సౌదీ అరేబియాలోని పలు ప్రాంతాలపై దాడులు చేశామన్న హూతీ తిరుగుబాటు దళాలు, అసలేం జరుగుతోంది?

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, పాట్రిక్ జాక్సన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 5 నిమిషాలు
సౌదీ అరేబియా రాజధాని రియాద్‌తో పాటు ఎర్ర సముద్ర తీరంలోని ఇంధన కేంద్రాలను డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులతో లక్ష్యంగా చేసుకున్నట్లు యెమెన్‌లోని ఇరాన్ మద్దతుగల హూతీ తిరుగుబాటుదారులు ప్రకటించారు.
శనివారం రియాద్ వైపు ప్రయోగించిన ఒక బాలిస్టిక్ క్షిపణిని అడ్డుకుని ధ్వంసం చేసినట్లు సౌదీ అధికారులు తెలిపారు. అయితే, వారు మరే ఇతర దాడిని గానీ, ప్రాణ, ఆస్తి నష్టాలను గానీ ధ్రువీకరించలేదు.
అంతకుముందు శనివారం నాడు రియాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని ఇంధన ట్యాంకుల నుంచి దట్టమైన నల్లటి పొగలు రావడం కనిపించింది. దీనివల్ల కాసేపు విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది.
జులైలో సౌదీ అరేబియాపై ఇరాన్ మద్దతుగల హూతీ తిరుగుబాటుదారులు దాడులను తీవ్రతరం చేసినప్పుడు, తొలిసారిగా రాజధానిలో వైమానిక దాడుల హెచ్చరిక సైరన్లు మోగాయి.
ఈ దాడులపై స్పందించిన తుర్కియే.. అవసరమైతే సౌదీ అరేబియాకు సైనిక సహాయం అందిస్తామని పేర్కొంది.

"మధ్యప్రాచ్యంలో ఉన్న అమెరికా పౌరులు అప్రమత్తంగా ఉండాలని, కొన్ని విమానాల రద్దు, ఇతర ప్రయాణ ఆటంకాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని" అమెరికా విదేశీ వ్యవహారాల శాఖ తన పౌరులను కోరినట్టు బీబీసీ ప్రతినిధి పాట్రిక్ జాక్సన్ తెలిపారు.
"ఇరాన్ మద్దతుగల హూతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాపై సైనిక చర్యకు దిగారు. పౌర విమానాశ్రయాలను కూడా లక్ష్యంగా చేసుకున్నారు. ఈ సైనిక ఘర్షణ తీవ్రరూపం దాల్చే అవకాశం ఉంది"అని అమెరికా విదేశీ వ్యవహారాల శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
"ఈ ప్రాంతంలో, ఈ మార్గం గుండా చేసే ప్రయాణాల గురించి అమెరికా పౌరులు తీవ్రంగా పునరాలోచించుకోవాలి" అని కూడా సూచించింది.

ఫొటో సోర్స్, AFP via Getty Images
సౌదీ అరామ్‌కో స్థావరాలు లక్ష్యంగా..
బిషా, తాయిఫ్, ఫరాసాన్, యన్‌బూ నగరాల్లో "పౌరులను లక్ష్యంగా చేసుకునే శత్రువుల ప్రయత్నాలను" ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ధీటుగా ఎదుర్కొందని సౌదీ నేతృత్వంలోని కూటమి అధికారిక ప్రతినిధి ఒక ప్రకటనలో చెప్పారు.
ఎర్ర సముద్ర తీరంలో ఉన్న ప్రభుత్వ చమురు సంస్థ సౌదీ అరామ్‌కో(గ్యాస్ సంస్థ)కు చెందిన యన్బూలోని సదుపాయాలు, రియాద్‌లోని సున్నితమైన ప్రాంతాలపై దాడి చేయడానికి "పెద్ద సంఖ్యలో బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులు, డ్రోన్లను" ఉపయోగించినట్లు హూతీ మిలిటరీ ప్రతినిధి యాహ్యా అల్-సరియా ఆన్‌లైన్ ప్రకటనలో పేర్కొన్నారు.
