'నా చేతులకు ఉన్న మెహందీ చెరగక ముందే, కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తోంది'.. శ్రావణి రాణే, మహమ్మద్ ఫైజ్ల కేసు ఏమిటి?

ఫొటో సోర్స్, Shravani Rane
- రచయిత, దీపాలి జగ్తాప్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 6 నిమిషాలు
''వారు రాజకీయాల పేరుతో మమ్మల్ని వేధిస్తున్నారు. మేం రాజకీయాల్లో లేము. అలాంటప్పుడు ఎందుకు వేధిస్తున్నారు? నా చేతులకు ఉన్న మెహందీ ఇంకా పోనే లేదు. నేను కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తోంది'' అని శ్రావణి రాణే అన్నారు.
22 ఏళ్ల శ్రావణి రాణే, 26 ఏళ్ల మహమ్మద్ ఫైజ్లు 2026 అక్టోబర్‌లో ప్రత్యేక వివాహ చట్టం కింద పెళ్లి చేసుకున్నారు.
శ్రావణిని బలవంతంగా మతం మార్చారని ఆరోపిస్తూ ఆమె తల్లి మేఘవాడీ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా మహమ్మద్ ఫైజ్‌పై కేసు దాఖలు చేశారు.
మహారాష్ట్రలో రాష్ట్ర ప్రభుత్వం 2026 మార్చిలో ఫ్రీడమ్ ఆఫ్ రిలిజియన్ బిల్లును (మత స్వేచ్ఛ బిల్లును) ఆమోదించింది.
ఈ బిల్లు ప్రకారం బలవంతంగా లేదా మోసపూరితంగా మత మార్పిడికి పాల్పడితే శిక్ష విధించే నిబంధనలు ఉన్నాయి. అలాగే, మత మార్పిడి కోసం చేపట్టాల్సిన విధివిధానాలను కూడా ఈ చట్టం నిర్దేశించింది.

బీజేపీ నేత కిరీట్ సోమయ్య, శ్రావణి తల్లి నీలేశా రాణే.. కొన్ని రోజుల క్రితం మేఘవాడీ పోలీసు స్టేషన్‌ను సందర్శించారు. ఆ తర్వాత వారు మీడియాతో కూడా మాట్లాడారు.
శ్రావణి అందించిన సమాచారం ప్రకారం.. వారు ఐదేళ్లుగా ప్రేమలో ఉన్నారు. స్కూల్ నుంచి వారిద్దరూ ఒకరికొకరు తెలుసు. అలాగే, 2022 నుంచి వారిద్దరూ ప్రేమించుకుంటున్నారు.
''ఇరు కుటుంబాలకు ఈ విషయం తెలుసు. నిజానికి, మా రెండు కుటుంబాలు కూడా ఒకరికొకరు బాగా తెలుసు. మేం కలిసేవాళ్లం'' అని శ్రావణి తెలిపారు.
తన తల్లి, మహమ్మద్ ఫైజ్ కలిసి కేకు తింటున్న ఫొటోను ఆమె తన మొబైల్ ఫోన్లో చూపించారు..
కానీ, పెళ్లి తర్వాత తన భర్తపై కేసు నమోదైంది. పెళ్లి అయిన కొన్ని రోజులైనా కాకముందే, ముందస్తు బెయిల్ కోసం ఇలా పోలీసు స్టేషన్, కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుందని శ్రావణి రాణే వాపోయారు.
పెళ్లయిన తర్వాత కొన్ని రోజుల వరకు అంతా బాగుందని, ఫోన్లో తన తల్లితో కూడా మాట్లాడినట్లు శ్రావణి తెలిపారు.
కానీ, ఒక్కసారిగా శ్రావణి భర్త మహమ్మద్ ఫైజ్‌పై కేసు దాఖలైనట్లు తెలిసింది. పోలీస్ స్టేషన్‌కు రావాలని శ్రావణికి సమన్లు జారీ చేశారు.
మహారాష్ట్ర ఫ్రీడమ్ ఆఫ్ రిలిజియన్ యాక్ట్, 2026 కింద మేఘవాడీ పోలీస్ స్టేషన్లో దాఖలైన కేసులో నిందితుడు మహమ్మద్ ఫైజ్ అక్బర్ ఖాన్‌కు దిండోషి సెషన్స్ కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
రూ. 50,000 వ్యక్తిగత బాండ్‌తో పాటు, అదే మొత్తానికి పూచీకత్తు సమర్పించాలనే షరతుపై కోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ ఇచ్చింది.
వచ్చే 90 రోజుల పాటు ప్రతి సోమవారం, శుక్రవారం మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్యలో సంబంధిత పోలీస్ స్టేషన్ ముందు హాజరు కావాలని నిందితుడిని కోర్టు ఆదేశించింది.
అంతేకాక, సాక్ష్యాధారాలను తారుమారు చేయకూడదని, ఫిర్యాదుదారుడిని లేదా సాక్షులను సంప్రదించకూడదని, దర్యాప్తుకు సహకరించాలని, 7 రోజులలోపు తన నివాస చిరునామాను, సంప్రదింపు వివరాలను దర్యాప్తు అధికారికి అందించాలని, కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్ళకూడదని షరతులను విధించింది కోర్టు.
