ప్రాణభయంతో ఎర్ర సముద్రం దాటి పారిపోతున్నారు

సౌదీ అరేబియా, హూతీలు, మధ్యప్రాచ్యం, యుద్దం, యెమెన్

ఫొటో సోర్స్, Frank Gardner/ BBC

ఫొటో క్యాప్షన్, ‘మా దేశంలో శాంతి నెలకొంటే మేము తిరిగి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాం’ అని అయిషా అబ్దుల్కాదిర్ మహమ్మద్ అంటున్నారు.
    • రచయిత, ఫ్రాంక్ గార్డనర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 5 నిమిషాలు

యాభై ఏళ్ల ఇబ్రహీం ఇస్సా యెమెన్ తీర ప్రాంతం ధుబాబ్‌‌కి చెందిన వారు. యెమెన్ హూతీలకు, సౌదీ మద్దతు గల బలగాలకు మధ్య జరుగుతున్న యుద్ధంలో ముందువరుసలో ఉందీ పట్టణం.

ప్రస్తుతం ఉత్తర జిబూటీలోని ఒబాక్‌ సమీపంలోని మార్కాజీ శిబిరంలో ఆయన తన కుటుంబంతో కలిసి ఆశ్రయం పొందుతున్నారు. రెండు వైపులా తెరిచి ఉంచిన విశాలమైన గోదాం లోపల టార్పాలిన్‌పై కూర్చొని ఉన్నారాయన. చిన్నచిన్న పడవల్లో బాబ్ అల్- మండబ్ జలసంధిని దాటుకొని వస్తున్న వారితో ఈ శిబిరం కిక్కిరిసిపోతోంది.

సముద్రాన్ని దాటిన తర్వాత, యెమెన్ శరణార్థులు ట్రక్కుల్లో, కాలినడకన ఈ శిబిరానికి చేరుకుంటున్నారు. ఈ శిబిరాన్ని స్థానిక ప్రభుత్వంతో కలిసి ఐక్యరాజ్యసమితి నిర్వహిస్తోంది.

'నా పిల్లలు భయంతో అరుస్తూ, వణికిపోతుంటే అక్కడ ఊరికే ఎలా కూర్చోగలను?' అని ఇబ్రహీం ఇస్సా ప్రశ్నిస్తున్నారు.

" విమానాల శబ్ధాలు వినగానే పిల్లలు భయంతో గట్టిగా అరుస్తున్నారు. తల్లిదండ్రులుగా ఇది మా బాధ్యత. దీన్ని చూసిన తర్వాత మేం ఏం చేయగలం? వారిని రక్షించుకోవడానికే మేం పారిపోయి వస్తున్నాం' అని ఆయన చెప్పారు.

తన కుటుంబాన్ని యెమెన్‌ నుంచి తీసుకురావడానికి సరిపడా పెద్ద పడవ మత్స్యకారుడైన ఇస్సా వద్ద అప్పటికే ఉండేది.

ఇస్సా తన కుటుంబంతోపాటు తాము పెంచుకున్న మేకలనూ తీసుకొచ్చారు. ఇప్పుడు శిబిరం చుట్టుపక్కల వంటగ్యాస్ క్యాన్‌లు, ఖాళీ ప్లాస్టిక్‌ సీసాల మధ్య ఆహారం కోసం ఆ మేకలు వెతుకుతున్నాయి.

మరికొన్ని కుటుంబాలు చిన్న చిన్న మూటలతో సామగ్రిని యెమెన్‌ నుంచి తెచ్చుకున్నాయి. ఒక కుటుంబమైతే తమతోపాటు జెరాక్ షీషాపైప్(హుక్కా)ను తీసుకొచ్చింది. మరికొందరు కట్టుబట్టలతో ఈ శిబిరానికి చేరుకున్నారు.

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
సౌదీ అరెబియా, హూతీలు, మధ్యప్రాచ్యం, యుద్దం,యెమెన్

ఫొటో సోర్స్, Ed Habershon/ BBC

ఫొటో క్యాప్షన్, ఇబ్రహీం ఇస్సా తన కుటుంబం, మేకలతో పాటు ఓ బోటెక్కి తప్పించుకున్నారు

గత కొద్ది రోజుల్లోనే దాదాపు 3,000 మంది యెమెన్ శరణార్థులు తమ కుటుంబాలతో ఇక్కడకు చేరుకున్నారు. ఎర్ర సముద్రం ప్రాంతంలో అకస్మాత్తుగా చెలరేగిన అలజడి కారణంగా దాదాపు 1,20,000 మంది యెమెన్ ప్రజలు నిరాశ్రయులయ్యారని ఐక్యరాజ్యసమితి అంచనా వేస్తోంది.