"యెమెన్ రాజధాని సనాను లక్ష్యంగా చేసుకుని సౌదీ శత్రువులు చేస్తున్న నేరపూరిత ప్రయత్నాలకు ప్రతీకారంగానే" ఈ దాడులు చేసినట్లు ఆయన తెలిపారు. సనా ప్రస్తుతం హూతీ తిరుగుబాటుదారుల నియంత్రణలో ఉంది.
గతవారంలో యెమెన్‌లో సౌదీ అరేబియా 300 వైమానిక దాడులు చేసిందని అల్-సరియా అంతకుముందు ఆరోపించింది.
అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన యెమెన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హూతీ తిరుగుబాటుదారులు అంతర్యుద్ధం చేస్తున్నారు. ఈ ప్రభుత్వానికి సౌదీ అరేబియా మద్దతు ఉంది.
ఇటీవలి నెలల్లో సౌదీ అరేబియాలో పలు స్థావరాలపై హూతీ తిరుగుబాటుదారులు దాడులు చేశారు. యెమెన్‌పై ఎగురుతున్న ఒక సౌదీ యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్లు కూడా ఈ వారంలోనే వారు ప్రకటించారు.
హూతీ తిరుగుబాటుదారులు, సౌదీ మద్దతుగల ప్రభుత్వ బలగాల మధ్య జరిగిన పోరులో శనివారం 48 మంది మరణించారని యెమెన్ అంతర్యుద్ధంలో పాల్గొన్న ఇరుపక్షాల సైనిక వర్గాలను ఉటంకిస్తూ ఏఎఫ్‌పీ వార్తాసంస్థ రిపోర్ట్ చేసింది.
తమ ఫైటర్లు 31 మంది చనిపోయినట్లు హూతీ తిరుగుబాటుదారులు చెప్పగా.. తమ వైపు 17 మంది సైనికులు మరణించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయని ఏజెన్సీ పేర్కొంది. అయితే, ఈ వివరాలను ఏజెన్సీ ధ్రువీకరించలేదు.
ఇటీవలి ఘర్షణల కారణంగా నిర్వాసితులైన వారి సంఖ్య 1,04,796 దాటినట్లు ఐక్యరాజ్యసమితి సంస్థ 'ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ (ఐఓఎం)' శుక్రవారం వెల్లడించింది.
'అలారం విన్నాను, ఆ తర్వాత కిటికీలు దద్దరిల్లాయి'
శనివారం రియాద్‌లో పలు పేలుళ్ల లాంటి శబ్దాలు వినిపించాయి. కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సమస్యలు తలెత్తినట్లు వార్తలు వచ్చాయి.
విమానాల రాకపోకలను పర్యవేక్షించే వెబ్‌సైట్ ఫ్లైట్‌రాడార్24 ప్రకారం, పలు విమానాలు ఆలస్యంగా నడిచాయి. కొన్ని రద్దయ్యాయి.
అరామ్‌కోకు చెందిన ఒక ఇంధన ట్యాంకులో చెలరేగిన మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నట్లు కనిపించారని ఏఎఫ్‌పీ జర్నలిస్ట్ ఒకరు తెలిపారు.
సౌదీ సివిల్ డిఫెన్స్ రాత్రి వేళ రియాద్‌తో పాటు దేశంలోని ఇతర ప్రాంతాలలో సంభవించగల ముప్పు గురించి మొబైల్ ఫోన్లకు అలర్ట్‌లు పంపింది. శనివారం ఉదయం తర్వాత ముప్పు తొలగిపోయినట్లు సందేశం జారీ చేసింది.
అలర్ట్ వచ్చిన తర్వాత నగరంలో వరుసగా పలు పేలుళ్ల శబ్దాలు విన్నట్లు రియాద్‌లోని కొందరు స్థానికులు పేరు బయటపెట్టకూడదనే షరతుపై ఏఎఫ్‌పీకి తెలిపారు.