షరతులను ఉల్లంఘిస్తే బెయిల్‌ను రద్దు చేయవచ్చని కూడా కోర్టు స్పష్టం చేసింది.

ఫొటో సోర్స్, Shravani Rane
'నేను మతం మార్చుకోలేదు'
''నా వాంగ్మూలం రికార్డు చేశారు. నేను నా ఇష్టంతోనే వచ్చానని పోలీసులకు చెప్పాను. ఇష్టంగానే పెళ్లి చేసుకున్నాను. నేను ఆయన్ను ప్రేమించాను, అందుకే ఆయన్ని పెళ్లి చేసుకున్నాను" అని శ్రావణి రాణే బీబీసీకి తెలిపారు.
"నేను మతం మారలేదు. నా ఆధార్ కార్డు, పాన్ కార్డు 'శ్రావణి నీలేశా రాణే' అనే పేరుతోనే ఉన్నాయి. దీనికి నా భర్తకు ఎటువంటి అభ్యంతరం లేదు. మరి వీరికి వచ్చిన సమస్య ఏమిటి?" అని శ్రావణి ప్రశ్నించారు.
కోర్టు వివాహం తర్వాత నిర్వహించిన ఫ్యామిలీ రిసెప్షన్ ఫంక్షన్ ఆహ్వాన పత్రికలో కూడా 'శ్రావణి నీలేశా రాణే' అనే పేరుతో పాటు 'ఆయేషా' అని కూడా ఉండటంతో, తాను వేరే మతంలోకి మారానేమోనని ప్రజలు భావించారని శ్రావణి పేర్కొన్నారు.
తాను మతం మారలేదని శ్రావణి చెప్పారు.
''నేను మతం మారలేదు. మాకు వెడ్డింగ్ రిసెప్షన్ జరిగింది. ఆ కార్డుపై ఉన్న పేరుతో నేను మతం మారినట్లు నిరూపణ అవుతుందా?" అని శ్రావణి రాణే ప్రశ్నించారు.
"వారు నా దుస్తులను బట్టి నన్ను జడ్జ్ చేస్తున్నారు. నాకు నచ్చినట్లు దుస్తులు ధరించినంత మాత్రాన నేను మతం మారినట్లు కాదు. ఆ కార్డుపై నా పేరు 'శ్రావణి' అని పెద్ద అక్షరాలతో రాసి ఉంది. వారు నన్ను ప్రేమగా 'ఆయేషా' అని పిలుస్తారు" అని తెలిపారు.
ఈ ఘటనకు సంబంధించి, శ్రావణి తల్లి నీలేశా రాణే, మేఘవాడీ పోలీస్ స్టేషన్లో బలవంతపు మత మార్పిడిపై ఫిర్యాదు చేశారు.
అంతకుముందు శ్రావణి తప్పిపోయినట్లు రిపోర్టు చేశారు. అయితే, ఫోన్లో తన తల్లితో మాట్లాడినట్లు శ్రావణి చెప్పారు.
పెళ్లి తర్వాత.. తనకు తానుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి, తన వివాహ ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించినట్లు తెలిపారు.
మహమ్మద్ ఫైజ్‌పై మత స్వేచ్ఛ చట్టం కింద కేసు నమోదు కాగా, ఆయన దిండోషి కోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది.
''అబ్బాయి ముస్లిం, అమ్మాయి హిందువు. ప్రత్యేక వివాహ చట్టం కింద వారి పెళ్లి జరిగింది. అందుకే, రిసెప్షన్ కార్డుపై ఆయేషా అని పేరు రాశారు. కానీ, ఆ అమ్మాయి మతం మార్చుకుందని ప్రజలు భావించారు'' అని మహమ్మద్ ఫైజ్ తరఫున న్యాయవాది కరీం పఠాన్ చెప్పారు.
మహమ్మద్ ఫైజ్‌కు ముందస్తు బెయిల్ జారీ అయిన తర్వాత మాట్లాడిన కరీం పఠాన్... "ఈ చట్టం ఇంకా హైకోర్టు, సుప్రీంకోర్టులలో పెండింగ్‌లో ఉంది. ఒక నిరపరాధిని ఇరికించడానికి ఈ చట్టాన్ని దుర్వినియోగం చేశారు. అయితే, సెషన్స్ కోర్టులో కేసును ప్రజెంట్ చేసిన తీరు, ఎఫ్ఐఆర్ ఆరోపణలు అబద్ధమని నిరూపించింది. ఇది మాకు, ఆ దంపతులకు లభించిన పెద్ద విజయం" అని అన్నారు.
రాజకీయాలు చేస్తున్నారని ఆరోపణలు
ఇది హిందూ-ముస్లిం వివాహం కావడం వల్లే తనపై రాజకీయాలు చేస్తున్నారని శ్రావణి ఆరోపించారు.
ఈ ఘటనపై మాట్లాడిన బీజేపీ నేత కిరీట్ సోమయ్య, '' 22 ఏళ్ల హిందూ యువతిని వలలో పడేసి, బలవంతంగా మతం మార్చారు. ఆ యువతి తల్లి ఏదైనా చర్యలు తీసుకునేలోపే, ఆ యువకుడు ప్రత్యేక వివాహ చట్టం కింద ఆమెను వివాహం చేసుకున్నారు'' అని తెలిపారు.
