స్మిత్ మచ్చర్: ‘ఆ పని చేయకపోతే నేను చచ్చిపోతానని తెలుసు’- నెతన్యాహుతో ఫ్లై దుబయ్ కెప్టెన్ ఇంకా ఏం చెప్పారు?

ఫొటో సోర్స్, ANI
ఫ్లై దుబయ్ విమానం ఘటన తర్వాత ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యారు భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్. తాజాగా ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు ఆయనతో ఫోన్‌లో మాట్లాడారు.
సెప్టెంబర్ 30 నాటి ఘటనలో స్మిత్ చూపిన ధైర్యాన్ని ఈ సందర్భంగా నెతన్యాహు మెచ్చుకున్నారు. ‘భారతదేశానికి, ఇజ్రాయెల్‌కు, యావత్ ప్రపంచానికీ హీరో’ అని స్మిత్‌ను అభివర్ణించారు నెతన్యాహు.
ఫోన్ సంభాషణలో ఈ సంఘటన గురించి కెప్టెన్ స్మిత్, నెతన్యాహుల మధ్య చర్చ జరిగింది.
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయం వారి సంభాషణల వీడియోను పోస్ట్ చేసింది .
విమాన ప్రయాణంలో ఏం జరిగిందో, కాక్‌పిట్ తలుపు తెరిచి పరిస్థితిని ఎలా చక్కదిద్దడానికి ప్రయత్నించారో స్మిత్ ఆయనకు చెప్పారు.


ఫొటో సోర్స్, Jack GUEZ / AFP via Getty Images
నెతన్యాహు స్మిత్‌తో ఏమన్నారు?
"కెప్టెన్, మా రాబోయే స్వతంత్ర దినోత్సవంనాడు ఒక ప్రత్యేక జ్యోతిని వెలిగించడానికి మిమ్మల్ని, నా ప్రియ మిత్రుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానించాలనుకుంటున్నా. మీరు భారతదేశానికి, ఇజ్రాయెల్‌కు, యావత్ ప్రపంచానికి నిజమైన హీరో. మీరు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను" అని నెతన్యాహు తన ఫోన్ సంభాషణలో అన్నారు.
విమానంలో ఏం జరిగిందో స్మిత్‌ను అడిగి తెలుసుకున్నారు నెతన్యాహు.
అదొక ఒక మామూలు ప్రయాణమేనని స్మిత్ అన్నారు. అయితే, ప్రార్థన చేసుకోవాలని కో-పైలట్ అడిగారని, తనకది అసాధారణంగా ఏమీ అనిపించలేదని స్మిత్ చెప్పారు.
"ఆయన (కో-పైలట్) ప్రార్థన చేస్తుండగా వెనక్కి కాకుండా గౌరవంతో ముందుకు చూస్తున్నా. మూడు నాలుగు నిమిషాల తర్వాత నా తల వెనుక భాగంలో గట్టి దెబ్బ తగిలినట్లు అనిపించింది" అని స్మిత్ చెప్పారు.
మొదట్లో విమానానికి ఏదో అయ్యిందని భావించానని, తర్వాత ఆ దెబ్బలు కొనసాగుతుండంతో అది విమానానికి జరిగిందికాదని అర్థమైందని, కాక్‌పిట్‌లో ఉన్న మరొక వ్యక్తే తనపై దాడి చేశారని గ్రహించినట్లు స్మిత్ వెల్లడించారు.
"నేను ఆయన్ను ఆపడానికి ప్రయత్నించా. కానీ మొదట్లో అయిన గాయాల వల్ల నాకు దాదాపు ఏమీ కనిపించలేదు. నా చూపు పూర్తిగా మసకబారింది. ఆ సమయంలో విమానం వేగంగా కిందకు పడిపోతోందనేది నాకు అర్థమైంది. అప్పుడు ఏం జరిగిందో నాకు సరిగా గుర్తుకు రావడం లేదు" అని స్మిత్ అన్నారు.

