గిన్నిస్ రికార్డ్ కోసం 168 గంటల పాటు డాన్స్ చేసిన నైజీరియన్, భారతీయ మహిళ రికార్డ్ బ్రేక్ అవుతుందా?

ఫొటో సోర్స్, Saycheese
- రచయిత, మకూచి ఒకాఫోర్
- హోదా, బీబీసీ ఆఫ్రికా, లాగోస్
- ప్రచురణ
- చదివే సమయం: 4 నిమిషాలు
సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పే లక్ష్యంతో లేగాస్ నగరంలో 168 గంటల పాటు డాన్స్ చేశారు నైజీరియాకు చెందిన ఓ డాన్సర్.
ఆయన పేరు బెంజమిన్ డేనియల్ (33). బెన్ డాన్సర్‌గా ప్రసిద్ధి చెందారు. అత్యధిక సమయం డాన్స్ చేసిన వ్యక్తిగా గిన్నిస్ రికార్డు బ్రేక్ చేయాలనే లక్ష్యంతో 7 రోజులు డాన్స్ చేయాలని ఆయన లక్ష్యంగా పెట్టుకుని దాన్ని పూర్తి చేశారు.
స్నేహితులు, మద్దతుదారుల ప్రోత్సాహంతో లేగాస్‌లోని ఫ్రీడమ్ పార్క్‌లో బెన్ గత మంగళవారం డాన్స్ చేయడం మొదలు పెట్టిన ఆయన స్థానిక కాలమానం ప్రకారం సెప్టెంబర్ 29న (మంగళవారం) ఉదయం 3 గంటల సమయంలో తన లక్ష్యాన్ని చేరుకున్నారు. అదనంగా మరో 9 గంటల పాటు డాన్స్ కొనసాగించినట్లు బెన్ బృందం తెలిపింది.
శారీరకంగా అలసిపోయిన ఈ డాన్సర్ ప్రస్తుతం వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి వెళ్లారు.
అత్యధిక సమయం పాటు డాన్స్ చేసిన వ్యక్తిగా టైటిల్ పొందేందుకు డేనియల్ నుంచి తమకు దరఖాస్తు అందిందని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ నిర్ధరించింది. ప్రస్తుతం 127 గంటలతో ఆ రికార్డు ఉంది.

"బెంజమిన్ నుంచి దరఖాస్తు వచ్చింది. ఆయన సమర్పించబోయే ఆధారాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. ఆయన పేరు మీద రికార్డు ప్రకటించడానికి ముందు వాటిని పరిశీలించి, సమీక్షిస్తాం" అని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధి ఒకరు తెలిపారు.
బెన్ ప్రదర్శనను సామాజిక మాధ్యమాల్లో లైవ్ స్ట్రీమింగ్ చేశారు. ఆయన ఈ చాలెంజ్‌ని పూర్తి చేయడంపట్ల భావోద్వేగానికి గురైనట్లు తెలిపిన ఆయన బృందం హర్షం వ్యక్తం చేసింది. బెన్‌కి ప్రోత్సాహం అందించేందుకు లేగాస్‌లోని ఫ్రీడమ్ పార్క్‌కి తరలివచ్చిన యువత ఆయన ప్రతీ మూవ్‌ని రికార్డ్ చేస్తూ కేరింతలు కొట్టారు.
"ఇది చాలా అద్భుత సమయం. బెన్ ఇంత దూరం వచ్చి, ఇలాంటి ఘనత సాధించడం పట్ల గర్వంగా ఉంది. దేవుడికి కృతజ్ఞతలు" అని ప్రదర్శనను వీక్షించిన ఊచే అనుముదు అనే వ్యక్తి తెలిపారు.

