చైనా దిగుమతులపై భారత్ ప్రమాదకర స్థాయిలో ఎందుకు ఆధారపడుతోంది?

ఫొటో సోర్స్, AFP via Getty Images
- రచయిత, నిఖిల్ ఇనాందార్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 7 నిమిషాలు
పిల్లల కోసం ఏదైనా కొత్త ఆటవస్తువును కొనడానికి మీరు ఇండియాలో ఓ బొమ్మల దుకాణంలోకి వెళితే చాలు... చైనాతో మరింత మెరుగైన ఆర్థిక సంబంధాల కోసం భారత్ ఎలా పోరాడుతుందో ఒక అవగాహనకు రావచ్చు.
ఆరేళ్ల కిందట దేశీయంగా ఉత్పాదకతను పెంచడానికి నాణ్యత లేని బొమ్మలు మార్కెట్లోకి రాకుండా నిరోధించడానికి.. భారత్‌కు దిగుమతయ్యే బొమ్మలపై టారిఫ్‌లను 20 నుంచి 60శాతానికి, ఆ తర్వాత 70శాతానికి పెంచింది.
దీనిపై రిటైలర్లు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
విదేశాల్లో తయారయ్యే వస్తువులతో దేశీయ సంస్థలు ఎప్పటికీ పోటీ పడలేవన్నారు.
కస్టమ్స్ డ్యూటీలను పెంచడం , నాణ్యత నియంత్రణ ప్రమాణాలు లాంటి నిర్ణయాలు సత్ఫలితాలు సాధించాయి.

భారత్‌కు బొమ్మల దిగుమతులు 2020లో దాదాపు 300 మిలియన్ డాలర్ల (రూ. 2886 కోట్లు) నుంచి ఈ ఏడాది 100 మిలియన్ డాలర్లకు( రూ. 963 కోట్లు) పడిపోయాయి.
అదే సమయంలో ఎగుమతులు దాదాపు 129 మిలియన్ డాలర్ల( రూ. 1242 కోట్లు) నుంచి 200 మిలియన్ డాలర్లకు( రూ. 1926 కోట్లు) పెరిగాయి.
ఒకప్పుడు స్థానిక బొమ్మల మార్కెట్లో 70శాతం వాటా కలిగి ఉన్న చైనాపై ఆధారపడటాన్ని భారత్ గణనీయంగా తగ్గించుకోగలిగింది.

ఫొటో సోర్స్, Bloomberg via Getty Images
వాణిజ్య లోటుతో భారత్‌కు నష్టం
చైనాతో రోజురోజుకూ అసమానంగా మారుతున్న వాణిజ్య సంబంధాలను సరిచేయడానికి భారత్ చేసిన ప్రయత్నాలలో ఈ రంగానికి సంబంధించిన విజయం ఒక అరుదైన మినహాయింపుగా నిలుస్తుంది.
కొంతమంది నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రస్తుత ప్రపంచంలోనే ఇది అత్యంత అసమానమైన వాణిజ్య సంబంధాలలో ఒకటి.
2020లో గల్వాన్ వ్యాలీ ఘర్షణల తర్వాత ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.
యాంటీ-డంపింగ్ డ్యూటీలతో పాటు టిక్‌టాక్ వంటి చైనీస్ యాప్‌లపై దిల్లీ నిషేధం విధించింది.
అయినప్పటికీ బీజింగ్‌తో భారత్ వాణిజ్య లోటు 2020లో 44 బిలియన్ డాలర్ల నుంచి ఈ ఏడాది కళ్ళు తిరిగేలా 112 బిలియన్ డాలర్లకు పెరిగింది.
"చైనాతో రాజకీయ, రక్షణ, పెట్టుబడి సంబంధాలు అత్యంత కనిష్ఠ స్థాయికి దిగజారినా, భారత్ ఆ దేశం మీద ఆర్థికంగా ఆధారపడటం మరింత పెరిగింది" అని వాషింగ్టన్కు చెందిన ఆసియా సొసైటీ పాలసీ ఇన్స్టిట్యూట్ సెంటర్ ఫర్ చైనా అనాలిసిస్ ఫెలో కెవిన్ జోంగ్జే లీ బీబీసీతో అన్నారు.