ఫొటో సోర్స్, @IsraelMFA
'నేను ఆ పని చేయకపోతే చనిపోతానేమో అనుకున్నా'
కాక్‌పిట్ తలుపు తెరవడానికి ప్రయత్నించానని, కానీ అది గడియపెట్టి ఉందని కెప్టెన్ స్మిత్ చెప్పారు. ఆ తర్వాత ఆయన కాక్‌పిట్ నేలపై పడుకున్నారు. విమానం ఊగిపోతుండటం, హోరున వీస్తున్న గాలి, ప్రయాణికుల అరుపులు తనకు వినిపించాయని ఆయన అన్నారు.
''చివరి ప్రయత్నం చేయడానికి నాలో ఇంకా శక్తి మిగిలి ఉంది. దాన్ని వ్యక్తిగత పోరాటం అనండి, ప్రజల కోసం పోరాటం అనండి, నేను అది చేయకపోతే చనిపోతానని నాకు అర్థమైంది. నా శక్తినంతా కూడగట్టుకుని, తలుపు దగ్గరకు వెళ్లి దాన్ని తెరిచా" అని స్మిత్ చెప్పారు.
''అదృష్టవశాత్తు డోర్ దగ్గర జనం ఉన్నారు. వారు పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు, ఇక మిగిలినది మీకు తెలిసినదే" అన్నారు స్మిత్.
కాక్‌పిట్ తలుపు ఎలా తెరిచారని నెతన్యాహు స్మిత్‌ను అడిగారు.
తలుపును లోపలి నుంచి తెరవాలంటే దాని నాబ్‌ను తిప్పాల్సి ఉంటుందని, బయటి నుంచి అయితే కోడ్ ద్వారా తెరవవచ్చని స్మిత్ చెప్పారు.
''బయటి నుండి నా సహోద్యోగులు కోడ్‌తో తలుపు తెరవడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఆ వ్యక్తి (కో-పైలట్) తలుపు తెరుచుకోకుండా అడ్డుపడుతున్నారు. తలుపు తెరవడానికి ఉన్న ఏకైక మార్గం అక్కడికి చేయిచాచి దాని నాబ్‌ను తిప్పడమే. తలుపు తెరవాలంటే, దాన్ని కొంచెం వేగంగా తిప్పాలి. నా చేయి ఆ నాబ్‌కు చేరగానే, దాన్ని తిప్పి తలుపు తెరిచా" అన్నారాయన.

ఫొటో సోర్స్, DPR PMO/ANI
ఇజ్రాయెల్‌కు ఆహ్వానం
కెప్టెన్ స్మిత్ మాటలు విన్న తర్వాత ఆయన ధైర్యాన్ని ప్రశంసిస్తూ, స్మిత్ అనేకమంది ప్రాణాలను కాపాడటమే కాకుండా, క్లిష్ట పరిస్థితిలో అద్భుతమైన ధైర్యంసాహసాలు ప్రదర్శించారని నెతన్యాహు అన్నారు.
"మీరు ఎన్నో ప్రాణాలను కాపాడారు. అంతకంటే గొప్పదాన్ని మీరు కాపాడారని నేను అనుకుంటున్నా. ఎంత ప్రమాదకరమైనా, హింసాత్మకమైనా సరే, ధైర్యవంతులైన పైలట్లు, ప్రయాణికులు ఎలాంటి చెడునైనా ఎదుర్కొని ఓడించగలరనే ప్రపంచ విశ్వాసాన్ని కూడా మీరు కాపాడారు" అని నెతన్యాహు అన్నారు.
"దీనిని ప్రపంచవ్యాప్తంగా ప్రశంసిస్తున్నారు. మీరు ఇజ్రాయెల్ హీరో. భారతదేశపు హీరో. మీరు యావత్ ప్రపంచానికే హీరో. ఇక్కడి ప్రజలు మిమ్మల్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తారని నేను మీకు చెబుతున్నా" అన్నారు నెతన్యాహు.
సంభాషణ సందర్భంగా, కెప్టెన్ స్మిత్ విమానంలోని ఒక దంతవైద్యుడి గురించి కూడా ప్రస్తావిస్తూ, తన ప్రాణాలను కాపాడటంలో ఆయన కీలక పాత్ర పోషించారనీ, ఆయన్ని కలవాలనుకుంటున్నానని చెప్పారు.
కెప్టెన్ స్మిత్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీలను కూడా ఇజ్రాయెల్ సందర్శనకు ఆహ్వానించారు నెతన్యాహు.
‘‘ఈ ప్రత్యేక సందర్భంలో మాకు గొప్ప స్నేహితులైన కెప్టెన్ స్మిత్, ప్రధానమంత్రి మోదీలు ఒక ప్రత్యేక జ్యోతిని వెలిగించాలని నేను కోరుకుంటున్నా. మా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మేం అందించగల అత్యున్నత గౌరవం ఇది. సాధారణంగా ఇది ఇజ్రాయెల్ పౌరులకు మాత్రమే ఇస్తారు. కానీ ఈ సందర్భంలో ఇజ్రాయెల్ పౌరులందరూ మిమ్మల్ని స్వాగతిస్తారని నేను నమ్ముతున్నా’’ అని నెతన్యాహు అన్నారు.
''మిమ్మల్ని త్వరలోనే ఇజ్రాయెల్‌లో చూడాలని కోరుకుంటున్నా" అని అన్నారు నెతన్యాహు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























