని, మరికొన్ని గంటల్లోనే ఏమైనా జరగొచ్చని వైద్యుడు చెప్పారు. కనీసం అతనికి కడసారి వీడ్కోలు చెప్పేందుకైనా తల్లి సమయానికి చేరుకోవాలని ఆయన ఆశించారు.

ఆ రోజు రాత్రి సుమారు 8 గంటలకు అమ్జద్‌ను ఆసుపత్రిలో చేర్చారు. మరుసటి రోజు ఉదయం సుమారు 6 గంటలకు తల్లి ఆసుపత్రికి చేరుకున్నారు. ఆమె గ్రామం నుంచి ఆసుపత్రికి రావడానికి సమయం పట్టడంతో ఆలస్యమైంది.

ఆమె కొడుకు బెడ్ పక్కన కూర్చుని దేవుడిని ప్రార్థించారు. గది నుంచి బయటకు వచ్చిన వెంటనే మోకాళ్లపై కూలబడి కన్నీటిపర్యంతమయ్యారు.

ఆమె వచ్చిన సమయంలో అమ్జద్ గుండె కొట్టుకునే వేగం మెరుగుపడిందని వైద్యులు చెప్పారు. అతనికి మరోసారి శస్త్రచికిత్స చేశారు. అయితే పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది.

"మేము ఎప్పుడూ భయంతో ఉంటాం. పిల్లలు చనిపోతుంటే చూడటం చాలా బాధాకరం. మాకు శాంతి కావాలి. మేము సురక్షితంగా ఉండాలనుకుంటున్నాం" అని షమ్సాన్ అనే నర్సు అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)