ఫొటో సోర్స్, Costfoto / NurPhoto via Getty Images
మేకిన్ ఇండియాలో చైనా ఉత్పత్తులే దిక్కా?
మరింత ఆందోళనకర అంశమేంటంటే చైనా నుంచి భారత్‌కు దిగుమతులు రెట్టింపు అయినప్పటికీ భారత్ నుంచి చైనాకు ఎగుమతులు మాత్రం కోవిడ్ మహమ్మారికి ముందు ఉన్న స్థాయి కంటే తక్కువగానే ఉన్నాయి.
"భారత పారిశ్రామిక దిగుమతుల్లో 30శాతం కంటే ఎక్కువ చైనా నుంచే వస్తున్నాయి. 100కి పైగా కీలకమైన ఉత్పత్తుల కోసం భారత్ చైనాపై ఆధారపడి ఉంది. ఇది రోజు రోజుకీ పెరుగుతోంది" అని దిల్లీకి చెందిన గ్లోబల్ ట్రేడ్ అండ్ రీసర్చ్ ఇనిషియేటివ్- జీటీఆర్ఐకి చెందిన అజయ్ శ్రీవాస్తవ చెప్పారు.
దిగుమతులు ఇదే వేగంతో కొనసాగితే ద్వైపాక్షిక లోటు 134 బిలియన్ డాలర్లకు పెరగవచ్చు. ఇది భారతీయ పరిశ్రమపై బీజింగ్‌కు మరింత పట్టును ఇస్తుందని శ్రీవాస్తవ అభిప్రాయపడ్డారు.
రెండు దేశాల సంబంధాలు మెరుగుపడుతున్న తరుణంలో ఇటీవలి బ్రిక్స్ సదస్సులో పాల్గొన్న ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఈ "నిర్మాణాత్మక వాణిజ్య అసమతుల్యతలు, సరఫరా గొలుసు సమస్యలను" పరిష్కరిస్తామని చెప్పారు.
చైనా దిగుమతుల మీద భారత పారిశ్రామిక రంగం ఎంతగా ఆధారపడిందో పరిశీలిస్తే ఇది దిల్లీకి చాలా కష్టతరమైన పని అవుతుందని నిపుణులు బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, Bloomberg via Getty Images
చైనా విడి భాగాలు- ఇండియాలో అసెంబ్లింగ్
భారత్ కేవలం తుది ఉత్పత్తులను వినియోగించుకోవడానికే కాకుండా పారిశ్రామిక వస్తువుల ఉత్పత్తి కోసం కూడా ఎక్కువగా చైనాపైనే ఆధారపడుతోంది.
నిజానికి స్మార్ట్ఫోన్లు, సోలార్ పరికరాల వంటి పూర్తయిన వస్తువుల దిగుమతులపై ఆధారపడటాన్ని భారత్ తగ్గించుకుంది.
ఇప్పుడు ప్రపంచంలోని ఐఫోన్లలో పావు వంతు కంటే ఎక్కువ ఇక్కడే ఉత్పత్తి చేస్తోంది. "అయినప్పటికీ ఐ ఫోన్ల ఉత్పత్తి అంతా అసెంబ్లింగ్ ఆధారితంగానే ఉంది. వాటి విడిభాగాల కోసం ముఖ్యంగా చైనా నుంచి వచ్చే దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడింది" అని శ్రీవాస్తవ చెప్పారు.
పారిశ్రామిక యంత్రాలు, బ్యాటరీ ఇన్పుట్లు, రసాయనాలు, సోలార్ సెల్లు, ఉత్పాదక పరికరాల విషయంలో కూడా ఇదే పరిస్థితి ఉంది.
చైనా నుంచి వచ్చే దిగుమతులలో ఎలక్ట్రికల్ మెషినరీ, ఎలక్ట్రానిక్స్ మాత్రమే 36 శాతం వాటాను కలిగి ఉండగా యంత్రాలు, మెకానికల్ పరికరాలు 21.7శాతంతో తర్వాతి స్థానంలో ఉన్నాయని అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ థింక్ ట్యాంక్ తెలిపింది.
ఆర్గానిక్ రసాయనాలు, ప్లాస్టిక్ ముడి పదార్ధాల వాటా కూడా గణనీయంగా ఉంది.
"ఈ దిగుమతులకు అంతరాయం ఏర్పడితే అది వినియోగాన్ని ప్రభావితం చేయడమే కాకుండా ఉత్పత్తి ప్రక్రియని కూడా దెబ్బతీస్తుంది" అని అబ్జర్వర్ రీసర్చ్ ఫౌండేషన్ సెంటర్ ఫర్ న్యూ ఎకనామిక్ డిప్లొమసీ ఫెలో సౌమ్య భౌమిక్ అన్నారు.
చైనా దిగుమతులను స్థానిక ఉత్పత్తితో భర్తీ చేయడంలో భారత్ ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఇది ప్రతిబింబిస్తోందని ఆయన వాదించారు.

