నేహా బోరాను పోలీసు వాహనంలో తీసుకువెళ్లి ఎక్కడ వదిలిపెట్టారు, దిల్లీ ‘సిటిజన్ మార్చ్’లో ఏం జరిగింది?

నేహా బోరా
ఫొటో క్యాప్షన్, దిల్లీ పోలీసులు తమ నేత నేహాబోరాను నిర్బంధించారని వామపక్ష విద్యార్థి సంఘం ఏఐఎస్ఏ తన ఇన్‌స్టా పేజీలో తెలిపింది.
ప్రచురణ
చదివే సమయం: 6 నిమిషాలు

దిల్లీలో ఇండియా గేట్ నుంచి జంతర్ మంతర్ వరకు ఆదివారం 'సిటిజన్ మార్చ్' నిర్వహించారు. ఈ ప్రదర్శనలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. సర్‌లో చోటుచేసుకున్న అక్రమాలకు వ్యతిరేకంగా, సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ను తొలగించాలనే డిమాండ్‌తో ఈ ప్రదర్శన నిర్వహించారు.

జంతర్‌మంతర్‌కు వెళ్లే మార్గాలను పోలీసులు బారికేడ్లతో మూసివేసి, ఆ ప్రాంతంలో భారీ సంఖ్యలో భద్రతా బలగాలను మోహరించారు.

తమ నాయకురాలు నేహా బోరాను దిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని వామపక్ష విద్యార్థి సంఘం ఏఐఎస్ఏ 'ఎక్స్'లో చేసిన ఒక పోస్ట్‌లో తెలిపింది.

"దిల్లీ పోలీసులు నేహాను ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? ఇది నిర్బంధం కాదు...కిడ్నాప్" అని నేహా బోరా 'ఎక్స్' అకౌంట్‌లో రాసి ఉంది.

అయితే తరువాత ‘నరేలా ఇండస్ట్రీయల్ ఏరియా పోలీసుస్టేషన్ నుంచి ఏఐఎస్ఏ అధ్యక్షురాలు నేహాను విడుదల చేశారు. అయితే ఆమె వద్ద బ్యాగ్ కానీ, ఫోన్ కానీ లేదు. ఆమెకు సాయం అందించడానికి మేం ఒక లాయర్ల బృందాన్ని పంపుతున్నాం’’ అని ఏఐఎస్ఏ ఎక్స్‌లో పోస్టు చేసింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
జ్ఞానేశ్ కుమార్, ఎన్నికల కమిషనర్
ఫొటో క్యాప్షన్, సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ను తొలగించాలని విపక్షాల సహా అనేక సంఘాలు కోరుతున్నాయి.

జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌పై విచారణ

ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం(అక్టోబర్ 5) విచారణ జరపనుందని లైవ్ లా తెలిపింది.

మిగతా ఇద్దరు ఎన్నికల కమిషనర్ల ఆమోదం లేకుండా ఎస్ఐఆర్ అంశంపై జ్ఞానేశ్ కుమార్ నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపిస్తూ ఈ పిటిషన్ దాఖలైనట్టు లైవ్ లాలో ఉంది.

సర్‌కు సంబంధించిన 14 నిర్ణయాలను రద్దు చేయాలని, జ్ఞానేశ్ కుమార్‌పై చర్యలు తీసుకోవాలని, ఎస్ఐఆర్ నిర్ణయాలపై సిట్ దర్యాప్తు జరపాలని ఈ పిటిషన్‌లో కోరారు.

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చి, జస్టిస్ వి. మోహనలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించనున్నట్టు లైవ్ లా తెలిపింది.

దిల్లీ నిరసనలు
ఫొటో క్యాప్షన్, దిల్లీలో జరిగిన నిరసన ప్రదర్శనలో పెద్ద ఎత్తున ప్రజలు, విద్యార్థి సంఘాలు పాల్గొన్నాయి

‘నిరసనలు ఒక్క రోజుతో ఆగేవి కావు’

మరోవైపు దిల్లీలో జరుగుతున్న నిరసనలపై సామాజిక కార్యకర్త యోగేంద్ర యాదవ్ 'ఎక్స్'లో ఓ పోస్ట్‌ చేశారు. "ఇవాళ సిటిజన్ మార్చ్ సందర్భంగా నిరసన కోసం కేటాయించిన ప్రదేశం జంతర్ మంతర్ వైపు వెళ్తుండగా పోలీసులు నన్ను బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. ఇది కేవలం ఒక రోజు జరిగే ప్రతీకాత్మక నిరసన కాదు. జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించే వరకు ఈ నిరసనలు కొనసాగుతాయి'' అని యోగేంద్రయాదవ్ ఆ పోస్ట్‌లో రాశారు.

నేహా బోరాను అదుపులోకి తీసుకున్న కారులో ఒక్క మహిళా పోలీసుకూడా లేరని యోగేంద్ర యాదవ్ ఆరోపించారు.

"ఎన్నికల సంఘం చేస్తున్న చట్టవిరుద్ధ కార్యకలాపాలను కాపాడటానికి చేసిన మరో చట్టవిరుద్ధమైన చర్య ఇది'' అని ఆయన విమర్శించారు.

నిరసనల సందర్భంగా తనను దిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని యోగేంద్ర యాదవ్ చెప్పారు.

"మమ్మల్ని బస్సు ఎక్కించి ఎక్కడికో తీసుకువెళ్తున్నారు. జ్ఞానేశ్‌ కుమార్‌ను పదవి నుంచి తొలగించేవరకు మేం వెనక్కి తగ్గం. ఈ నిరసన కొనసాగుతూనే ఉంటుంది" అని 'ఎక్స్'లో ఓ ఫోటో పోస్ట్ చేసి యోగేంద్ర యాదవ్ రాశారు.