''మూడు వారాల తర్వాత ముస్లిం ఆచారాల ప్రకారం వివాహం జరిగింది. అంటే ఇందులో ఏదో తేడా ఉంది. మొదట ఆ అమ్మాయిని వలలో వేసుకున్నారు, ఆ తర్వాత శారీరక సంబంధం పెట్టుకున్నారు, అనంతరం, పెళ్లి చేసుకుంటామని ఆశ చూపి మతం మారమని బలవంతం చేశారు" అని చెప్పారు.
"మత మార్పిడుల నిరోధక చట్టం కింద ఇది నేరం. ఈ విషయమై కేసు నమోదైంది. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు" అని సోమయ్య ఆరోపించారు.
బాలిక తల్లికి న్యాయం జరుగుతుందని కూడా ఆయన అన్నారు.
అయితే, తన భర్తపై వస్తోన్న ఈ ఆరోపణలను శ్రావణి ఖండించారు. ఈ విషయంలో రాజకీయాలు జరుగుతున్నాయని చెప్పారు.

ఫొటో సోర్స్, Shravani Rane
'కుటుంబానికి అంతా తెలుసు'
తాము ప్రేమించుకుంటున్నామని తన కుటుంబంలో అందరికీ తెలుసని శ్రావణి రాణే చెప్పారు. ఇరు కుటుంబాల మధ్య సంబంధాలు కూడా మెరుగ్గా ఉండేవన్నారు.
"ఆయన నా బాయ్‌ఫ్రెండ్ అనే విషయం మా కుటుంబ సభ్యులందరికీ తెలుసు. మా అమ్మ కూడా ఆయనతో మాట్లాడేది. నేను ఆయన ఇంటికి వెళ్లడం, ఆయన మా ఇంటికి రావడం వంటి విషయాలన్నీ ఇంట్లో అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు మా అమ్మ కూడా తాను ఏమి మాట్లాడుతుందో తనకే తెలియని విధంగా మాట్లాడుతోంది. వారిద్దరూ కలిసి కేక్ తింటున్న ఫొటో కూడా నా దగ్గర ఉంది" అని శ్రావణి పేర్కొన్నారు.
ప్రేమ వివాహాలను మతం లేదా రాజకీయ కోణంలో చూడొద్దని అన్నారు. ఈ సమస్య వల్ల, తమకు ఎక్కడా సురక్షితంగా లేకుండా పోయిందన్నారు.
''మా పెళ్లి జరిగి నెల అవుతుంది. ఎక్కడా మాకు భద్రత లేదు. మేం ప్రేమించుకున్నాం కాబట్టి పెళ్లి చేసుకున్నాం. మాకు కులం, మతం పట్టింపు లేవు. ప్రేమ మతం మీద ఆధారపడి ఉండదు. ప్రేమ ఎక్కడైనా, ఎవరితోనైనా పుట్టగలదు'' అని శ్రావణి చెప్పారు.
"మేం ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నాం. కలిసి ఉండటానికే పెళ్లి చేసుకున్నాం. మా పెళ్లి ఒక మతపరమైన సమస్యగా మారుతుందని మాకు తెలియదు'' అని తెలిపారు.
శ్రావణి తల్లి ఆరోపణలేంటి?
తన కుమార్తె శ్రావణి రాణే ఇస్లాం మతంలోకి మారిందని తల్లి నీలేశా రాణే చెప్పారు. ఈ మత మార్పిడికి సంబంధించిన వీడియో తన వద్ద ఉందని కూడా ఆమె చెబుతున్నారు.
"ఆమె మతం మారకపోతే, అక్కడ ఖాజీ కూర్చుని ఉన్న ఆ వీడియో నాకు ఎక్కడి నుంచి వచ్చింది? పెళ్లి వేడుకను మరాఠీలో ఎందుకు జరపలేదు? అప్పటికే ఆయన ఆమెను బెదిరించారు. అందుకే, ఆమె పెళ్లి చేసుకుంది. ఆమె మతం మారిందన్నది స్పష్టమైంది" అని చెప్పారు.
కోర్టు నుంచి శ్రావణి తల్లి న్యాయం కోరుతున్నారు. తన కూతుర్ని తిరిగి రప్పించాలని డిమాండ్ చేశారు. ఈ మత మార్పిడికి సంబంధించి ఫిర్యాదు దాఖలు చేసినట్లు నీలేశా రాణే కూడా తెలిపారు.
''ఆమె మతం మార్చుకుంది. నేను దాన్ని అంగీకరించను. ఈ పెళ్లిని నేను ఒప్పుకోను. నాకు నా కూతురు తిరిగి కావాలి. ఆమె మతం మార్చుకోకపోతే, బురఖా ఎందుకు ధరించింది? ఆయన ఆమె స్నేహితుడు కాబట్టే నేను ఆయనకు కేక్ తినిపించాను" అని చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)































