పిడుగు పడిందా, వడగళ్ల వర్షమా? 104 మందితో వెళ్తున్న ఆ విమానం ఎందుకు దెబ్బతింది?

ఫొటో సోర్స్, Getty Images
పట్నా నుంచి లఖ్‌నవూ వెళ్తున్న ఇండిగో విమానం ముందు భాగం ధ్వంసం కావడం చర్చనీయాంశంగా మారింది.
విమానం ముందు భాగం ఇలా దెబ్బతినడానికి కారణం ఏంటి? అనే అంశంపై ఇంత వరకు ఇండిగో నుంచి కానీ, డీజీసీఏ నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
ఈ ఘటనకు అసలు కారణం తెలియడం లేదని హిందుస్థాన్ టైమ్స్ చెబుతుంటే, పిడుగుపడటం వల్లే ఇలా జరిగిందని ఎన్డీటీవీ పేర్కొంది. పిడుగుపాటుగా అనుమానిస్తున్నట్లు పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది.
ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన 6E925 నెంబర్ గల విమానం పట్నా నుంచి 104 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్టు పీటీఐ వార్తా సంస్థతోపాటు, హిందుస్థాన్ టైమ్స్, ఎన్డీటీవీలు పేర్కొన్నాయి. గుర్తు తెలియని వస్తువు ముందు భాగాన్ని ధ్వంసం చేసిందని హిందుస్థాన్ టైమ్స్ కథనం తెలిపింది. అది పిడుగా, వడగండ్లా, మంచు ముక్కా అనేది మాత్రం తెలియదని చెప్పింది.
దాదాపు 17వేల అడుగుల ఎత్తులో ఉన్నప్పుడే ఘటన జరిగిందని, అనంతరం 4.05 గంటలకు లఖ్‌నవూ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయినట్టు కూడా వెల్లడించింది. ప్రయాణికులు, సిబ్బంది అంతా సురక్షితంగా ఉన్నారని పేర్కొంది.

‘‘విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయలేదు. లఖ్‌నవూ విమానాశ్రయంలో సాధారణ ల్యాండింగ్ జరిగింది. ఆకాశంలో ఉన్నప్పుడు అసలేం జరిగిందో తెలుసుకునేందుకు ఆ విమానాన్ని నిలిపివేశారు’’ అని విమానాశ్రయ ప్రతినిధి ఒకరు చెప్పినట్లు ‘హిందుస్థాన్ టైమ్స్’ పత్రిక కథనం తెలిపింది.
విమానం ల్యాండ్ అయ్యే వరకు ప్రమాదం జరిగిందని ఇండిగో సిబ్బందికి తెలియదని ఎయిర్‌పోర్టు అధికారులు హిందుస్థాన్ టైమ్స్‌కి సమాచారం ఇచ్చారు. అందుకే సాంకేతిక తనిఖీల తర్వాత క్లియరెన్స్ వచ్చే వరకు ఆ విమానాన్ని నడపబోమని ఇండిగో తెలిపినట్టు పేర్కొంది.
అయితే పిడుగు పాటు వల్ల ఇండిగో విమానాన్ని అత్యవసరంగా లఖ్‌నవూలో ల్యాండ్ చేశారని ఎన్డీటీవీ తెలిపింది. షెడ్యూల్ కంటే 8 నిమిషాలు ముందుగానే ల్యాండ్ చేసినట్టు ఆ కథనం చెబుతోంది.
పిడుగుపడినట్టు చెబుతున్న ఇండిగో ప్రతినిధి
"ఇండిగో ఎయిర్‌లైన్‌కు చెందిన 6E 625 నెంబర్ గల విమానం పట్నా నుంచి లఖ్‌నవూకు ప్రయాణిస్తున్న క్రమంలో ప్రతికూల వాతావరణం, వడగళ్ల వాన కారణంగా రాడోమ్ ధ్వంసమైంది. విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. సంబంధిత అధికారులకు వెంటనే సమాచారం చేరవేశాం. విమానం అవసరమైన నిర్వహణ పనులు పూర్తి చేసి, క్లియరెన్స్ వచ్చిన తర్వాత కార్యకలాపాలు ప్రారంభిస్తాం" అని ఇండిగో ప్రతినిధి చెప్పినట్టు ఎన్డీటీవీ పేర్కొంది.
ఇండిగో ప్రతినిధులతో కానీ, డీజీసీఏ ప్రతినిధులతో కానీ బీబీసీ నేరుగా మాట్లాడలేదు.