ఫొటో సోర్స్, Saycheese
భారతీయురాలి పేరిట ప్రస్తుత రికార్డ్
అత్యధిక సమయం డాన్స్ చేసిన వ్యక్తి రికార్డ్ ప్రస్తుతం సృష్టి సుధీర్ జగ్‌తప్ అనే భారత డాన్సర్ పేరిట ఉంది. 2023లో 16 ఏళ్ల వయసులో ఆమె ఈ రికార్డును నెలకొల్పారు. దీనికోసం ప్రధానంగా ప్రముఖ భారతీయ సంప్రదాయ నృత్యమైన కథక్‌లో ఆమె ప్రదర్శన చేశారు.
దాదాపు 18 ఏళ్లుగా ప్రొఫెషనల్ డాన్సర్‌గా ఉన్న బెంజమిన్ డేనియల్ ప్రధానంగా నైజీరియా నృత్య సంప్రదాయాలతో పాటు వేగంగా మారుతున్న ఇంటర్నెట్ సంస్కృతిపై దృష్టి పెట్టారు.
బెన్ ప్రదర్శనలో భాగంగా ఆసాంతం ఆఫ్రోబీట్స్ వినిపించాయి. వాటితో పాటు ఫూజీ, జాజ్, జూక్ జానర్లపై ఆయన డాన్స్ చేశారు.
నైజీరియాలోని భిన్నత్వాన్ని ప్రతిబింబించేలా...
డాన్స్‌లో భాగంగా కొన్నిసార్లు ఆయన నైజీరియా సంప్రదాయ దుస్తులను ధరించారు. వాటిల్లో అగ్‌బదా, దశీకీ కూడా ఉన్నాయి.
నైజీరియాలో భిన్నమైన సంప్రదాయాలు గల 250కి పైగా జాతులున్నాయి.
‘‘బెన్ కేవలం తన శారీరక దృఢత్వాన్ని మాత్రమే పరీక్షించుకోవాలని అనుకోలేదు. తన డాన్స్ ద్వారా నైజీరియాలోని భిన్నత్వాన్ని ప్రతిబింబించాలని అనుకున్నారు’’ అని బెన్ బృందం తెలిపింది.
ఈ ప్రయత్నానికి ముందు బెన్ తీవ్రమైన ఫిట్‌నెస్ ట్రైనింగ్ తీసుకున్నారు. డైట్ మార్చుకొని కార్బొహైడ్రేట్స్, కార్డియోవాస్క్యూలర్ కండిషనింగ్‌పై దృష్టి సారించారు.
ఈ డాన్స్‌థాన్ సందర్భంగా గంటపాటు నిరంతర ప్రదర్శన చేస్తే ఓ ఐదు నిమిషాల పాటు విరామం తీసుకునేందుకు అనుమతి ఉంటుంది. ఆ సమయంలో బెన్ తేలికపాటు ఆహారంతో పాటు పానీయాలు తీసుకున్నారు.
ఆయన గంటల పాటు డాన్స్ చేసి ఒకేసారి విరామం తీసుకునేవారు. ఎప్పటికీ అందుబాటులో ఓ వైద్య బృందం ఉండేది.
బెన్ ప్రదర్శన ఓ వేడుకలా మారిపోయింది. ఆయన డాన్స్‌కి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవ్వడంతో మరింతమంది అక్కడికి చేరుకోవడం మొదలు పెట్టారు.
బెన్ పట్టుదల చూసి తనకు ముచ్చటేసిందని ఆయన మద్దతుదారులైన మొరోనుముబో అకోడు అనే మహిళ చెప్పారు. ఆయన డాన్స్ చూసేందుకు ఆమె తరచుగా వచ్చేవారు. అయితే ఇది ఆయన ఆరోగ్యం పట్ల ఎలాంటి ప్రభావం చూపుతుందోనని కాస్త ఆందోళన చెందినట్లు ఆమె తెలిపారు.
"ఇది నిజంగా పిచ్చి. కానీ, నేను అతడి పట్టుదల పట్ల గర్వంగా ఉన్నా" అని ఆమె చెప్పారు.
బెన్ ఎనర్జీలో ఎంతో తేడా గమనించినట్లు ఇమాన్యూయేల్ ఉలెలు అనే వ్యక్తి తెలిపారు. ఆయన రెండుసార్లు ప్రదర్శన చూడటానికి వచ్చారు.
"రెండో రోజున అతడిలో అలసట చూడవచ్చు" అని ఉలెలు అన్నారు.
"నేను ప్రదర్శన వేదిక వద్ద 3 గంటలు డాన్స్ చేశా. ఆ తర్వాతే అనిపించింది అసలు అతను ఎలా డాన్స్ చేయగలుగుతున్నాడని" అని అని ఉలెలు పేర్కొన్నారు.
అయితే ఐదో రోజున 16 గంటల పాటు డాన్స్ చేసిన బెన్, మునుపెన్నడూ లేనంత ఎనర్జీతో కనిపించారని ఉలెలు చెప్పారు.
"బలమైన కాంక్షతో మన లక్ష్యానికి తగిన, దానికి మించిన సామర్థ్యాన్ని పొందినప్పుడు, నమ్మశక్యం కానీ ఎన్నో ఘనతలను సాధించగలమని బెన్ నిరూపించారు" అని ఉలెలు పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Saycheese
నైజీరియాలో గిన్నిస్ క్రేజ్...
గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌తో నైజీరియాకు ఒక బలమైన అనుబంధం ఉంది. ముఖ్యంగా ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో.
2023లో లేగాస్‌లో హిల్డా బచీ అనే కుక్ 93 గంటల 11 నిమిషాల పాటు నిరంతరంగా వంట చేసి గిన్నిస్ రికార్డును నెలకొల్పారు.
ఈ ఘనత నైజీరియాలో ఎంతోమందిలో గిన్నిస్ రికార్డ్ సాధించాలనే కాంక్షను ప్రేరేపించింది. ఆ తర్వాత ఆమె రికార్డును చాలామంది బ్రేక్ చేశారు.
బచీ కుక్-ఎ-థాన్ (వంట) రికార్డు నెలకొల్పిన 2 నెలల్లోనే నైజీరియా నుంచి 1500లకు పైగా కొత్త దరఖాస్తులు వచ్చినట్లు గిన్నిస్ తెలిపింది. అందులో చదవడం, పాటలు, కుట్లు అల్లికలకు సంబంధించిన ఈవెంట్లు ఉన్నాయి.
"ఇటీవలి కాలంలో రికార్డులను బ్రేక్ చేసేందుకు నైజీరియా నుంచి వస్తున్న విపరీతమైన ఉత్సాహం చూస్తుంటే ముచ్చటగా ఉంది" అని ఓ గిన్నిస్ ప్రతినిధి తెలిపారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




