పోలీసులు, జంతర్ మంతర్, లాఠీచార్జ్
ఫొటో క్యాప్షన్, తమ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేశారని ఎన్ఎస్‌యుఐ ఆరోపించింది

వీధుల్లోకి ఎన్ఎస్‌యూఐ, ఆమ్ ఆద్మీ పార్టీ

ఈ నిరసన కోసం పెద్ద సంఖ్యలో ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు కూడా ఇండియా గేట్ దగ్గరకు చేరుకున్నారు. దిల్లీ పోలీసులకు వ్యతిరేకంగా నిరసనకారులు నినాదాలు చేస్తూ కనిపించారు.

మహిళా జర్నలిస్టులు చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు సౌరభ్ భరద్వాజ్ కూడా నిరసనలో పాల్గొన్నారు. ఆయనతోపాటు పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

''మహిళా జర్నలిస్టులతోనే ఇలా ప్రవర్తిస్తోంటే...సామాన్య ప్రజలు పరిస్థితి ఎలా ఉంటుందో మీరు ఆలోచించవచ్చు. ఏసీపీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి'' అని సౌరభ్ భరద్వాజ్ డిమాండ్ చేశారు.

సౌరభ్ భరద్వాజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకునే ముందు అక్కడ చాలా సేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు తమతో దురుసుగా ప్రవర్తించారని నిరసనకారులు ఆరోపించారు.

దిల్లీ నిరసనలు
ఫొటో క్యాప్షన్, నిరసనకారులకు, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షనలో కొన్ని బస్సుల అద్దాలు పగిలిపోయాయి

‘మహిళలతో ఇలాగేనా వ్యవహరించేది?’

''ఓటు దొంగలకు వ్యతిరేకంగా గళం వినిపిస్తున్న మా ఎన్‌ఎస్‌యూఐ సహచరులను దిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కానీ ఎన్‌ఎస్‌యూఐ సహచరుల గొంతులను అణచివేయలేరు. ప్రజాస్వామ్యాన్ని, ఓటుహక్కును కాపాడేందుకు మా పోరాటం కొనసాగుతుంది" అని ఎన్ఎస్‌యూఐ 'ఎక్స్'లో పోస్ట్ చేసింది.

"ఓట్ల దొంగతనానికి, జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చిన మా ఎన్ఎస్‌యూఐ కార్యకర్తలపై దిల్లీ పోలీసులు దారుణంగా లాఠీఛార్జ్ చేశారు. ఈ చర్యలో మా సహచరులలో ఒకరి కాలికి తీవ్రంగా గాయమైంది.

'బేటీ బచావో, బేటీ పఢావో' అని మాట్లాడే ప్రభుత్వం సమక్షంలోనే మహిళా నిరసనకారులతో పోలీసులు వ్యవహరించిన తీరు, మా కార్యకర్తలపై చేసిన బలప్రయోగం తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి'' అని అని ఎన్‌ఎస్‌యూఐ 'ఎక్స్'లో చేసిన మరో పోస్ట్‌లో విమర్శించింది.

దిల్లీ పోలీసులు ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన సౌరభ్ భరద్వాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు
ఫొటో క్యాప్షన్, దిల్లీ పోలీసులు ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన సౌరభ్ భరద్వాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు

అంతకుముందు కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) అధికార ప్రతినిధి సౌరవ్ దాస్, పార్టీ సభ్యురాలు రత్నా సింగ్ పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. వారితో పాటు సీపీఐ(ఎం) నాయకురాలు బృందా కరాత్ కూడా ఉన్నారు.

" బాధితులకు మద్దతుగా నిలిచేందుకు సీజేపీ తరపున రత్నా సింగ్, నేను వచ్చాం. దిల్లీ పోలీసులు యువతను ఎంత క్రూరంగా అదుపులోకి తీసుకుంటూ హింసిస్తున్నారో యావత్ దేశం చూస్తోంది. దిల్లీ పోలీసులు సిగ్గుపడాలి" అని సౌరవ్ దాస్ వ్యాఖ్యానించారు.

దిల్లీ నిరసనలు
ఫొటో క్యాప్షన్, దిల్లీ పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ జరిగిన పార్లమెంట్ మార్చ్‌లో పాల్గొన్న సీజేపీ సౌరవ్ దాస్

" లైంగిక హింసకు గురైన బాధితురాలితో కలిసి మా బృందం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి, ఏసీపీపై వేధింపుల కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయమని కోరింది. కానీ క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు కొనసాగుతోందని చెబుతూ దిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి నిరాకరించారు" అని కాక్రోచ్ జనతా పార్టీ 'ఎక్స్'లో పోస్ట్ చేసింది.

''చట్టం స్పష్టంగా ఉంది. ఎలాంటి దర్యాప్తు లేకుండానే ముందుగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలి. అయినప్పటికీ దిల్లీ పోలీసులు తమ ఏసీపీని కాపాడటానికి అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు'' అని సీజేపీ ఆరోపించింది.

దిల్లీ నిరసనలు
ఫొటో క్యాప్షన్, నేహాబోరా

మమతా బెనర్జీ వర్గానికి చెందిన టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా జంతర్ మంతర్ దగ్గర భద్రతా సిబ్బంది మోహరింపుపై ఒక వీడియోను షేర్ చేశారు.

"జ్ఞానేశ్ కుమార్‌ను కాపాడేందుకు మోదీ, షా ఎలా ప్రయత్నిస్తున్నారో ఇది చూపిస్తోంది. జంతర్ మంతర్‌ను సామాన్య ప్రజలకు యుద్ధ క్షేత్రంగా మార్చేశారు. ఈ కిరీటాలు ఎగిరిపోతాయి. ఈ సింహాసనాలు కూలిపోతాయి'' అని ఆమె రాశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)