ఏడాది క్రితమే యెమెన్‌లోని కీలక ప్రాంతాలను తమ ఆధీనంలోకి తెచ్చుకున్న హూతీలు ఈ నెలలో తీరం వెంబడి బాబ్ అల్ మండెబ్ దిశగా దూసుకెళ్తున్నారు. ఇది దక్షిణ ఎర్రసముద్రం, గల్ఫ్ ఆఫ్ ఏడెన్, విశాలమైన హిందూ మహాసముద్రాలను కలిపే ఒక కీలకమైన సముద్రమార్గం.

అంతర్జాతీయ గుర్తింపు పొందిన యెమెన్‌ ప్రభుత్వానికి సౌదీ అరేబియా మద్దతుగా నిలుస్తోంది. హూతీలు నియంత్రణలోకి తీసుకుంటున్న ప్రాంతాలపై వైమానిక దాడులు చేస్తోంది. హూతీలు కూడా డ్రోన్లు, మిస్సైల్స్‌తో నైరుతి సౌదీ అరేబియాపై విరుచుకుపడుతున్నారు.

'ఏ పక్షం నుంచి దాడులు జరుగుతున్నాయనేది మాకు సంబంధం లేదు' అని శిబిరంలో ఉన్న వారంతా అరబిక్ భాషలో గట్టిగా చెప్పారు. 'మా చుట్టూ పడుతున్న బాంబుల వల్లే మేం పారిపోవాల్సి వచ్చింది'అని స్పష్టం చేశారు.

యెమెన్‌కు సరిగ్గా సముద్రం అవతలవైపు ఉన్న జిబూటి ఒకప్పటి ఫ్రెంచ్ కాలనీయే. హూతీలు, యెమెన్‌ ప్రభుత్వం మధ్య జరుగుతున్న యుద్ధంలో జోక్యం చేసుకునే ఉద్దేశం లేదని ఆ దేశం(జిబూటి) స్పష్టం చేస్తోంది.

ఆఫ్రికాలోనే అత్యంత సైనిక శక్తి కలిగిన దేశాల్లో జిబూటి ఒకటి. 2003 నుంచి అమెరికా ఇక్కడ క్యాంప్ లెమొనియర్ అనే ఒక భారీ సైనిక స్థావరాన్ని నిర్వహిస్తోంది. గతంలో ఈ స్థావరం ఫ్రాన్స్‌కు చెందిన ఫ్రెంచ్ ఫారిన్ లెజియన్ కేంద్రంగా సేవలందించింది.

మార్కాజీ శిబిరంలో నేను మాట్లాడిన వారిలో ఖాసిం అబ్రహం అబ్సీ ఒకరు. ఆయన వయసు 100 సంవత్సరాలుగా గుర్తింపు కార్డులో ఉంది.

'మేం ఇక్కడికి రావడానికి కారణం ఏంటి? 'అని ఆయన ప్రశ్నించారు.

'ఆ విమానాలే, ఆ విమాన శబ్దాలే. మా పిల్లల కోసం మేం పారిపోయేలా చేశాయి. మా గుండెలు రగిలిపోతున్నాయి. అవి ఏ వర్గానివో మాకు తెలియదు. కానీ పర్వతాల్లో, రోడ్లపై ఇలా అన్ని చోట్లా హూతీలు ఉన్నారు. అందుకే ఆ విమానాలు ఎక్కడపడితే అక్కడ బాంబులు వేస్తున్నాయి' అని చెప్పారాయన.

సౌదీ అరెబియా, హూతీలు, మధ్యప్రాచ్యం, యుద్దం,యెమెన్

ఐక్యరాజ్యసమితి శరణార్థుల సంస్థ (యూఎన్‌హెచ్‌ఆర్‌సీ) ఏర్పాటు చేసిన గుడారాల దగ్గర, 37 డిగ్రీల సెల్సియస్ ఎండలో నేను ఏడెన్‌కు చెందిన 63 ఏళ్ల మహమ్మద్ అబ్దుల్లాను కలిశాను.

