జెన్ జెడ్, విపక్షాల ఉద్యమం: భారత్‌లో ప్రతిపక్షాల భాష ఎంత వేగంగా మారిందంటే..

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, ఇమ్రాన్ ఖురేషీ
- హోదా, బీబీసీ కోసం
- ప్రచురణ
- చదివే సమయం: 6 నిమిషాలు
దిల్లీలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఆ పార్టీ ఎంపీ ప్రియాంక గాంధీ, ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ, ముంబయిలో కాక్రోచ్ జనతా పార్టీ నేత అభిజిత్ దీప్కే, శివసేన (యూబీటీ) నాయకుడు ఉద్ధవ్ ఠాక్రే నిరసనలు చేస్తున్నారు.
ప్రస్తుతం నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ (సర్)ను రద్దు చేయాలనీ, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని డిమాండ్ చేస్తూ దేశంలోని వివిధ ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో జెన్ జెడ్ యువతతో సహా పలువురు నేతలు నిరసన చేపట్టారు.
గతంలో నీట్ పేపర్ లీక్‌పై కాక్రోచ్ జనతా పార్టీ దిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర నిరసన తెలపగా..దీనికి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది.
గతకొన్ని దశాబ్దాలలో ఏ ఉద్యమ భాష మారనంత వేగంగా గడిచిన కొన్ని నెలల్లో స్వల్ప వ్యవధిలోనే ఈ ఉద్యమ భాష మారినట్లు కనిపిస్తోంది. ఇది చాలా అరుదు.
ఇప్పటి వరకు భారత్ ఎన్నో పెద్ద ఉద్యమాలను చూసింది. ఈ ఉద్యమాలలో చాలా వరకు సమాజంలోని ప్రతి వర్గాన్ని ప్రభావితం చేశాయి. కానీ, ఈసారి ఉద్యమం ఏమైనా భిన్నంగా ఉందా?


ఫొటో సోర్స్, Indranil MUKHERJEE / AFP via Getty Images
రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచిన అభిజిత్ దీప్కే వ్యాఖ్యలు
బస్సులో ఒక యువతిపై జరిగిన అత్యాచారానికి నిరసనగా దిల్లీలో వందలాది మంది యువతీ యువకులు వీధుల్లోకి రావడంతో గత దశాబ్ధంలో ఒక భారీ ఉద్యమం జరిగింది.
దశాబ్దాల నాటి అత్యాచార చట్టాలలో మొట్టమొదటిసారి కీలకమైన మార్పులు రావడానికి ఈ ఉద్యమం దారితీసింది. అదేవిధంగా, గాంధేయవాదిగా చెప్పుకునే ఒక నాయకుని సారథ్యంలో అవినీతికి వ్యతిరేకంగా కూడా ఒక భారీ ఉద్యమం జరిగింది.
అయితే, గత 12 ఏళ్లలో మొదటిసారి అదీ గత మూడు నాలుగు నెలల్లో ప్రతిపక్ష పార్టీకి చెందిన అగ్రనేతలు కూడా చెప్పడానికి సాహసించని మాటలను బహిరంగ వేదికలపై వినిపించాయి. జంతర్ మంతర్, ఇతర ప్రాంతాల్లో ఉన్న సామాన్య యువత ఇలాంటి మాటలను వ్యక్తం చేసింది.
దేశంలో ఏం జరుగుతోంది?
'కాక్రోచ్ జనతా పార్టీ' (సీజేపీ)ని ఏర్పాటు చేసి ఒక్కసారిగా ప్రాచుర్యం పొందిన అభిజిత్ దీప్కే వంటి నాయకులు కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేస్తున్నారు.
గత వారం ముంబయిలోని శివాజీ పార్క్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ.. అభిజిత్ దీప్కే చేసిన వ్యాఖ్యలు అనుభవజ్ఞులైన రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచాయి.
"నేను ఒక పేద తల్లి కొడుకును. మీ వల్ల పిల్లలందరూ పేద తల్లుల కొడుకులుగా మారిపోయారు" అని ఆయన అన్నారు.
ఆ తర్వాత హోంమంత్రి అమిత్ షాను సవాల్ చేస్తూ మరో కామెంట్ కూడా ఆయన చేశారు. తనను అరెస్టు చేయాలని అమిత్ షాకు సవాలు విసిరారు అభిజిత్ దీప్కే. ధర్మేంద్ర ప్రధాన్‌కు పట్టిన గతే అమిత్ షాకు పడుతుందని కూడా అన్నారు.