ఫొటో సోర్స్, Halldor Gudmundsson
ప్రయాణిస్తున్న విమానంపై పిడుగుపడితే?
ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నప్పుడు విమాన ప్రయాణాలకు డీజీసీఏ అనుమతి ఇవ్వదు. అయితే ఒక వేళ విమానం టేకాఫ్ అయ్యేంత వరకు వాతావరణం బాగుండి, తర్వాత మారితే పరిస్థితి ఎలా ఉంటుంది? విమానంపై పిడుగు పడితే దాని ప్రభావం లోపల ఉండే ప్రయాణికులపై ఉంటుందా? అనే అంశంపై గతంలో బీబీసీ కథనం ప్రచురించింది.
ఐస్‌లాండ్ రాజధాని రెయ్క్యావిక్ నుంచి పారిస్‌కు 2016 అక్టోబర్ 3న బయలుదేరిన వావ్ ఎయిర్ విమానానికి పిడుగు తాకింది. అయినా ఎలాంటి సమస్య లేకుండా సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకుంది. విమానానికి ఎలాంటి నష్టం జరగలేదని ఆ సంస్థ బీబీసీకి తెలిపింది.
ఈ దృశ్యాలను ఐస్‌లాండ్‌లోని కెఫ్లావిక్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పని చేస్తున్న హాల్దోర్ గుడ్ముండ్సన్ తన ఫోన్‌లో చిత్రీకరించారు.
"చూడటానికి చాలా ఆసక్తికరంగా అనిపించింది. కానీ కొంచెం భయంగానూ అనిపించింది" అని అప్పట్లో గుడ్ముండ్సన్ చెప్పారు.
పిడుగు పడినా ఏమీకాదంటున్న నిపుణులు
"విమానాలను మెరుపులు తాకడం అరుదైన విషయం కాదు. అయితే సుమారు 1 బిలియన్ జూల్స్ శక్తి ఉన్న పిడుగు, అంటే దాదాపు పావు టన్ను టీఎన్‌టీ పేలుడు శక్తికి సమానమైన దెబ్బను విమానాలు ఎలా తట్టుకుంటాయనే ప్రశ్న ఆసక్తికరంగా ఉంటుంది" అని వావ్ ఎయిర్ ప్రతినిధి చెప్పారు.
"పిడుగు, మెరుపుల వల్ల వచ్చే కరెంట్ విమానం లోపల ఉన్న ప్రయాణికులు, సిబ్బంది, ఎలక్ట్రానిక్ పరికరాలకు చేరకుండా విమానం బయటి పొరను ప్రత్యేకంగా రూపొందిస్తారు" అని రిటైర్డ్ పైలట్, బ్రిటిష్ ఎయిర్‌లైన్ పైలట్స్ అసోసియేషన్ సభ్యుడు క్రిస్ హామండ్ చెప్పారు.
విమానం బయటి కవరింగ్‌లో ఒక లోహపు జాలీ అమర్చి ఉంటుంది. పిడుగు తాకినప్పుడు ఆ విద్యుత్ ఈ లోహపు పొర గుండా ప్రయాణించి బయటకే వెళ్లిపోతుందనీ, దీంతో విమానం లోపల ఉన్న వారికి ఎలాంటి ప్రమాదం జరగదనీ ఆ హామండ్ చెప్పారు.
విమానంలోని ఎలక్ట్రానిక్ పరికరాలు, ఇంధన ట్యాంక్‌కు వెళ్లే కనెక్షన్లు ముఖ్యమైన భాగాలను మెరుపు, పిడుగుల ప్రభావం పడకుండా ప్రత్యేక భద్రతా వ్యవస్థలతో రూపొందిస్తారు. విమానాలు వాస్తవ సర్వీస్‌లోకి వచ్చే ముందు వాటిపై కృత్రిమ మెరుపు, పిడుగులతో పరీక్షలు చేస్తారు.
అంటే, ఒక ఎగిరే ఫారడే కేజ్‌లా విమానం పనిచేస్తుంది. మెరుపు, పిడుగు పడినా దాని వల్ల వచ్చే విద్యుత్ విమానం బయట భాగం గుండా వెళ్లిపోతుందిగానీ లోపల ఉన్న ప్రయాణికులు, సిబ్బంది, పరికరాలకు చేరదు.
ఇప్పుడు ఇండిగో విషయంలో కూడా అదే జరిగి ఉంటుందని వైమానిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అందుకే బయట ఏం జరిగిందో లోపల ఉన్న సిబ్బందికి, ప్రయాణికులకు విమానం దిగేంత వరకు తెలియలేదని అంటున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




