మహమ్మద్‌ 2015 నుంచే శిబిరంలో ఉంటున్నారు. నాటి అధ్యక్షుడు అబ్దరబ్బు మన్సూర్ హాదీ, తీలకు యుద్ధం ప్రారంభమైనప్పుడే ఆయన పారిపోయి జిబూటికి వచ్చారు.

అప్పటి నుంచి మహమ్మద్‌ ఈ శిబిరంలోనే ఉంటున్నారు. అయితే మేం మాట్లాడుతుండగా, తన దేశం ఎదుర్కొంటున్న దుస్థితిని వివరిస్తూ ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు.

'ఈ గుడారంలో ఉన్న చాలా మంది ప్రజలు అత్యంత దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నారు. వారి బాధ నా మనసును కలచి వేస్తోంది. అలాంటి నా ప్రజలను కన్నీళ్లు ఆగడం లేదు. మా గోస వినాలని స్వచ్ఛంద సంస్థలను, జిబూటి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. మాకు ఆశ్రయమిచ్చినందుకు వారికి ధన్యవాదాలు' అని చెప్పారు.

వారు ఎంత కాలం ఇక్కడ ఉంటారనే విషయం జరుగుతున్న యుద్ధంపై ఆధారపడి ఉంది. 2014 నుంచి భయంకరమైన అంతర్యుద్ధాలతో యెమెన్ అతలాకుతలమవుతోంది. వేల మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షల మంది నిరాశ్రయులయ్యారు.

సౌదీలు, హూతీల మధ్య 2022లో ఐక్యరాజ్యసమితి మధ్యవర్తిత్వంలో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ఇటీవల కాలంలో ఘోరంగా విఫలమైంది. ఇరు పక్షాలు క్షిపణులు, డ్రోన్లతో, వైమానిక దాడులు చేసుకుంటున్నాయి.

సౌదీ అరెబియా, హూతీలు, మధ్యప్రాచ్యం, యుద్దం,యెమెన్

ఫొటో సోర్స్, Ed Habershon/ BBC

ఫొటో క్యాప్షన్, తీవ్రమైన సంఘర్షణ కారణంగా 1,20,000 మందికి పైగా యెమెన్ ప్రజలు నిరాశ్రయులయ్యారని అంచనా.

యెమెన్ యుద్ధం తమకు సంబంధం లేని అంశంగా చాలా మందికి అనిపించవచ్చు. కానీ బాబ్ అల్- మండబ్ జలసంధి ద్వారా సౌదీ అరేబియా చమురు రవాణాకు ఆటంకం ఏర్పడితే మాత్రం దీనిపై విస్తృతంగా చర్చ జరుగుతుంది. అయితే ఈ యుద్ధం కారణంగా నష్టపోతున్న సాధారణ ప్రజలకు గుర్తింపు లభించడం లేదు.

చుట్టూ ఉన్న గందరగోళం మధ్య, టార్పాలిన్‌పై తన భార్య పక్కన కూర్చున్న ఖాసిం అబ్సీ, జిబూటిలోని భద్రతను వదిలి వెళ్లడానికి సంకోచిస్తున్నారు. 'యుద్ధం ఇలాగే కొనసాగితే మేం తిరిగి వెళ్లేది లేదు. ఎందుకంటే ఇక్కడ మేం ప్రశాంతంగా ఉన్నాం' అన్నారు.

ఆయన భార్య, ఈషా అబ్దుల్లా కూడా దీంతో ఏకీభవించారు.

'మా దేశంలో శాంతి నెలకొంటే కచ్చితంగా వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉన్నాం. అక్కడ శాంతి నెలకొనాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నాం. మాకు కావాల్సింది శాంతి, మా పిల్లల భవిష్యత్. వారికి మొదట భద్రత, తర్వాత ఆహారం, నీరు, చదువు లభిస్తే చాలు' అని ఆమె ఆశ పడుతున్నారు.

"మీరే చూస్తున్నారు కదా, కట్టుబట్టలతోనే మేం పారిపోయి వచ్చాం. ఎందుకంటే అక్కడ(యెమెన్) శాంతి లేదు" అని ఆవేదన వ్యక్తం చేశారు.

సౌదీ అరెబియా, హూతీలు, మధ్యప్రాచ్యం, యుద్దం,యెమెన్

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)