"యువతలో ఇప్పుడు మార్పు వస్తోంది. ప్రస్తుత సమాజ స్థితిగతులు అలాగే కొనసాగడం పట్లగానీ, ఏం జరిగినా చూస్తూ ఉండిపోయే వైఖరిపట్లగానీ వారు ఇక సంతృప్తిగా లేరు" అని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సంజీవ్ శ్రీవాస్తవ బీబీసీ న్యూస్‌తో అన్నారు.
"భారత్ ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి మార్పునూ కోరుకోని సమాజమని మనం భావించేవాళ్లం. కానీ, గత కొన్ని నెలలుగా ఆ సంప్రదాయం మారుతోంది" అని అన్నారు.

ఫొటో సోర్స్, Imtiyaz Khan/Anadolu via Getty Images
ముందటి ఉద్యమాలతో పోలిస్తే ఇప్పుడెందుకు భిన్నమైంది?
మూడు వ్యవసాయ చట్టాల రద్దును కోరుతూ రైతులు చేపట్టిన నిరసనతో సహా గత 12 ఏళ్లలో జరిగిన నిరసనలన్నీ ప్రధానంగా కొన్ని నిర్దిష్ట వర్గాలకే పరిమితమయ్యాయి.
పంటలకు ప్రభుత్వం కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) కల్పించడం లేదని, దీంతో తాము అంతర్జాతీయ కంపెనీలు, ప్రైవేట్ వ్యాపారుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సి వస్తుందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.
పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏకి) వ్యతిరేకంగా జరిగిన నిరసనలు కూడా ఒకే వర్గానికి పరిమితమయ్యాయి. రైతుల నిరసన మాదిరిగా ఏడాదిపాటు సాగకపోయినా, నాలుగు నెలల పాటు నడిచిందీ ఉద్యమం. కరోనా ఉధృతి కారణంగా నిరసనలో పాల్గొన్న మహిళలు ఉద్యమాన్ని విరమించారు.
అయితే, నేడు కనిపిస్తున్న వ్యత్యాసం దీనికి మించినదని బీబీసీతో సీనియర్ రాజకీయ విశ్లేషకురాలు ఆర్తీ జెరాత్ అన్నారు.
"నేడు వీధుల్లోకి వచ్చిన ప్రజలు బీజేపీకి ఓటు వేసిన వారి పిల్లలే. మధ్యతరగతి, దిగువ మధ్య తరగతికి చెందిన వారి తల్లిదండ్రులు బీజేపీకి ఓటు వేశారు. ఈ వర్గంలో మహిళల ఓట్లు కూడా అధిక సంఖ్యలో ఉన్నాయి. ముఖ్యంగా ఈ మహిళలే నరేంద్ర మోదీకి మద్దతునిచ్చే ప్రధాన శక్తిగా నిలిచారు" అని ఆర్తీ జెరాత్ అన్నారు.
"ఈ ఉద్యమాల్లో పెద్ద సంఖ్యలో పాల్గొన్న మహిళలు ప్రభుత్వాన్ని పూర్తిగా కదిలించారు. ప్రభుత్వం గతంలో ఇతర ఉద్యమాలను సమర్థవంతంగా నిలువరించగలిగింది. కానీ, ఇప్పుడు విద్య, ఉద్యోగాలు, నిరుద్యోగం వంటి ప్రాథమిక అంశాలపై అదే ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు" అని జెరాత్ అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Elke Scholiers/Getty Images
ఆర్తీ జెరాత్ అభిప్రాయంతో రాజకీయ, ఆర్థిక వ్యవహారాలపై విశ్లేషణలు చేసే మరో సీనియర్ వ్యాఖ్యాత మాధవన్ నారాయణన్ కొంతవరకు ఏకీభవిస్తున్నారు.
"మొత్తం రాజకీయ చర్చల్లో బహిరంగంగా మాట్లాడే ధైర్యం క్రమంగా పెరుగుతోంది. దీనికి ఒక కారణం ఏమిటంటే.. సాంకేతికంగా దేశంలో కేవలం బీజేపీ ప్రభుత్వం మాత్రమే కాదు, ఎన్డీయే ప్రభుత్వం అధికారంలో ఉంది. అందువల్ల, ప్రభుత్వ వ్యతిరేక వాతావరణం విషయంలో రాజకీయ వర్గాల్లో ఒక రకమైన ఆశ కనిపిస్తోంది" అని బీబీసీతో మాధవన్ నారాయణన్ అన్నారు.