ఫొటో సోర్స్, AFP via Getty Images
చైనా మార్కెట్లో భారత కంపెనీలకు అడ్డంకులు
ఇన్పుట్లు, ముడి పదార్థాలపై ఆధారపడటం పెరగడంతో పాటు ఇతర స్థూల ఆర్థిక పోకడల వల్ల కూడా భారత్‌కు చైనీస్ దిగుమతులు పెరుగుతున్నాయి.
స్టీల్, సోలార్ ప్యానెళ్లు, ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు అనేక ఇతర రంగాలలో చైనాకు భారీ అదనపు ఉత్పత్తి సామర్థ్యం ఉంది.
అయితే చైనా ఆర్థిక వ్యవస్థ మందగమనం ఆ ఉత్పత్తులను వినియోగించుకోలేకపోతోంది. దీంతో చైనా ఉత్పత్తిదారులు విదేశీ మార్కెట్లలోకి విస్తరిస్తూ తమ వస్తువులను చౌకగా విక్రయిస్తున్నారు.
చైనా వాణిజ్య మిగులు వరుసగా రెండో ఏడాది కూడా ట్రిలియన్ డాలర్లు దాటుతుందని అంచనా.
చైనా వివిధ రంగాలలో తయారీని వేగంగా విస్తరిస్తూ ఉండటం "పాశ్చాత్య మార్కెట్లు చైనా వస్తువుల మీద టారిఫ్‌లు, ఇతర ఆంక్షలను విధిస్తూ ఉండటంతో" చైనా ఉత్పత్తులు భారత తీరాలకు చేరుకుంటున్నాయి’’ అని శ్రీవాస్తవ చెప్పారు.
మరోవైపు చైనా మార్కెట్ అందుబాటులో లేకపోవడం భారతీయ కంపెనీలకు ప్రధాన సవాలుగా మారింది.
"చైనాలో భారతీయ ఉత్పత్తులు అనేక రకాల టారిఫ్, నాన్-టారిఫ్ అడ్డంకులను ఎదుర్కొంటున్నాయి. దీనివల్ల ఎగుమతులను పెంచడం కష్టంగా మారుతోంది" అని లీ చెప్పారు.
"పరస్పర మార్కెట్ కోసం బలమైన ప్రయత్నం లేకుండా సంబంధాల పునరుద్ధరణ కొనసాగితే, రాజకీయ సంబంధాలు మెరుగవుతాయి కానీ చైనా మీద భారత్ ఆర్థికంగా ఆధారపడటం అలాగే ఉండిపోయే ప్రమాదం" అని లీ హెచ్చరించారు.

ఫొటో సోర్స్, Getty Images
పరిష్కారం ఏమిటి?
భారత్ తనకు అనవసరమైన దిగుమతులను తగ్గించడానికి ఎగుమతులు మెరుగు పరచడానికి తయారీ రంగాన్ని బలోపేతం చేయడమే పరిష్కారం అని శ్రీవాస్తవ చెప్పారు.
కానీ దానికి నిర్దిష్ట పారిశ్రామిక విధానం, బలమైన మౌలిక వసతులు, నాణ్యమైన విద్యుత్ సరఫరా, అందుబాటులో రుణాలు, సమర్థవంతమైన రవాణా సౌకర్యాలు, త్వరగా స్పందించే అధికార యంత్రాంగం అవసరం. ఈ విభాగాలలో భారత్ ఇంకా వెనుకబడే ఉంది.
ఇటీవల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి నిబంధనలను భారత్ సడలించింది.
భారత్‌లో పెట్టుబడులను విస్తరించాలనుకునే చైనా కంపెనీలకు ఈ నిర్ణయం తలుపులు తెరవవచ్చు.
కానీ వీటిని కూడా జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉందని శ్రీవాస్తవ చెప్పారు
"పంపిణీ నెట్‌వర్క్‌లను విస్తరించడానికి, చైనా విడిభాగాలను ఉపయోగించి అసెంబుల్ చేయడానికి పెట్టుబడులు పెట్టడం, కేవలం చైనాపై ఆధారపడటాన్నే పెంచుతుంది. అందుకే సాంకేతిక బదిలీ, స్థానికంగా అదనపు విలువను జోడించడం, దేశీయ విడిభాగాల ఉత్పత్తులకు, ఇండియా నుంచి ఎగుమతులకు ప్రాధాన్యంఇవ్వాలి’’ అని ఆయన చెప్పారు.
భారత్- చైనా మధ్య వాణిజ్య అసమానతను తగ్గించడానికి చైనాకు నిర్దిష్ట రంగాలకు ఎక్కువ అధిక ఎగుమతులు జరపాలనే లక్ష్యంపై భారత్ దృష్టి పెట్టవచ్చని లీ చెప్పారు.
చైనా జనాభాలో వృద్ధుల జనాభా పెరుగుతోంది. దీంతో వారి ఆరోగ్య సంరక్షణ ఖర్చులు పెరుగుతాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుంటే ఫార్మాస్యూటికల్స్ వంటి రంగాలు ఎగుమతులు పెంచుకోడానికి సహజంగానే భారత్‌కు కొంత సానుకూలంగా ఉంటాయి.
"అయితే కేవలం కొన్ని ప్రత్యేక ఎగుమతి రంగాలను కనుగొనడం ద్వారా112 బిలియన్ డాలర్ల లోటును తగ్గించడం సాధ్యం కాదు" అని లీ చెప్పారు.
"సంబంధాలను మరింత విస్తృతం చేయడంలో భాగంగా మార్కెట్ లభ్యతపై రాయితీలు ఇవ్వడానికి బీజింగ్ సిద్ధంగా ఉందా లేదా అన్నదే ఇక్కడ కీలక ప్రశ్న" అని లీ అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)






