"నేను అలారం విన్నాను, ఆ వెంటనే నా కిటికీలు దద్దరిల్లాయి. ఇది నిజంగా భయానకంగా ఉంది. నేను దీనిని ఊహించలేదు" అని రియాద్ ఉత్తర భాగంలో నివసించే 27 ఏళ్ల యువకుడు అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
కీలకమైన ఓడరేవు నగరం మోఖా, పెరిమ్ దీవిని హూతీ తిరుగుబాటుదారులు ఇటీవల వ్యూహాత్మకంగా ఆధీనంలోకి తీసుకున్నారు. ఆసియా, ఐరోపాలకు చమురు ఎగుమతి చేయడానికి గల్ఫ్ దేశాలు ఉపయోగించే కీలక సముద్ర మార్గ ప్రవేశద్వారం వద్ద ఈ దీవి ఉంది.
వాయువ్య యెమెన్‌లో హూతీల ఆధీనంలోని ఓడరేవులు, విమానాశ్రయాలను సౌదీ అరేబియా దిగ్బంధించడానికి ప్రతీకారంగానే ఈ మార్గాన్ని దిగ్బంధించినట్టు హూతీ తిరుగుబాటుదారులు చెప్పారు.
ఇరాన్‌తో అమెరికా, ఇజ్రాయెల్ సాగిస్తున్న యుద్ధం కారణంగా హార్ముజ్ జలసంధి మూసుకుపోవడంతో, చమురు ఎగుమతుల కోసం సౌదీ నౌకలు ఎర్ర సముద్రంలోని ఇదే భాగంపై ఆధారపడుతున్నాయి.
ఈ యుద్ధం చమురు ధరలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో అంచనా వేయడం తమకు కష్టంగా మారిందని ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ సంస్థ జేపీ మోర్గాన్ శుక్రవారం తెలిపింది.
"దీని తుది ఫలితం ఏమిటన్నది మాకు నిజంగా తెలియదు, అందుకే మేం దీనిని అంచనా వేయలేకపోతున్నాం" అని పెట్టుబడిదారులకు పంపిన ఒక నోట్‌లో బ్యాంక్ పేర్కొంది.

ఫొటో సోర్స్, Mohammed HUWAIS / AFP via Getty Image
'మక్కా ఒప్పందం' కింద సాయం: తుర్కియే
హూతీ తిరుగుబాటుదారుల దాడుల నేపథ్యంలో సౌదీ అరేబియాకు కొన్ని సైనిక అవసరాలు ఉండొచ్చని తుర్కియే విదేశాంగ మంత్రి హకాన్ ఫిదాన్ శనివారం తెలిపారు. 'మక్కా ఒప్పందం' పరిధిలో ఆ అవసరాలను తుర్కియే పరిశీలిస్తోందని చెప్పారు.
"సౌదీ అరేబియా ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికారంపై తీవ్ర దాడులు జరగడాన్ని గమనిస్తున్నాం. మాకు ఒక కూటమి ఒప్పందం ఉంది, ఈ అంశంపై మేం ఒక్కటిగానే ఉన్నాం. వారికి కొన్ని సైనిక అవసరాలు ఉండొచ్చు. ముఖ్యంగా కొన్ని సాంకేతిక విషయాలకు సంబంధించి ఆ అవసరాలను తీర్చడంలో మాకు ఎలాంటి ఇబ్బందీ ఉండదు" అని ఎన్‌టీవీతో మంత్రి ఫిదాన్ చెప్పారు.
అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో సౌదీ అరేబియాను లాగకూడదని తుర్కియే మంత్రి సూచించారు. ఈ ఘర్షణలో పాల్గొనాలని సౌదీ కోరుకోవడం లేదన్నారు.
''ఈ సంక్షోభాన్ని కొంతకాలం వరకు సహించగలిగాం. కానీ ఇప్పుడు దీని వల్ల కలుగుతున్న ఆర్థిక పరిణామాలు భరించలేనంతగా మారుతున్నాయి'' అని ఫిదాన్ అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




