"కానీ, ఈ వాతావరణంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్య కాంత్ 'కాక్రోచ్' అనే పదాన్ని ఉపయోగించినప్పుడు, అది రాజకీయ చర్చల స్థాయిని మరింత దిగజార్చడాన్ని మనం చూశాం. జెన్ జెడ్ తరం వారి సున్నితమైన అంశాన్ని ఆయన ప్రస్తావించారు. అదే సమయంలో, నీట్ పరీక్షలో పేపర్ లీక్ విషయం కూడా తెరపైకి వచ్చింది. ఈ రెండు అంశాలు రెండు సున్నితమైన విషయాలను తాకాయి. అంతేకాకుండా, యువత, దిగువ మధ్యతరగతి వర్గాలలో నిజమైన ఆందోళన ఉంది. దిగువ మధ్యతరగతి వర్గం కోపంగా ఉన్నప్పుడు రాజకీయాలు ఎప్పుడూ కీలకమైన మలుపు తీసుకుంటాయి. ఈ ఆగ్రహానికి అభిజీత్ దీప్కే రూపంలో ఒక మార్గం దొరికింది" అని మాధవన్ నారాయణన్ అన్నారు.
వీటన్నింటితో పాటు, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ కూడా కొన్ని మౌలిక ప్రశ్నలను లేవనెత్తిందని నారాయణన్ అన్నారు.
13 కోట్ల మంది ఓటర్ల ఓటు హక్కును తొలగించడం, ఆ అంశం ప్రాథమిక హక్కులతో ముడిపడి ఉండటం వల్ల ఈ ప్రశ్న తలెత్తిందని ఆయన పేర్కొన్నారు.
"ఇది సమాజంలో ఈ ఉద్యమానికి మరింత ఆమోదాన్ని అందిస్తోంది. ఫలితంగా, భాషలో మరింత సూటిదనం, స్పష్టత వచ్చింది. డిమాండ్లలోనూ, వాటిని వ్యక్తీకరించే భాషలోనూ ఈ మార్పు కనిపిస్తోంది" అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Arun SANKAR / AFP via Getty Images
ఇలాంటి ఉద్యమాలు దేశంలో రాజకీయాల్లో మార్పు తీసుకు రాగలవా?
''జెన్ జెడ్ లేదా జెన్ ఆల్ఫా అని పిలిచే ఈ కొత్త జనరేషన్.. ఇప్పుడున్న నిబంధనలను సవాల్ చేస్తోంది" అని సంజీవ్ శ్రీవాస్తవ అన్నారు.
"మీకు ఈ మార్పు కనిపిస్తుంది. అనుభవమవుతుంది కూడా. దీని వెనుక సామాజిక, ఆర్థిక కారణాలు ఉన్నాయి. పురోగతిపై ఆశ, నిరాశ ఇలా అన్నీ ఇందులో ఇమిడి ఉన్నాయి" అని ఆయన అన్నారు.
"ఇప్పుడు యువత తమ సొంత నిబంధనలను నిర్దేశించుకుంటోంది. అయితే, దీని గురించి ఇప్పుడే ఏదైనా చెప్పడం తొందరపాటు అవుతుంది" అని సంజీవ్ శ్రీవాస్తవ చెప్పారు.
ఈ పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో ప్రభుత్వానికి అర్థం కావడం లేదని ఆర్తీ జెరాత్ అన్నారు.
'జెన్ జెడ్'తో అనుసంధానం అయ్యేందుకు అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమె భావిస్తున్నారు. ఉదాహరణకు, ఆర్‌ఎస్‌ఎస్ అటువంటి ప్రయత్నమే చేస్తోంది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా జెన్ జెడ్ తరాన్ని ఆకర్షించే ప్రణాళికలను ప్రకటించారు.
"ప్రభుత్వం దీనిని ఎలా అడ్డుకోగలదో నాకు నిజంగా తెలియదు. నేను ఒకటి చెప్పగలను. వచ్చే ఏడాది కొన్ని ఎన్నికలు జరగబోతున్నాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ ఎన్నికలు ఉన్నాయి. బీజేపీ, ప్రతిపక్షాల సమర్థతను అంచనా వేయడానికి ఈ ఎన్నికలు అసలైన పరీక్షని నేను అనుకుంటున్నా. ఒక అభిప్రాయానికి రావడానికి ముందు మనం ఈ ఎన్నికల్లో ఏం జరుగుతుందో చూడాలి'' అని ఆర్తీ జెరాత్ అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























